ఆడపిల్లకు ఆర్థిక భరోసా


Sat,August 4, 2018 01:31 AM

సుకన్య సమృద్ధి యోజన

child
లింగ వివక్ష అధికంగా మనదేశంలో ఆడపిల్ల పుట్టిందంటేనే అదో బరువు బాధ్యతగా భావించేవారు అధికం. దేశంలో నానాటికి తగ్గిపోతున్న పిల్లల లింగ నిష్పత్తి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బేటీ బచావో, బేడి పడావో నినాదంతో సామాజిక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకాన్ని జనవరి 22, 2015న ప్రవేశపెట్టింది.


ఆడపిల్లల తలిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకాన్ని రూపొందించారు. పుట్టిన వెంటనే అమ్మాయి పేరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను ఓపెన్ చేసి అందులో సొమ్మును తలిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు డిపాజిట్ చేయవచ్చు. ఆ అమ్మాయి విద్య, వివాహాలకు ఆ సొమ్మును వినియోగించే విధంగా స్కీమ్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌కు దేశవ్యాప్తంగా అనూ హ్య స్పందన లభిస్తున్నది. ఇటీవల ఇందులో డిపాజిట్ చేసే కనీస మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ. 500 కు తగ్గించారు. దేశ వ్యాప్తంగా 76లక్షల మంది ఎస్‌ఎస్‌వై అకౌంట్లను ప్రారంభించారు. ఈ అకౌంట్లలో ఇప్పటివరకు మొత్తం రూ. 3,000 కోట్ల నిధులు జమ అయ్యాయి. ఇలాంటి వినూత్న పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పిస్తుంది. తలిదండ్రులు కూడా క్రమం తప్పకుండా ఈ అకౌంట్‌లో చిన్న మొత్తాల్లో నిధుల్ని జమ చేయడం
ద్వారా భవిష్యత్ గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

ఎవరు, ఎక్కడ ఓపెన్ చేయవచ్చు

ఈ అకౌంట్‌ను ఆడపిల్ల తలిదండ్రులు లేదా సంరక్షకులు ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ కవల పిల్లలు అయితే ముగ్గురికి ఓపెన్ చేయవచ్చు. పుట్టిన రోజు నుంచి పదేండ్ల లోపు అమ్మాయిల పేరు మీద అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న ఏ పోస్టాఫీసులో నైనా లేదా ఎస్‌బీఐ తదతర వాణిజ్య బ్యాంకుల్లో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్లు

అమ్మాయి బర్త్ సర్టిఫికేట్, తండ్రి లేదా సంరక్షకుని గుర్తింప కార్డు, అడ్రస్ ధృవీకరణ, కవల పిల్లలయితే అందుకు సంబంధించి ధృవీకరణ.


ఎంత డిపాజిట్ చేయవచ్చు

కనీసం ప్రస్తుతం రూ. 250 నుంచి రూ. 1,50,000 వరకు ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తాన్ని నెలకి ఒకసారి అని కాకుండా, ఏడాదికి లక్షన్నర రూపాయలకు మించకుండా ఎన్ని సార్లయినా, ఎంతమొత్తం అయిన డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతి (ఎస్‌ఐపీ) రూపంలో కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆటోమేటిక్ క్రెడిట్ చేసే అవకాశం కూడా ఉంది. అకౌంట్ ప్రారంభించిన తర్వాత 15 ఏండ్ల పాటు డిపాజిట్ చేయాల్సిఉంటుంది. అకౌంట్ ప్రారంభించిన తర్వాత 21 ఏండ్లకు ఈ అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది.


ఎంత వడ్డీ? ఏమిటీ ప్రయోజనం

ఈ డిపాజిట్లపై ఏటా 8.10 శాతం వడ్డీ వస్తుంది. ఈ డిపాజిట్లపై వడ్డీని ప్రతి మూడునెలలకోసారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. గత ఏడాది 9.10 శాతం వడ్డీని ఇచ్చింది. ఈ డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పెట్టుబడిగా పెట్టిన మొత్తంమీద, వడ్డీ ఆదాయం మీద, అలాగే విత్‌డ్రా చేసిన అసలు, వడ్డీ మీద పన్ను మినహాయింపు ఉంటుంది. దీన్నే ట్రిపుల్ ఎగ్జంప్షన్ అని కూడా అంటారు. ఒకవేళ మధ్యలోనే డిపాజిట్‌ను నిలిపివేస్తే రూ. 50 జరిమానాతో తిరిగి ప్రారంభించవచ్చు. నగదు, చెక్కు, డ్రాఫ్ట్, లేదా అన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా ఈ అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు.


ఈ అకౌంట్ క్లోజ్ చేయడం ఎలా?

ప్రారంభించిన తర్వాత 21 ఏండ్లకు మెచ్యూరిటీ అయినప్పుడు గుర్తింపు కార్డు, అడ్రస్ ధృవీకరణ, ఆధార్ తదితర పత్రాలతో అసలు, వడ్డీతో సహా తీసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయికి 18 ఏండ్లు నిండిన తర్వాత పెండ్లి కోసం లేదా అత్యవసర వైద్య సేవల కోసం 50 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. ఒకవేళ అమ్మాయి ఏదైనా కారణంతో చనిపోతే తలిదండ్రులు లేదా సంరక్షకుడు సంబంధిత పత్రాలను సమర్పించి విత్ డ్రా చేయవచ్చు.
madhavi-reddy

172
Tags

More News

VIRAL NEWS

Featured Articles