ఇన్నోవేటివ్ తెలంగాణ!


Tue,August 14, 2018 11:39 PM

అమెరికా వెళ్లాలి.. అక్కడ ఉద్యోగం చేయాలనే ఆలోచన ఇదివరకు చాలా ఉండేది. ఇన్నోవేషన్స్‌లో మనవాళ్లకు తిరుగులేకపోవడంతో ప్రముఖ కంపెనీలన్నీ కండ్లకద్దుకొని తీసుకున్నాయి. అమెరికా శాస్త్ర.. సాంకేతిక అభివృద్ధిలో తెలుగువాళ్ల పాత్ర ముఖ్యమైందని పలు సర్వేలు కూడా వెల్లడించాయి. అంత పరిజ్ఞానం.. నేర్పరితనం.. సృజనాత్మకత ఉన్న మనవాళ్ల నైపుణ్యాన్ని మనమే వినియోగించుకోలేమా? అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చినవే స్టార్టప్‌లు. టీహబ్.. వీహబ్‌తో ఇప్పటికే అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రూరల్ టాలెంట్‌ను వెతికే పనిలో పడింది. టెక్నాలజీ కోర్సులు చదివినవాళ్లకు మాత్రమే కాకుండా గ్రామాల్లో ఉండే అందరికీ ప్రాథమిక దశ నుంచి ఇన్నోవేటివ్ స్పిరిట్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇంటింటికి ఓ ఇన్నోవేటర్. అదెలా సాధ్యమో జిందగీలో చదవండి!
అవసరం నుంచే ఆవిష్కరణ పుడుతుంది. ఆలోచనల నుంచి ఐడియా వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఏ ఐడియా వస్తుందో తెలియదు. యాపిల్ చెట్టు కొత్త కాదు.. యాపిల్ పండ్లు రాలి పడడమూ కొత్త కాదు.. ఎన్ని చెట్లు మొలవలేదు. ఎన్ని పండ్లు రాలలేదు. మరి న్యూటన్ మాత్రమే అందులోంచి ఓ కొత్త సత్యాన్ని ఎలా తెలుసుకున్నాడు? అదే తపన. అదే ఆలోచన. అదే ఐడియా. అర్కెమెడిస్‌కు యురేకా మూమెంట్ వచ్చింది ఇలాంటి ఆలోచనల నుంచే. థామస్ ఆల్వా ఎడిసన్‌కు బల్బ్ ఐడియా వెలిగింది ఇలాంటి అంతర్మథనం నుంచే. అచ్చమైన ఐడియా అంతర్మథనం నుంచే పుడుతుంది. అదే ఓ కొత్త ఆవిష్కరణకు దారి తీస్తుంది. అలాంటి ఆవిష్కరణలకు పురుడుపోసేందుకు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. వీరిని చూడండి.. ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన.. ఒక్కో ఆవిష్కరణ. ఒకరు పొలం పనులు సులభం చేశారు. ఇంకొకరు నాట్లు సులువుగా వేసే యంత్రం కనిపెట్టారు. మరొకరు డ్రోన్‌తో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఈ మూడూ వ్యవసాయ రంగానికి సంబంధించినవి. మరి ఇలాంటి ఎన్ని రంగాల్లో ఎన్ని ఆవిష్కరణలు చేయొచ్చు. ఆలోచించండి. ఐడియా ఎవరి సొత్తూ కాదు. మీరూ వీరిలా ఆలోచించండి.. అవసరం ఏదైనా కావొచ్చు.. ఓ పరిష్కారం కనిపెట్టండి. అదే ఆవిష్కరణ. మీ ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకే ఇన్నోవేషన్ సెల్ ఎదురుచూస్తున్నది.

innovation


ఇంటింటికో ఆవిష్కర్త!

తెలంగాణ.. ఇన్నోవేషన్ ఇలాఖాగా మారుతున్నది. వినూత్న ఐడియాలకు కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. ఐదో తరగతి చదువుకొని.. చేనేతలో విప్లవాత్మక ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం.. నిజామాబాద్ పల్లెలో పుట్టి.. రెడ్‌బస్ ఆన్‌లైన్ బస్ బుకింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించిన ఫణీంద్ర సామ.. ఇలాంటి ఆణిముత్యాలు.. ఇంటింటికో ఇన్నోవేటర్లు తెలంగాణలో చాలామంది ఉన్నారు! వాళ్లందర్నీ చేరదీసి ఇంక్యుబేట్ చేసేందుకు కృషి చేస్తున్నది తెలంగాణ ఇన్నోవేషన్ సెల్!!

Phaneendra-Sama
ఫణీంద్ర సామ
చీఫ్ ఇన్నోవేషన్
ఆఫీసర్, తెలంగాణ

తెలంగాణను ఇన్నోవేషన్స్ కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఇది కేటీఆర్ ఐడియా. దాంట్లో భాగంగానే మేం ప్రతి ఇంటా ఓ ఇన్నోవేటర్‌ని ఎలా తీసుకురావాలి అని పనిచేస్తున్నాం. ఇన్నోవేషన్స్ గురించి ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై డిస్కషన్స్ చేసేదాకా వెళ్లాలనేది మా ఆలోచన. చింతకింది మల్లేశం లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని మరింతగా ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి రోడ్ షో ప్రారంభిస్తున్నాం. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. తెలంగాణలోని 15 జిల్లాలను ఎంచుకున్నాం. ఒక్కో జిల్లాకు వెళ్లి ఈవెంట్స్ నిర్వహించి నవతరం నుంచి ఐడియాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. బెస్ట్ 20 ఐడియాస్‌ను సేకరించి ప్రోత్సహిస్తాం. వారికి ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తాం. ఇంక్యుబేటర్స్‌లో 6 నెలల ఇంక్యుబేషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని టీ-20 ఐడియాస్ అంటున్నారు. ఆర్థిక సహకారం అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని పల్లె సృజన అనే సంస్థతో కలిసి నిర్వహిస్తున్నాం. ఉదాహరణకు చింతకింది మల్లేశంను తీసుకుందాం. ఆయనలోని టాలెంట్‌ను గుర్తించి.. సేవలు విస్తరింపజేసి.. చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు రూ.కోటి రూపాయల సహకారం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి కేటీఆర్ ఇప్పించారు. ఇప్పుడు 80 మంది ఉన్నారు. రేపు 8000 మంది అవుతుండొచ్చు. ఇవన్నీ కావాలంటే కొన్ని సక్సెస్ స్టోరీలు కావాలి.


Dileep-Konatham
కొణతం దిలీప్
డైరెక్టర్,
తెలంగాణ డిజిటల్ మీడియా

తెలంగాణ ఇన్నోవేషన్స్‌కు పెట్టింది పేరు. వాట్సప్, ఫేస్‌బుక్స్ కూడా ఒకప్పుడు స్టార్టప్సే. అందరం వెళ్లేదారి కాకుండా మనం కొత్త దారి ఎంచుకోవాలని కేటీఆర్ ఆలోచన. దాంట్లో భాగంగా మొదట శ్రీకారం చుట్టిన కార్యక్రమమే టీ-హబ్. ఇప్పుడు తాజాగా వీ-హబ్ ప్రారంభించారు. స్టార్టప్స్‌కు సపోర్ట్ చేయడం ఓకే కానీ.. పిల్లల్ని చదువు తప్పితే వేరే పనికి వెళ్లనివ్వరు. వేరే ఏ ఆలోచన చేయనివ్వరు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇన్నోవేషన్స్ వైపు ఆకర్షించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాలలు, కళాశాలలే కాదు వయోజనుల్లోనూ ఉండే ఇన్నోవేటివ్స్‌ను రాబట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇన్నోవేటర్స్ ప్రతి జిల్లాల్లో ఉన్నారు. చింతకింది మల్లేశం వంటివారు చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు 80 మందిని గుర్తించారు. అలాంటి ఇన్నోవేటర్స్‌ను గుర్తించి మాట్లాడుతున్నారు. టాలెంట్‌ను గుర్తించడంతో పాటు ఇంకొంతమందికి స్ఫూర్తిదాయంగా ఉంటుంది. ఇంజినీరింగ్ చేసినవాళ్లే ఇన్నోవేటర్స్ కాదు. పొలం దగ్గర వ్యవసాయం చేసేవాళ్లలోనూ ఇన్నోవేటర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లందరూ బయటకు రావాలి.


mini-tractor

1.రైతుల కోసం మినీ ట్రాక్టర్

జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ట్రాక్టర్ డిజైన్ ఛాలెంజ్-2018లో వరంగల్ రూరల్ జిల్లా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అవార్డు గెలుచుకున్నారు. వారికి ఆ అవార్డు సాధించి పెట్టిందే ఈ మినీ ట్రాక్టర్. తక్కువ ఖర్చుతో దేశీయ విడి భాగాలతో వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ఉపయోగపడే ట్రాక్టర్‌ను రూపొందించి దేశంలో జిల్లా విద్యార్థులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని ముగ్ధుంపురం గ్రామ శివారుల్లోని జయముఖి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా జరిగిన ట్రాక్టర్ డిజైనింగ్ చాలెంజ్ స్వీకరించి మినీ ట్రాక్టర్ తయారుచేశారు. ఈసీఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న 25 మంది బృందంతో కూడిన విద్యార్థులు ఈ మినీ ట్రాక్టర్ డిజైన్ చేసారు. కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హేమసుందర్ ఆధ్వర్యంలో రూ.2.10 లక్షలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఉపయోగపడే పద్ధతిలో ఈ మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు.


electricity bill

2.ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్టిమేటర్

ఆవిష్కర్తలు: కరీంనగర్‌జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు.
ఉపయోగం ఏంటి?: స్మార్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్టిమేటర్ ప్రాజెక్టును ప్రణీత్‌కుమార్ పర్యవేక్షణలో నవ్య, రీతురామన్, రాహుల్, శ్రీజ రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటంటే.. ఇంట్లో ఎంత విద్యుత్‌ను వాడుకుంటున్నామో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.


3TS

3.ఆటోమేటిక్ టాయిలెట్ మెషీన్

ఆవిష్కర్త: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ గ్రామానికి చెందిన మనోజ్. పట్టణంలోని నవజ్యోతి పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న మనోజ్‌కు సైన్స్‌పై ఆసక్తి ఎక్కువ. అతడి ఆసక్తిని గమనించిన హెడ్‌మాస్టర్ సుజాత ఇన్నోవేషన్స్ పట్ల ప్రోత్సహించారు. స్వచ్చభారత్ కార్యక్రమాల్లో పాఠశాల తరపున అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న మనోజ్.. ఉపాధ్యాయులు అపర్ణ, అజయ్‌ల సహకారంతో రూ. 2500 ఖర్చుతో ఆటోమేటిక్ టాయిలెట్ మెషీన్‌ను రూపొందించాడు.
ఉపయోగం: టాయిలెట్ వెంటనే శుభ్రం అవుతుంది. మామూలుగా మూత్ర విసర్జన తరువాత నీళ్లు పోయకపోవడంతో దుర్వాసనతో హీన స్థితికి చేరుకుంటాయి. ఇదే మనోజ్ ఆలోచనకు బీజం వేసింది. అతడు తయారుచేసిన టాయిలెట్ మెషీన్ కిందిభాగంలో పైడిల్ అమర్చడంతో మూత్రం చేసే వ్యక్తి పైడిల్‌పై కాలుమోపగానే ఆటోమేటిక్‌గా నీరు పంప్ అవుతుంది.
paddy-machine

4.వరిలో కొత్త యంత్రం

ఆవిష్కర్తలు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామ పంచాయతీ సర్వారానికి చెందిన రైతు పిట్టల రాములు.
ఉపయోగం: వరి నాటు వేసేముందే జంబు (నారు మడిని లెవల్ చేసే) కొట్టేందుకు ఈ యంత్రాన్ని ఉపయోగించొచ్చు.
ఆవిష్కరణ : పిట్టల రాములు 2016లో పత్తిలో కలుపుతీసేందుకు (పవర్ వీడర్)ను సబ్సిడీ ద్వారా కొనుగోలు చేశాడు. తర్వాత కొద్దిరోజులకు ఆ యంత్రంలో మార్పులు చేశాడు. చక్రాలు తీసి, ఇనుము చక్రాలు బిగించి, వరి పొలాన్ని లెవల్ చేసే యంత్రాన్ని అమర్చి, జంబులా తయారు చేశాడు. ఈ పరికరంలో కేవలం రెండు లీటర్ల పెట్రోల్‌తో రోజుకు మూడు ఎకరాల వరి మడిని లెవల్ చేస్తున్నాడు.


missed-call

5.మిస్డ్‌కాల్‌తో మోటార్ ఆన్ ఆఫ్

ఆవిష్కర్త: ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన యువకుడు గుండ రాజయ్య ఉపయోగం: మిస్‌డ్‌కాల్‌తో వ్యవసాయ విద్యుత్ మోటర్‌ను అన్‌ఆఫ్ చేయొచ్చు. ఆవిష్కరణ : విద్యుత్ మోటార్‌లో వైండింగ్ చేయడం రాజయ్య వృత్తి. అదే క్రమంలో గతంలో వ్యవసాయ విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవి కనుక ఆర్ధరాత్రి రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు.రైతులు ఇంట్లో నుండే విద్యుత్ మోటర్‌ను అన్‌ఆఫ్ చేసే పరికరం తయారు చేయాలనే లక్ష్యంతో సెల్ ఫోన్ ఐసీల నుంచి సిగ్నల్ బాక్స్ కనెక్షన్ ఇచ్చి సిగ్నల్ బాక్స్ నుంచి విద్యుత్ మోటర్ స్టాటర్ వైర్లను అమర్చారు. సిగ్నల్ బాక్స్‌కు అమర్చిన సెల్ ఫోన్‌కు కాల్ చేస్తే మోటర్ ఆన్ అయ్యే పరికరాన్ని తయారు చేశాడు. దీంతో ఇంట్లో నుంచి మోటార్‌ను అన్‌ఆఫ్ చేసే ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో పలువురు రైతులు ఈ పరికరాన్ని అమర్చుకొని ఇంటి వద్ద నుండే మోటర్‌ను ఆన్ ఆఫ్ చేసే అవకాశం కల్గించారు. ఈ పరికరాన్ని అమర్చుకున్న రైతు సెల్‌కు రైతు వద్ద ఉన్న సెల్‌కు త్రీఫేస్ విద్యుత్ పోయినా, వచ్చినా సెల్‌కు మెసేజ్ అలర్ట్ వస్తుంది.


women-protection

6.ఉమెన్ ప్రొటెక్షన్ జాకెట్

ఆవిష్కర్త: కరీంనగర్‌జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన 27 ఏళ్ల పూరెల్ల శ్రీనివాస్. ఇతడు డిగ్రీ చదివాడు. సైన్స్‌పై అతనికి ఆసక్తి. నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపెట్టేందుకు కొన్ని ఆవిష్కరణలు చేశాడు. దాంట్లో ఒకటి ఈ ఉమెన్ ప్రొటెక్షన్ జాకెట్.
ఉపయోగం ఏంటి?: సాధారణంగా కనిపించే ఈ జాకెట్ స్త్రీలకు రక్షణగా ఉపయోగపడుతుంది.
ఆవిష్కరణ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్క్యూట్ బోర్డును తయారుచేశాడు. ఇది పగలంతా సూర్యరశ్మితో చార్జింగ్ అవుతూ, విద్యుత్‌తో చార్జింగ్ పెట్టుకునేలా ఉంటుంది. దీనిని ఎవరైనా టచ్ చేస్తే విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌కు గురవుతారు. దీంతో అతడు స్పృహ తప్పిపడిపోతాడు. ఓల్జేట్‌ను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ జాకెట్ ధరించిన వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు.


janagam

7.కూలీలు లేకుండానే నాట్లు

నారుమడి లేకుండానే నేరుగా పొలంలో నాట్లు వేసేలా ముగ్గురు రైతులు వినూత్న ప్రయోగం చేపట్టి విజయం సాధించారు. మండెలో మొలకెత్తిన వరి విత్తనాలతో నేరుగా నాట్లు వేసే ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టారు. కూలీల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో రోటోవీడర్‌ను తయా రు చేసి ఔరా! అనిపించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం బండ్లగూడెం గ్రామానికి చెందిన రైతులు మాసిరెడ్డి తిరుపతిరెడ్డి, రాగల్లమహేందర్, బిర్రు నరేశ్‌లు ప్లాస్టిక్ పైపును ఉపయోగించి ఒక్కసారి చల్లితే.. ఆరు సాల్లు విత్తనాలు పడేలా రోటో వీడర్‌ను తయారు చేశారు. ఈ రోటోవీడర్ వల్ల ఎంతో ఖర్చు తగ్గింది.


warangal-app

8.నా పంట యాప్..

యంత్ర పరికరాల సమస్యను తీర్చడానికి నా పంట యాప్ వినూత్న సౌకర్యాన్ని రైతులకు అందిస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లా హంటర్‌రోడ్డు న్యూశాయంపేటకు చేందిన రైతు బిడ్డ ఎంబీఏ విద్యార్థి నవీన్‌కుమార్ ఈ యాప్‌ను రూపొందించారు. ట్రిపుల్‌ఐటీ, ఇంక్రిశాట్ సంస్థల సహకారంతో స్టార్టప్ కింద తెలంగాణ అవిర్భావం రోజున నా పంట మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రతి రైతు తమకి కావాల్సిన యంత్ర పరికరాలను తమ పొలంలో ఉండి అద్దెకు తీసుకునే సదుపాయం ఉచితంగా కల్పించారు. చేయాల్సిందల్లా నా పంట మొబైల్ యాప్‌లోని వ్యవసాయ పరికరాల అద్దెకు సంబంధించిన ట్యాబ్ మీద క్లిక్ చేయడమే.


bhumaiah-chary

9.నోస్ ఫిల్టర్స్

ఇప్పటిదాకా 48 ఇన్నోవేషన్స్ చేశాను. నేను చదివింది పదవతరగతి. ప్రస్తుతం 17 పేటెంట్‌ల కోసం కృషి చేస్తున్నా. ఇందులో నాకు గుర్తింపు తెచ్చినవి రెండు ప్రయోగాలు. ఒకటి వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి నోస్ ఫిల్టర్‌లను తయారు చేశాను. అయితే వీటి తయారీ వెనుక ఒక కథ ఉంది. నా వృత్తి బంగారం పని చేయడం. ఒకరోజు షాపులో పనిచేసి ఇంటికి వస్తున్నా. అప్పుడే పిల్లలు చెత్త ఏరుతున్నారు. బండి మీద వెళుతున్న నాకు ఆ లైట్ ఫోకస్‌లో దుమ్ము పైకి లేవడం కనిపించింది. ఆ దుమ్ము వల్ల వారు ఎన్ని అనారోగ్యాల బారిన పడుతారనే ఆలోచన మొదలైంది. పది సంవత్సరాలుగా కృషి చేసి ముక్కులోనే పెట్టుకునేలా నోస్ ఫిల్టర్‌లని కనుగొన్నా. వీటిని తయారుచేసే మెషీన్‌ని కూడా నేనే తయారుచేశా. ఈ మెషీన్ వల్ల కేవలం ఐదురూపాయలకే నోస్ ఫిల్టర్‌ని అందుబాటులోకి తేవచ్చు. దీంతోపాటు నా ఇన్నోవేషన్‌లో పేరు తెచ్చింది.. విండ్‌మిల్. మామూలుగా అయితే గంటకు 18 కి.మీల వేగం కంటే ఎక్కువ ఉంటేనే ఈ విండ్ మిల్ తిరిగి మనకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కానీ గంటకు 5కి.మీ.ల వేగంతో గాలివీచిన కరెంట్ ఉత్పత్తి అయ్యేలా ఈ పరికరాన్ని తయారుచేశా. ఇది ఇంకా పూర్తి దశకు చేరుకోలేదు అని తన ఆవిష్కరణ గురించి చెప్పారు నిజామాబాద్‌కు చెందిన భూమయ్య చారి.


mallesam

10. తక్కువ ఖర్చులో..

మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ పనుల్లో ఇంట్లో వాళ్లు కష్టపడడం చూస్తూనే పెరిగా. మామూలుగా బోర్‌లలో నుంచి నీటిని తోడాలంటే పెద్ద పెద్ద ఇంజిన్‌లు కావాలి. అందుకే నేను ఒక పెడల్ పంప్‌ని కనిపెట్టా. దీనిద్వారా 25 అడుగుల లోతులో ఉన్న నీటిని కూడా సులువుగా బయటకు తోడుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారుచేశా. దీంతోపాటు సోలార్ స్ప్రేయర్ తయారుచేశా. తక్కువ బరువుతో.. ఎటువంటి కాలుష్యం లేకుండా ఉండేలా దీన్ని రూపొందించా. కేవలం ఐదు గంటల పాటు ఎండలో ఉంటే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దీనిద్వారా ఫోన్ చార్జింగ్‌లు, లైట్లను వెలిగించుకోవచ్చు. అలాగే.. పంటలకు ఎరువులు చల్లేందుకు వీలుగా ఈ స్ప్రెయర్‌ని తయారుచేశా. అలాగే ఫెర్టిలైజ్ డివైజ్‌ని కూడా తయారుచేశా. సుమారుగా నేను 15 ఇన్నోవేషన్‌ల వరకు చేశా. అయితే ఈ ప్రయోగాల వెనుక ఒక కథ ఉంది. మా అమ్మ లెప్రసీతో బాధపడేది. లైట్స్ స్విచ్ఛాఫ్, ఆన్ చేయడం కష్టమయ్యేది. తన బాధ చూసి ఒక రిమోట్‌ని తయారుచేశా. దాని ద్వారా కూర్చున్న దగ్గర నుంచే ఫ్యాన్‌ని ఆపరేట్ చేయొచ్చు. అలా నా ప్రయోగాలు ఒకొక్కటిగా పెరిగాయి అని తన ఆవిష్కరణల గురించి వివరించారు నల్లగొండకు చెందిన బొమ్మగాని మల్లేష్.

11 ప్రమాదాన్ని పసిగట్టే యంత్రం

11TS
శరీరంలోని వివిధ అవయాల్లో ఏర్పడే రక్తప్రసరణ సమస్యలను ముందుగానే పసికట్టే అధునాతన పరికరం త్వరలోనే మన ముందుకు రాబోతున్నది. దేశవ్యాప్తంగా జరిగిన అనేక ప్రదర్శనల్లో ది బెస్ట్‌గా నిలిచింది ఈ పరికరం. ఈ బ్లడ్ క్లాటింగ్ (రక్తం గడ్డకట్టడం) ప్రమాదం ముంచుకొచ్చే వరకూ కనిపించదు. అందుకే ఈ ప్రమాదాన్ని ముందే పసిగడుతుంది వీనస్ క్లాట్ ప్రివెంటర్. రక్తం గడ్డకట్టి, కండరాలు బిగుసుకుపోయే వరకు.. పరిస్థితి తీవ్రత కనిపించదు. అయితే ఈ పరికరం ద్వారా శరీరంలో ఎక్కడైనా రక్తం గడ్డ కడుతున్నదా? అనే విషయాన్ని ముందే తెలుసుకోవచ్చు. బీపీ మానిటర్, గ్లూకోమీటర్లలాగే దీన్ని కూడా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించి పరీక్షలు చేసుకోవచ్చు. సీఆర్‌ఓకు కనెక్ట్ చేసిన ఒక సెన్సార్‌పై మన బొటనవేలిని ఉంచితే.. స్క్రీన్ మీద రక్తంలోని కార్బన్ డై యాక్సైడ్ స్థాయిని తెలియజేస్తుంది. దాని ద్వారా శరీరంలో బ్లడ్ క్లాటింగ్ సమస్య ఉన్నదీ, లేనిదీ తెలిసిపోతుంది. బీపీ, షుగర్ చెకింగ్ మెషిన్ల మాదిరిగానే ఈ డివైస్‌ను కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గరే పరీక్షలు చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

12 రీసెర్చర్ల ఫ్లాట్‌ఫామ్

12akira--reasearch-funders
ఏదైనా అంశం మీద రీసెర్చ్ చేయాలనుకున్న వారికి ఫండ్ సమకూర్చే స్టార్టప్‌ని ప్రారంభించాడు శ్రవణ్ కుమార్. చదువుకుంటూ, రెగ్యులర్‌గా రీసెర్చ్ చేసేవారికి, యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసేవారికి ఫండింగ్ అవసరం ఉంటుంది. ప్రాజెక్టు చేసేవారికి వేదిక కల్పిస్తూ, ఫండింగ్ వసూలు చేసివ్వడంరక స్టార్టప్ చూసుకుంటుంది. గత 8 నెలల్లో 225 ప్రాజెక్టులు రిజిష్టర్ అయ్యాయి. 125 ప్రాజెక్టులు లిస్ట్ అయ్యాయి. ఇందులో 75 ప్రాజెక్టులకు ఫుల్ ఫండింగ్ వచ్చింది. ఇందులో 6500 మంది కలిసి రెండున్నర కోట్ల రూపాయలు ఫండింగ్ చేశారు. మీ అధ్యయనానికి ఫండ్ పొందాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. Reasearch fundes.org లో రిజిష్టర్ చేసుకోవాలి. తర్వాత మీ అప్లికేషన్లను రివ్యూ చేస్తారు. లైవ్ దశ నుంచి ప్రమోట్ దశకు సెలక్ట్ అయిన ప్రాజెక్టుల కోసం ఫండ్ డొనేషన్లు వస్తాయి.

13 అతిచిన్న శాటిలైట్!

13micro-satelite3-team
తమిళనాడుకు చెందిన 18 సంవత్సరాల రిఫత్ షారుక్ కేవలం 64 గ్రాములున్న ఉపగ్రహాన్ని తయారుచేసి అరుదైన రికార్డు సృష్టించాడు. నాసా నిర్వహించిన క్యూబ్స్ ఇన్ స్పేస్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశాడు రిఫత్ షారుక్. ఇంటర్మీడియట్ చదువుతున్న రిఫత్ రీ ఇన్ఫర్మ్ కార్బన్ ఫైబర్ పాలిమర్స్‌తో ఈ అతిచిన్న శాటిలైట్‌ను రూపొందించాడు. ఈ బుల్లి శాటిలైట్‌కు ఏపీజే అబ్దుల్ కలాం పేరు వచ్చేలా కలామ్‌శాట్ అనే పేరు పెట్టారు. ఈ శాటిలైట్‌ను నాసా వర్జీనియా నుంచి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ వాతావరణంలో కార్బన్ ఫైబర్ త్రీడీ ముద్రణ పనితీరును పరిశీలిస్తుంది. అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాలపై ధార్మిక కిరణాల వల్ల జరిగే మార్పులను ఇది రికార్డు చేస్తుంది.

14 పత్తి కలుపు యంత్రం

14TS
ఆవిష్కర్త: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిడుగు శేఖర్‌రెడ్డి.
ఉపయోగం: పత్తిలో కలుపు తీసేందుకు శేఖర్‌రెడ్డి రూపొందించిన ఈ యంత్రంవల్ల ఖర్చుతోపాటు సమయం తగ్గించే అవకాశమూ ఉంటుంది.
తయారుచేసిన విధానం: తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. పత్తిలో కలుపు తీసేందుకు ప్రతి సంవత్సరం కూలీలకు రోజుకు 300 నుంచి 400 రూపాయలు ఇవ్వడంతో పత్తి సాగు చేయడానికి ఎక్కువ ఖర్చు కావడంతో విసుగు చెందాడు. పత్తిలో కలుపు తీసేందుకు కూలీలతో పని లేకుండా ఖర్చు తగ్గించుకోవడానికి పిడుగు శేఖర్‌రెడ్డి వినూత్నంగా ఆలోచించి తన పాత సైకిల్ ముందువైపు నాగలి లాంటి యంత్రాన్ని అమర్చి దానితో పత్తిలో కలుపు తీసే యంత్రాన్ని అచ్చం ట్రాక్టర్, నాగలిలా తయారు చేశాడు. తన మిత్రుడు సంతోష్ సహాయంతో ఒక్క రోజులో పది మంది చేయాల్సిన పనిని గంటలో చేస్తున్నాడు. ఈ యంత్రం సహాయంతో ఇద్దరు మనుషులతో గంటలో ఎకరం భూమిలో పత్తి కలుపు తీస్తున్నారు.

15 ఇంటెల్లిబోట్ సాఫ్ట్‌వేర్

15Intellibot--team
వంద కంప్యూటర్లతో సమానమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించారు. ఇంటెల్లిబోట్ అనే ఈ సాఫ్ట్‌వేర్‌తో మీ సమయాన్ని, ధనాన్ని, పనిభారాన్ని తగ్గించుకోవచ్చు. ఇది నెక్ట్స్ జనరేషన్ సాఫ్ట్‌వేర్. ఆర్‌పీఏ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమెషీన్) వేదికగా దీనిని రూపొందించారు. రోబోలకు వాడే పలు సాఫ్ట్‌వేర్లలో ఇది కూడా ఒకటి. హెచ్‌ఎస్‌బీసీలో పనిచేస్తున్న అలేఖ్ బృందం ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది. భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రెండేళ్లు కష్టపడి దీనిని రూపొందించారు. హెచ్‌ఎస్‌బీసీకి చెందిన 26 దేశాల్లోని ఆఫీసుల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి కంపెనీకి దాదాపు 2 కోట్ల రూపాయల మేర ఆదాయం కూడా తెచ్చిపెట్టారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌బీసీ నుంచి 10మంది బయటకు వచ్చి, దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి.. ఈ సాఫ్ట్‌వేర్‌ను నమ్ముకొని స్టార్టప్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఇంటెల్లిబోట్‌ను అప్‌గ్రేట్ చేసి భవిష్యత్ తరాలకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడేలా రూపొందించారు. ఇలాంటివి విదేశాల్లో ఉన్నా.. మన దేశంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను మొదటిసారిగా పరిచయం చేసింది మాత్రం ఈ ప్రతినిధులే. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రావెలింగ్, స్టాక్‌మార్కెటింగ్, హెచ్‌ఆర్ వంటి రంగాల్లో, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల (కార్వీ, టాటా కేపిటల్, లోన్స్, టెలీకాలర్ కంపెనీలు)కు చాలా ఉపయోగం. ఈ సాఫ్ట్‌వేర్ వల్ల దాదాపు 80శాతం పని త్వరగా అవుతుంది. తప్పులు జరిగే అవకాశం కూడా లేదు. కంప్యూటర్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే.. అదే కరెక్ట్ చేసుకొని, ఎలాంటి వైరస్‌లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

16 స్మార్ట్ ఫీల్డ్ ప్రొటెక్టర్

16TS
ఆవిష్కర్తలు: హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు.
ఉపయోగం ఏంటి?: స్మార్ట్ ఫీల్డ్ ప్రొటెక్టర్ అమర్చిన సెన్సార్ దగ్గరకు జంతువులుగానీ.. మనుషులుగానీ వస్తే బంజర్ లైట్ వెలుగుతుంది. సైరన్ మోగుతుంది. దీంతో అక్కడేం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. అదే సమయంలో మన దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. సెల్‌ఫోన్‌తో సైరన్‌ను, బంజర్‌లైట్‌ను ఆఫ్ చేయొచ్చు. దీనివల్ల ఇంట్లో, పొలం వద్ద దొంగల బెడద నుంచి తప్పించుకోవచ్చు.
ఆవిష్కరణ : స్మార్ట్ ఫీల్డ్ ప్రొటెక్టర్ ప్రాజెక్టును డాక్టర్ కళ్లం రవీంద్రబాబు పర్యవేక్షణలో స్వేత, సహితి, సంజన్, విశ్వప్రసాద్‌రెడ్డిలు తయారుచేశారు. దీనికోసం ఎల్‌పీసీ 2148 మైక్రో కంట్రోలర్ రిలే, జీఎస్‌ఎం మాడ్యుల్, సెన్సర్, బంజర్ లైట్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సర్, 4జీబీ రామ్, హార్డ్ డిస్క్‌తో పాటు సిమ్ కార్డును అమర్చారు. దీనిని ఇంటి ముందు కానీ, పొలం వద్దకాని అమర్చి మన దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌కు మెసేజ్‌కు అలర్ట్ చేసుకోవాలి.

17 దొంగలను పట్టించే అలారం

17theft-alaram
వెంకట్, దుర్గాప్రసాద్ అనే ఇద్దరు కుర్రాళ్లు కలిసి క్షణాల్లో దొంగలను పట్టించే పరికరం తయారుచేశారు. రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే ఈ డివైజ్ పేరు ఆర్‌ఎఫ్ బేస్డ్ ఫైర్ అండ్ థెఫ్ట్ అలారం. ఇంటర్నెట్ అవసరం లేకుండానే రేడియో ఫ్రీక్వెన్సీ అనుసంధానంతో ఈ పరికరం పనిచేస్తుంది. దీనికి ఒక కెమెరా, ఒక సెన్సర్ అమరుస్తారు. కెమెరా తలుపు ఎదురుగా సెట్ చేసుకోవాలి. సెన్సర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కరంటు ఉన్నంతసేపు కరంటుతో, కరంటు పోతే బ్యాటరీతో ఈ పరికరం నడుస్తుంది. పరికరంలో ఒక సిమ్‌కార్డు ఇన్‌సర్ట్ చేస్తారు. ఆ సిమ్‌కార్డులో పోలీస్ స్టేషన్, ఇంటి ఓనర్, పక్కింటివాళ్ల నంబర్లు ఫీడ్ చేసి పెడుతారు. ఇంట్లోకి దొంగలు ప్రవేశించగానే.. కెమెరా వారిని డిటెక్ట్ చేసి ముందుగా పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తుంది. పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌కి సమాచారం ఇస్తుంది. ఇలా దొంగల్ని పట్టుకోవచ్చు.

18 పవర్ స్ప్రేయర్ తయారీ

18TS
కొత్తగూడెం జిల్లాకు చెందిన గుర్రంవసంత్ తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న పరికరాలతో పవర్‌స్ప్రేయర్‌ను తయారు చేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన గుర్రం వసంత్ వెల్డింగ్‌షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆయన షాపు ప్రధాన రహదారిపై ఉండడంతో దాని ముందు నుంచి రైతులు తమ వీపుపై పవర్ స్ప్రేయర్లు, హ్యాండ్ స్ప్రేయర్లు తగిలించుకొని వెళ్తుండటం చూసి తక్కువ ఖర్చుతో పవర్‌స్ప్రేయర్ తయారు చేయాలనే ఆలోచన అతనికి తట్టింది. వెంటనే పవర్‌స్ప్రేయర్ పనితీరుపై అధ్యయనం చేశాడు. అలా తెలుసుకున్న అంశాలతో అందుబాటులో ఉన్న సామాగ్రితో పవర్‌స్ప్రేయర్‌ను కేవలం రూ.1,500 వ్యయంతో తయారు చేశాడు. తయారీకి ఉపయోగించిన పరికరాలు సాధారణంగా అందుబాటులో ఉండేవే. రూ.800 విలువ చేసే బైక్ బ్యాటరీ, రూ.200 విలువ చేసే మోటార్, రూ.100 విలువ చేసే వాటర్ క్యాన్, రూ.150 విలువ చేసే ఛార్జబుల్ ట్రాన్స్‌ఫార్మర్, రూ.200 విలువ చేసే పైపులు. ఇలా పలు పరికరాలతో తయారు చేసిన పవర్‌స్ప్రేయర్‌కు ఫుల్ ఛార్జింగ్ చేస్తే చాలు ఆరు గంటల పాటు నిరంతరాయంగా పంట చేలల్లో పురుగు మందును స్ప్రే చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్ సహాయంతో గంట వ్యవధిలోనే రెండు ఎకరాల విస్తీర్ణంలో పిచికారీ చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే పవర్‌స్ప్రేయర్‌కు ఆరు గంటల సమయం పడుతుంది. ఆరు గంటల కోసం కనీసం ఒక లీటరు పెట్రోల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అంటే సుమారు రూ.80 వరకు ఖర్చు అవుతుంది. కానీ వసంత్ తయారు చేసిన పవర్‌స్ప్రేయర్ ఆరు గంటల వినియోగానికి విద్యుత్తు వినియోగ ఖర్చు కేవలం రూ.10 మాత్రమే. ఇంతేకాకుండా మరమ్మత్తులకు అవకాశం ఉండదు. కానీ మార్కెట్‌లో లభించే పవర్‌స్ప్రేయర్ మరమ్మత్తులకు బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

19 గంటలో యాప్

19ongo-frame-work
ఒక్క యాప్ తయారుచేయడానికి ఎంతో కొంత సమయం తీసుకుంటారు యాప్ డెవలపర్లు. కానీ ఆన్‌గో ఫ్రేమ్‌వర్క్ వారు మాత్రం గంటలో యాప్ తయారుచేసేస్తారు. పలు కంపెనీలకు, సంస్థలకు వారి అవసరాల మేరకు, తక్కువ ఖర్చులో యాప్ క్రియేట్ చేస్తున్నారు అనసూయ అకిల్ల. మొదట్లో వాయిస్ కమాండ్స్ ద్వారా గేమ్ ఆడేలా ఒక యాప్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆన్‌గో ఫ్రేమ్‌వర్క్ పేరుతో ఒక ఆఫీస్ పెట్టి 360 డిగ్రీల కోణంలో టెక్నాలజీ డెవలప్ చేయాలి, సామాన్యులకు సైతం యాప్‌లు అందుబాటులోకి రావాలనే ఆలోచనతో ఈ స్టార్టప్‌కి మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా 20 బెస్ట్ యాప్స్ క్రియేషన్ కంపెనీల్లో ఒకటిగా ఇది దూసుకుపోతున్నది.

20 చెవిటి, మూగ వారికో యంత్రం

20TS
-ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో రూపొందించిన పాలమూరు విద్యార్థులు
-కొత్త యంత్రంతో అంతర్జాతీయ గుర్తింపు
చెవిటి, మూగ వారికి వినబడదు, ఏం చెప్పినా అర్థం కాదు, అటువంటి వారిని అత్యవసర పరిస్థితుల నుంచి వారిని రక్షించడం ఇబ్బందితో కూడిన పని. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు తమ విద్యార్థులతో కలిసి వారిని జాగరూకులను చేసే పరికరాన్ని రూపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు. మహబూబ్‌నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలం, యన్మన్‌గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ అధ్యాపకునిగా పనిచేస్తున్న శ్రీధర్ తమ విద్యార్థులలో శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్‌కు వినికిడి లోపం ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతగా అరిచినా ఆమెకు వినిపించేది కాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు శ్రీధర్, తమ పాఠశాల విద్యార్థులు లక్ష్మి, తదితరులతో ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. పిల్లలు ఆడుకునే రిమోట్ కారు, సెల్‌ఫోన్‌లో ఉండే కొన్ని భాగాలు, కాలర్ ఐడీ బోర్డును ఉపయోగించి 4 వోల్టుల బ్యాటరీతో జాగరూక పరికరాన్ని రూపొందించారు. చేతి గడియారం ధరించినట్లుగా మూగ, చెవిటివారు ఈ పరికరాన్ని ధరిస్తే 80 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అవసరం ఉన్న వారు రిమోట్ నొక్కడం ద్వారా చేతికున్న పరికరం వైబ్రేట్ అవుతుంది. ఆ పరికరంలో నంబర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎవరు పిలుస్తున్నారో సులభంగా గుర్తిస్తారు. రిమోట్ నొక్కిన వారి దగ్గరికి వెళ్లి వారు చెప్పిన మాటలు వింటారు లేదా పనులు చేస్తారు. ఈ యంత్ర పరికరం తయారీకి రూ.4వేల లోపు ఖర్చవుతుంది.

21 రైతుమిత్ర యాప్

21TS
ఆవిష్కర్తలు: హుజూరాబాద్ మండలం
సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు.
ఉపయోగం ఏంటి?: రైతులకు సమాచారం
అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఆవిష్కరణ : రైతులకు ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అసిస్టెంటు ప్రొఫెసర్ రఘు నేతృత్వంలో రైతుమిత్ర యాప్‌ను రామకృష్ణ, ధాత్రి, మనుషా, శరణ్య రూపొందించారు. దీనివల్ల రైతులకు అన్ని విధాలైన సమాచారం ఒక్క దగ్గరే లభిస్తుంది. ఈ యాప్‌లో రైతుకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల సమాచారం, వ్యవసాయ లావాదేవీలు వంటి సమాచారం దొరుకుతుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

22 వైబ్రేషన్ ద్వారా వినికిడి యంత్రం

22TS
ఆవిష్కర్త: కరీంనగర్‌జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన 27 ఏళ్ల వయసున్న పూరెల్ల శ్రీనివాస్.
ఉపయోగం: చెవులు వినపడని వారు వైబ్రేషన్ యంత్రం ద్వారా పంటికి తగలడంతో వినికిడి శక్తిని కలిగించొచ్చు.
ఆవిష్కరణ : వైబ్రేషన్ యంత్రాన్ని చెవిటి వారికి పళ్ల మధ్య పెట్టడం వల్ల దాని వైబ్రేషన్‌కు వినికిడి శక్తి మెదడుకు చేరుతుంది. దీనివల్ల మనం మాట్లాడే సంభాషణ చెవిటి వారు వినగలుగుతారు. పంటి వైబ్రేషన్ ద్వారా పళ్ల నరాలు, ఫేషియల్ నరువు ద్వారా వినికిడి శక్తి మెదడుకు వెళుతుంది. దవడలకు, చెవికి, చెంపలకు వైబ్రేషన్ కలుగుతుంది. ఈ మిషన్ పంటికి తాకడంతో శబ్దాలను వినవచ్చు. వైబ్రేషన్ యంత్రం పంటికి తగలడంతో మ్యాగ్జిల్లరి, మ్యాండిబులార్, లింగువల్ నరాల ద్వారా స్పర్శ మెదడుకు వెళ్తుంది. అక్కడి నుంచి వినికిడికి ఉపయోగపడుతుంది.

23 పెద్దమనుషుల కోసం..

23woobloo-group
వూబ్లూ యాప్.. ఇంట్లోని పెద్దవాళ్లు ఇతరుల మీద ఆధార పడకుండా ఈ యాప్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కోరుకున్న సేవ క్షణాల్లో ఇంటిముందు వాలిపోతుంది. ఒక్కసారి ప్లేస్టోర్ నుంచి వూబ్లూ (woobloo) యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే క్యాబ్, హోటల్, ఫుడ్, సినిమా టికెట్స్, బస్, ట్రైన్ టికెట్స్ బుకింగ్స్, సరుకులు, షాపింగ్, మెడిసిన్, హోటల్స్, డ్రైవర్స్, ఇంటిపని చేసే మనుషులు, ైఫ్లెట్ టికెట్స్, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, వంటమనిషి ఇలా అన్ని సేవలూ ఈ ఒక్క యాప్‌లోనే ఉంటాయి. యాప్ మీద క్లిక్ చేసి సర్వీసెస్ మీద టచ్ చేస్తే చాలు.. వూబ్లూ ఏమేం సర్వీసులు అందిస్తుందో అవన్నీ కనిపిస్తాయి. వాటిలోంచి మనకు అవసరమైంది సెలక్ట్ చేసుకుంటే.. వూబ్లూ ప్రతినిధులే మనకు అవసరమైన సేవలు బుక్ చేస్తారు. శిరీషా గొండి, సందీప్ గొండి, రాహుల్ దేవరకొండ. ఈ ముగ్గురూ కలిసి గతేడాది జూన్‌లో వూబ్లూ ఐడియాకు ప్రాణం పోశారు. ఆరు నెలల కష్టం తర్వాత డిసెంబర్ రెండవ వారంలో వూబ్లూని లాంచ్ చేశారు.

24 డ్రోన్‌తో పురుగు మందు పిచికారి

24TS
పొలంలో పిచికారి చేయడానికి మార్కెట్‌లో చాలా రకాల స్ప్రే మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాకాసిపేట్‌కు చెందిన శివసాయి రామకృష్ణ తన మిత్ర బృందంతో పొలాల్లో డ్రోన్‌తో పురుగుల మందు పిచికారి చేసే పరికరాన్ని తయారు చేశాడు. బోధన్ మండలం భవానీపేట్‌లోని కిరణ్ వరి పొలంలో ప్రయోగాత్మకంగా డ్రోన్‌తో పురుగుల మందు పిచికారి చేశారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి, టీకేఆర్, సెయింట్ హాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన నలుగురు విద్యార్థులు శివసాయి రామకృష్ణ, ఎనోష్, అశ్విన్, సంతోష్‌లు దీని తయారీలో పాల్గొన్నారు. డ్రోన్ ద్వారా ఏ విధంగా పురుగుల మందులు పిచికారి చేయవచ్చో వివరించారు. ఈ విధానంలో కూలీల కొరతను అధిగమించడంతో పాటు మనుషులకు హానిచేసే క్రిమిసంహారక మందులను సులభంగా పిచికారి చేయవచ్చు. దీంతో పది నిమిషాల్లో ఎకరా మొత్తం క్రిమిసంహారక మందు పిచికారి చేయవచ్చు. డ్రోన్‌తో పురుగుల మందు పిచికారి చేయడానికి ఎకరాకు రూ. 300 ఖర్చు అవుతుంది. కూలీల వ్యయంతో పోలిస్తే ఇదేమి పెద్ద ఖర్చుకాదని వారంటున్నారు.

25 టిల్లర్ ట్రాక్టర్.. థ్రిల్లింగ్ ఆవిష్కరణ

25saidachari
సైదాచారి ఏడో తరగతి వరకే చదువుకున్నాడు. సూర్యాపేట జిల్లా అత్మకూర్.ఎస్ మండలంలోని కందగట్ల గ్రామానికి చెందిన ఇతడు సొంత ఆలోచనతో వినూత్న పరికరాలు రూపొందిస్తూ ఇంజినీరును తలపిస్తున్నాడు. తక్కువ ధరలో ఎక్కువ లాభం కలిగించేలా వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. తండ్రి వృత్తిరీత్యా కందగట్ల గ్రామంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం, వాటిని బాగు చేయడం వంటి పనులు చేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సైదాచారి ఏడో తరగతి వరకు చదువు ఆపేసి తండ్రికి ఆసరాగా ఉండేందుకు ఈ పని చేయడం ప్రారంభించాడు. కార్పెంటర్ పని చేస్తూనే వినూత్న రీతిలో రైతులకు ప్రయోజనకరంగా ఉండే వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేస్తున్నాడు. మొట్టమొదట 2015లో టిల్లర్‌ను ఆవిష్కరించాడు. దీనికి మంచి పేరే వచ్చినా రైతులు స్వయంగా బలం ప్రయోగించి వాటిని నెట్టాల్సి వస్తుండడంతో దానిని మరింత మెరుగ్గా రూపొందించాలని భావించాడు. అందులో భాగంగా మల్టీ మినీ ట్రాక్టర్‌ను తయారు చేశాడు.

తయారు చేసిన విధానం: సన్నకారు రైతుకు అనుకూలంగా ఉండే విధంగా మల్టీ మినీ ట్రాక్టర్‌ను సైదాచారి తయారు చేశాడు. 5 హెచ్‌పీ సామర్థ్యం గల చైనా ఇంజిన్‌ను ప్రయోగానికి ఎంచుకున్నాడు. రెండు టిల్లర్ టైర్లు, మరో రెండు ఆటో టైర్లను తీసుకొని చైనా ఇంజిన్ రన్నింగ్‌కు అనుగుణంగా సామిల్లులో వాడే బేరింగ్‌లు, బెల్టుల సాయంతో టైర్లు తిరిగేలా రూపకల్పన చేశాడు. హబ్బులు, డిస్క్‌లను సొంతంగా ఐరన్‌తో తీర్చిదిద్దాడు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఒక్కో పరికరాన్ని సేకరించి తన ఆలోచనకు తగిన విధంగా వాటిని మలుస్తూ మల్టీ మినీ ట్రాక్టర్‌ను రూపొందించాడు. ట్రాక్టర్ ముందుకు వెనక్కు వెళ్లేలా గేర్లు అమర్చాడు. సైదాచారి ఒక సహాయకుడిని నియమించుకొని రూ. 70వేల ఖర్చుతో 15 రోజుల్లోనే మినీ ట్రాక్టర్‌ను తయారు చేశాడు. ఇప్పటి వరకు ఆరు మల్టీ మినీ ట్రాక్టర్లను (ఇంజిన్, కల్టివేటర్) తయారు చేసి రూ.90వేల చొప్పున విక్రయించాడు. ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉండడంతో ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు వచ్చి ఆర్డర్లపై వీటిని తయారు చేయించుకొని వెళ్తున్నారు.

పనిచేసే విధానం: సైదాచారి ఆవిష్కరించిన మల్టీ మినీ ట్రాక్టర్ మెట్ట పంటలకు ఎంతో ప్రయోజనకారి. పది ఎకరాలు సాగుచేస్తున్న రైతు అవసరాలన్నీ ఈ మినీ ట్రాక్టర్ తీరుస్తున్నది. ఒక లీటరు డీజిల్‌తో ఎకరం పొలాన్ని దున్నుకునేందుకు వీలుంది. పత్తి సాగు చేసే వారికి మొక్కలు 5 అంగుళాల ఎత్తు పెరిగే వరకు పాదు చేసేందుకు, మందు చల్లేందుకు సులువుగా ఉంటుంది. మిర్చి, చెరకు, పసుపు, మల్బరీ, నిమ్మ తోటలతో పాటు కూరగాయల సాగుకు అవసరమైన పనులను దీని ద్వారా చేయవచ్చు. దీంతోపాటు ఈ మినీ ట్రాక్టర్‌కు ట్రాలీని అమరిస్తే 9 క్వింటాళ్ల బరువును లాగుతుంది.

26 పల్సర్ బుల్లెటైంది

26TS
సాధించాలనే పట్టుదల... ప్రత్యేకతను చాటాలన్న తపన... లక్ష్య సాధనకు కృషి... వీటన్నింటితో తన ఆలోచనకు రూపమిచ్చాడు.. వెరసి పల్సర్ వాహనాన్ని బుల్లెట్టులా మార్చాడు. ఖమ్మం నగరానికి చెందిన మురళీ 1996 నుంచి మెకానిక్ వృత్తిలో కొనసాగుతున్నాడు. మొదటి నుంచి తనకు ఉన్న అనుభవంతో ఏదైనా ఒకటి కొత్తగా ఆవిష్కరించాలనే కోరిక ఉండేది.. అతని షెడ్డుకు వచ్చే వాహనాలలో సాధారణ వాహనాలతో పాటు బుల్లెట్లు కూడా రిపేరుకు వచ్చేవి. డుగుడుగుమనే శబ్దంతో యువత మనసును దోచుకునే బుల్లెట్లు మురళీని కూడా ఆలోచనలో పడేసి కొత్త ఆవిష్కరణకు కారణమయింది.

