ఆరోగ్యానికి.. అరుదైన డివైజ్!


Sun,December 9, 2018 12:42 AM

కలుషితమైన నీటి వల్ల అనారోగ్యాల బారిన పడుతారని తెలుసు. కానీ ఏం చేసినా ఈ సమస్య తీరకుండా ఉంది. మన ఒక్క దేశంలోనే కాదు.. ఈ సమస్య ప్రపంచమంతా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గీతాంజలి రావు అనే చిన్నారి పూనుకున్నది. దీనికిగానూ అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకున్నది. ఇంతకీ ఆ చిన్నారి ఎక్కడ ఉంటుంది? ఆ డివైజ్ ఎలా పనిచేస్తుందన్న విషయాలు తెలుసుకుందామా.. గీతాంజలి రావు.. వయసు 12 యేండ్లు. మిచిగాన్‌లో నివాసం. అక్కడ కలుషితమయిన నీరు చుట్టు పక్కల ఉండడం వల్ల, ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చదువుకున్న వారు నీటిని మరుగపెట్టి తాగుతున్నారు. మిగిలిన వాళ్లు అలానే తాగుతున్నారు. ప్రజలందరూ రోగాలతో బాధపడుతుంటే చూడలేకపోయింది గీతాంజలి. స్వచ్ఛమైన నీటిని అందించడానికి ఓ డివైజ్‌ను కనిపెట్టింది. ఈ డివైజ్‌ని మన వెంట ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. దీని ఫలితాలు కూడా వెంటనే మొబైల్‌లో వచ్చేస్తాయి. ఈ డివైజ్ కనిపెట్టినందుకు డిస్కవరీ ఎడ్యుకేషన్ 3ఎం ఇచ్చే అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ అవార్డు ఈ సంవత్సరానికి గీతాంజలికి దక్కింది. అవార్డుతో పాటు.. రూ. 17,84,375 చెక్ కూడా అందుకున్నది.
allari

పద్ధతి పాటిస్తే..

మిచిగాన్‌లోని ఫ్లింట్ నగరానికి చెందిన ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వారు తాగే నీరు మంచిది కాదని తెలుసు. ఏం చేస్తారు. మరో మార్గం లేదు. మురికి నీటిని తాగుడం వల్ల ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. సుమారు లక్షమంది రోగాల బారిన పడ్డారు. ఇదంతా చూసిన 12 యేండ్ల గీతాంజలి రావు మంచి నీటిని అందించాలనుకున్నది. గీతాంజలి తండ్రి ఇంజినీర్. ఇంట్లో తాగునీటిని పరీక్షించి ఆ తరువాత తాగడం గీతాంజలి గమనించింది. అందుకనే గీతాంజలి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ పద్ధతినే అందరూ పాటిస్తే సరిపోతుంది కదా అనుకున్నది. కానీ ఆ పద్ధతికి చాలా ఖర్చవుతుంది. పరీక్షించడం అంత సులువు కాదు. అందరూ చేయాలంటే కుదురని పని. ఈ పద్ధతిని కొంచెం మార్చి అందరికీ ఉపయోగపడేలా చేయాలనుకున్నది. గీతాకి సైన్స్ ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. ఈ ఆసక్తే ఈ ప్రయోగానికి నాందయింది. అయితే చేసేముందు ఒక్కదాన్నే పూర్తి చేయగలనా? అన్న సందేహం వచ్చింది గీతాంజలికి వచ్చింది. ప్రయోగానికి ఉపాధ్యాయుల సహాయం కోరింది. వాళ్లు ఆమె చేసే ప్రయోగానికి సహకరిస్తామని మాట ఇచ్చారు.

వారి ప్రోత్సాహంతోనే చేయగలిగా..

గీత ప్రయోగం గురించి తండ్రికి చెప్పింది. ఇంజినీర్ అయిన గీత తండ్రి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా ప్రయోగం మొదలుపెట్టింది. యూనివర్సిటీలోని ల్యాబ్‌లో ప్రయోగం చేయడానికి అనుమతి ఇచ్చారు స్కూల్ యాజమాన్యం. డివైజ్ పేరు లీడ్ డిటెక్టింగ్ డివైజ్. దీనిలో మూడు భాగాలుంటాయి. రసాయనికంగా చికిత్స చేయడానికి కార్బన్ నానోట్యూబ్, బ్లూటూత్ ఉండే సిగ్నల్ ప్రాసెసర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఉంటాయి. క్యాట్రిడ్జ్‌లో ఉండే నానోట్యూబ్స్ చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రాన్‌ల ప్రవాహాన్ని మారుస్తాయి. దీన్ని ఉపయోగించి పరికరం తయారు చేసింది. క్యాట్రిడ్జ్‌ని మంచి నీటిలో ముంచి తీస్తే ఎటువంటి ఎలక్ట్రానుల ప్రవాహం ఉండదు. మంచినీరు అని మొబైల్‌లో చూపిస్తుంది. అదే క్యాట్రిడ్జ్‌ని మురికి నీటిలో మంచి తీస్తే ఎలక్ట్రాన్‌ల ప్రవాహాన్ని ప్రాసెసర్ ద్వారా మొబైల్‌లో చూపిస్తుంది. ఈ నీరు తాగడానికి పనికిరావని తెలియజేస్తుంది. దీన్ని ఒకసారి ఉపాధ్యాయులకు చూపించింది. వారు ఒకసారి డివైజ్‌ను పరిశీలించారు. ప్రయోగం పూర్తయిన తరువత డివైజ్‌ని ఎలా ఉపయోగించుకోవాలో వీడియో తీసి చూపించింది గీత. ఈ టూల్ చాలా చిన్నదిగా ఉంటుంది. నీటిని తాగే ప్రతీసారి డివైజ్‌తో టెస్ట్ చేసి తాగొచ్చు. ఈ ప్రయోగాన్ని డిస్కవరీ ఎడ్యుకేషన్ 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్‌కి పంపించారు. అందులో గెలిచి అందరి మన్ననలూ పొందుతున్నది. లీడ్ డిటెక్టివ్ డివైజ్ కొంతమేరకు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నదీ చిన్నారి.
Gitanjali-Rao
ఆహారం తీసుకోకపోయినా కొన్నిరోజులు జీవించగలం. నీరు లేకుండా బతుకడం చాలా కష్టం. దొరికిన నీరు తాగి రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. నాన్న ఇంజినీర్. ఆయన సాయంతో నీటిని పరీక్షించే డివైజ్‌ను తయారు చేయాలనుకున్నా. ఉపాద్యాయుల ప్రోత్సాహంతో ప్రయోగం పూర్తిచేశా. ఈ డివైజ్ పక్కన ఉంటే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే. డిస్కవరీ ఎడ్యుకేషన్ 3ఎం ఇచ్చిన చెక్‌ని పాఠశాలకు, మరిన్ని ప్రయోగాలకు ఉపయోగిస్తూ ఎందరో చిన్నారులకు ఆదర్శంగా నిలుస్నున్నది గీతాంజలి.
వనజ వనిపెంట

395
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles