ఈ లక్షణాలు అల్జీమర్స్‌వేనా?


Sat,December 8, 2018 02:26 AM


మా అత్తయ్య వయస్సు 70 సంవత్సరాలు. ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. రెండు మూడు నెలలుగా తనకు ఏదీ గుర్తుండటం లేదు. చిన్న పిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నది. ఎలాంటి విషయమైనా త్వరగా మర్చిపోతున్నది. ఒకప్పుడు ఆమె మేధస్సుతో మా ఇంటిల్లిపాదినీ హ్యాండిల్ చేసి అందర్నీ సెట్ చేసింది ఆమె. అలాంటి మా అత్తయ్య ఇప్పుడు ఇలా మారడం మాకు బాధగా ఉంది. కుటుంబమంతా ఆందోళనకు గురవుతున్నాం. ఇంకో విషయం.. ఆమెకు ఈ మధ్యకాలంగా ఫిట్స్ కూడా వస్తున్నాయి. మొదట్నుంచి ఈ సమస్య లేదు. ఇవన్నీ చూసినవాళ్లు ఇది అల్జీమర్స్ వ్యాధి అంటున్నారు. ఇది నిజమే అంటారా? ఒకవేళ అల్జీమర్సే అయితే అది నయం అవుతుందా? మా అత్తయ్య తిరిగి మామూలు స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? దయచేసి తెలుపగలరు.
- ఆర్. యశోద, ఘనపురం, వరంగల్

Councelling
యశోదగారూ.. మీ ఆందోళన అర్థమైంది. మీ అత్తయ్య మామూలు పరిస్థితిలోకి రావాలంటే అత్యవసర చికిత్స ఇవ్వాలి. దాంతోపాటు కొన్ని మెళకువలు కూడా పాటించాలి. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. వయస్సు పెరుగుతున్నకొద్దీ మానవ శరీరంలో మార్పు వస్తుంది. అలాగే ఆలోచనా విధానంలో.. జ్ఞాపకశక్తిలో కూడా మార్పులు వస్తుంటాయి. జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తుంటుంది. మీ అత్తయ్య విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఆమె వయసు 70 అంటున్నారు కాబట్టి అది వయసురీత్యా వచ్చిన మతిమరుపే. అయితే అది అల్జీమర్స్ అని మాత్రం వ్యక్తిని పరిశీలించిన తర్వాతే చెప్పొచ్చు. జ్ఞాపకశక్తి క్షీణించే తీవ్రత పెరగడాన్నే మతిభ్రంశం లేదా అల్జీమర్స్ అంటారు. మతిమరుపుకు.. మతిభ్రంశానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి. మతిమరుపు ఉన్నవాళ్లు చిన్న విషయాలను మర్చిపోయినప్పటికీ తర్వాత గుర్తుకు తెచ్చుకుంటారు. మనమూ వాళ్ల స్థితిని గ్రహించగలుగుతాం. కానీ మతిభ్రంశం ఉన్నవాళ్లు ఒకసారి మర్చిపోతే తిరిగి దాన్ని గుర్తుకు తెచ్చుకోలేరు. ఒక దగ్గర పెట్టిన వస్తువులను మరో దగ్గర వెతకడం.. రోజువారీ కార్యకలాపాల్లో మార్పు రావడం.. చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ చెప్పడం వంటివి చేస్తుంటారు. ఆశ్చర్యంగా బోలెడన్ని పాత విషయాలు గుర్తుపెట్టుకుంటారు కానీ.. ప్రస్తుత విషయాలేవీ గుర్తుపెట్టుకోరు. ఒక రోజు కిందటి విషయాల్ని కూడా పూర్తిగా మర్చిపోతుంటారు. మీ అత్తయ్యలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అనేది పరిశీలించాలి. జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది చెప్పినా పట్టనట్టు తనకేం సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నారా? గ్రహించాలి. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా.. హైపర్‌టెన్షన్.. డయాబెటిక్.. ఫిట్స్ ఉన్నవారిలో ఈ సమస్య ఉంటుంది. మీ అత్తయ్యకు కూడా ఫిట్స్ వస్తున్నాయి అన్నారు కాబట్టి ఈ వ్యాధి అల్జీమర్స్‌తో దగ్గర సంబంధం కలిగి ఉందని చెప్పొచ్చు. పోషకాహార లోపం.. పక్షవాతం కూడా కొన్నిసార్లు అల్జీమర్స్‌కు దారితీస్తుంది. మీ అత్తయ్య మానసిక స్థితి బాగా ఉన్నప్పుడు.. ఆమె శరీరం అన్నింటినీ తట్టుకున్నప్పుడు మీకు అన్నీ తానై చూసుకున్నారు. కానీ ఇప్పుడామె వయసు.. శరీరం అన్ని పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాయి. ఇది మీ అత్తయ్యనే కాదు.. చాలామందిని వేధిస్తున్నది. కాబట్టి మీరు ఆందోళనను పక్కనపెట్టి ఆమెను మంచి మానసిక నిపుణుడికి చూపించండి. ఒకవేళ అన్ని పరీక్షలు చేసిన తర్వాత అది అల్జీమర్స్ వ్యాధే అని ఒక నిర్ధారణకు వస్తే తదుపరి ఏంటి అనేది చెప్పొచ్చు.

- డాక్టర్ పురుషోత్తం
మానసిక నిపుణులు
డీఎంహెచ్‌ఓ, కరీంనగర్

683
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles