ఆహారమే ఆరోగ్యం


Tue,August 28, 2018 01:32 AM

healthy-food
ధైర్యం షాపుల్లో దొరుకదు.. మనమే దాన్ని కూడగట్టుకోవాలి.. సాధారణ గృహిణి స్థాయి నుంచి.. పౌష్టికాహారాన్ని తయారు చేసే స్థాయికి ఎదిగింది.. మంచి ఆరోగ్యం.. మంచి ఆహారం అంటూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నది.. ఉన్నదాంట్లో నలుగురికీ పంచాలనుకునే గుణం ఆమెది.. గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్‌లో ఒకరిగా నిలిచిన ఆమె.. నిజామాబాద్‌కి చెందిన తోకల శ్రీదేవి..ఇక ఎవ్వరూ పౌష్టికాహార లోపంతో మరణించకూడదని ప్రతిన పూని.. మంచి కార్యాన్ని ప్రారంభించిన ఆమె పరిచయమే ఇది.. పాతతరహా పౌష్టిక ఆహారాన్ని కాదనుకొని రెడీ టు ఈట్ ఫుడ్‌ల వెంట పడుతున్నాం. ఫలితం.. మధమేహం, బీపీ.. ఇలా నోరు కూడా తిరుగని రోగాల బారిన పడుతున్నాం. ఇంతకీ లోపం ఎక్కడున్నది? అనే మూలాలు వెతికితే తినే తిండిలోనే అని అర్థమవుతుంది. దీనికి తోడు కాలుష్యం కూడా ఒక కారణమే. ఈ రెండింటి మీద అవగాహన ఉన్నప్పుడే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని చెబుతున్నది శ్రీదేవి. మంచి ఆహారం.. మంచి ఆరోగ్యం పేరుతో ఉపన్యాసాలు ఇస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నది. సొంతం లాభం కొంత మానుకొని.. పొరుగు వారికి తోడ్పడాలనే మాటను పాటిస్తూ ముందుకు సాగుతున్నది.
healthy-food1
శ్రీదేవి సొంతూరు సిద్దిపేట. ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన పెండ్లితో మకాం నిజామాబాద్‌కు చేరుకుంది. చిన్న ఇంట్లో కాపురం. పైగా పండిత కుటుంబం. ఇంట్లో పూజలు, పునస్కారాలతో సరిపోయేది. ఇద్దరు పిల్లలు పుట్టారు. చిన్న కుటుంబం, చింత ల్లేనిది అనేకంటే సర్దుకుపోయే కుటుంబమని చెప్పొచ్చు. 2006 వరకు శ్రీదేవి సాధారణ గృహిణిగానే స్థిరపడింది. కానీ వారం రోజుల పాటు భర్త కామారెడ్డి వెళ్లి హవనం చేయాల్సి వచ్చింది. పిల్లలు స్కూలుకు వెళ్తారు. ఇంట్లో టీవీ చూసి చూసి కూడా బోర్ వచ్చేసింది. కాస్త ఎనర్జీనిచ్చే పదార్థం తినాలనిపించింది. అప్పుడే సత్తుపిండి.. అదేనండీ బాలామృతం తినాలని అనుకుంది. దాంట్లో కొద్దిగా కాజు.. మరికొన్ని ఇంగ్రిడియెంట్స్ కలిపి పట్టించింది.


క్రమక్రమంగా..

మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. శ్రీదేవి విషయంలో అదే జరిగింది. తను ఆ బాలామృతం పట్టించడానికి వెళ్లింది. అయితే దాని బరువు ఎంత ఉందో తెలుసుకోవడానికి దగ్గరలోని సూపర్ మార్కెట్‌కి వెళ్లింది. అయితే ఆ పిండి టేస్ట్ చూసిన ఆ సూపర్ మార్కెట్ యజమాని తనకు ఆ పిండిని ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పాడు. తను ఖర్చు పెట్టిన దానికంటే కూడా డ్బ్బై రూపాయల లాభం వచ్చింది. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడే మార్గం కనిపించింది. ఆర్థికంగా కుటుంబానికి కాస్త చేదోడు వాదోడు అవ్వచ్చని అనుకుంది. అందుకే వచ్చిన లాభంతో మరిన్ని సరుకులు తీసుకెళ్లి వాటితో మరింత పొడి చేసి పెట్టింది. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసింది. అయితే దాంట్లో ఒక చిన్న లెటర్ పెట్టింది. అందులో.. ఈ పొడి నచ్చిన వాళ్లు, నచ్చని వాళ్లెవరైనా తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. దాంతో పాటు తన అడ్రస్ కాగితాన్ని జత చేసింది.


అనుకోని పిలుపు..

ఎవరి దగ్గరకు చేరితే దాని ఫలితం చేకూరుతుందో అప్పుడు శ్రీదేవికి తెలియదు. కానీ అది ఎవరి చేతిలోకి వెళ్లాలో అలాగే వెళ్లింది. ఎన్‌ఐఎన్‌లోని పొన్నా రాముల చేతులోకి ఆ ప్యాకెట్ వెళ్లింది. శ్రీదేవి ఇన్నోవేటివ్.. క్రియేటివ్ ఐడియా చూసి ముచ్చటేసింది. ఆమెను కలిసి దాన్ని ఇంకా ఎలా బాగు చేయాలి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియచేశారు. అక్కడ శ్రీదేవి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పెద్ద పెద్ద సంస్థల నుంచి ఆమెకు ఆహ్వానాలు దక్కాయి. అక్కడ న్యూట్రిషన్ గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయింది. గోధుమ, రాగి మాల్ట్‌లను తయారుచేసి ఎందరికీ ఉచితంగా పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఇండియన్ డైటిక్ అసోసియేషన్‌లో తను తయారు చేసిన ప్యాకెట్స్ ఉచితంగా పంపిణీ చేసే చాన్స్ వచ్చింది.


ప్రముఖులతో కలిసి..

శ్రీదేవికి తను తయారుచేసిన ప్రొడక్ట్స్‌కి పేరు వచ్చింది. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పల్లె సృజన గణేశం, నాబార్డ్ హెడ్ మోహన్ పరిచయం ఆమెను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. వారి సలహాల మేరకు దత్త న్యూట్రిషన్స్ పేరు మీద ఫుడ్ లైసెన్స్ తీసుకుంది. కానీ కొన్ని రోజులకు ఆ పేరు మారిస్తే బాగుంటుందని ప్రముఖులు సూచించారు. వారి మాటలను గౌరవించి.. దాన్ని సమృద్ధి ఫుడ్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించింది. సూక్ష్మ పోషకాల పేరుతో మొదలైన ఆమె న్యూట్రిషన్ కార్యక్రమాలు పలుచోట్ల ఉపన్యాసం ఇచ్చేలా.. నలుగురికీ అవగాహన కల్పించేలా చేసింది.


పదిమందిని తయారు చేస్తా..

డబ్బు ఉన్నవారు ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కానీ పేదవారికి వచ్చేసరికి ఆ అవగాహన ఉండదు. పోషకాల గురించి ఆలోచించరు. వారికి కూడా పౌష్టికాహారం అందాలన్నదే నా ఆలోచన. నేను దీనికి డబ్బులు పెట్టి పేటెంట్ తీసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే నాకు అంత స్థోమత లేదు. ఆ డబ్బులే ఉంటే నలుగురికీ సాయం చేయొచ్చన్నది నా ఆలోచన. అందుకే ఇప్పుడు ప్యాకెట్ చేసి అమ్మే దాంట్లో సగం ఇంటి గురించి, సగం నలుగురు పేదవాళ్లకు దానం చేస్తా. నేను బిజినెస్‌గా దీన్ని అనుకోలేదు. కానీ ప్రభుత్వం, ఏవైనా సంస్థలు వస్తే తక్కువ ధరలో ఈ న్యూట్రీషన్ వాల్యూస్ ఉన్న ఆహారాన్ని అందించగలను. నాలాగ మరో పదిమందిని తయారుచేయగలను. నా విజయం వెనుక నా భర్త చంద్రమౌళి శర్మ సహకారం ఎంతో ఉంది. నా ప్రొడక్ట్స్ కావాలన్నా, నన్ను సంప్రదించాలన్నా 8309119835కి కాల్ చేయగలరు అంటున్నది శ్రీదేవి.


ఎవరెవరు ఏం తినాలి?

-చిన్న పిల్లలు : దొడ్డు బియ్యం, కందిపప్పు లేదా పెసరపప్పు విడివిడిగా వేయించుకొని రవ్వ మాదిరి మిక్సీ పట్టాలి. ఈ రవ్వలో కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఉడికించి పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది.

-మహిళలు : ధనియాలు తీసుకొని అందులో నీళ్లు పోసి మరిగించాలి. రుతుస్రావం రోజుల్లో ఈ కషాయాన్ని తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.

-స్థూలకాయులు : సొరకాయ, దోసకాయ కూరలు ఎక్కువగా తినాలి. ఇందులో నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌గా చేసి తింటే ఈ సమస్య నుంచి దూరం కావచ్చు.

-ఉద్యోగులు : రాగులు వేయించుకోవాలి. తర్వాత జొన్నలు, మినపప్పు విడివిడిగా పిండి పట్టుకోవాలి. ఇవన్నీ ఒక డబ్బాలో వేసి ఇందులో బెల్లం పొడి చేసి కలుపుకోవాలి. ఈ పదార్థాలను పాలతో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది.

-క్రీడాకారులు : మినుపపప్పు, జొన్నలు, పల్లీలు కలిపి పట్టించాలి.బాదం, బెల్లంతో కలిపి పాలతో గానీ, నీటితో గానీ తీసుకుంటే శారీరక దారుఢ్యం పెరుగుతుంది.

-డయాబెటిస్ ఉన్నవాళ్లు : రాగులు, జొన్నలు, కందులు, పెసర్లు, మినుములను వేయించి పొడిలా మిక్సీ పట్టాలి. దీన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

-సౌమ్య నాగపురి

856
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles