ఆ పనిమనిషే.. ఈ కమెడియన్!


Mon,August 20, 2018 01:18 AM

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు వస్తుంది అని వింటుంటాం. కొన్ని ఘటనలు కళ్లారా చూస్తుంటాం. అలాంటి నిజమైన కథే ఇది. ఒకప్పుడు ఇళ్లలో పాచీపనులు చేసి, నాలుగిండ్లలో వంట చేసిన ఈమె.. ఇప్పుడు ఓ స్టార్ స్టాండప్ కమెడియన్.
Deepika-Mhatre
కాలం అందరికీ అవకాశం ఇస్తుంటుంది. కొంతమంది దానిని గుర్తించక వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటే.. మరికొందరు సద్వినియోగం చేసుకుంటారు. ఈ కోవకు చెందిన దే ఈ స్టార్ కమెడియన్ దీపిక మహత్రే. ముంబైకి చెందిన దీపిక జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే.. ముగ్గురి పిల్లల పోషణ, ఆస్తమాతో బాధపడుతున్న భర్తను దవాఖానలో చూపించేందుకు ఎన్నో కష్టాలు అనుభవించింది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి, 4.30కు ముంబైలోని లోకల్ ట్రైన్‌ను ఎక్కి, అందులో రోల్డ్ గోల్డ్ నగలు అమ్మేది. ఇలా కష్టపడితే రోజుకు రూ.300-400 వరకూ వచ్చేవి. ఒక్కోరోజు ఉత్తచేతులతోనే ఇంటికి తిరిగొచ్చేది. ఇలా కొన్నాళ్లు కష్టపడిన తర్వాత.. ఆ పనికి స్వస్తి చెప్పి మలాడ్‌లోని సంగీత విహార్ కాలనీలో ఐదు ఇళ్లలో పాచీపనులు చేసేది, వారికి వండిపెట్టేది. మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి వచ్చిన భర్త, పిల్లల బాగోగులు చూసుకునేది. ఈ క్రమంలో ఒకరోజు ఆ కాలనీకి చెందిన ఓ యజమాని ఆడవారి కోసం ఓ టాలెంట్ షో నిర్వహిస్తున్నది. అందులో అంతా పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తున్నారు. అయితే, అందులో పాల్గొన్న దీపిక కొత్తగా ఏదైనా చేయాలని, ఓ పదేసి జోక్స్ చెప్పింది. వాటిని అందులో ఉన్నవారంతా చప్పట్లు కొట్టి అభినందించారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ జర్నలిస్టు.. ప్రముఖ స్టాండింగ్ కమెడియన్ అథితి మిట్టల్‌కు పరిచయం చేశారు. అంతే.. అప్పటి నుంచి దీపిక లైఫ్ టర్న్ అయింది. ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్తకొత్త జోక్స్ రాసుకొని, సందర్భోచితంగా చెప్పి స్టార్ కమెడియన్‌గా మారిపోయింది. ముంబై వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమందికి ఆదర్శమైంది. ప్రస్తుతం ఇండ్లలో పనులు చేస్తున్న వారిపై జరుగుతున్న వేధింపులపై తన గళాన్ని విప్పుతున్నది. వేధింపులు అరికట్టాలంటూ తనదైన ప్రతిభతో నినదిస్తున్నది. సోషల్‌మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నది. ఇలా వచ్చిన ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థానంలో నిలిచింది దీపిక.

896
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles