అలసటకు కారణమేంటి?


Fri,November 30, 2018 11:21 PM

మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు. ఆమెకు బీపీ ఉన్నది. షుగర్ కూడా ఉన్నది. బరువు కూడా అధికంగానే ఉంది. బీపీ.. షుగర్ టాబ్లెట్లు ప్రతిరోజూ వేసుకుంటున్నారు. అయితే ఏ చిన్నపాటి పని చేసినా ఆమె అలసిపోతున్నది. బాగా చెమటలు వస్తుంటాయి. మా బంధువు ఒకరికి ఇటీవల గుండెపోటు వచ్చింది. ఆమె కూడా బీపీ.. షుగర్ పేషెంటే. మాకు భయంగా ఉంది. మా అమ్మగారి అలసటకు కారణమేంటి? గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా? ముందుగానే పసిగట్టడం ఎలా? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలుపగలరు.
- సీహెచ్. సుధాకర్, మేడ్చల్

Councelling
సుధాకర్‌గారూ.. మీ అమ్మగారికి ఉన్న ఆరోగ్య సమస్య ప్రమాదకరమైనదే. అలా అని బాధపడుతూ ఉంటే పరిష్కారం కాదు. బీపీ.. షుగర్ ఉందన్నారు. కానీ వాటి స్థాయి ఎంత? వాడుతున్న టాబ్లెట్లు ఏంటి? వంటి విషయాలు తెలియజేయలేదు. ఇక మీరు తెలిపిన లక్షణాలను పరిశీలిస్తే.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మధుమేహం ఉన్నవారికి హార్ట్‌ఎటాక్ వస్తుందా? అనేది మీ ప్రధాన సందేహం అనే విషయం స్పష్టమవుతున్నది. అయితే సాధారణ వ్యక్తికన్నా మధుమేహం ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదం 3 నుంచి 7 రెట్లు పెరుగుతుంది. బీపీ.. షుగర్ రెండూ ఉంటే 7-8 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఊబకాయం ఉంటే మాత్రం 6-7 సంవత్సరాల జీవనకాలం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇక గుండెపోటును ఎలా గుర్తించాలి అన్నారు కదా? గుండెలో నొప్పి వస్తేనే గుండెపోటు ప్రమాదం ఉన్నట్లు కాదు. కొందరికి ఎలాంటి నొప్పి రాకున్నా గుండెపోటు వస్తుంది. దానికి బదులు ఆయాసం వస్తుంది. ఏ చిన్న పనిచేసినా త్వరగా అలసిపోతారు. కడుపులో మంటగా ఉంటుంది. మెడనొప్పి.. దవడనొప్పి.. వెన్నులో నొప్పిగా ఉంటుంది. మేం పరిశీలించిన అంశాలను బట్టి చెప్పేదేంటంటే.. మహిళలు గుండె సంబంధిత సమస్యలను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలస్యం చేసి ఆఖరి సమయంలో హాస్పిటల్స్‌కు రావడం వల్ల ప్రాణాలను రక్షించుకోలేకపోతున్నారు. మీరు ఆ పొరపాటు చేయకండి. వెంటనే ఈసీజీ పరీక్ష చేయించండి. మరింత స్పష్టత కోసం 2డీ ఎకో కార్డియోగ్రామ్ చేయించండి. దీనివల్ల గుండెపోటును.. గుండె ఎంతమేర దెబ్బతిన్నది అనే విషయాన్ని.. కవాటాల పరిస్థితి.. గుండె పంపింగ్ తీరును అంచనా వేయవచ్చు. తప్పకుండా చేయించాల్సిన మరో పరీక్ష.. ట్రెడ్‌మిల్. దీనిద్వారా గుండె పరిస్థితిని అంచనా వేస్తారు. దీంతోపాటు లిపిడ్ ప్రొఫైల్.. యాంజియోగ్రామ్ పరీక్షలు చేయించాలి. మధుమేహం ఉన్నవారిలో హార్ట్‌ఎటాక్ సైలెంట్‌గా వచ్చే ప్రమాదం ఉంది. యాంజియోగ్రామ్ పరీక్ష చేయడం వల్ల రక్తనాళాల్లో ఎంతమేర అవరోధం ఉంది? గుండెకు ఉన్న ప్రమాదమేంటో నిర్ధారణ చేస్తారు. కాబట్టి మీరు వెంటనే మీ అమ్మగారికి ఈ పరీక్షలన్నీ చేయించండి. పౌష్టికాహారాన్ని ఇవ్వండి. ఉప్పు తక్కువగా తినాలి. నూనెలు తగ్గించాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి.

డాక్టర్ ఓ.ఆదికేశవ నాయుడు
కార్డియో ఎక్స్‌పర్ట్
ఉస్మానియా హాస్పిటల్,
హైదరాబాద్

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles