ఈ వెంట్రుకలు ఎందుకో...?


Wed,July 26, 2017 01:50 AM

నా వయసు 19 సంవత్సరాలు. గత కొంత కాలంగా నాకు ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి. చెంపల మీద కూడా వెంట్రుకలు వస్తున్నాయి. ముఖం జిడ్డుగా అవుతున్నది. ఈ మధ్య బరువు కూడా చాలా పెరిగిపోయాను. మెడ దగ్గర చర్మం మందంగా నల్లగా అవుతున్నది. ఈ సమస్యలతో నాకు నలుగురిలోకి వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?
పవిత్ర, ఖమ్మం

girlsadalone
మీరు కేవలం ముఖం మీద కనిపిస్తున్న సమస్యల గురించి మాత్రమే ప్రస్తావించారు. మీ నెలసరులు ఎలా ఉన్నదీ తెలియజేయలేదు. మీ సమస్యలన్నీ పరిశీలించిన తర్వాత మీకు పీసీఓడీ అనే హార్మోన్ సమస్య ఉందని అనిపిస్తున్నది. ఈ సమస్య యుక్తవయస్కుల్లో ఎక్కువగా కనిపించే సమస్య. పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అర్థం. అంటే అండాశయంలో చిన్నచిన్న నీటి బుడుగల వంటివి ఏర్పడుతాయి. అందువల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా మీరు చెప్పిన సమస్యలతో పాటు నెలసరులు కూడా క్రమం తప్పుతాయి. ప్రస్తుత ఒత్తిడి కలిగిన జీవనశైలి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఎవరైనా అధిక బరువు, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ సమస్య చిన్న వయసులోనూ రావచ్చు.

ఈ సమస్యను నిర్ధారించడానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ పరీక్ష, పెల్విక్ అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాటు బ్లడ్‌షుగర్, థైరాయిడ్ స్థాయిలను కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కేవలం మందులు వాడితే సరిపోదు. జీవన శైలిలో మార్పులు కూడా తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, సమతుల ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం, తాజా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవడం, శరీర బరువు అదుపులో ఉంచుకోవడం వంటివన్నీ తప్పనిసరిగా పాటించాలి. ఇప్పటికే వచ్చిన అవాంఛిత రోమాల సమస్య పరిష్కారానికి చర్మ వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు లేజర్ చికిత్స ద్వారా వాటిని తొలగించుకోవాలి. వీటన్నింటికంటే ముందు మానసిక ఒత్తిడిని తగ్గించుకొనేందుకు ప్రయత్నించాలి. ఈ చర్యలన్నీ తీసుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే భావించవచ్చు.
drsudakarreddy

488
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles