ఎండల్లో.. గుండె వైఫల్యమా?


Mon,April 15, 2019 11:07 PM

ఏం ఎండలు ఇవి? ఏం ఉష్ణోగ్రతలు ఇవి? ఇంటినే అంటిపెట్టుకొని ఉండలేం. బయటకు వెళ్లాలంటే భయం పుట్టుకొచ్చే పరిస్థితి. ఈ ఎండల ప్రభావం ఎక్కువగా పడేది గుండెపైనే. గుండె వైఫల్యం సమస్యలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. కాబట్టి.. గుండెను పదిలంగా ఉంచుకుందాం. వైఫల్యం బారి నుంచి తప్పించుకుందాం!
Heart-Failure
ఒక అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో 3 నుంచి 4 శాతం మంది హార్ట్ ఫెయిల్యూర్‌కు గురవుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రమాదం ఎక్కువవుతూ ఉంది. 20-30 ఏండ్ల వయసు ఉన్నవారిలో ఇది ఒక శాతం ఉంటే యాభై యేండ్లు దాటిన తర్వాత 20%పైగా పెరిగిపోతున్నది. హార్ట్ ఫెయిల్యూర్‌ను గుర్తించిన ఏడాదిలోపే 40-50 శాతం మంది మరణిస్తున్నారు. ఇండియాలో అంతకంతకూ పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు, కరోనరి వ్యాధుల వల్ల గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ జీవితం గడిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏంటీ గుండె వైఫల్యం?

శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేయడం వల్ల గుండె తన శక్తిని కోల్పోతుంది. దీనివల్ల సంకోచ వ్యాకోచాలు జరిపే సామర్థ్యం క్షీణిస్తుంది. గుండె వైఫల్యం వల్ల గుండె ఛాంబర్లలో రక్తం కదలిక మందగిస్తుంది. గుండెలో ఒత్తిడి పెరుగుతుంది. శరీరభాగాలకు ఆక్సీజన్, పోషకాలు ఉన్న రక్తాన్ని సరఫరా చేయడం సాధ్యపడదు. తగ్గిన పంపింగ్ సామర్థ్యాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తూ గుండె గదులు వ్యాకోచించి మరింత రక్తాన్ని నింపుకోవడం ప్రారంభిస్తాయి. మొదట్లో ఇది గుండెలో రక్తం కదలికను పెంచుతుంది. కానీ, కొద్ది రోజులకు గుండె కండరాల గోడలు బలహీనపడతాయి. ఒత్తిడితో రక్తాన్ని పంపింగ్ చేయలేవు. మూత్రపిండాలు శరీరంలో సోడియంతో కూడిన ద్రవాలను నిలువ చేయడం ప్రారంభిస్తాయి. ఫలితంగా చేతులు, కాళ్ళు, చీలమండలు, ఊపిరితిత్తులు తదితర అంగాలలో నీరు చేరుతుంది. ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

గుండె ఆగిపోతుందా?

హార్ట్ ఫెయిల్యూర్ అనగానే గుండె పనిచేయటం నిలిచిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ అది నిజం కాదు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రాథమికంగా అవసరాల మేరకు గుండె శరీర కణజాలానికి రక్త్తాన్ని సరఫరా చేయలేక పోవటం వల్ల పోషకాలు అందకపోవటం, రక్తనాళాలు నిండిపోయి రద్దీ ఏర్పడటం మాత్రమే. దీనిని న్యూరోహార్మోనల్ ఆక్టివేషన్ అంటారు. చివరకు ఇది ఆరోగ్యానికి తీవ్రహాని కలిగిస్తుంది.

లక్షణాలేంటి?

-శ్వాస తగ్గుతుంది. కష్టంగా మారుతుంది.
-కాళ్లు, చీలమండలు, పొట్ట వాచిపోతాయి.
-వికారంగా, కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది.
-నాడీ స్పందన అస్తవ్యస్థంగా తయారవుతుంది.
-ఎత్తుపై పడుకోవటం కష్టమవుతుంది.
-విపరీతమైన అలసట అనిపిస్తుంది.
-రాత్రివేళ తరచూ మూత్రం వస్తుంది.

నిర్ధారణ ఎలా?

రోగులు అలసిపోయినపుడు.. పడుకున్నప్పుడు శ్వాస అందకపోవటం, మితిమీరిన అలసట, ఒళ్లు వాపు వంటి లక్షణాలు, వివిధ పరీక్షలు జరపటం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్‌ను నిర్ధారించవచ్చు. సాధారణంగా ఈ వ్యాధిని గుర్తించటానికి హెమోగ్రామ్, సెక్రెటినైన్, ధైరాయిడ్ పనితీరు, ఎలక్ట్రోలైట్స్, రక్తంలో చక్కెర, బిఎన్‌పి, ఇసిజి, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ వంటి నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. కొన్నిసార్లు కార్డియాక్ ఎం.ఆర్.ఐ., పెట్‌స్కాన్, మయోకాండ్రియల్ బయాప్సీ వంటి మరింత ఆధునిక పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది.

చికిత్స ఏంటి?

అన్ని వ్యాధుల విషయంలో లాగానే హార్ట్ ఫెయిల్యూర్‌ను కూడా ముందు జాగ్రత్తలతో నిరోధించగలగడమే ఉత్తమం. అధిక రక్తపోటు, మధుమేహం.. గుండె వ్యాధి రావటానికి ప్రధాన కారణాలు. అందువల్ల ప్రాథమిక స్థాయిలోనే పోషకాలతో కూడిన పరిమిత ఆహారాన్ని తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, స్ఢూలకాయం ఏర్పడకుండా జాగ్రత్తపడడం హార్ట్ ఫెయిల్యూర్‌ను అరికట్టడానికి తోడ్పడతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, డైస్లిపిడెమియా (రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి లిపిడ్స్ శాతం విపరీతంగా పెరిగిపోవడం) వంటి వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఆ వ్యాధులను తగ్గించేందుకు సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలతో ఈ చికిత్సను కొనసాగించాలి.

జనాభాలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్న వారిని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం ద్వారా ఆ వ్యాధులకు చికిత్సను వెంటనే ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది. మధుమేహం, అధికరక్తపోటు వంటి పలు కారణాల వల్ల కరోనరి అర్టరీ డిసీజ్ వస్తుంది. అది గుండెపోటుకు, గుండె బలహీనపడడానికి, అంజైనాలకు దారితీస్తుంది. దీనిని ముందుగా కనిపెట్టగలిగితే గుండెకు జరుగగల తీవ్రనష్టాన్ని నిలుపవచ్చు.

ఇలా నివారించవచ్చు!

గుండెపోటుకు వెంటనే, సమర్థవంతమైన చికిత్స అందించగలిగితే గుండె వైఫల్యాన్ని నివారించొచ్చు. వ్యాధి సోకితే చికిత్స తప్పనిసరి. ఆహారంలో ఉప్పును తగ్గించడం, మద్యం మానడం, రక్తపోటును అదుపులో ఉంచడం, శరీరంలో న్యూరోహార్మోనల్ కార్యశీలతను మార్చే మందులు సిఫార్సు చేయడంపై దృష్టిని కేంద్రీకరించాలి. హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్థులకు సిఫార్సుచేసే మందులలో ముఖ్యమైనవి ఎసిఇ ఇన్హిబిటర్స్, బీటా బ్లాక ర్స్, అల్డోస్టెరోన్ అంటగొనిస్ట్స్. ఇవి వాడితే కోలుకునే అవకాశం ఉంది. సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్థులు చాలామంది హఠాత్తుగా మరణిస్తుంటారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణమైన హెచ్చుతగ్గులు ఇందుకు దారితీస్తుంటాయి. కొంతమంది మాత్రం కార్డియాక్ రీసిక్రొనైజేషన్ చికిత్సలు- కార్డియో వాస్క్యులార్ డిఫ్రైబ్రిలేటర్ వల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు.

వీరిలో కొందరు గుండె కవాటాల మరమ్మతు- మార్పిడి, శస్త్రచికిత్స ద్వారా ఎడమ జఠరిక కుహరానికి మార్పులు చేయడం వల్ల ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నా యి. హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి బాగా ముదిరిన వారికి వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైసెస్ ఉపయోగపడతాయి. ఇవి పాక్షికంగా లేదా మొత్తంగా గుండె విధులను చేపట్టే పంపింగ్ పరికరాలు. దీనికి తోడు ఈ వ్యాధిగ్రస్థులకు గుండె మార్పిడి మరో ముఖ్యమైన అవకాశం ఉంది. వీటన్నింటికంటే ముందు.. ఒకవేళ గుండె వైఫల్యం అని భావిస్తే మాత్రం ముందుగానే మంచి ఆస్పత్రికి వెళ్లాలి. సరైన చికిత్స చేయించుకోవాలి. ఇలా చేస్తేనే గుండె వైఫల్యం నుంచి బయటపడవచ్చు.

వైఫల్యానికి కారణమేంటి?

ఆధిక రక్తపోటు, మధుమేహం, కరోనరి వ్యాధుల వల్ల గుండెకు చాలా నష్టం జరుగుతుంది. వాల్వులార్ డిసీజెస్, జెనెటిక్ మజిల్ డిజార్డర్, మితిమీరిన మద్యపానం, స్థూలకాయం, వాపులు, సంక్రమణ వ్యాధులు వంటి కారణాలు కూడా గుండె పనితనాన్ని దెబ్బదీస్తాయి. వీటివల్ల గుండెకు రెండు విధాల నష్టం జరుగుతుంది.
1. గుండె పంపింగ్ సామర్థ్యం క్షీణించటం (సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్)
2. కండరాలు గట్టిపడటం (డయస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్) కొందరిలో రెండు రకాలుగానూ గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉంది.
pankaj-jariwala

237
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles