ఆర్థిక సమస్యల్ని ఇలా అధిగమిద్దాం


Sat,December 8, 2018 01:17 AM

ఎప్పుడైనాసరే మన వ్యక్తిగత జీవితం, సంపాదన గురించిన ఆందోళనలు చాలాచాలా భయాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అనేవి మన అజాగ్రత్త వల్లే ఎదురవుతాయి. అయితే ప్రతీ వ్యక్తికి ప్రధానంగా ఉండే ఆర్థిక సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలో ఒక్కసారి చూద్దాం..!
financial-fears

ఉద్యోగ నష్టం

ఉద్యోగాన్ని కోల్పోవడమంటే బహుశా చాలాచాలా భయంకరమైనదే. ఎవరు మాత్రం స్థిరమైన ఆదాయాన్ని వదులుకుంటారు చెప్పండి. ఉద్యోగం లేక పోయినైట్లెతే రోజువారి ఖర్చులనూ తీర్చుకోవడం కష్టతరమే మరి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలున్నవారికి తమ వైద్య ఖర్చులు, గృహ, ఆటో, వ్యక్తిగత రుణా లున్నవారికి వాటి నెలసరి వాయిదాల చెల్లింపులు భారమే. అయితే ఓ చిన్న ముందు జాగ్రత్తతో ఈ సమస్యను మీరు ఇట్టే అధిగమించవచ్చు. మీ తొలి నాళ్లలోనే ఓ అగంతుక నిధిని ఏర్పాటు చేసుకున్నైట్లెతే ఆర్థిక కష్టాల్ని దాటే వీలుంటుంది. ఉద్యోగ జీవితం ఆరంభమైన నాటి నుంచే ఓ ప్రత్యేక నిధికి గనుక మీరు ప్రణాళిక వేసుకుంటే.. కష్ట సమయాల్లో అది మిమ్మల్ని కాపాడుతుంది. కనీసం 6 నుంచి 8 నెలలదాకైనా ఆ నిధితో రోజువారి అవసరాలను తీర్చు కోవచ్చు. ఇక జీతం పెరిగినప్పుడల్లా ఆ నిధిలో జమచేసే మొత్తాలనూ పెంచుకున్నైట్లెతే పెద్దపెద్ద ఆర్థిక ఇబ్బందుల్నీ పరిష్కరించుకోవచ్చు. అసలు అగంతుక నిధి అంటే ఏమిటి?.. అనుకోకండి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు, ఎక్కడో ఓ చోట దాచుకునే నగదు నిల్వలు వీటన్నింటినీ కూడా అగంతుక నిధిగానే భావించవచ్చు. ఇతర రంగాల్లో అనుభవం సంపాదించడం, వివిధ పనుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం వంటివి కూడా ఉద్యోగాలను కోల్పోయినప్పుడు మనకు ఇతోధికంగా సాయపడగలవు. మీకు మరో జీవితాన్నే చూపగలవన్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆరోగ్య సమస్యలు

జీవితం అంటేనే ఊహించని మలుపుల సమాహారం. సాధారణంగా ఇలాంటివి ఆరోగ్యపరంగా ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా మనకు చెప్పి రావు. అంతేగాక వాటికయ్యే ఖర్చులనూ ఎవరూ అంచనా వేయలేరు. కాబట్టి మన జబ్బులు.. వాటికయ్య డబ్బులను చూసి భయపడటం అత్యంత సహజం. ఈ భయాన్ని అధిగమించడానికి ఆరోగ్య బీమాలు దోహదపడవచ్చు. వయసు తక్కువే.. ఆరోగ్యంగానే ఉన్నాం.. నాకిప్పుడే హెల్త్ పాలసీలు ఎందుకు?.. అనుకోకండి. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలాచాలా కష్టం. కనుక ప్రతీ ఒక్కరూ ఆరోగ్య బీమాను తీసుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యవ్వన సమయంలోనే ఈ బీమాలను పొందడం వల్ల మనకు మరిన్ని ప్రయోజనాలూ అందుతాయన్న విషయాన్ని మరువద్దు. దీనివల్ల కొన్నిసార్లు అసాధారణ సమస్యలకూ బీమాను అందుకోగలం. ఇక పాలసీని కొనేముందే దాని నియమ నిబంధనల్ని పూర్తిగా చదవండి. దీనివల్ల ఆపత్కాలంలో మనకు అనవసర సమస్యలు రాకుండా ఉండగలవు.

శేష జీవితం

ప్రతీ ఒక్కరు తమ శేష జీవితం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటారు. అయితే జీవితంలో తాము పడిన కష్టాలను ఉద్యోగానంతర కాలంలో తీపి గుర్తులుగా మార్చుకునేది కొందరే. పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం ముందే ఆలోచించి తగిన ఆర్థిక ప్రణాళికల్ని చేసుకునేవారికే ఈ అదృష్టం అని చెప్పవచ్చు. అలాకాకుండా తమ పిల్లలపై ఆధారపడేవారు, తమ కనీస అవస రాల కోసం వారి ముందు చేయి చాచేవారికి శేష జీవితం నిజంగా గడ్డుకాల మేనని చెప్పాలి. అలాగని తల్లిదండ్రులను బాగా చూసుకునే సంతానమే ఈ రోజుల్లో లేదన్నది మా ఉద్దేశం కాదు. అయితే మనకంటూ సొంత ఆర్థిక దన్ను ఉంటే.. ముదిమి వయసును చూసి మరింత మురిసిపోవచ్చన్నదే ఇక్కడి అసలు మాట. కాబట్టి ఉద్యోగ సమయంలోనే రిటైర్మెంట్ ఫండ్‌కు ప్లాన్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ నిధి మీకేగాక, మీ పిల్లలపైనా ఆర్థిక భారాన్ని తగ్గించగలదు. మీ వయసు ఆధారంగా, పదవీ విరమణ నాటికి మీరు పోగేసే సొమ్ము చేతికందేలా ప్రణాళికలు వేసుకోవాలి. ఉద్యోగ జీవితం ముగిశాక కూడా మీ పెట్టుబడులు కొనసాగితే అవి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టే వీలున్నది. కనుక అవసరాలకు అనుగుణంగా రిటైర్మెంట్ ఫండ్‌ను రూపొందించుకోవడం చాలా అవసరం.

అప్పుల భారం

స్థోమతకు మించిన అప్పులతో తిప్పలు తప్పవు. కాబట్టి అవసరాలకు పైబడి రుణాల జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం. మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా పయనించడం ముఖ్యమే. అయితే బలవంతంగా ఆవైపు వెళ్తే మాత్రం దానివల్ల మీకు నష్టాలు కలుగవచ్చు. ఏది అవసరం, మరేది అనవసరం అన్న విచక్షణ తప్పక ఉండాలి. రుణాలిస్తాం అనగానే వెళ్లకుండా ఆచితూచి స్పందించాలి. ఎంతో అవసరమైతే తప్ప అప్పు చేయవద్దు. అలాగే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలమా? అన్నదాన్నీ ఆలోచించుకోవాలి. అనాలోచితంగా చేసే అప్పులు.. కొన్ని సందర్భాల్లో మన అసలు అవసరాలకు ప్రతిబంధకంగా మారవచ్చు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తదితర వాటి వైపు చూడకపోవడం కూడా మీ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది. సంపాదన పెరిగితే లగ్జరీ జీవనశైలికి అలవాటు పడకండి. ఎందుకంటే సంపద అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఆదాయం తగ్గినప్పుడు మన అలవాట్లను అదుపులో పెట్టుకోలేకపోతే ఇబ్బందులే మరి.

మన తదనంతరం

కుటుంబానికి పెద్ద దిక్కు కరువైతే.. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ప్రతీ ఒక్కరూ తాము లేకపోతే తమ కుటుంబం గతి ఏమిటీ? అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనం చనిపోతే పిల్లల చదువు, పెండ్లిండ్లు, రుణాల చెల్లింపులు ఎలా? అన్నది ఆలోచించాలి. కాబట్టి బీమా అవసరాన్ని గుర్తించాలి. ఇన్సూరెన్స్‌లు అనేవి.. మనం చనిపోతే మన కుటుంబానికి మన స్థానంలో నిలబడి సాయం చేయగలవు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బీమాను అశ్రద్ధ చేయ కూడదు. చిన్న వయసులోనే బీమాలను మొదలు పెడితే.. ప్రీమియం తక్కువగా ఉండటమేగాక, ప్రయోజనాన్ని ఎక్కువగా అందించగలవు.

384
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles