ఇది రుమటాయిడ్ ఆర్థరైటిసా?


Sat,January 20, 2018 01:12 AM

నాకు 27 ఏండ్లు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. కొద్ది నెలలుగా చేతులు, కాళ్ల వేలి కీళ్లలో వాపు కనిపిస్తున్నది. కొన్నిసార్లు బిగుసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళలో బాధ చాలా తీవ్రంగా ఉంటున్నది. విపరీతమైన అలసటగా ఉంటున్నది. నోరు తరచుగా తడి ఆరిపోతున్నది. ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలేనా? ఇంత చిన్న వయసులో ఇది వస్తుందా? దీనికి చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలియజేయగలరు.
విజయ్, హైదరాబాద్

gettyimages
మీరు తెలియజేసిన లక్షణాలను బట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగానే అనిపిస్తున్నది. సాధారణంగా 40-60 వయసులో ఈ వ్యాధి బయటపడుతుంది. కానీ కొంతమందికి చిన్న వయసులోనే వ్యాధి ప్రారంభం కావచ్చు. ఉదయం నిద్ర లేవగానే కీళ్లు బిగుసుకొని నొప్పిగా ఉంటాయి. కీళ్లలో వాపు ఉంటుంది. వీటిని ప్రధాన లక్షణాలుగా భావించినప్పటికీ నీరసంగా ఉండడం, ఆకలి మందగించడం, నోరు తడి ఆరిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రారంభంలో కాలు, చేతుల్లో ఉండే చిన్న కీళ్లలో సమస్య కనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. శరీరంలో ఉండే నిరోధక వ్యవస్థ విపరీతంగా స్పందించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇలా నిరోధక వ్యవస్థ పనితీరులో తేడా వల్ల వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. వాటిలో ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. శరీరంలోని యాంటీ బాడీస్ కీళ్లలోని పలుచని పొరలకు అతుక్కొని నిరంతరంగా కీళ్ల మీద దాడి చేస్తుంటాయి. ఫలితంగా కీళ్లలో వాపు వచ్చి, చాలా నొప్పిగా ఉంటాయి. ఇది కొంతవరకు వంశపారంపర్యంగా సంక్రమించేందుకు ఆస్కారం ఉంది. ముందుగా మీరు డాక్టర్‌కు చూపించుకొని అవసరమైన పరీక్షలు చేయించుకుంటే మీ వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవునో కాదో నిర్ధారణ అవుతుంది. వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించడం అవసరం. అలా చేస్తే సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుంది. నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ను ఈ వ్యాధికి చికిత్సగా ఉపయోగిస్తారు. చాలా మందిలో ఈ మందులు మంచి ఫలితాలను ఇస్తాయి. వీలైనంత త్వరగా మీరు చికిత్స ప్రారంభించడం మంచిది.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
సీనియర్ రుమటాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
హైదరాబాద్

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles