ఆటుపోట్లకు ఎదురీదాలి


Sat,August 25, 2018 01:25 AM

STOCK
అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో 2009 తర్వాత ఈక్విటీ మార్కెట్లు, అందులోని పెట్టుబడులు గొప్ప ప్రతిఫలాల్ని అందించాయని తేలింది. అయితే మదుపరులెవరికీ ఈ ప్రయోజనం కలుగకుండా పోయింది. కారణం స్టాక్ మార్కెట్లకు చాలామంది దూరంగా ఉండటమే. ఎక్కువమంది మదుపరులు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి కనబరుచడం లేదు.


-వివిధ పోర్ట్‌ఫోలియోలు, అనేకానేక షేర్లతో కూడిన స్టాక్ మార్కెట్లలో.. మదుపరులకు తమ పోర్ట్‌ఫోలియో తీరు ఎందుకు ఆకర్షణీయంగా ఉండటం లేదు? మార్కెట్లు ఎప్పుడు ఈ కోణంలో లాభాల్లో ట్రేడ్ అవుతాయి? అన్న ఆందోళన ఎక్కువైపోయింది. నిజానికి మార్కెట్ కదలికలపైనే పోర్ట్‌ఫోలియోల నిర్మాణం ఆధారపడి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో తమ పెట్టుబడుల్లో మదుపరులు తీసుకునే నిర్ణయాలు, మార్పులే సదరు పోర్ట్‌ఫోలియోల వృద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాయి.


-పెట్టుబడుల విషయంలో మదుపరుల తెలివి కంటే వారి ప్రవర్తనకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగని తెలివిగా వ్యవహరించకూడదని కాదు. వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఏయే అంశాలు మన పెట్టుబడులను తరచుగా ప్రభావితం చేస్తున్నాయనేది గమనించడం చాలా ముఖ్యం. అలాంటి పరిణామాలు ఎదురైనప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలకే పెద్దపీట వేయడం అన్నివేళలా శ్రేయస్కరం. త్వరగా వచ్చేదేదైనా అది అంతే త్వరగా వెళ్లిపోతుంది. అది లాభమైనా.. నష్టమైనా. కాబట్టి మార్కెట్లలో పెట్టుబడులకు వెళ్లేముందు మన స్వభావాన్ని అందుకు తగ్గట్లుగా మలుచుకోవడం చాలాచాలా అవసరం.


-ఉదాహరణకు చీకట్లో మనకు ఓ శబ్దం వినిపించింది. మొదట అప్రమత్తం అవుతాం. ఆ తర్వాత మనల్ని మనం కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటాం. మనచుట్టూ అందరూ ఉన్నా.. చీకటి కారణంగా ప్రతీ మనిషి ఇలా ప్రవర్తించడం అంత్యంత సహజం. అలాగే స్టాక్ మార్కెట్లలోనూ ఈ చీకటి శబ్దాలకు నిలకడనేది ఉండదు. నిబ్బరంగా ఉంటే అంతిమ విజయం మనదే. ఏం జరుగుతుందో ఓపిగ్గా వేచిచూడండి. తాత్కాలిక పరిణామాలను చూసి కంగారుపడటం మానేయండి. పరిస్థితులు చక్కబడ్డాక అసలు ఫలితాలు కనిపిస్తాయి. స్టాక్ మార్కెట్ల లావాదేవీలు చాలాచాలా సున్నితమైనవి. షేర్ల ట్రేడింగ్‌పై ప్రతీ అంశం ప్రభావం చూపుతుంది. అందుకే ఒడిదుడుకులు సర్వసాధారణం. సూచీలు పడుతూ.. లేస్తూ.. పయనం సాగిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లోనే మదుపరులు అత్యుత్సాహంతో తీసుకునే నిర్ణయాలు షేర్ల లాభాలకు, నష్టాలకు కారణమవుతాయి. ఈ పైపై మెరుగులను చూసి మన పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరికాదు. మూలాలను తెలుసుకుని ముందుకెళ్లడం సర్వదా క్షేమం.


-మన పెట్టుబడులను లాభదాయకంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళ్లేందుకు నిపుణుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడుతాయి. దీనివల్ల మార్కెట్ తీరుతెన్నులపై ఓ చక్కని అవగాహననూ సంపాదించుకోవచ్చు. మదుపరులు పెట్టుబడులను కొనసాగిస్తేనే వృద్ధిని చూడగలుగుతారు. పెట్టుబడులను ఆపేయడం మదుపరుల సహజ లక్షణం కాదు. ఏయే రంగాల్లో బలమైన వృద్ధిరేటు ఉందో తెలుసుకుని, ఆ దిశగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలను అందుకోవచ్చు. మార్కెట్‌లో ఏయే షేర్ ఎంత మేర ట్రేడ్ అవుతుందనేది పరిశీలించి, భవిష్యత్తులో మన పెట్టుబడులు ఎంతటి ఆకర్షణీయంగా తయారవుతాయో ఓ అంచనాకు రావడం.. మనకున్న ముందుచూపునకు నిదర్శనంగా నిలుస్తుంది. పెట్టుబడులకున్న నూతన మార్గాలనూ అన్వేషించడం అలవరుచుకోవాలి. సముద్రపు ఆటుపోట్లను తట్టుకోగలిగితేనే ఆ సాగర సంపద చేతికందేది. అలాగే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడితేనే లాభాలు వరించేది.
NARESH

403
Tags

More News

VIRAL NEWS

Featured Articles