ఇంట్లోనూ హరితవనం!


Sat,July 16, 2016 12:15 AM

harithavanamగృహమే కదా స్వర్గసీమ అంటారు. మరి స్వర్గం అంటే? ఒక నమ్మకం. అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశానికది చిహ్నం. అందుకే.. ఇల్లు స్వర్గసీమ.. ఇంటి పేరు ప్రేమ.. అని ఓ సినీ కవి తన పాటలో విశిష్టంగా వివరించాడు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని కూడా ఊరికే అనలేదు పెద్దలు. ఇంటి అలంకరణతోనే ఇల్లాలి అభిరుచులు, గుణగణాలు తెలుస్తాయి, కాబట్టి అలా అన్నారు. అనాది నుంచే అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న గృహాలంకరణ ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతోంది.

ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఇంటిని స్వర్గసీమగా మార్చుకునే సమయం ఎంతమందికి ఉంటుంది? కాలం మారుతున్నది. దానికి అనుగుణంగా అభిరుచులూ మారుతున్నాయి. ఆ అభిరుచులను ఒడిసిపట్టుకుని.. ఫ్యాషన్‌ను కలగలిపి ఇంటిని ఓ హరితవనంలా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఐడియా వచ్చింది వీరికి. శిల్పా, రీత్ మినియేచర్ హెవెన్‌తో మీ ఇంటికి సరికొత్త హరిత హంగులు అద్దుతామంటున్నారు.

ఇంటిని ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించడం అంత సులువైన పనేమీ కాదు. నిజం చెప్పాలంటే ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపే ఆధునిక మానవుడు.. తలదాచుకునేందుకు ఏదో ఒక ఇళ్లు ఉంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాడు. కానీ రోజంతా ఆఫీసుల్లో పనిచేసి అలసిపోయి వచ్చిన వారికి ఇంటికి చేరగానే సేదతీరేందుకు ఆహ్లాదకర వాతావరణం ఉండడం ఇంటికి, ఒంటికి ఎంతో అవసరం. ఇదే విషయాన్ని కొందరు శ్రీమంతులు గుర్తించి ఇంటిని స్వర్గసీమ చేసుకుంటుంటారు. సామాన్య, మధ్య తరగతివారిలో కూడా కొందరు ఇంటి చుట్టూ అందమైన మొక్కలను, పచ్చిక బైళ్లను పెంచుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో స్థలం లేని భవంతుల్లో నివసిస్తున్నవారు మట్టి కుండీల్లో పూల మొక్కలు పెంచుకుంటున్నారు. వీరి అభిరుచి మేరకు పుట్టినవే కిచెన్ గార్డెనింగ్, హోమ్ గార్డెనింగ్. అలాంటిదే ఈ మినియేచర్ హెవెన్. మరో పేరు మినియేచర్ గార్డెనింగ్ అని కూడా చెప్పొచ్చు.

హాబీ టు బిబినెస్


శిల్పా చౌహాన్, రీత్ వత్నాని తోడికోడళ్లు. శిల్పది సిమ్లా, రీత్ వత్నానిది నాగ్‌పూర్. శిల్ప భర్త ఉద్యోగ నిమిత్తం కుటుంబం మొత్తం కొన్నాళ్లు యూకేలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు శిల్ప ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏదైనా చేయాలని ఆలోచించేది. అక్కడ పక్కింటి ఆవిడ మినిగ్డానింగ్ చేసేది. అప్పుడప్పుడు సరదాగా వెళ్లి చూసి ఎలా చేయాలో నేర్చుకున్నది. ఇంట్లో ఉన్న పాత వస్తువులకు కొత్త అందాలను జోడించడం మొదలుపెట్టింది. అదే ఆ తర్వాత ఆమె ప్రొఫెషన్ అయింది. హాబీగా మొదలైన ఆ ప్రొఫెషన్ ఇప్పుడు కొందరికి ఉపాధి కల్పించేంత వరకు ఎదిగింది. ఇలాంటి ఐడియాతో పనిచేస్తున్న వాళ్లు హైదరాబాద్‌లో ఎవరూ లేరు. పెళ్లి పేరంటం, బర్త్‌డే, ఈవెంట్ ఏదైనా కావొచ్చు. వేడుక ఇంకేదైనా కావొచ్చు. మీ ఫంక్షన్‌లో కూడా వర్క్‌షాప్ పెడతారు. ఒకరికి ఎనిమిది వందల రూపాయల చొప్పున చెల్లిస్తే రెండు గంటల పాటు మినియేచర్ గార్డెనింగ్ నేర్పిస్తారు. ఆ తర్వాత మీ మెదడుకు పదును పెట్టి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులతో కూడా సృజనాత్మకతను జోడించి వాటితో అద్భుతాలు చెయొచ్చని అంటున్నారు శిల్పా చౌహాన్, రీత్ వత్నాని.

వర్కషాప్‌లు..


శిల్ప, రీత్ మినియేచర్ హెవెన్ పేరుతో స్టార్టప్ ప్రారంభించి మూడు నెలలవుతున్నది. మొదటి వర్క్ షాప్ హైదరాబాద్‌లోని లామాకాన్‌లో ఏర్పాటు చేశారు. 40 మంది చిన్నారుల కోసం నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌కు అనూహ్య స్పందన లభించింది. అప్పటి నుంచి పర్యావరణ ప్రేమికులు తమ పిల్లలకు నేర్పించడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని సప్తపర్తిలో కూడా వర్క్‌షాప్ పెట్టారు. ఆ నోటా ఈ నోటా వీళ్ల ఐడియాకు మంచి పేరు వచ్చింది. కార్పొరేట్ కంపెనీల్లో కూడా వర్క్‌షాప్‌లు పెట్టాలని ఆహ్వానాలు అందుతున్నాయి. ఒక సినిమాకు మినియేచర్ గార్డెనింగ్ సెట్ వేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరుతున్నాయి. కొన్ని వెబ్‌సైట్లతో కలిసి వారంతాల్లో మరిన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు. వీకెండ్స్‌లో మురికివాడల్లోకి వెళ్లి అక్కడ అంతా శుభ్రం చేసి గార్డెనింగ్‌కు సంబంధించిన అంశాలను వాళ్లకు వివరిస్తామంటున్నారు.

haritha

ఆన్‌లైన్ సేవలు..


మినియేచర్ హెవెన్ ఇప్పటి వరకు ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆర్డర్లు పొందుతున్నది. ఇప్పటికైతే మూడు పూల కుండీలు.. ఆరు పూల మొక్కల్లా బాగానే నడుస్తున్నది. దీన్ని మరింత విస్తరించే దిశగా ఆన్‌లైన్‌లో అమ్మకాలను ప్రారంభించాలనుకుంటున్నారు. వెబ్‌సైట్ ప్రారంభించి దాని ద్వారా ఆర్డర్లు తీసుకోవడం, హోమ్ డెలీవరి వెలుసుబాటు కూడా కల్పించాలనుకుంటున్నారు. ఎవరికైనా కావాల్సిన థీమ్ చెప్తే దాన్ని బట్టి యాక్సెసరీస్‌ను వాడి గార్డెనింగ్‌కు సంబంధించిన వస్తువులను తయారు చేస్తున్నారు. వెరైటీ మొక్కలతో, డిఫంట్ పూల కుండీలకు ప్రాణం పోస్తున్నారు. కిచెన్, గార్డెనింగ్, బాల్కనీ, హాల్, బెడ్ రూం, కిచెన్ రూంకు సంబంధించిన పూల కుండీలతో పాటు ఆఫీస్‌కు కావాల్సిన గార్డెనింగ్ కూడా చేస్తారు. చక్కని పూల మొకలతో మనసుకు ప్రశాంతత లభించడమే కాకుండా ఆఫీస్‌లో ఆహ్లాద వాతావరణం కూడా దొరకుతుందని చెప్తున్నారు.

మినియేచర్ అంటు సూక్ష్మం, హెవెన్ అంటే స్వర్గం. చిన్న చిన్న మొక్కలతో, అందమైన కుండీలతో సూక్షస్వర్గంగా నిర్మించడమే వీళ్లు ఎంచుకున్న అంశం. పెద్ద చెట్టు ఇంట్లో నాటలేం. అదే చిన్న మొక్కను పూల కుండీలో పెట్టి ఇంట్లో పెంచొచ్చు. దీన్నే మినియేచర్ హెవెన్ అంటారు. చాలామందికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది. కానీ స్థలం ఉండదు. ఉన్న కొద్ది స్థలంలో ఎలాంటి మొక్కలు నాటాలో తెలియదు. అసలే హైదరాబాద్‌లో స్థలం ఉండడం గగనం. అయినా మొక్కలు నాటాలి. ఇల్లు పచ్చగా కళకళలాడాలి. మరెలా? మినిగ్డానింగ్ చేయించాలి. ఎలా చేయించాలి. ఎవరు చేస్తారు. వీళ్లను అడగండి. ఎలా చేయాలో చెప్తారు.


కేసీఆర్ కోసం గిఫ్ట్ :

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలాంటి కార్యక్షికమాలు చేయించడం శుభపరిణామం. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్షికమాన్ని తలపెట్టడం సంతోషం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పెట్టేందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మినీ గార్డెన్ తయారు చేసి పెట్టాం. కలిసి ఇవ్వాలనుంది. చాలా రోజులనుంచి ఎదురుచూస్తున్నాం. త్వరలో అపాయింట్‌మెంట్ తీసుకుని కలిసి ఇస్తాం.

అజహర్ షేక్
వీరగోని రజినీకాంత్

1602
Tags

More News

VIRAL NEWS