ఆకట్టుకోని గోల్డ్ ఈటీఎఫ్‌లు


Sat,July 14, 2018 02:32 AM

-కొనసాగుతున్న పెట్టుబడుల ఉపసంహరణ
-ఏప్రిల్-జూన్‌లో తరలిపోయిన రూ.150 కోట్లు
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)కు ఆదరణ కరువవుతున్నది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ దాదాపు రూ.150 కోట్ల పెట్టుబడులను మదుపరులు ఉపసంహరించుకున్నారు. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ తాజా గణాంకాల ప్రకారం 14 ఈటీఎఫ్‌ల నుంచి రూ.146 కోట్ల పెట్టుబడులు వెనుకకుపోయాయి. ఏప్రిల్‌లో రూ.54 కోట్లు, మేలో రూ.38 కోట్లు, జూన్‌లో రూ.54 కోట్ల ఉపసంహరణ జరిగింది. అయితే నిరుడు ఏప్రిల్-జూన్‌లో రూ.218 కోట్లు తరలిపోగా, దాంతో పోల్చితే ఇప్పుడు తగ్గుముఖమే పట్టాయని చెప్పవచ్చు. మరోవైపు ఏడాది క్రితంతో పోల్చితే మాత్రం 12 శాతం పతనం కనిపించింది. గోల్డ్ ఫండ్స్ నిర్వహణ కింద ఆస్తులు నిరుడు జూన్ 30న రూ.5,174 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి రూ.4,567 కోట్లకు దిగజారాయి. నిజానికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్ గత ఐదేండ్లుగా మందగమనంలోనే నడుస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం 2017-18లో రూ.835 కోట్ల పెట్టుబడులు వెనుకకుపోగా, అంతకుముందు 2016-17లో రూ.775 కోట్లు, 2015-16లో రూ. 903 కోట్లు, 2014-15లో రూ.1,475 కోట్లు, 2013-14లో రూ.2,293 కోట్ల మేర పెట్టుబడులు తరలిపోయాయి. గడిచిన ఐదేండ్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు క్రమేణా తగ్గిపోయాయి.

2005 నుంచి బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 2011-12లో సరికొత్త స్థాయిని ధరలు తాకాయి. అయితే ఆ తర్వాత ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి. తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా విభాగం రిసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలపుర్కర్ అన్నారు. 2014 నుంచి స్టాక్ మార్కెట్లు పరుగందుకున్నాయన్న ఆయన గోల్డ్ ఈటీఎఫ్‌ల మదుపరులు ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి పెట్టడమే కారణంగా పేర్కొన్నారు.

234
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles