అస్తమానం వేధించకుండా..


Tue,December 11, 2018 12:12 AM

asthma
చలికాలంలో చాలామందిని వేధించే జబ్బు ఆస్తమా. మాములుగానే ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి శీతాకాలంలో విజృంభిస్తుంది. మనల్ని మనం కాపాడుకుంటేనే అస్తమానం వేధించే ఆస్తమాకు చెక్ పెట్టొచ్చు. లేకపోతే ప్రతీరోజు ఆస్తమాతో నరకమే. కాబట్టి ఆస్తమా అంటే ఏంటి? ఎలా వస్తుంది? నివారణ ఎలా? తీసుకోవాల్సిన చికిత్సల గురించి స్పష్టమైన అవగాహన అందరికీ అవసరం.

దేశ వ్యాప్తంగా రెండు కోట్ల మందికిపైగా వయోజనులు, పిల్లలను వేధిస్తున్న వ్యాధి ఆస్తమా. రోజురోజుకూ ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నది. గత రెండు మూడేండ్లలోనే వీరి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇతరత్రా పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కేవలం ఆస్తమా ద్వారానే వృత్తి, ఉద్యోగాల్లో సరిగా రాణించలేకపోతున్నారని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఆస్తమా మరింతగా విస్తరిస్తున్నది.

ఆస్తమా అంటే?

దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అంటారు. దీని వల్ల ఊపిరితిత్తులలోని గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యం గా శ్వాసకోశ మార్గంలో వాపు రావడం, మార్గం కుంచించుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

ఆస్తమాకు కారణాలు?

ఆస్తమాకు మన చుట్టూ ఉండే కాలుష్యపూరిత పరిసరాలే కారణం అయ్యే ప్రమాదం ఉంది. చల్లటి వాతావరణం, దుమ్ము, ధూళి, పొగ, ఫంగస్, వాయు కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఆస్తమా రావొచ్చు. పెంపుడు జంతువులు, రసాయనాలు, ఘాటువాసనలు కూడా ఆస్తమాకు కారణం కావొచ్చు.

ఆస్తమా ఎలా వస్తుంది?

ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించింది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. దీనినే ఎటోపి అంటారు. కొంతమందిలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటిబాడీ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి సరిపడని యాంటీజెన్లు లోపలికి ప్రవేశించినపుడు ఈ యాంటిబాడీ వెలువడి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుంచి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇదే ఆస్తమాకు దారి తీస్తుంది.

లక్షణాలేంటి?

ఎడతెరిపిలేని దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, మానసిక ఆందోళన తదితర లక్షణాలను ఆస్తమాలో గుర్తించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నిర్ధారణ పరీక్షలు

-వంశానుగత చరిత్ర, అలర్జీకి సంబంధించిన పరీక్షలు, కఫం పరీక్ష, చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు, స్పైరో మెట్రీ, ఛాతి ఎక్స్‌రేవంటి పరీక్షల ద్వారా ఆస్తమా వ్యాధిని నిర్ధారించవచ్చు.
-టెస్టుల రిపోర్టుకు అనుగుణంగా వైద్యులు చికిత్స అందిస్తారు.

జాగ్రత్తలు

ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమయానుగుణంగా పోషకాహారం తీసుకోవడంతో పాటు ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. మానసిక ఆందోళనకు గురికావొద్దు. దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యాలకు దూరంగా ఉండాలి. చల్లని వాతావరణంలో అస్సలు తిరగకూడదు. ఆరోగ్యానికి సరిపడని పదార్థాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

ఎలా సోకుతుంది?

ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌తో కూడిన గాలి తీసుకెళ్లే, వాటి నుంచి కార్బన్‌డయాక్సైడ్ కలిగిన గాలిని బయటకు పంపించే వాయు నాళాలకు ఆస్తమా సోకుతుంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో శ్వాసమార్గం సాధారణ వ్యక్తుల కంటే చాలా ఇరుకుగా ఉంటుంది. రెండు కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మొదటిది శ్వాసమార్గపు గోడలలో మృదువైన కండరాలు ఎక్కువ కావటం. దుమ్ము -ధూళి, వాతావరణ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులకు శ్వాసమార్గపు కణజాలం అతిగా స్పందించటం వల్ల వస్తుంది. ఇది సోకినప్పుడు వాపుతో వాయునాళాల లోపలి భాగం వాచుతుంది. వాపు వల్ల ఈ వాయు నాళాలు చాలా సున్నితంగా తయారవుతాయి. తేలికగా అలర్జీలకు గురవుతాయి. వాపు, అలర్జీలతో వాయునాళాలు కుంచించుకొని గాలి వెళ్లాల్సిన స్థలం సన్నగా మారిపోతుంది. ఊపిరితిత్తులకు వచ్చే, వాటి నుంచి బయటకు వెళ్లే గాలి పరిమాణం చాలావరకు తగ్గిపోతుంది. దీంతో వ్యక్తి ఊపిరి పీల్చినపుడు, వదిలినపుడు కీచు శబ్దం వస్తుంటుంది. ఛాతీ బరువుగా అనిపిస్తుంది. ఉమ్మితో తెమడ పడుతుంటుంది. శ్వాస పీల్చుకోవటంలో సమస్యలతో దగ్గు వస్తుంటుంది. శ్వాసతీసుకోవటం కష్టంగా తయారవుతుంది. అందువల్లనే సాధారణ పరిభాషలో ఆస్తమాను దగ్గు దమ్ము అంటుంటారు.

సంప్రదాయ చికిత్సలకు స్వస్తి

వ్యాధి విస్తరిస్తున్నట్లుగానే దానికి చికిత్సా విధానాలు కూడా పెరుగుతున్నాయి. ఆస్తమాను అదుపుచేసే పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. గత ఇరవై ఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనా సంస్థలు, వైద్య కేంద్రాలలో జరిపిన పరిశోధనల ఫలితంగా ఆస్తమాను అదుపు చేయడమే కాకుండా దాని దాడి నుంచి ఏళ్ల తరబడి రక్షించగల చికిత్సా విధానాలు రూపొందాయి. జీవితాంతం స్టెరాయిడ్లు, ఇతర మందులు వాడాల్సిన పరిస్థితి వేగంగా తొలగిపోతున్నది. ప్రపంచస్థాయి వైద్యకేంద్రాలకే పరిమితమైన ఈ ఆధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ చికిత్సలకు బదులుగా ఈ అత్యాధునిక చికిత్సలను ఎంచుకోవటం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించటం ద్వారా తీవ్రమైన ఆస్తమాను అదుపు చేయవచ్చు.

ఆధునిక వైద్యసేవలు

ఆస్తమా జీవితకాలం వేధించే వ్యాధి. గతంలో ఈ వ్యాధి సోకిన వ్యక్తులను పూర్తిస్థాయి రోగులుగా భావించేవారు. ఇప్పుడు అధునాతన వైద్య పరిశోధనలు, నూతన చికిత్సా విధానాల అభివృద్ధితో ఆ పరిస్థితి మారిపోయింది. శాశ్వత నివారణ సాధ్యం కాకపోయినా వయోజనుల్లో కనీసం పది సంవత్సరాల పాటు బాధను ఖచ్చితంగా నివారించే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా చికిత్స ప్రధానంగా ఇన్హేలర్ల ద్వారా ఉపయోగించే మందుల రూపంలో చేస్తారు. ఈ ఇన్హేలర్లు మందులను నేరుగా శ్వాసమార్గంలోకి ప్రవేశపెడతాయి. ఆస్థమాలో ఉపయోగించే ఈ రకమైన మందులను బ్రాంకోడైలేటర్లు.. ఇన్హేల్ స్టెరాయిడ్స్ అంటారు. బ్రాంకోడైలేటర్లు శ్వాసమార్గంలో పేరుకుపోయిన మృదువైన కండరాల సాంద్రతను తగ్గించి శ్వాసమార్గాలు తెరుచుకోవటానికి తోడ్పతాయి. ఇన్హేల్ స్టెరాయిడ్స్ శ్వాసనాళాల వాపును తగ్గిస్తాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 90శాతం మందికి ఈ చికిత్స వల్ల ఉపశమనం కలుగుతుంది.

బ్రాంకియల్ థర్మోప్లాస్టీ

తీవ్రమైన అస్తమా వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం ఇవ్వగల అత్యాధునిక చికిత్సగా ఇది ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియలో ఒక ప్రత్యేక పరికరం (ప్రోబ్)ను ఉపయోగించి శ్వాననాళపు గోడలను వేడిచేస్తారు. బ్రాంకోస్కోప్ ద్వారా వెళ్లే ఈ ప్రోబ్ అందించిన వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ తొలిగిపోతుంది. దాంతో శ్వాసమార్గం విశాలంగా తెరుచుకుంటుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాల చొప్పున వ్యవధిని ఇస్తూ మూడు దఫాలుగా నిర్వహిస్తారు. ఈ మూడు దఫాల చికిత్సా ప్రక్రియ పూర్తయ్యే సరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. చెప్పుకోదగ్గ ఉపశమనం లభిస్తుంది. సహజంగానే వ్యక్తి జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అదే సమయంలో ఆస్తమా అటాక్స్ సంఖ్య, ఆ కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి రావటం తగ్గిపోతాయి. ఈ చికిత్సా ప్రక్రియ ఫలితం చాలా కాలం పాటు (కనీసం ఎనిమిది సంవత్సరాలు) నిలిచివుంటుంది. శ్వాసమార్గంలో ఆటంకంగా తయారయిన మృదువైన కండరాల పరిమాణాన్ని తగ్గించే ఒకే ఒక్క చికిత్సగా బ్రాంకియల్ థర్మోప్లాస్టీ నిలబడుతున్నది. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన, ఇన్హేలర్ మందుల వల్ల ప్రయోజనం లభించనప్పుడు ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఈ ప్రక్రియను ఎంచుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆస్తమా ఓ సంక్లిష్టమైన వ్యాధి. పరిసరాలలో పరిస్థితి, వాతావరణం ఈ వ్యాధి తీవ్రతను పెంచటంలో చాలా ముఖ్యమైన పాత్రవహిస్తున్నందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దీని బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాధిని నిరోధించటం ఓ సవాలు కూడా. అయితే సులభమైన కొన్ని సూచనలు పాటించటం ద్వారా ఆశించిన ఫలితాలు ఉంటాయి.
1. దిండ్లపై దుమ్ము, ధూళి లేకుండా చూసుకోండి. కనీసం పదిహేను రోజులకు ఓసారి పక్కబట్టలను మరుగుతున్న నీళ్లతో ఉతకండి.
2. పెంపుడు జంతువులను పడకగదిలోకి, ఫర్నీచర్ పైన కూర్చోవటానికి అనుమతించకండి.
3. పడక గదిలో కార్పెట్లు వేయకండి. దూదికూరి చేసిన పిల్లల బొమ్మలను పడకగదుల్లో పెట్టకండి.
4. ఇంటి వాతావరణంలో తేమ అధికంగా ఉండకుండా చూసుకొండి. ఇంట్లోకి వస్తున్న గాలి నాణ్యత గమనిస్తూ ఉండండి.
5. ధూమపానం కోసం ఉద్దేశించిన ప్రదేశాలకు దూరంగా ఉండండి.
6. ఇళ్లలో ఫ్లోరింగ్, బాత్రూమ్‌లను శుభ్రం చేసేందుకు ఘాటైన క్లీనర్లను, ఆసిడ్‌లను వాడకండి.
7. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొండి.
8. తీవ్రమైన వేడి, చలి ఉన్న రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయకండి.
9. అస్తమా లక్షణాలు కనిపించినపుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొండి. ప్రారంభంలోనే వైద్యులను కలవటం వల్ల మీ అస్తమాకు కారణాలను గుర్తించి చికిత్స చేయటం - జాగ్రత్తలను సూచించటం ద్వారా దానిని పూర్తగా అదుపులో ఉంచటానికి వీలవుతుంది.
Dr.-Hari-Kishan
డాక్టర్ జీ హరికిషన్
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
ఛాతీ & శ్వాసకోశ వ్యాధుల విభాగం
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles