ఇది నిజంగా సమస్యా?


Thu,June 22, 2017 01:57 AM

మా ఆవిడ వయసు 36 సంవత్సరాలు. ఆమె ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంది. తరుచుగా ఫోన్లు మాట్లాడడం, ఫోన్ చూసుకోవడం, మెసేజ్‌ల అప్‌డేట్స్ చూసుకోవడం వృత్తిరీత్యా ఆమెకు తప్పనిసరి. అందువల్ల అది ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఎప్పుడైనా ఫోన్ చూడలేకపోతే చాలా కంగారు పడిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందంటే చాలు ఇక ఏ పని మీదా దృష్టి నిలపలేకపోతున్నది. అసహనం, చిరాకు పడడం ఎక్కువ అవుతున్నది. ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా తన స్థితి బాలేనట్టు అనిపిస్తున్నది. నిజంగా ఆమెకు ఏదైనా సమస్యా? ఇది ఇలా అలవాటు అవుతుందా? అడిక్షన్‌గా మారుతుందా? ఆమెకు ఎలాంటి సహాయం అవసరం. దయచేసి తెలుపగలరు.
అవినాష్, హైదరాబాద్

woman-texting
గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈమెయిల్స్, మెసేజ్‌లు, వాట్సప్ వంటివన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల నిజానికి పనుల్లో ఒత్తిడి చాలా పెరిగిపోయిందని చెప్పాలి. అంతకుముందు కమ్యూనికేషన్‌లో కొద్దిపాటి సమయం ఉండడం వల్ల కొంత పని తక్కువగా ఉండేది. లేదా కొన్ని పనులు తప్పించుకునే వీలుండేది. ఇప్పుడు అటువంటి అవకాశమే లేకుండా పోయింది. కమ్యూనికేషన్‌కు కనీసం నిమిషాల వ్యవధి కూడా ఉండడం లేదు. అనుకున్నదే తడువుగా సమాచారం అవతలి వైపు నుంచి వచ్చేస్తుంది. ఒక్కోసారి అనుకోకుండానూ వచ్చేస్తున్నది. ఈ వేగాన్ని అందుకోవడంలో తప్పనిసరిగా ఒత్తిడి పెరుగుతున్నది. నిజానికి ఇది కొత్త ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నదనే చెప్పుకోవాలి.

ఇది ఒక్కమనకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఒకే వ్యక్తి రకరకాల గ్రూప్‌లలో సభ్యులుగా ఉండడం వల్ల ఇతరుల పనితీరు, వారి ప్రదర్శనా సామర్థ్యం వంటివి ఎప్పటికప్పుడు తెలిసిపోవడం వల్ల పోటీ పెరిగి ఒత్తిడి కూడా పెరుగుతున్నది. ఒకవేళ ఈ కమ్యూనికేషన్ దూరమైతే ఏం జరుగుతుందో తెలియక పోవడం వల్ల తాము వెనుకబడిపోతామన్న భయం కలుగుతున్నది. వెరసి ఇవ్వన్నీ కూడా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇది క్రమంగా డిప్రెషన్‌గా కూడా మారవచ్చు. ఇలాంటివన్నీ కచ్చితంగా వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది మానసిక సమస్యగా మారక ముందే మేల్కొనాల్సిన అవసరం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉంది.

ఎప్పుడూ ఫోన్ చూస్తు ఉండడం వల్ల వారు తమ సోషల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్‌ను చాలా వరకు సరిగ్గా ఆనందించలేని స్థితికి వస్తారు. ఇది కూడా తిరిగి ఒత్తిడికి కారణం అవుతుంది. కానీ కమ్యూనికేషన్‌కు పూర్తిగా దూరంగా ఉండడం సాధ్య పడదు కనుక వీటిని చూసేందుకు కొంత సమయానికి మాత్రమే పరిమితం కావడం మంచిది. ప్రతి ఒక్క మెసేజ్‌ని చదువడం వంటి అలవాటును క్రమంగా మానుకోవాలి. కేవలం ముఖ్యమని అనుకున్న మెసేజ్‌లకు మాత్రమే పరిమితం కావాలి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను వారంలో ఒకరోజు మాత్రమే చూడాలన్న నియమం పెట్టుకుంటే మంచిది. వీలైనన్ని తక్కువ గ్రూప్‌లలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉండడం వల్ల కూడా కొంత ఒత్తిడి తగ్గుతుంది.
bharathdr
ఇక వృత్తికి సంబంధించిన మెసేజ్‌లను తప్పనిసరిగా ఆఫీస్ సమయంలో మాత్రమే చూడడం, వాటికి స్పందించడం నియమంగా ఉంచుకోవాలి. ఆ విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్పాలి. ఆఫీసు సమయం తర్వాత అటువంటి మెసేజ్‌లు పంపకూడదన్న స్పష్టమైన ధోరణిని అనుసరించడం తప్పనిసరి. ఇలాంటి కొన్ని నియమాలు పాటించడం వల్ల ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. మీరు ఈ విషయంలో మీ శ్రీమతికి తోడుగా నిలువడం ముఖ్యం. ఆమెకు సరైన సూచనలు ఇచ్చి పాటించేలా చూడండి. అయినప్పటికీ ఆమెలో మార్పు కనిపించకపోతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు.

405
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles