ఇప్పటి నాయకులు.. ఒకప్పటి క్రీడాకారులు!


Sat,September 1, 2018 11:17 PM

cricketers
క్రీడారంగాల్లో రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా కష్టమే! కొంత కాలం తర్వాత ఈ రెండూ ఉన్నా ఫలితం ఉండదు. కారణం వయసు. అది పెరుగుతున్నా కొద్ది అవకాశాలు తగ్గుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రంగాల్ని ఎంచుకుంటుంటారు క్రీడాకారులు. అలా క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు నాయకులు వీళ్లు..


ఇమ్రాన్ ఖాన్

Imran-khan
పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌పై చాలా చర్చ జరుగుతున్నది. పాకిస్థాన్ తరపున క్రికెట్ ఆడి ప్రపంచకప్ అందించిన ఘనత ఉన్నవాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక తెహ్రిక్ - ఏ- ఇన్సాఫ్ రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంటరయ్యాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి దేశ ప్రధాని పీఠం కైవసం చేసుకున్నాడు.


అజారుద్దీన్

AZHARUDDIN
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన టీమీడింయా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్టు ప్రచారం కూడా జరుగుతున్నది.


అర్జున రణతుంగ

Arjuna_Ranatunga
శ్రీలంక ప్రపంచకప్ గెలిచిన ఒకప్పటి జట్టులో అర్జున సభ్యుడే. క్రికెట్‌కు దూరమయ్యాక రాజకీయాల్లో చేరాడు. ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.


మహ్మద్ కైఫ్

KAIF
క్రికెట్ జీవితం తర్వాత రాజకీయాల్లోకి ఎంటరయ్యాడు కైఫ్. కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఉత్తరప్రదేశ్ ఫుల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.


మన్సూర్ అలీ ఖాన్ పటౌడి

MANSORR-ALI-KHANPataudi
46 టెస్ట్ మ్యాచ్‌లు, కెప్టెన్‌గా 41 మ్యాచ్‌లకు బాధ్యతలు వహించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 1991 సాధారణ ఎన్నికల్లో భోపాల్‌లో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అంతకు ముందు 1971 ఎన్నికల్లో కూడా విశాల్ హర్యానా పార్టీ తరపున నిలబడి ఓటమి రుచి చూశాడు.


సనత్ జయసూర్య

SANATH-JYASURYA
బ్యాట్ పట్టుకొని బ్యాలెట్ వైపు కన్నేసాడు. ఓ వైపు క్రికెట్ ఆడుతూనే రాజకీయాలపై ఆసక్తి కనబరిచాడు. 2010లో ఎంపీగా ఎంపికై కూడా మైదానంలోకి దిగాడు.


క్రితి ఆజాద్

kirtiazad
ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 25 వన్డే మ్యాచ్‌లాడిన క్రితి ఆజాద్ 1983 వరల్డ్ కప్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. క్రితి తండ్రి భగవత్ జా ఆజాద్ బిహార్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. రాజకీయ కుటుంబం కావడంతో వారసత్వంగా తను కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. క్రికెట్‌లో రిటైర్‌మెంట్ తీసుకున్నాక కొన్నాళ్లు టీవీల్లో కామెంటరీ చేశాడు. 2014లో లోక్‌సభ సభ్యునిగా దర్భంగా నుంచి గెలిచాడు. ప్రస్తుతం కూడా లోక్‌సభ సభ్యునిగా గెలిచి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డు బద్దలు కొట్టాడు.


వినోద్ కాంబ్లీ

VINOD-KAMBLI
104 వన్డేలు, 17 టెస్ట్‌మ్యాచ్‌లాడిన వినోద్ కాంబ్లీ లోక్ భారతి పార్టీ తరపున 2009 ఎన్నికల్లో విక్రోలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాడు. తన పుట్టిన రోజు సెంచరీ చేసిన మొదటి భారతీయ క్రికెటర్ రికార్డు నమోద్ చేశాడు. లోక్ భారతి పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.


నవజోత్ సింగ్ సిద్దు

Navjot-Singh-Sidhu
ప్రస్తుతం టీవీల్లో వ్యాఖ్యాతగా, జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సిద్దు ఒకప్పటి క్రికెటర్. సిద్దు ఇండియన్ క్రికెట్ జట్టుకు 51 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 134 వన్డేల్లో పరుగుల వరదలు తీయించాడు. క్రికెటర్‌గా రిటైర్‌మెంట్ తీసుకున్నాక కొన్నాళ్లు బీజేపీలో ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రస్తుతం పంజాబ్ పర్యాటక శాఖ మంత్రిగా సేవలందిస్తున్నాడు. అవాజ్ ఏ పంజాబ్ అనే పార్టీని కూడా ప్రారంభించాడు.


చేతన్ చౌహాన్ 1991, 1998 ఎన్నికల్లో అమ్రోహీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగాడు. అప్పటి నుంచి క్రీయాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాడు. మనోజ్ ప్రభాకర్ 1998 ఎన్నికల్లో న్యూ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. 83 టెస్టులు, 200లకు పైగా శ్రీలంక తరపున క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన హశన్ తిలకరత్నే యునైటెడ్ నేషనల్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశాడు. 2011లో మాజీ పాకిస్థాన్ కెప్టెన్ ఆమీర్ సోహెల్ పీఎమ్‌ఎల్ ఎన్ పార్టీలో చేరాడు. 2011 పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ ముత్తహిదా ఖౌమీలో జాయినయ్యాడు. వీళ్లతో పాటు చాలామంది క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి గెలిచి నాయకులయ్యారు. ఓడిపోయి వ్యాపారాలు పెట్టుకున్నారు.
-అజహర్ షేక్

913
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles