ఈ యాప్స్ వృద్ధుల కోసం


Wed,August 22, 2018 04:03 AM

టెక్నాలజీ అంటే రోజురోజుకూ వేగంగా దూసుకుపోవడం కాదు.. ఆ అభివృద్ధి, ఆ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం. చదువుకున్న ఈ తరం వారికి టెక్నాలజీ వాడకాన్ని ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. టెక్నాలజీని ఇప్పటి తరం ఏ రేంజ్‌లో వాడుకుంటుందో.. ఆడుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వయసైపోయి.. ఒంట్లో ఓపిక తగ్గి.. ఇంట్లోనే ఉండే పెద్దమనుషులకు టెక్నాలజీ వల్ల ఏం ఉపయోగం? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.
old
సీనియర్ సిటిజన్స్‌కు కూడా టెక్నాలజీ ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు ఒక సార్థకత లభిస్తుంది. అభివృద్ధికి ఒక అర్థం వస్తుంది. ఆ కోవలో అమెరికాలో ఓ ప్రయత్నం మొదలుపెట్టారు. అదేంటంటే.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పెద్ద మనుషుల బాగోగులు పట్టించుకునే టెక్నాలజీ. అదేం చేస్తుందంటే.. టైమ్‌కి వారు తింటున్నారా? మందులు వేసుకుంటున్నారా? పడుకున్నారా? మెలకువతో ఉన్నారా? ఉల్లాసంగా ఉన్నారా? అలసటగా ఉన్నారా? ఆందోళనగా ఉన్నారా? ప్రమాదంలో ఉన్నారా? సురక్షితంగానే ఉన్నారా? వంటి అంశాలన్నీ నిశితంగా పరిశీలిస్తూ వారి రోజూవారీ జీవితంలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తుంది. ఆ వెంటనే డాక్టర్లకు సమాచారం చేరవేస్తుంది. ప్రస్తుతం పైలట్ దశలో అభివృద్ధి అవుతున్న ఈ ప్రాజెక్టు అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. కాలిఫోర్నియాకు చెందిన హోమ్‌వాచ్ కేర్‌గీవర్స్ ఆఫ్ శాన్ జువాన్ కాపిస్ట్రానో అనే సంస్థ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నది. మన దేశంలో ఇప్పటికే యాప్‌ల రూపంలో టెక్నాలజీ కొంత చేరువైంది. ఇలాంటి ప్రత్యేకమైన మరికొన్ని యాప్స్ వివరాలు ఈ కింద ఉన్నాయి.


voucher

వోచర్ క్లౌడ్

ఐఫోన్‌లో తప్ప మిగతా అన్ని ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. ముదిమి వయసులో బయటకు వెళ్లాలని ఆశపడే పెద్దవారు ఒక్కసారి ఈ యాప్‌లో చెక్ చేసుకుంటే చాలు.. ఎక్కడెక్కడ ఏయే ఆఫర్లున్నాయో సులభంగా తెలిసిపోతుంది. రెస్టారెంట్లు, సినిమాలు, గార్డెన్‌సెంటర్లు, ఇతర ఔట్‌లెట్లలో ఆఫర్లు, వోచర్లు, డిస్కౌంట్ల అందుబాటు గురించి చెప్పే యాప్ ఇది.


pillbox

పిల్‌బాక్స్

కొన్నిసార్లు టాబ్లెట్లు వేసుకోవాల్సిన సమయాన్ని మనమే మరిచిపోతుంటాం. అలాంటి వయసు మీద పడి జ్ఞాపకశక్తి తగ్గిపోతున్న పెద్దవారు మరిచిపోవడంలో తప్పేమీ లేదు. అయితే.. పిల్‌బాక్స్ యాప్ ఆ సమస్యను అధిగమించేందుకు సహాయపడుతుంది. కాకపోతే ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో ముందే ఇందులో సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆ సమయానికి గుర్తు చేస్తుంది.


cataract-myths
పెద్దవారికి ఉపయోగపడే ఇలాంటి ఎన్నో యాప్స్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని సమయాల్లో మనం వారికి అందుబాటులో ఉండలేం. ఒక్కసారి సమయం వెచ్చించి వాటిని డౌన్‌లోడ్ చేస్తే, మనం లేని సమయంలో ఆ యాప్స్ వారికి ఎంతో సహాయంగా ఉంటాయి.


fall-ditector

ఫాల్ డిటెక్టర్

వయసైపోయాక ఒంట్లో పట్టు సడలిపోతుంది. కొన్నిసార్లు కిందపడిపోతుంటారు. వారిని ఇంట్లో వదిలేసి అందరూ ఉద్యోగాలు, కాలేజీలకి వెళ్లిపోతే వారి గురించి ఎవరు పట్టించుకుంటారు? వారికి ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది? అనే ఆందోళనకు ఈ యాప్‌తో చెక్ చెప్పొచ్చు. ఇంట్లోని పెద్దవారు రోజూవారీ ప్రవర్తనకు భిన్నంగా, తేడాగా ప్రవర్తించినా, వారి ఆరోగ్యం, కదలికల విషయాలలో ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే పసిగట్టి యాప్‌లో కనెక్ట్ అయి ఉన్న మీకు అలర్ట్ పంపిస్తుంది. వెంటనే స్పందించి వారిని కాపాడుకోవచ్చు.


motion-doctor

మోషన్ డాక్టర్

ప్రమాదవశాత్తో, ఇతర కారణాల వల్లనో గాయాలైనప్పుడు ఏం చేయాలో తోచదు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే యాప్ ఇది. కిందపడినప్పుడు ఎముకలు కాస్త అటు, ఇటు జరిగి, లేదంటే విరిగి చెప్పలేనంతగా బాధపెడుతుంటాయి. అలాంటి సందర్భంలో చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి ఈ యాప్ చెప్తుంది. వయసు మీద పడినవారికి అయితే ఇది మరింత ఉపయోగకరం.


ఐబీపీ (బ్లడ్ ప్రెజర్)

వయసు మీద పడిన తర్వాత ఒంట్లో బీపీ, షుగర్ లెవల్స్ మారుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే మందులేసుకోవాలి. లేదంటే.. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీ మొబైల్‌లో ఐబీపీ యాప్ ఉంటే చాలు.. ప్రతీసారి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు.


విజ్ విజ్

పెద్దవారికి స్మార్ట్‌ఫోన్ల వాడకం అంతో ఇంతో తెలిసినా.. దాని గురించి పూర్తిగా తెలిసే అవకాశం చాలా తక్కువ. ఏదైనా బ్రౌజ్ చేయాలన్నా.. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలన్నా.. ఇబ్బందే. అయితే.. ఈ యాప్ అలా కాదు. ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి మనకేం కావాలో ఆడియో రూపంలో అడిగితే.. వీడియో రూపంలో సమాధానం, సమాచారం రెండూ ఒకేసారి ఇస్తుంది.


వెబ్ ఎండీ

ఇది ఒక వెబ్‌సైట్‌కి సంబంధించిన యాప్. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహమైనా, సమాచారమైనా ఈ యాప్ అందిస్తుంది. హెల్త్‌టిప్స్, సలహాలు అన్నీ ఈ యాప్ ద్వారా పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ఈ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సింది సెలక్ట్ చేసుకోవడమే.


డ్రాగన్ డిక్టేషన్

ఆఫీసులో ఉన్న కొడుకుకో, కూతురుకో, లేదంటే ఇంకెవరికైనా ఏదైనా మెసేజ్ పంపాలనుకునే పెద్దవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరం. టైప్ చేయలేక పడే ఇబ్బందుల్ని దీని ద్వారా అధిగమించవచ్చు. మీరు టైప్ చేయాలనుకున్న సమాచారాన్ని ఈ యాప్ ఓపెన్ చేసి నిర్ణీత స్పీడులో చెప్తే చాలు.. మీ మాటలు అక్షరాలుగా ప్రత్యక్షమవుతాయి. ఎంచక్కా ఆ మెసేజ్‌ని మీ వారికి పంపవచ్చు.

1082
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles