ఎస్‌బీఐ బాస్


Mon,June 19, 2017 01:22 AM

ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం. తను చేయాలనుకున్నది నిక్కచ్చిగా చేసే తత్వం. ఎవరికీ భయ పడని మనస్తత్వం. అవినీతి, బంధుప్రీతిని సహించని నైజం. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే ముక్కు సూటితనం. రైతుల రుణమాఫీయైనా, ఖాతాలో కనీస బ్యాలెన్స్ విషయంలోనైనా తను పనిచేస్తున్న సంస్థకు నష్టం వాటిల్లే ఏ చర్యనూ సమర్థించని క్రమశిక్షణ, అంకితభావం.. ఇవన్నీ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్‌బ్యాంక్ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యలోని సమర్థతకు నిదర్శనాలు. అంతేకాదు, తొమ్మిది అంకెలున్న సంఖ్యల లెక్కలు సైతం బుర్రలోనే చేయగల అపారగణిత జ్ఞానం ఆమె సొంతం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలోనూ మార్పులు రావాలంటున్న అరుంధతీ భట్టాచార్య సక్సెస్‌మంత్రం.అరుంధతీ భట్టాచార్య దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తొలి మహిళా ఛైర్‌పర్సన్. 7 అక్టోబర్ 2013న ఆమె ఎస్‌బీఐకీ 24వ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. నిజానికి ఆమె మూడేళ్ల పదవీకాలం 2016 సెప్టెంబర్ 30తో ముగిసింది. కానీ, భారతీయ మహిళాబ్యాంక్ సహా 5 ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం 2017 మార్చితో ముగియాలన్న లక్ష్యం నేపథ్యంలో ఆమె పదవీకాలం మరో ఏడాది పొడిగించారు.
ARUNDHATI

ప్లాష్‌బ్యాక్..

అరుంధతీ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో 18 మార్చి 1956న జన్మించారు. ఆమె బాల్యమంతా భిలాయ్‌లో గడిచింది. తండ్రి పొర్డ్యుత్ కుమార్ ముఖర్జీ భిలాయ్ ఉక్కు కర్మాగారంలో పనిచేసేవాడు. ఆమె తల్లి కళ్యాణీ ముఖర్జీ బొకారోలో హోమియోపతి వైద్యురాలు. అరుంధతీ భట్టాచార్య బొకారోలోని సెయింట్ క్సావియర్ స్కూలులో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఆ తరువాత కలకత్తాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ బ్రాబోర్న్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యం చదివారు. ఆమె భర్త ప్రీతిమోయ్ భట్టాచార్య ఖరగ్‌పూర్ ఐఐటీలో మాజీ ప్రొఫెసర్.

నాలుగు దశాబ్దాల అనుబంధం

అరుంధతీ భట్టాచార్యది ఎస్‌బిఐతో నలభై సంవత్సరాల అనుబంధం. 1977లో తన 22వ యేట ఆమె భారతీయ స్టేట్‌బ్యాంక్‌లో సాధారణ ప్రొబేషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 66వ బ్యాంక్ ఎస్‌బిఐ. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్బీఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటా కలిగి ఉన్నాయి. అలాంటి ప్రతిష్ఠాత్మక బ్యాంకుకు అరుంధతీ భట్టాచార్య ఎమ్‌డీగా నియమితులయ్యారు. నాలుగు పదుల ఉద్యోగ జీవితంలో ఇదే బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఆమె పనిచేశారు. తన కెరీర్‌లో డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్- బెంగళూరు సర్కిల్, ఎస్‌బిఐ క్యాపిటల్- మర్చంట్ బ్యాంకింగ్ విభాగపు చీఫ్- వంటి ఉన్నత స్థాయి పదవులు నిర్వహించారు. విదేశీ ఎక్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, మానవ వనరులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి విభాగాల్లో ఆమె సేవలందించారు. న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన బ్యాంక్ శాఖలో పనిచేసిన అనుభవం కూడా అరుంధతికి ఉంది. ఇన్ని అనుభవాలే భట్టాచార్యను ఎస్‌బిఐ టాప్ చైర్లో కూర్చోపెట్టాయి.

నవ్విన నాప చేనే...

భారతీయ స్టేట్‌బ్యాంక్‌కు రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. అలాంటి బ్యాంక్‌కు తొలిసారి ఒక మహిళ ఛైర్‌పర్సన్‌గా నియమితులవ్వడమంటే మాటలు కాదు. ఆమె ఎస్‌బిఐ పగ్గాలు చేపట్టినప్పుడు అంతా నోరెళ్లబెట్టారు. కానీ, నవ్విన నాప చేనే పండిందన్నట్లు అనుమానాలను, అంచనాలనూ తలకిందులు చేస్తూ నూతన విధానాలతో ఆమె దూసుకుపోతున్నారు. ప్రైవేటు బ్యాంకులకు దీటుగా ఎస్బీఐని తీర్చిదిద్దడంతో పాటు కొత్తతరం వినియోగదారులకు చేరువ చేసేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు అందరి మన్ననలూ పొందుతున్నాయి.

బెస్ట్ సీఈవో

బ్యాంకును అంతర్గతంగా, బహిర్గతంగా పటిష్టం చేసేందుకు అరుంధతీ ఎన్నో చర్యలు చేపట్టారు. మొండి బకాయిలతో ఇబ్బంది పెట్టేవాళ్లను గుర్తించడం, ఖర్చుల తగ్గింపు, హెచ్‌ఆర్ విభాగాల్లో మార్పులు, కస్టమర్ సర్వీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భట్టాచార్య బాధ్యతలు చేపట్టాక బ్యాంక్ డిపాజిట్స్ 13 శాతం పెరిగాయి. ఎస్బీఐ ఆస్తులు 14.24 శాతం వృద్ధి చెందడంతో పాటు లాభాలు కూడా ఇరవై శాతం వరకూ పెరిగాయి. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆమెను బెస్ట్ సీఈఓ ఆఫ్ ది ఇయర్-2015గా నిలిపాయి.

అరుదైన గౌరవం

2015లో ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలోని 30 మందిలో అరుంధతీ భట్టాచార్య 5వ స్థానంలో నిలిచారు. అదే సంవత్సరం ఆమె పారిన్ పాలసీ మాగజైన్ ద్వారా టాప్ 100 గ్లోబల్ థింకర్స్‌లోనూ ర్యాంకు సాధించారు. అలాగే, ఆసియా పసిఫిక్‌లో అత్యంత శక్తివంతమైన మహిళలలో 4వ స్థానాన్ని పొందారు. ఫార్చ్యూన్ ప్రపంచంలోని 50 మంది గొప్పనాయకుల జాబితాలో భట్ట్టాచార్య 26వ స్థానంలో నిలిచారు. ఎస్పీఐకి సంబంధించి డిమానిటైజేషన్, మొండిబకాయిలు వంటి పలు సమస్యలను ఎదుర్కోవడంలో భట్టాచార్య కీలకపాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది.

డిటిటల్ సీఈఓ

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ కూడా అరుంధతీ సారథ్యంలో రూపకల్పన జరిగిందే. యాప్ ప్రారంభించిన ఒక్క ఏడాది కాలంలోనే రూ. 11,662 కోట్ల విలువ చేసే లావాదేవీలు ఈ వేదిక ద్వారా జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ స్పేస్‌లో ఇప్పుడు ఎస్‌బిఐ మార్కెట్ లీడర్. ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర 1.35 కోట్ల మంది మొబైల్ యాప్ యూజర్స్ ఉన్నారు. మొత్తం మొబైల్ బ్యాంకింగ్‌లో ఒక్క ఎస్‌బిఐ వాటానే 46 శాతం. 13 భాషల్లో ఉన్న బడ్డీ డిజిటల్ వాలెట్ ఇప్పటికే చాలామందికి చేరువైంది. బటువా పేరుతో మరో యాప్‌ను మాస్ కోసం తయారు చేశారు. ఇలా ఒక్క రిటైల్ కస్టమర్లకే పరిమితం కాకుండా కార్పొరెట్ కస్టమర్లకు కూడా ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చి డిటిటల్ సీఈఓగా పేరు తెచ్చుకున్నారు అరుంధతీ భట్టాచార్య.

బ్యాంకుల విలీనం

ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం దాదాపు పూర్తయింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్‌బ్యాంక్‌ఆఫ్ మైసూరు (ఎస్‌బీఎం), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్( ఎస్‌బీటీ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బీపీ). స్టేట్‌భ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్)లను ఎస్‌బీఐలో విలీనం చేశారు. మరికొన్ని కూడా అదే బాటలో నడువనున్నాయి.

అపార గణిత మేధావి

కేవలం బ్యాంకింగ్ రంగంలోనే కాదు, గణితంలోనూ ఆమె జ్ఞానం అపారం. అరుంధతీ తొమ్మిది అంకెల సంఖ్యల లెక్కలు సైతం బుర్రలోనే చేయగలరు. ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూనే, తోటి మహిళా ఉద్యోగుల సాదకబాదకాలు పట్టించుకోవడంలో ముందుంటారు. అటు కుటుంబాన్నీ, ఇటు ఉద్యో గ జీవితాన్నీ బ్యాలెన్స్ చేయడానికి మహిళలెంత కష్టపడతారో తనకు తెలుసంటారు. తోటి మహిళా ఉద్యోగుల్లో భట్టాచార్యకు గొప్ప కీర్తి ప్రతిష్టలే వున్నాయి. ఎస్బీఐలో రెండు లక్షల మంది ఉద్యోగులుంటే, వారిలో 40 వేల మంది మహిళలున్నారు. మహిళా ఉద్యోగుల కోసం ఆరోగ్య పరీక్షలు ప్రవేశ పెట్టిన ఘనత అరుంధతీ సొంతం. భవిష్యత్తులో ఆమె ముందు మరెన్నో సవాళ్లు ఉన్నప్పటికీ వాటన్నింటినీ తన ప్రతిభతో నెగ్గుకొస్తారని అంటున్నారామె సహోద్యోగులు.

గర్భవతులకు సెలవులు

అరుంధతి ఉద్యోగకాలంలో అనేక కొత్త వ్యాపార విధానాలను ప్రారంభించారు. ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్.బి.ఐ కస్టోడియల్ సర్వీసు, ఎస్‌బిఐ పెన్షన్ ఫండ్స్, ఎస్‌బిఐ మాక్వరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తదితర నూతన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె తన పదవీకాలంలో గర్భవతులు, చిన్న పిల్లల సంరక్షణకు, మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాల సబ్బాటికల్ సెలవు పాలసీని ప్రారంభించారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళా ఉద్యోగులందరికీ క్యాన్సర్ వాక్సినేషన్ ఉచితంగా అందించారు.

సంచలన నిర్ణయాలు :


arundathiTV
రైతు రుణమాఫీపై అభ్యంతరాలు ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న రుణమాఫీపై తనకు కొన్ని అభ్యంతరాలున్నాయని అరుంధతీ అంటారు. వ్యవసాయ రుణాలను ఎత్తి వేస్తే క్రెడిట్ క్రమశిక్షణకు భంగం కలుగుతుందనేది ఆమె అభిప్రాయం. రైతు రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు ఖాతా సమస్య తలెత్తుతుందని, అలాగే ప్రభుత్వాలు రైతులకు కల్పించే రుణమాఫీల వల్ల బ్యాంకుల ఆదాయం తగ్గిపోతుందనేది ఆమె వాదన. రైతులకు మద్దతు ఇవ్వడం ముఖ్యమే. కానీ, ఇది ఒక క్రమపద్ధతిలో జరగాలన్నది ఆమె అభిప్రాయం.రుణమాఫీ పొందిన రైతులు భవిష్యత్తులోనూ అలాంటి మాఫీకోసం ఎదురుచూస్తారని, తద్వారా కొత్తగా ఇచ్చిన రుణాలకు బకాయిలు చెల్లించేందుకు రైతులు వెనుకాడుతారని ఆమె అంటారు. ఈ విషయంలో రైతు సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారామె.

కనీస బ్యాలెన్స్ లేకుంటే చార్జీలు

పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే పెనాల్టీలు తప్పవని అరుంధతీ స్పష్టం చేశారు. నగదు నిల్వ అవసరం లేని జన్‌ధన్ ఖాతాల నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ఇలాంటి ఖాతాలు ఎస్‌బిఐలో 11 కోట్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో జరిమానా విధించాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వం సూచించింది. కానీ, ఎస్‌బిఐ ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అంతేకాకుండా, నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగిస్తే ఛార్జీలు తప్పవని కూడా ఆమె స్పష్టం చేశారు. ఒక గృహస్థుడికి నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు. కాబట్టి ఖాతాదారులు మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని కూడా ఆమె సూచించారు.

కీలక మార్పులు


ArundhatiNV
61 ఏళ్ల అరుంధతీ భట్టాచార్య నాయకత్వంలో ఎస్బీఐలో ఎన్నో కీలకమైన మార్పులు వచ్చాయి. టెక్నాలజీకి అనుగుణంగా.. డిజిటల్ బ్యాకింగ్ అవుట్‌లెట్, మొబైల్ వ్యాలెట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్, ఈ-పే తదితర అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లో బ్యాంక్ ప్రమోషన్‌కు సిద్ధమయ్యారు. ఇవే కాదు, ఇన్‌స్ట్రాగ్రామ్, పిన్‌ట్రెస్ట్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఎస్‌బిఐ హవా కనిపిస్తున్నది. ఎస్‌బిఐ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ గవర్నమెంట్ బ్యాంక్ అనే ట్యాగును పూర్తిగా చెరిపేసి జెన్ వై కస్టమర్లకు చేరువ చేసే ప్రయత్నం చేశారు.

2271
Tags

More News

VIRAL NEWS