ఇమేజ్‌లకే ఇమేజ్!


Sun,August 19, 2018 01:42 AM

కొందరు మాటలతో మైమరిపిస్తే.. మరికొందరు రాతలతో కదిలిస్తారు..హైదరాబాద్‌కు చెందిన శ్రీశైలం మాత్రం తన ఫొటోలతో ఈ రెండూ చేస్తారు.ఒకప్పుడు పెండ్లి ఫొటోలు తీసిన శ్రీశైలం.. అక్కడితోనే జీవితం ఆగిపోకూడదనే ఆలోచనతో తొలిసారి చెన్నై రైలు ఎక్కాడు. అవకాశాలు వాటికవే రావని నమ్మి, తానే సృష్టించుకునేందుకు రెండో సారి ముంబై రైలు ఎక్కాడు. చివరగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈసారి రష్యా ైఫ్లెట్ ఎక్కాడు. కష్టాలు ఎన్ని ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని ఎన్నడూ వీడలేదు..
తన ఆలోచనతో, పట్టుదలతో నలుగురికి ఒక్కరిగా నిలిచాడు. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగే క్రమంలో దాదాపు 30కి పైగా అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఫొటోగ్రఫీ అనేది ఒక అందమైన భాష. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలకు సంకేతం.. అంతటి గొప్ప పాత్ర పోషించే ఫొటోగ్రఫర్ మనసున్న కవి అని చెబుతున్న శ్రీశైలం జీవన ప్రయాణం.. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. ఆయన మాటల్లోనే..

Lokecen1
చిలుకూరు బాలాజీ గుడి సమీపంలోని అజీజ్ నగర్ గ్రామం మాది. ఇంటర్ చదివేటప్పుడు ఫొటోలపై ఆసక్తి కలిగింది. దీనికి తోడు మా టీచర్ ఒకరు ఫొటోగ్రఫీ గురించి గొప్పగా చెబుతుండేవారు. అలా తెలియకుండానే ఫొటోగ్రపీ వైపు అడుగులు వేశా. మొదట పెండ్లి ఫోటోలు, వీడియోలు తీసేవాడిని. కొన్నాళ్లకు ఫొటోగ్రఫీలో మరింత నైపుణ్యం పెంచుకోవాలనిపించింది. సంబంధించిన కోర్సు చేయాలనే ఆలోచనతో అబిడ్స్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్ ఆఫీసులో మూడు నెలల కోర్సు పూర్తి చేశాను. పెండ్లిళ్లకు వీడియోలు, ఫొటోలు మరింత నైపుణ్యంతో తీసేవాడ్ని. ఆ పని సంతృప్తినిచ్చింది. అలా 1997 వచ్చే సరికి చదువుకు టాటా చెప్పి ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంపిక చేసుకున్నాను.

కొణికలో కంపెనీలో చేరాను: జీవితం చాలా సాఫీగా సాగిపోతున్న సమయం అది. పెండ్లి ఫొటోలు తీయడంతోనే సరిపోయేది. కొన్ని రోజులకు ఓ ఆలోచన వచ్చింది. ఇక్కడే ఇలాగే చేసుకుంటూ వెళ్తే జీవితం ఇక్కడే ఆగిపోతుంది. మరింత అభివృద్ధి చెందాలంటే ఏదైనా చేయాలనే ఆలోచనలో పడ్డాను. వెంటనే పేపరు యాడ్‌లో చెన్నైలోని కొణిక కంపెనీ ట్రైనింగ్ గురించి తెలుసుకున్నాను. ఫోన్ నెంబర్ తెలుసుకొని ధైర్యంగా ఫోన్ చేసి వివరాలు అడిగాను. శిక్షణ ఇస్తాం. జాయిన్ అవ్వమని చెప్పారు. అప్పటికి నాకు తమిళం, ఇంగ్లీష్ అంతగా తెలీదు. అయినా దైర్యంతో 2000 సంవత్సరంలో రైలు ఎక్కి చెన్నై వెళ్లాను. అక్కడ నా అదృష్టం కొద్దీ కొణిక డైరెక్టర్‌గా పొన్నస్వామి ఉన్నారు. ఆయనకు తెలుగు వచ్చు. ఆయనే అండగా నిలిచి కష్టపడు నేనున్నా అని భరోసా ఇచ్చారు.
Lokecen3
ఉద్యోగం వదులుకున్నాను: కోర్సు పూర్తయిన వెంటనే ల్యాబ్ మేనేజ్‌మెంట్ జాబ్ వచ్చింది. పొన్నస్వామి సార్ వద్దకు వెళ్లి నేను చేయను అని చెప్పాను. ఫొటోగ్రఫీ వైపు వెళ్లాలనే కోరికతో వచ్చాను. అటు వైపే ప్రయాణం చేస్తాను అని చెప్పాను. కోర్సు పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చాను. ఇక్కడ మళ్లీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడం ప్రారంభించాను. ఈ సమయంలో పొన్నస్వామి తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలు చూసేందుకు వచ్చారు. ఆయనకు మన కల్చర్ అంటే చాలా ఇష్టం. రామప్ప, వరంగల్ కోట చూసి సంతోషపడ్డారు. తర్వాత కొద్ది రోజులకు ఆయనకు ఫోన్ చేసి ఇక్కడ ఉండలేను. పీసీ శ్రీరాం వద్ద పని చేయాలని ఉంది అని చెప్పాను.

హైదరాబాద్ వదిలి రాగలవా అన్నారు: పీసీ శ్రీరాం అంటే చాలా గొప్ప సినిమాటోగ్రఫర్. డైరెక్టర్ల, హీరోలతో సినిమాలు ఎలా ప్రచారం చేస్తారో.. పీసీ శ్రీరాం పేరుతో సినిమాలు ప్రచారం చేసేవారు. అత్యధింగా రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో ఆయనకొరు. అయన గురించి తెలుసుకొని అసిస్టెంట్‌గా అయినా చేరాలనుకున్నాను. పొన్నస్వామికి ఇదే విషయం చెబితే చెనైలోనే స్థిరపడాలి, హైదరాబాద్ వదిలి రాగలవా అన్నారు. ఆలోచించి చెప్పు నా వంతు ప్రయత్నం చేస్తా అన్నారు. అమ్మానాన్న ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదు. అనుకున్నట్లుగానే పొన్నస్వామి ఫోన్ చేసి చెన్నైకి పిలిచారు. అయితే ఇంట్లో ఏర్పడ్డ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లలేకపోయాను. అది బాధాకరమైన విషయం కాని తప్పలేదు. మళ్లీ వెళ్లే అవకాశం తర్వాత నాకు ఎప్పుడూ రాలేదు.
Lokecen
బిజినెస్ అట్టర్ ఫ్లాప్: చేసేదేం లేక హైదరాబాద్‌లో స్థిరపడాలని మిత్రులతో కలిసి స్టుడియో ప్రారంభించా. కొన్ని నెలల్లోనే తీవ్రంగా నష్టపోయాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నా ఫెయిల్యూర్‌గా ఒప్పుకుంటాను. చేతిలో డబ్బులేదు. అప్పులు కట్టాలని ఇంట్లో వాళ్లకు చెప్పాను. తర్వాత కొన్నాళ్లకు ఎకరం భూమి అమ్మేసి అప్పులు కట్టేశాం. ఏం చేయాలో తెలియక మళ్లీ కొన్ని అసైన్‌మెంట్లు చేయడం ప్రారంభించాను. అలా 2007 వరకు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, అసైన్‌మెంట్లు చేశాను. తర్వాత నావల్ల కాలేదు. నేను ఎన్నో కొత్త ప్రదేశాలు చూడాలి. నా కెమెరాతో ప్రపంచానికి కొత్త కోణంలో చూపెట్టాలనే తపన నాలో ఉండేది. మళ్లీ ఈసారి మరింత పక్కాగా ఆలోచించి ముంబై రైలు ఎక్కాను. అక్కడే రెండ్లేండ్లు ఫొటోగ్రఫీలో మాస్టర్ కోర్సు చేశాను. అది కంప్లీట్ కమర్షియ్‌ల్ ప్రొఫెషనల్ కోర్సు. 2010లో కోర్సు పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చాను.

ప్రపంచ పోటీల్లో తొలి గెలుపు: కోర్సు పూర్తయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఫొటో కాంపిటీషన్ ప్రారంభమైంది. దీని గురించి తెలుసుకున్న నేను ఖచ్చితంగా పోటీ పడాలని అనుకున్నాను. అప్పటికే నేను తీసిన ఫొటోలతో దరఖాస్తు చేశాను. లోన్‌లీ ప్లానెట్ అనే ప్రఖ్యాతి గాంచిన ట్రావెల్ కంపెనీ ఈ పోటీలు నిర్వహిస్తుంది. ఇక కాంపిటీషన్ జరిగే అంశం ట్రావెల్ ఫొటోగ్రఫీ. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా లక్షా 30 వేల మంది పోటీపడ్డారు. ఇందులో నేను గెలిచి.. గ్రాండ్ ప్రైజ్‌కి ఎంపికయ్యాను. అలా వరల్డ్ ట్రిప్‌కి ఎంపికయ్యాను.
Lokecen2
వరల్డ్ ట్రిప్‌లో తొలి ప్రాధాన్యంగా భారత్: తొలి బహుమతిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన దేశాలు ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పించారు. వరల్డ్ ట్రిప్ కంటే నాకు భారత్‌లోని అన్ని ప్రదేశాలు చూడాలని ఉంది అని చెప్పాను. కాని రూల్స్ ప్రకారం, అలా కుదురదు అని చెప్పారు. కొన్ని రోజుల పాటు ఈ చర్చలు జరిగాయి. చివరకు వరల్డ్ ట్రిప్‌కు బదులుగా 10,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఇచ్చారు. ఇక అప్పుడు ప్రారంభించాను నా భారత యాత్ర.. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 రాష్ర్టాలు తిరిగాను. అక్కడి సంస్కృతులు గురించి తెలుసుకున్నాను. ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్తే దాదాపు 2, 3 నెలలు బయటే ఉండేవాడ్ని. మంచి ఫొటో రావాలంటే ఎంతో ఓపిక, సహనం, నైపుణ్యంతో ఉండాలి. ఒకవైపు కమర్షియల్ వర్క్ చేస్తూనే నా అభిరుచికి తగిన ఫొటోలు తీసుకునే వాడ్ని. ఉత్తర్‌ప్రదేశ్‌లో హోలీ పండుగ అద్భుతంగా జరుగుతుంది. పూలు, రంగులు కలిపి చల్లుకుంటారు. దాన్ని కవర్ చేసేందుకు 20 నుంచి 30 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో తొలిసారి మేడారం జాతర చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడి సంస్కృతి అద్భుతంగా అనిపించింది. ..?

రష్యాలో ఏడాది ప్రాజెక్టు..

గొప్ప చరిత్ర ఉన్న సెయింట్ పీటర్‌బర్గ్‌ని కొత్తగా చూపించాలి. ఫైన్ ఆర్ట్స్, కల్చర్, పీపుల్, స్ట్రీట్ , చిల్డ్రన్ ఇలా 8 విభాగాల్లో ఫొటోలు తీయాలి. ఇది ఏడాది ప్రాజెక్టు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. తరుచూ రష్యా వెళ్లివస్తుంటాను. ఈ ఏడాది చివరి వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలి. దాంతో వారు పెద్ద ఫొటోగ్రపీ షో ఏర్పాటు చేసి సెయింట్ పీటర్‌బర్గ్‌ని కొత్త కోణంలో ప్రపంచానికి చూపిస్తారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తే నాకంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు వస్తుంది అని భావిస్తున్నాను. దీని తర్వాత తెలంగాణ కల్చర్‌ను ప్రపంచానికి చూపించాలనే ఆలోచన ఉంది. దీనికోసం ఇప్పటికే ఓ ప్రణాళిక రచించాను.
- శ్రీశైలం, ఫొటోగ్రాఫర్
Lokecen4
రవీంద్ర భారతి దశ మార్చింది: 2015లో ముంబైలో జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ మొదటి ఫొటోగ్రఫీ షో నిర్వహించారు. దానికి దరఖాస్తు చేసి 7 ఏండ్లు ఎదురు చూస్తే అవకాశం వచ్చింది. తర్వాత అదే ఏడాదిలో హైదరాబాద్‌లోని గోతే జంత్రంలో చేశాను. 2018లో రవీంద్ర భారతిలో నిర్వహించాను. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ నాకు ఎంతో సహకారం అందించారు. వారి ప్రోత్సాహం తోనే షో ఏర్పాటు చేశాను. ఈ అప్‌డేట్స్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, రష్యాలో పని చేసే ఇద్దరు స్నేహితులు రష్యాలో ఫిపా జరుగుతున్న సందర్భంగా ఫొటోగ్రఫీ షో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చారు. దీంతో నేను రష్యా వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టాను. రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ అంటే అదొక సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం. ప్రపంచ కలలకు నిలయంగా చెప్పుకోవచ్చు. నాకూ అక్కడికి వెళ్లాలని కోరిక. మరోవైపు తెలంగాణ, భారత కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశంగా అనిపించింది. వెంటనే రష్యా వెళ్లాలని ప్రయత్నం పారంభించాను. నేరుగా రమణాచారిగారి వద్దకు వెళ్లాను. ఇదీ నా పరిస్థితి అని వివరించాను. ఆయన ధైర్యంగా వెళ్లు అని చెప్పారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మరోవైపు మిత్రులు, కుటుంబ సభ్యులు సపోర్టు చేశారు. అలా అందరి సాయంతో చివరకు రష్యాకు విమానం ఎక్కాను.

లంబాడా సంస్కృతిలో రష్యా మోడల్: రష్యాకు రమ్మని ఆహ్వానించిన మిత్రులు అక్కడికి వెళ్లాక ఎంతో సాయం చేశారు. ఫిఫా సందర్భంగా ప్రపంచం మొత్తం అక్కడే కనిపించింది. అన్ని రకాల, జాతుల వారు దర్శనమిచ్చారు. ముందుస్తుగా అనుకున్నట్లు ఇక్కడి లంబాడీ దుస్తులను తీసుకువెళ్లి రష్యన్ మోడల్‌తో ఫొటోలో తీసాను. ఇలా భారత్, రష్యా సంస్కృతులను పరిచయం చేసే ఫొటోలతో ఫొటోగ్రఫీ షో ఏర్పాటు చేశాను. లంబాడా డ్రెస్ చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. ఇంత కలర్‌ఫుల్ డ్రెస్ అంటూ...ఆసక్తిగా చూశారు. రష్యాలో ఉండే ఉండే ఓ టీవీ జర్నలిస్టు షో చూసి ఒక ఆర్ట్ మేనేజర్‌కి పరిచయం చేశారు. అయితే అప్పటికి నేను ఇండియా వచ్చాను. ఫొటోలు చూడాలని కోరితే వెంటనే రష్యా వెళ్లిపోయాను. నా వద్ద ఉన్న 70 ఫొటోలతో వారికోసం మూడు రోజుల పాటు ఫొటోగ్రఫీ షో ఏర్పాటు చేశాను. ఆర్ట్ మేనేజర్ కొత్త ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అప్పటికే ఒక విదేశీ ఫొటోగ్రాఫర్ కోసం వెతుకుతున్నారు. నా ఫొటోలు చూసి నన్ను ఎంపిక చేశారు.

డేవిడ్ అలెన్ హార్వేని కలువడం మరచిపోలేను: 2016 షార్జాలో అక్కడి కింగ్ వరల్డ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచంలోని టాప్ 20 ఫొటోగ్రఫర్లను మాత్రమే ఆహ్వానించారు. అయితే అప్‌కమింగ్ ఫొటోగ్రాఫర్స్ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో 5గురు అరేబియన్, నాన్ అరేబియన్స్ ఒకరికి అవకాశం కల్పించారు. నాన్ అరేబియన్ కోటాలో, నా ఫొటోలతో దరఖాస్తు చేస్తే ఎంపికయ్యాను. అలా షార్జా వెళ్లాను. నాకు అమితంగా నచ్చే వరల్డ్ ఫేమస్ ఫొటోగ్రఫర్ డేవిడ్ అలెన్‌హర్వేను కలిసాను. దాదాపు అరగంట పాటు ఆయన వద్ద ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. నా ఫొటోలు చూసి అభినందించారు. జీవితంలో అవి మరచిపోలేని రోజులు. మిగతా ఫేమస్ ఫొటోగ్రాఫర్లను కలిసి కొత్త విషయాలు తెలుసుకున్నాను.

సిద్ధార్థ్ బీసగోని

729
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles