ఆరోగ్య పథం యోగ మార్గం


Mon,June 19, 2017 01:17 AM

యోగా! ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప వరం. వందల వేల సంవత్సరాల క్రితమే కనుగొన్న ఆరోగ్య మార్గం. కానీ దాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. మన సంస్కృతిలోని అన్ని అంశాల మాదిరిగానే యోగా కూడా మరుగున పడుతున్న సమయంలో యూఎన్‌ఓ యోగా ఔన్నత్యాన్ని గుర్తిస్తూ రెండేళ్లు గా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతోంది. మూడవ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో... ప్రముఖ యోగా గురువుల అభిప్రాయాలు..
hoga
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. దీన్ని భారతీయ సంస్కృతి అనాదిగా నూటికి నూరుపాళ్లు నమ్ముతూ వచ్చింది. ఆ దిశలో సాగుతూ వచ్చింది. కానీ... మధ్యలో పాశ్చాత్య విధానాల ప్రభావంతో కొంత దారి తప్పినందుకు ఫలితాన్ని ఇప్పుడు దేశం యావత్తూ అనుభవిస్తోంది. చాలా రకాల జీవనశైలి అనారోగ్యాలు సమాజాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి వేదకాలపు యోగశాస్త్రం వైపు చూస్తోంది. కేవలం యోగా మాత్రమే పూర్తి ఆరోగ్యాన్ని అందించగల సంజీవని అని అందరి ఆమోదం పొందుతోంది. అన్ని దేశాల ప్రజలు కుల మతాలకు అతీతంగా యోగా సాధనలో ఆనందాన్ని అందుకుంటున్నారు. ఆరోగ్యాన్ని సాధిస్తున్నారు.
యోగ సాధన కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, ఆలోచనా విధానాన్ని చెప్పాలంటే పూర్తి జీవన విధానాన్ని మార్చేస్తుంది.
yoga
శరీరంలోని అవయవాలన్నీ కూడా ఫ్లెక్సిబుల్‌గా మారుతాయి. కీళ్లు, నాడులు, కండరాలు అన్నీ కూడా చురుకుగా తయారవుతాయి. శరీర అంతర్భాగాలు, రక్తనాళాలు అన్నీ ఉత్తేజితమవుతాయి. శరీరం పంచభూత నిర్మితం. సూర్యుడు శక్తికి కేంద్రం ఈ సూర్య శక్తిని శరీరంతో అనుసంధాన పరుస్తూ మనస్సు, శరీరాలను ఉత్తేజితం చేసుంది యోగా. యోగాతో మనసు, శరీరం, ఆలోచన అన్నింటిని ఒక తాటి మీదకు తేవడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. మనిషిలోని సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. అంతేకాదు ఆలోచనను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలన్నీ కూడా సమతులమవుతాయి. ప్రతి రోజూ యోగసాధన చేసే వ్యక్తి వ్యక్తిత్వంలో గణనీయమైన మార్పు సాధ్యపడుతుంది. ఆలోచన, ఆహార విహార విధానాలను యోగ సాధన ప్రభావితం చేస్తుంది. ఫలితంగా డబ్ల్యూహెచ్‌ఓ ఆశించిన సంపూర్ణ ఆరోగ్య సాధన సాధ్యపడుతుంది.

ఆసనాలు మాత్రమే కాదు..


SriSri-Ravi-Shankar
ప్రపంచం యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించింది. ఇప్పుడు యువత యోగ సాధనవైపు మొగ్గు చూపుతోంది. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం. అనారోగ్యం లేని శరీరం, తికమకలు లేని మనసు, సందేహాలు లేని బుద్ధి సాధ్య పడినపుడే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యపడుతుంది. ఇదే యోగా లక్ష్యం. ప్రభుత్వ అండదండలు లేకుండా ఏ కార్యక్రమం ముందుకు సాగలేదు. ప్రభుత్వ ఆదరణ లేక చాలా కాలం పాటు యోగా అనాథలా మిగిలిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవం జరిపేంతగా చొరవ చూపిన నేటి భారత ప్రభుత్వం తీరు అభినందనీయం. దీనికి పూర్తి అంగీకారం తెలిపిన 177 దేశాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, యోగా ద్వారా మనం మంచి పౌరులను తయారు చెయ్యగలం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయగలం. ప్రపంచ వ్యాప్తంగా దేశ, మత, రాజకీయ భావాలలో క్లిష్ట పరిస్థితులకు ఓర్చి జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్న యోగా శిక్షకులను అభినందిస్తున్నాను. ఈ ప్రాచీన విజ్ఞానానికి అవసరమైన గుర్తింపును అందిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్

ఇది చరిత్రాత్మకం


Sadhguru
ఆది యోగి, ప్రపంచానికి మొట్టమొదటి యోగి. దాదాపు 15 వేల సంవత్సరాల క్రితమే యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి యోగా రకరకాల విధానాల్లో ప్రచారంలో ఉంది. ఒక్కోరాజు కాలంలో ఒక్కోవిధంగా యోగజ్ఞానం ప్రపంచ వ్యాప్తం అవుతూ వస్తోంది. ముఖ్యంగా ఈ 12-15 సంవత్సరాల్లో యోగాను ప్రజల చెంతకు చేర్చడానికి రకరకాల విధానాల్లో మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఈరోజు ప్రపంచంలోని దాదాపు 177 దేశాలు అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఒక వేదిక మీదకు వస్తున్నాయి. ప్రపంచానికి నాయకత్వం వహించే దేశ నాయకుడు అంతర్జాతీయ వేదిక మీద యోగా గురించి మాట్లాడుతున్నారు. రాబోయే సంవత్సరం చరిత్రాత్మకం కాబోతున్నది. ప్రపంచ మానవాళి యోగా ద్వారా కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు తనలోపలికి తాను తొంగి చూసుకునే అవకాశం దొరికే అవకాశం రాబోతున్నది. తమలోపలికి తాము చూసుకోవడం కోసం పైకెత్తి చూడాల్సిన అవసరం లేదు. సంపూర్ణ ఆరోగ్యం లోపలి నుంచి రావల్సిన అంశం. అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే మొత్తం ప్రపంచమంతా కూడా సర్వమానవాళి ఆరోగ్యం లోపలి నుంచి రావల్సి ఉందని అంగీరించడానికి సూచన. ఇది మానవాళి వేస్తున్న ఒక గొప్ప ముందడుగు. ఈ రోజు కూడా దక్షిణాయన ప్రారంభంలో ఉంది. భూమి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు మళ్లుతుంది. ఆదియోగి యోగాను మానవాళికి అందించింది కూడా ఈ సమయంలోనే.
- సద్గురు, ఈశా యోగా

యోగాను వ్యాపారంగా మార్చొద్దు


yogi-aswini
మన విజ్ఞానం గురించిన అవగాహన మనకు లేకుండా పోయింది. ఇది వరకు అంతా కూడా గురుశిష్య పరంపరలో జీవన నైపుణ్యాలన్నింటిని నేర్చుకునే వారు. ఇప్పుడు కేవలం ఉపాధి మార్గాలు మాత్రమే విద్యలో అందుతున్నాయి. ప్రస్తుత విజ్ఞానమంతా కూడా కేవలం మన మెదడులోని కేవలం 7 శాతం మాత్రమే వినియోగంలోకి తెచ్చి కనిపెట్టినవి మాత్రమే. పూర్తి స్థాయిలో మెదడును వినియోగంలోకి తేవడానికి ఉన్న ఒకే ఒక మార్గం యోగా. టీలోమియర్ సిద్ధాతం ప్రకారం మన మేథ ఒక వినిమయ వల. సమాచారం ఒక న్యూరో ట్రాన్స్ మిటర్ నుంచి మరో ట్రాన్స్ మిటర్‌కు చేరుతూ మెదడును చేరుతుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరానికి ఎలాంటి ఏజ్ క్లాక్ లేదనే చెప్పాలి. ప్రతి వ్యక్తి మరణించే వరకు ఆరోగ్య పరమైన ఎలాంటి అసమర్థత లేకుండా జీవితాన్ని కొనసాగించాలి. పాశ్చాత్య వైద్య శాస్త్రం 35 శాతం శరీర ధర్మాలన్నీ సరిగ్గా పనిచేస్తే చాలు ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తుంది. అటువంటి వైద్య విధానం మనకు ఎలా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించగలుగుతుంది? కేవలం యోగ సాధన మాత్రమే అనారోగ్యాలను నివారించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సాధనం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి అనే ఎనిమిది విధానాల ఆష్టాంగ యోగసాధన చాలా శక్తివంతమైనది. కానీ ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఇందులో కనీసం యమ, నియమాలను ఆచరించగలిగినా చాలు. ఆరోగ్యాన్ని సాధించవచ్చు. అందుకు అనుగుణంగా తయారు చేసిన యోగా విధానమే సనాతన క్రియ. ఈ యోగా ప్రక్రియను నిత్యం అనుసరించడం ద్వారా అనారోగ్యం దరి చేరకుండా జీవితాన్ని గడిపేందుకు కావల్సిన శక్తిని సంతరించుకోవచ్చు. నిత్యమై నిలిచి ఉండేదే సత్యం. నిరంతరం మారుతుండేది ఎప్పటికీ సత్యం కాజాలదు. యోగా ద్వారా నిత్యమై నిలిచిన సత్యం వైపు మనల్ని నడిపిస్తుంది. వాస్తవాలను ఎరుకలోకి తెస్తుంది. ఇప్పుడు చాలా రకాల యోగాలు ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది దీన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ విజ్ఞానాన్ని ఇలా వ్యాపారంగా మార్చడం వల్ల అందరికి అందుబాటులో లేకుండా పోవడం ఒకటైతే, భారతీయ సంస్కృతిలోని గురుశిష్య పరంపరకు ఒక అవమానాన్ని ఆపాదించడమే అవుతుంది.
- యోగి అశ్విని ధ్యాన్ ఫౌండేషన్

స్వర్ణ భారతానికి మార్గం..


shivani
దాది జానకి ఈ సంవత్సరం 100 సంవత్సరాల వయసును పూర్తి చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఇప్పటికీ ప్రపంచమంతా తిరుగుతూ ప్రవచిస్తున్నారు. అందుకు దోహదం చేస్తున్న విషయం ఆమె యోగ జీవనం మాత్రమే. మీరు యోగా చేస్తారో లేక యోగ జీవనం సాగిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. యోగా చెయ్యడం అంటే కేవలం కొద్ది సమయం పాటు కొన్ని యోగాసనాలు సాధన చెయ్యడం. కాని యోగ జీవనం గడపడం అంటే ప్రతి నిమిషం యోగ సాధనలో ఉండడం. అలా యోగ జీవనం గడిపితే బాధల నుంచి విముక్తి, రోగాల నుంచి విముక్తి, వ్యసనాల నుంచి విముక్తి, అన్ని దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది. అలా ప్రతి ఒక్కరూ గడపగలిగితే ఈ ప్రపంచం ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఆలోచించండి. యోగా విత్తనాలను యూఎన్‌ఓ కేంద్రంగా ప్రపంచమంతా చల్లాలన్న మన ప్రధాని సంకల్పానికి మనమంతా బలాన్ని ఇవ్వాలి. ఈ సాధనతో స్వర్ణ భారతాన్ని సాధించడం సాధ్య పడుతుంది. ఇప్పుడు మనందరం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. ఇక నుంచి మనం యోగజీవనం గడుపుతామని. మనందరం రోజులో కాస్త సమయం తప్పకుండా యోగ సాధనకు నియోగిస్తామని.
ఓం శాంతి.
- బ్రహ్మకుమారి శివాని

821
Tags

More News

VIRAL NEWS