రెండు నెలల్లో...

రెండు నెలలు పాటు శ్రమించి రూ.40వేల ఖర్చుతో బుల్లెటు విడి భాగాలు సేకరించాడు. పల్సర్‌ను బుల్లెట్టులా చేసేందుకు విజయవాడ, గుంటూర్ కేంద్రాలకు వెళ్లొచ్చాడు. పాత పల్సర్ వాహనాన్ని బుల్లెట్టులా మార్చేందుకు తీవ్రంగా కృషి చేశాడు. బుల్లెట్టుకు ప్రాణమైన బీటింగ్‌లో కూడా తేడా రాకుండా ఉండేందుకు సైలైన్సర్ మప్లర్స్‌ను వాడి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరకు అందరూ ఆశ్చర్యపోయేలా కొత్త బుల్లెట్టును తీర్చిదిద్దిండు. ప్రస్తుతం ఆ వాహనాన్ని అతనే నడిపిస్తున్నాడు.

27 నీటితో ఇంధనం

27TS
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన ఎంటెక్ విద్యార్థి కోటేష్ గత 10 సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న గ్లోబల్ వార్మింగ్‌ను తరిమివేయాలనే లక్ష్యంతో పెట్రోల్‌కు బదులుగా నీటితో వాహనాలు నడిచేలా ప్రయోగాలు చేస్తున్నాడు. దీనికోసం ఎలక్ట్రోలసిస్ నీటిని ఇంధనంగా మార్చాడు. ఇప్పటి వరకు సుమారు 10వరకు వివిధ రకాల ప్రయోగాలు చేసిన కోటేష్ భవిష్యత్తులో మాట్లాడే రోబోను తయారు చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. అలాగే వ్యవసాయ బావుల వద్ద రైతులు కరంట్ కోసం పడిగాపులు పడకుండా కరంట్ వచ్చిన వెంటనే సెల్ రింగ్ వచ్చే విధానాన్ని కనుగొన్నాడు. మోటార్ ఆపాలి అంటే సెల్ రింగ్ ఇస్తే చాలు ఆగిపోతుంది. ఇంటి వద్ద కూర్చునే బావులు, బోర్ల వద్ద కరెంట్ మోటార్‌లను ఆన్ ఆఫ్ చేసే విధంగా ఒక పరికరాన్ని తయారు చేశాడు. మోటర్ వద్ద ఉన్న స్టాటర్ పెట్టెలో ఒక సెల్ ఏర్పాటు చేసి దాని వద్ద ఉన్న సెల్‌కు అనుసంధానం చేసి సెల్ రింగ్‌తో మోటార్ ఆన్ ఆప్ పరికరాన్ని తయారు చేశాడు. పోచారం, తల్లంపాడు గ్రామాల్లో రైతులు వీటిని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్‌లు, మూల మలుపుల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నివారించటానికి సిగ్నల్ ట్రేసర్‌ను కనిపెట్టాడు. 30 అడుగుల దూరంలో సిగ్నల్ ట్రేసర్ డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. ఎక్కడ అయితే మలుపుగాని స్పీడ్ బ్రేకర్‌గానీ ఉంటుందో అక్కడ ఒక చిప్ ఏర్పాటు చేసి వాహనాల్లో చిప్ పెడితే అవి గుర్తించి అప్రమత్తం చేస్తాయని తెలిపారు.

28 స్కూటర్ ఇంజిన్‌తో కలుపు తీసే యంత్రం

28TS
వ్యవసాయంలో కలుపును తీసేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన మధుసూదనాచారి, బాలస్వామిలు సంయుక్తంగా కలిసి స్కూటర్ ఇంజిన్‌తో యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రంతో పత్తి, మిర్చి, జొన్న ఇతర పంటల్లో కలుపు వేగంగా తొలగించేందుకు, చిన్న గుంటుక, నల్లిని తొలగించేందుకు ఉపయోగించవచ్చు. సాలు(మొక్కకు మొక్కకు మధ్య ఉన్న దూరం) పరిమాణాన్ని బట్టి చక్రాలను మార్చుకునేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు. కల్వకుర్తికి చెందిన బాలస్వామి బైక్ మెకానిక్ (38), మధుసూదనాచారి(40) వెల్డింగ్ వర్క్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ ఓ కొత్త ఆలోచనకు జీవం పోశారు. స్కూటర్ మోటర్‌తో ఏదైనా వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రం చేయాలనే ఆలోచన బాలస్వామికి వచ్చింది. వెంటనే 2 నెలలు శ్రమించి కలుపు తీత యంత్రాన్ని రూపొందించారు. దీనితో ఒక లీటర్ పెట్రోల్‌తో ఒక ఎకరా పొలంలో కలుపును తొలగించవచ్చు. ఈ యంత్రానికి ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ఇనుప చక్రాల కారణంగా నేలలోకి దిగి పోయే అవకాశం లేదు. దాదాపు రెండు నెలలు శ్రమించి రూ.30 వేల వ్యయంతో ఈ యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండడంతో పలువురు కొనసాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు 12 యంత్రాలను వీరు విక్రయించారు.

29 మార్కెట్ ధరలు చెప్పే యాప్

29TS
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రంలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రతిభను చాటుతున్నారు. గ్రామీణ పేద విద్యార్థులు, ముఖ్యంగా రైతు బిడ్డలైన విద్యార్థులు రైతులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశారు. అగ్రిగైడ్ పేరుతో స్మార్ట్ ఫోన్‌లలో ప్రత్యేకంగా యాప్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్న తరుణంలో వారికి ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. మార్కెట్లో వివిధ పంటలకు సంబంధించిన ధరలు, వాటి సమాచారం, అధికారుల వివరాలు, జీరో బడ్జెట్ ఇలా కొన్ని విషయాలు ఈ యాప్‌లో పొందుపర్చారు. కళాశాలలో సీఎస్‌ఈ విభాగంలో చదువుతున్న రాజేందర్, వెంకటేశ్ ఈ యాప్‌ను రూపొందించారు. ప్రస్తుతం రైతులు మార్కెట్ ధరలతో పాటు అధికారుల వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. హార్టికల్చర్ అధికారుల ఫోన్ నంబర్లు, వివిధ పంటలకు సంబంధించిన సలహాదారులు, ప్రొఫెసర్లు, వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లు పొందుపరిచారు. అంతేకాదు రాష్ట్రంలో వివిధ పంటలు, పండ్లు, కూరగాయల ధరలు ఏయే మార్కెట్ యార్డులలో ఏయే ధరలు పలుకుతున్నాయో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సబ్సిడీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో అన్న వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. పత్తి, వరి, వేరు శనగ, మొక్కజొన్న, కంది, ఆముదాలు, చెరుకు, పెసర, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు, జొన్నలు, మిరప, మినుములు, నువ్వులు, సజ్జల పంటలకు సంబంధించిన సమాచారం క్లుప్తంగా ఉంటుంది. పాలీహౌస్, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలనుకుంటున్న రైతులకు ఏయే పంటను ఏ విధంగా వినియోగించుకోవాలో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. విత్తన శుద్ధికి బీజామృతం తయారు చేసే విధానం, గణ జీవామృతం తయారు చేసే విధానాలు కూడా పెట్టారు.

1521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles