ఈ సమస్య మానసికమా?


Tue,June 27, 2017 11:19 PM

మా అబ్బాయి వయసు 30 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఇంజినీరింగ్ చదువుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే వాడు. చాలా చురుకుగా, హుషారుగా ఉండేవాడు. 6 నెలల క్రితం ఉద్యోగం పోయింది. ప్రయత్నాలు చేస్తున్నా తనకు తగిన ఉద్యోగం దొరుకడం లేదు. ఈ మధ్య కాలంలో మానసికంగా బాగా కుంగిపోయాడు కూడా. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆవేశ పడిపోతాడు లేదా తనకేదో అయిపోతుందని, హార్ట్‌ఎటాక్ వచేస్తున్నదని చాలా కంగారుపడుతాడు.అందరిని కంగారు పెడుతున్నాడు. ఇంట్లో అందరూ తన గురించే చాలా బాధపడుతున్నారు. అతడికి ఇలా ఎందుకు జరుగుతున్నది. అతడి సమస్యకు చికిత్స అవసరమా? పూర్తి వివరాలు తెలియజేయగలరు?
రాజరాజేశ్వరి, హైదరాబాద్

social-hormone
మీ అబ్బాయిలో కనిపిస్తున్నట్టు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అతడు పానిక్ యాైంగ్జెటీతో బాధపడుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఇలాంటి సమస్య ఉన్నవారిలో గుండెదడగా ఉండడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, తలనొప్పి, చేతులు వణకడం, మాట తడబడడం వంటి లక్షణాలు ఉండొచ్చు, వీటిలో కొన్ని కూడా ఉండొచ్చు. ఇది ఒక అటాక్‌లాగా వస్తుంది. దాదాపు 15-20 నిమిషాల పాటు ఈ స్థితి కొనసాగుతుంది. తాను వెంటనే చనిపోతానని, తనకు ఏదో అవుతున్నదని వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని తొందరపెడుతుంటాడు. కానీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి పరీక్షలు చేయిస్తే శారీరకంగా వారికి ఎలాంటి సమస్యా ఉండదు. ఎందుకంటే సమస్య వీరి శరీరంలో కాదు, మనసులో ఉంది. ఇది మెదడులో జరిగే రసాయన ప్రక్రియల్లో వచ్చే తేడాల వల్ల కలిగే సమస్య. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవారు అకస్మాత్తుగా పానిక్ అయిపోయే కూడా ఉంటుంది.

ఈ సమస్యకు చికిత్స అవసరమే. కేవలం కౌన్సెలింగ్‌తో వీరిలో మార్పు తీసుకురావడం కుదరదు. అయితే మానసిక చికిత్సకు తీసుకురావడానికి ముందు వీరికి శారీరకంగా ఎలాంటి అనారోగ్యం లేదని వారికి అర్థమయ్యేందుకు తప్పనిసరిగా పరీక్షలు చేయించి రిపోర్టులు వారికి వివరించి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. అయితే మానసికంగా అనారోగ్యంగా ఉన్నవారికి కుటుంబ సహకారం చాలా అవసరం ఉంటుంది. వారు చాలా సాధారణంగా ఉండేందుకు కుటుంబసభ్యుల సహకారం అవసరం అవుతుంది. వారిని కంగారు పడవద్దు అని చెప్పాలి. పక్కన కూర్చుని కాస్త చెయ్యి పట్టుకొని నేనున్నాను అన్న భరోసా ఇవ్వగలగాలి. అయినా పరిస్థితి అదుపులోకి రానట్టు అనిపిస్తే వెంటనే ఒక టాబ్లెట్ వేసుకోవాలని గుర్తుచెయ్యాలి.
drASreddy
ఒక్క టాబ్లెట్‌తో చాలా త్వరగా పరిస్థితి అదుపులోకి వస్తుంది. మందులతో పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చెయ్యడం, యోగా మెడిటేషన్ వంటివి సాధన చేస్తుంటే మరిన్ని మంచి ఫలితాలను తక్కువ సమయంలో సాధించేందుకు అవకాశం ఉంటుంది. జీవితంలో ఎత్తు పల్లాలు చాలా సహజమనే విషయాన్ని అతడికి అర్థం చేయించడం కూడా అవసరమే. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. మీరు మీ అబ్బాయిలో కలిగే లక్షణాలు, వాటి కారణాలు వీటన్నింటిని సరిగ్గా అంచనా వేసేందుకు గాను మీకు దగ్గరలో ఉన్న మానసిక నిపుణులను వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అతడు తప్పకుండా తిరిగి మామూలు మనిషి అవుతాడు.

522
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles