అవే నా బలం!


Thu,August 23, 2018 12:15 AM

మంబైలోని కామటిపుర. ఇదో నిత్య నరకం. ఎందుకంటే, ఎంతోమంది మహిళలు.. కామాంధుల దాహానికి నానా విధాలుగా బలవుతూనే ఉంటారు. అలాంటి చోట బతుకుతున్న వారి పిల్లల పరిస్థితి మరీ దారుణం.ఆ నరకకూపం నుంచి బయటికొచ్చి.. స్వశక్తితో ఎదిగి, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నది ఈ యువతి.
sheetal
శీతల్.. ఒకప్పుడు ఈమెను చూసి అందరూ లైట్ తీసుకున్నారు. నేడు ఆమె పట్టుదల, ధైర్యం, తెగువను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. బార్ డ్యాన్సర్ కూతురు.. మంచి భవిష్యత్ కోసం తానుగా నిర్మించుకుంటున్న బాటలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ముంబైలోని కామటిపురకు చెందిన శీతల్.. యుక్తవయసులోనే ఆ రొంపి నుంచి బయటకొచ్చింది. తల్లికి తోడుగా ఉంటున్న వ్యక్తే తనను లైంగికంగా వేధిస్తుండడం, తల్లి కూడా కష్టమైనా పడుపు వృత్తినే కొనసాగిస్తుండడంతో ఆ ఏరియాకే స్వస్తి చెప్పింది. క్రాంతి అనే ఎన్జీఓలో చేరి చదువు కొనసాగించింది. అయినా కొన్ని సంఘటనల వల్ల శీతల్ చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో తానుండే ఎన్జీఓలో జరిగే మ్యూజిక్ క్లాసులకు ఆకర్షితురాలైంది శీతల్. డోలక్, డ్రమ్స్ వాయించడంపై ఆసక్తి పెంచుకున్నది. మగవారు మాత్రమే రాణించగలిగిన ఆ విభాగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే కసితో వాటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది.


ఆ ఎన్జీఓ సాయంతో, యూఎస్‌ఏ నుంచి సగం స్కాలర్‌షిప్‌తో డోలక్, డ్రమ్స్, రిథమ్‌ప్యాడ్‌లో ప్రావీణ్యం సంపాదించింది. అలా తన మొదటి వర్క్‌షాప్‌లోనే అన్ని రకాల వాయిద్యాలపై వినసొంపైన రిథమ్‌ను పలికించి, అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది శీతల్. అలా డ్రమ్స్, మ్యూజిక్ థెరఫిస్టుగా కొత్తజీవితాన్ని ప్రారంభించింది. ఇన్నాళ్లూ తానుండే ఏరియా పేరు చెప్పుకునేందుకే భయపడిన శీతల్.. ఆ ఏరియానే తన బలమని చెబుతున్నది. కామటిపురలోని తన వయసు ఆడపిల్లలు వేశ్యవృత్తివైపు మళ్లకుండా జీవితంపై అవగాహన కల్పిస్తున్నది. పలు ఎన్జీఓల్లో మ్యూజిక్ క్లాసులు నిర్వహిస్తూ, స్ఫూర్తి నింపుతున్నది. నాడు తల్లిలాగే నువ్వూ తయారవుతావు అని హేళన చేసినవారే.. ఆమెను అభినందిస్తున్నారు.

639
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles