ఈ బాధ తీరేనా?!


Mon,February 5, 2018 11:41 PM

నా వయసు 60 సంవత్సరాలు. పిల్లలందరూ స్థిరపడ్డారు. ఈ వయసులో నాకు ఎవరికీ చెప్పుకోలేని సమస్య మొదలైంది. మూత్ర విసర్జనకు సంబంధించిన ఆలోచన మనసులోకి రాగానే వెంటనే బాత్రూమ్‌కి పరుగెత్తాల్సి వస్తున్నది. మూత్రం ఇంకా లోపలే ఉండిపోయినట్టు అనిపిస్తుంది. మంటగా కూడా ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను. నా సమస్యకు పరిష్కారం ఏంటో దయచేసి తెలుపగలరు.
- ధనలక్ష్మి, నిజామాబాద్

urine
మీ సమస్యకు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణం కావొచ్చు. ఇకపోతే మెనోపాజ్ దశలోకి వచ్చిన తరువాత హార్మోన్లు ఉండవు. కాబట్టి శరీరంలో పలు భాగాల్లో చర్మం మందం తగ్గి, పలుచబడుతుంది. మూత్రవ్యవస్థ, జననాంగం చుట్టుపక్కల భాగాలలోని చర్మం కూడా చాలా పలుచబడుతుంది. మెనోపాజల్ సిండ్రోమ్‌లో భాగంగా పదే పదే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు రావడం, మూత్రానికి వెంటవెంటనే వెళ్లాలనిపించడం, మూత్ర విసర్జన తరువాత కూడా మూత్రం ఇంకా లోపలే ఉండిపోవడం (అర్జ్ ఇన్‌కాంటినెన్స్), మూత్రం లీక్ కావడం, యురెత్రా సన్నబడిపోవడం (యురెత్రల్ స్టినోసిస్) లాంటి సమస్యలు వస్తాయి. లోకల్‌గా పరీక్షలు చేస్తే సమస్య తెలిసిపోతుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు యాంటిబయాటిక్స్ ఇచ్చి చికిత్స అందించవచ్చు. అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌ని మందుల ద్వారా తగ్గించవచ్చు. సన్నబడిన యురెత్రాకు డైలటేషన్ చికిత్స చేసి సరిచేస్తారు. అవసరాన్ని బట్టి హార్మోన్ ఆయింట్‌మెంట్లను ఇస్తారు. మధుమేహం ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకసారి షుగర్ టెస్టు కూడా చేయించుకోండి. సిగ్గుపడిపోయి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. పదే పదే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. మహిళల్లో కిడ్నీ ఫెయిల్యూర్‌కి గల ప్రధాన కారణాల్లో ఇదే ముందుంటుంది. అందుకే వెంటనే గైనకాలజిస్టును కలువండి.
dr-lalitha

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles