ఆరోగ్యప్రదాయి నీరా


Mon,August 20, 2018 11:36 PM

తాటి చెట్లు అనగానే కల్లును మాత్రమే ఉత్పత్తిచేసేవి అని అనుకుంటారు. అంతేకాక తాటిచెట్టు నుంచి వచ్చే ఉత్పత్తులు మత్తు కలిగిస్తాయని కూడా అపోహపడేవారు లేకపోలేదు. కానీ.. మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న పానీయాలను మనకు అందించే కల్పవృక్షం తాటిచెట్టు. అందులో ముఖ్యమైనది నీర. ఇది తాటి, ఈత చెట్ల నుంచి లభ్యమవుతుంది. నీరా ఆల్కహాలు లేని సహజసిద్ధమైన ఆరోగ్యద్రావణం. ఎన్నో రకాల ఔషధగుణాలున్న నీరా ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్యప్రదాయిని.
toddy
గ్రామీణ భారతంలో తాటి చెట్టుకు విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా పూరిళ్ల నిర్మాణంలో వీటి పాత్ర వెలలేనిది. వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, కల్లు వంటివాటి గురించి తెలియనివారుండరు. మన దేశంలో 14 కోట్ల తాటి చెట్లుఉంటే తమిళనాడులో అత్యధికంగా 6 కోట్లు, మన రాష్ట్రంలో కోట్ల తాటి చెట్లు ఉన్నాయని ఒక అంచనా.


ప్రకృతి ప్రసాదం నీరా : తాటిచెట్టు జాలువారే ఆరోగ్యదాయకమైన పోషక జలం నీరా. ఇది ఏడాది పొడవునా లభించే పానీయం. నీరాలో ఆల్కాహాల్ ఉండదు. నీరా ఒక స్వచ్ఛమైన, ప్రత్యేక రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. నీరా సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్‌గానే కాకుండా జీర్ణకోశ సంబంధితమైన ఒక ఔషధంలా కూడా పనిచేస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలకు దూరం చేస్తుంది. కంటిచూపును చాలా వరకు మెరుగుపరుస్తుంది. నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ ఇమ్యూనిటీని రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తాయి. నీరాలో ఉన్న అనేకమైన మినరల్స్ వల్ల రక్తకణాలు వేరుపడతాయి. ఇందులో ప్రధానంగా సుక్రోస్ ఉండడం వల్ల డయాబెటీస్ బాధితులు కూడా నిర్భయంగా సేవించవచ్చు.


ఎలా తయారవుతుంది?: నీరా తాటి, ఈత చెట్లతో పాటు కర్జూర, జీరిక చెట్ల నుండి వస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ఈత, తాటిచెట్ల నుంచి మాత్రమే నీరాను ఉత్పత్తి చేస్తున్నారు. నీరాను చెట్లనుంచి సేకరించే పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి గాను కుండను తినే సున్నపుతేటతో శుభ్రంగా కడిగి అది ఆరిన తర్వాత కొంత సున్నపుతేటను కుండలో వేసి సాయంత్రం సమయంలో చెట్టుకు అమర్చుతారు. తెల్లవారుజామున నాలుగున్నర తర్వాత నుంచి నీరాను సేకరించవచ్చు. అలా సేకరించిన నీరాను రెండుమూడు గంటల్లో సేవించాలి. లేదంటే ఐస్‌బాక్స్‌లలో భద్రపరిచి ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచితే రంగు, రుచి కోల్పోకుండా తాజాగా ఉంటుంది. కొబ్బరి నీళ్లకంటే ఇది ఎంతో శ్రేష్ఠంగా, రుచికరంగా ఉంటుంది. దీనిని కల్లుగా గుర్తించరు. ఇందులో మత్తు పదార్థం ఉండదు. నిషా కూడా రాదు.


ఎవరైనా తాగొచ్చు: నీరా ప్రకృతి సిద్ధమైన సహజపానీయం, తీపి ఆల్కహాల్ లేని పానీయం. అందువల్ల షుగర్ ఉన్నవారు కూ డా తాగవచ్చు. ఇందులో సుక్రోజ్ ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు, చిన్నపిల్లలు, గర్బిణులు కూడా తాగగల ద్రావణం ఇది.


తాటి కాయల నుంచి కూడా: తాటి చెట్టు నుంచి లభించే ఉత్పత్తుల్లో నీరా అతి ముఖ్యమైనది తాటి చెట్లకు కాయలు రాక మునుపు తాటి కాడల నుంచి నీరా లేదా కల్లు తీయడం ఆనవాయితీ. మగ కాడల నుంచి అక్టోబర్/నవంబర్ నుంచి జనవరి/ఫిబ్రవరి వరకు, ఆడ కాడల నుంచి ఫిబ్రవరి/మార్చి నుంచి మే/ జూన్ వరకు.. ఏడాదికి చెట్టుకు 300 నుంచి 600 లీటర్ల వరకు నీరా తీస్తున్నారు. అయితే, తాటి కాయల నుంచి కూడా జూన్ నుంచి సెప్టెంబర్/అక్టోబర్ వరకు నీరా తీయొచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. చెట్టుకు ఏడాదికి 600 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల వరకు నీరా ఉత్పత్తి చేయొచ్చని నిర్థారణ అయింది. ఈ విధానంలో ముదిరిన గెలలో అట్టడుగున ఉన్న తాటి కాయకు తొలుత గాటు పెట్టి నీరా సేకరిస్తారు.


పోషక విలువలెక్కువ : గెల నుంచి తీసిన నీరాలో కన్నా.. కాయల నుంచి తీసిన నీరాలో పోషక విలువలు ఎక్కువని నిపుణులు అంటు న్నారు. ఆరోగ్యానికి మేలు చేసే మాంసకృత్తులు, చక్కెర, ఇనుము, నత్రజని, భాస్వరం, కాల్షియం, థయామిన్, విటమిన్లు వంటి పలు పోషకాలు అధిక పరిమాణంలో ఉండి టానిక్‌లా పనిచేస్తుంది.


నిల్వచేసే పక్రియనే ముఖ్యం: నిజానికి చెట్టునుంచి సేకరించిన నీర రెండు మూడు గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత అది పులిసిపోతుంది. అలా జరుగకుండా ఉండడానికి శుద్ధిచేసి బాటిల్లలో నింపి శీతలీకరించగలిగితే మూడు నుంచి ఆరునెలల వరకు నిల్వచేయవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పూణాలోని నేషనల్ కెమికల్ లాబొరేటరీలో నీరా, స్వచ్చమైన తాటిని ఆరు నెలలపాటు నిల్వ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేశారు. నీరాను ఏడాది పొడవునా నిల్వ ఉంచే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తూ. గో. జిల్లా పందిరి మామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.


కొత్త ఇండస్ట్రీ పరిచయమవుతుంది..

నీరా ప్రకృతి పానీయం, ఆరోగ్యకరమైన పానీయం. కంటిచూపునకు, క్యాన్సర్ నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. మనరాష్ట్రంలో ఉన్న ఈత, తాటి వనాల నుంచి ఉత్పత్తి చేస్తే ప్రత్యామ్నాయ డ్రింక్‌ను అందించినవారమవుతాం. ఇది కేవలం ఆరుగంటల్లో పులిసిపోయే అవకాశం ఉంది. కనుక నూతన టెక్నాలజీని ఉపయోగించి నిల్వచేయాల్సిన అవసరం ఉంది. నీరాను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా లక్షలాదిమందికి ఉపాధి కల్పించినవారమవుతాం. అలాగే ఆదాయాన్ని సృష్టించవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్న వనాల పెంపకంతో పాటు, రాష్ట్రానికి ఒక కొత్త ఇండస్ట్రీని పరిచయం చేసినవారమవుతాం.
Boora-narsaih
-బూర నర్సయ్యగౌడ్, ఎం.పి, భువనగిరి.


యువతకు ఉపాధి

నీరాను నాన్ ఆల్కహాలిక్ న్యూట్రీషియన్ సాఫ్ట్‌డ్రింక్‌గా ఉత్పత్తి చేయడానికి నూతన శాస్త్రీయ పద్ధతిని అవలంబించి ఉత్పత్తి చేయడానికి శీతల పద్ధతుల ద్వారా నిల్వ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ప్రాసేసింగ్ యూనిట్‌ను నెలకొల్పాలి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి లభించినట్లవుతుంది. నీరాను ప్రమోట్ చేయడం కోసం టూరిజం కేంద్రాలలో ప్రత్యేక ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తే మంచిది.
-మద్దెల రమేష్‌బాబుగౌడ్,అధ్యక్షులు, తెలంగాణ నీరా, పల్మిర ప్రొడ్యూసర్స్ డెవలప్‌మెంట్ సొసైటీ.


ఆరోగ్య ద్రవంగా గుర్తించాలి

నీరాలో ఔషధ గుణాలున్నట్లు అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. నీరాను మత్తు పానీయంగా కాకుండా సాఫ్ట్‌డ్రింక్‌గా గుర్తించి ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నీరాను సేకరించడానికి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి ఉత్పత్తిని పెంచాల్సి ఉంది. అలాగే నీరాలో ఉన్న వ్యాధినిరోధక లక్షణాలను గుర్తించి ప్రోత్సహిస్తే ఒక ఆరోగ్యద్రవం అందరికీ అందుబాటులోకి వస్తుంది.
-గోపగాని ఆనంద్‌గౌడ్, అసిస్టెంట్ ప్రొపెసర్, ఓయు.


స్టడీ చేయాలి..

నీరా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌడ సమాజం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్టడీ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే గత ఏడాది 1.7 కోట్ల ఈత, తాటి వనాలను నాటాం. ఈ ఏడాది కూడా కోటికి పైగా నాటనున్నాం.వివిధ రకాల ఉత్పత్తులు కూడా చేయవచ్చన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. పైలైట్ ప్రాజెక్ట్‌గా అవకాశాలు ఇవ్వాలని అడుగుతున్నాయి. ప్రతిపాదనలు పంపాం. స్టడీ చేయాల్సి ఉంది.
-సోమేష్‌కుమార్,
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కమిషనర్.


నీరాలో ఔషధ గుణాలు..

-నీరాలో ఉండే సుక్రోస్, ప్రొటీన్స్ సహజసిద్ధమైన తీపితో పాటు శక్తినిస్తాయి.
-మలబద్ధకం, గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.
-తెల్లకల్లులో ఉండే ప్రో బయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
-మినరల్స్ రక్తకణాలను వృద్ధి చేస్తాయి.
-ముఖ్యంగా నీరా తాగితే ఫ్లోరోసిస్ తీవ్రత తగ్గుతుంది.
-తాటి బెల్లం, షుగర్(పామ్ షుగర్)ను డయాబెటీస్ ఉన్నవారూ వాడవచ్చు.
-నీరా, తాటిపండ్లు ఆయుర్వేదంలో విరివిరిగా వాడుతారు.
-నీరాలో ఆల్కహాల్ ఉండదు. తాటికల్లులో కేవలం నాలుగు శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది.


నీరాలోని పౌష్టిక గుణాలు

ప్రతి 100 మిల్లిలీటర్ల నీరాలో 264 కెసియల్ ప్రొటిన్, పిండిపదార్థం, సున్నా శాతం కొవ్వు, లవణాలు, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, సోడియం, పొటాషియం ఉంటాయి. విటమిన్స్‌లో ఎస్కార్టీస్ ఆసిడ్, నికోటిన్, రీబోప్లానిన్‌లు మెండుగా ఉంటాయి.


సర్వరోగ నివారిణి

-నీరా ఒక ఎనర్జీ డ్రింక్, గ్యాస్‌ను తక్కువ చేస్తుంది.
-మలబద్దకం నుంచి విముక్తి కలిగిస్తుంది.
-కంటిచూపును మెరుగుపరుస్తుంది
-లివర్ సంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
-కామెర్లు, ఫ్యాటిలివర్, లివరోసిన్ నుండి నీరా కాపాడుతుంది.గుండె పనిచేసే విధానాన్ని మెరుగు పరుస్తుంది.
-కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. వచ్చిన రాళ్లను కరిగిస్తుంది.
-క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తక్కువ చేస్తుంది.


ఉప ఉత్పత్తులు, ఆర్థికాభివృద్ధికి దోహదం

నీరా నుంచి ఇతర ఉప ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా కుటీర పరిశ్రమలకు చేయూతనివ్వచ్చు. వీటి ద్వారా ఔషధ విలువలున్న ఖరీదైన తాటి బెల్లాన్ని, తాటినీర చక్కెరను కూడా ఏడాదంతా తయారు చేయొచ్చు. తాటి బెల్లం కిలో ధర రూ. 300 వరకు ఉంటుంది. ఇది డయాబెటీస్ నియంత్రణకు చక్కగా ఉపయోగపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం వంటివి విరివిగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నీరాలో పామ్ షుగర్ సుక్రోజ్ ఉంటుంది. కాబట్టి మధుమేహ బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 కోట్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, భారతదేశంలో దాదాపు ఐదు కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు పామ్‌షుగర్ ప్రకృతి ప్రసాదించిన వరం. తాటి కలకండ, తాటి షుగర్ క్యాండీ, తాటి పౌడర్ తదితర అనుబంధ ఉత్పత్తుల తయారీతో కుటుంబ సభ్యులకు ఉపాధి లభిస్తుంది.

1813
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles