అమ్మపాలు.. ఓ ఆరోగ్య జీవితం!


Tue,August 7, 2018 01:33 AM

baby2
తల్లిపాలు పౌష్టిక విలువలే కాదు.. బంధాన్ని బలపరిచి.. తన్మయత్వం.. వాత్సల్యాలనూ ప్రతిబింబిస్తాయి! కానీ నేటితరం తల్లులు బిడ్డలకు పాలిస్తున్నారా? పాలివ్వడం వల్ల అందం తగ్గుతుందనేది నిజమా? అమ్మపాల అమృతం గురించి అవగాహన కల్పించేందుకు నిన్నటివరకు వారం రోజులుగా కార్యక్రమాలు జరిగాయి. తల్లిపాల వారోత్సవాల ద్వారా మనమేం నేర్చుకున్నాం? అమ్మపాలామృతం ప్రాముఖ్యమేంటి తదితర విషయాల గురించి ఆరోగ్యవంతమైన కథనం!


తల్లిపాలు.. సమర్థవంతమైన జీవితానికి పునాది. ఆరోగ్యకరమైన జీవితానికి తొలిమెట్టు. ఈ పోటీ ప్రపంచంలో మీ పిల్లలు అన్ని రంగాల్లో విజేతలుగా నిలవాలనుకుంటున్నారా? ఆటపాటల్లో చురుగ్గా రాణించాలనుకుంటున్నారా? గుండె, శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడాలనుకుంటున్నారా? అలర్జీ, అజీర్తిలాంటి సమస్యలతో బాధపడకూడదనుకుంటున్నారా? క్యాన్సర్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? పళ్లు పుచ్చిపోవడం, చెవిలో చీము కారడం లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలనుకుంటున్నారా? పుట్టిన వెంటనే పసరికలు రాకుండా ఉండాలనుకుంటున్నారా? వీటన్నింటికీ సమాధానం ఒక్క తల్లిపాలు మాత్రమే.


మొదటి గంటలో ఇద్దరు మాత్రమే

మాతృత్వం ఒక వరం. గర్భం ధరించినప్పటి నుంచి పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో కలలు కంటాం. వారి భవిష్యత్ గురించి మరెన్నో ప్రణాళికలు వేసుకుంటాం. కానీ నిజంగా సరైన పునాదిని అందిస్తున్నామా? లేదా అన్నది ప్రశ్నార్థకమే. తల్లిపాలు సమర్థవంతమైన సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితానికి పునాది. వాస్తవంగా మన దేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ప్రకారం.. బిడ్డ పుట్టిన గంటలోపు కేవలం 41.6శాతం పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇవ్వాలి. అంటే పుట్టిన ఐదుగురు నవజాత శిశువులలో ఇద్దరికి మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు ఇస్తున్నారు. ఈ సర్వే ప్రకారం చూస్తే మన దేశం తల్లిపాల విషయంలో చాలా వెనకబడింది. రాష్ట్రంలో తీసుకుంటే 67.3% తల్లులు మాత్రమే మొదటి 6 నెలలు తల్లిపాలు ఇస్తున్నారు. దీనిని 2025 నాటికి కనీసం 75 శాతంకి తీసుకెళ్లాల్సిందిగా ఎన్‌ఎఫ్‌హెచ్-4 గణాంకాల ఆధారంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది.


పదిమంది శిశువులలో ఒక్కరికి

మొదటి 6 నెలలు పూర్తికాలం తల్లిపాలు ఇస్తున్నవారు కేవలం 54.9% ఉన్నారు. అంటే ప్రతీ ఇద్దరు తల్లుల్లో ఒకరు మాత్రమే తన బిడ్డకు పూర్తి 6 నెలల కాలం తల్లిపాలు మాత్రం ఇస్తున్నారు. ప్రతి 10 మంది శిశువులలో ఒక్కరికి మాత్రమే 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు సరైన అదనపు ఆహారం లభిస్తున్నది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశం చాలా వెనకబడి ఉంది.

breastfeeding

తల్లిపాల ప్రాముఖ్యం

తల్లిపాలు లేకుంటే సృష్టి పరిణామ క్రమంలో మానవ మనుగడ ఆగిపోయేదేమో అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తల్లిపాల వల్ల తల్లిబిడ్డలు ఇద్దరికీ ప్రయోజనమే. బిడ్డకు ప్రయోజనాలు: మొదటగా వచ్చే ముర్రుపాలు మొట్టమొదటి వ్యాక్సిన్ లాంటిది. ఈ పాలను కచ్చితంగా బిడ్డకు పట్టాల్సిందే. అస్సలు పారబోయ కూడదు. తల్లిపాలలో సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్లతో పాటు బిడ్డకు కావాల్సిన కొవ్వులు, పిండి పదార్థాలు, అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఎటువంటి ఇతర ఆహార పదార్థం కానీ, నీళ్లు కాని ఇవ్వాల్సిన అవసరం లేదు.


10 శాతం తెలివితేటలు

పోతపాలు తాగిన పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగిన పిల్లలకు 6-10% తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తల్లిపాలు తాగుతున్న పిల్లలకు డయేరియా, వాంతులు, ఛాతీ, చెవి సంబంధిత ఇన్‌ఫెక్షన్లు కూడా రావు. పాలు ఇచ్చే సమయంలో నిరంతర తల్లిబిడ్డ స్పర్శ బిడ్డ మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది. వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఎంతో తోడ్పాటునందిస్తుంది.


అతిపెద్ద వ్యాక్సిన్

తల్లిపాలు తాగిన పిల్లలకు స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తల్లిపాలు ఆకలిని తీర్చే ఆహారం మాత్రమే కాదు.. ఎదుగుదలకు ఉపయోగపడి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే అతిపెద్ద వ్యాక్సిన్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే తల్లిపాలు మనిషి సమర్థవంతమైన జీవితానికి మంచి పునాది అవుతుంది.

Mother-Daughter

ఎన్నిసార్లు ఇవ్వాలి?

ఏడ్చినప్పుడు మాత్రమే పాలు ఇవ్వాలనుకోవడం తప్పు. రోజులో కనీసం 8-12 సార్లు ఖచ్చితంగా పాలు ఇవ్వాలి. అనగా ప్రతి 2-3 గంటలకు ఒకసారి పాలు పట్టాలి. ఒకవేళ అలా తాగకపోతే నిద్రపోతున్నా లేపి మరీ ఇవ్వాలి.


ఎంతసేపు ఇవ్వాలి?

ఒక రొమ్ము నుంచి కనీసం 10-15 నిమిషాలు ఇవ్వాలి. ఒక రొమ్ము పూర్తయిన తర్వాత ఇంకొక రొమ్ముకు మార్చాలి. రాత్రుల్లో పాలు ఇవ్వడం చాలా ప్రధానం. దాని ద్వారా మాత్రమే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ రాత్రి సమయంలో ఎక్కువ విడుదలై పాల ఉత్పత్తిని పెంచుతుంది.


సరిపోతున్నాయా?

పాలు ఇవ్వడం వల్ల మొదటి పది రోజులు మినహా.. శిశువు ప్రతిరోజూ 20-25 గా॥ బరువు పెరుగుతారు. 6-8 సార్లు మూత్రం పోస్తారు. పాలు తాగిన తర్వాత 2-3 గంటలు ప్రశాంతంగా నిద్రపోతారు. అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. ఈ సమయంలో నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలలు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు మంచి పోషక విలువలు కలిగిన అదనపు ఆహారం ఇవ్వాలి.

Bottle-Milk
పోతపాలు ఎప్పుడివ్వాలి?కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అదికూడా డాక్టర్‌ను సంప్రదించిన తరువాతనే పోతపాలు ఇవ్వాలి. బాటిళ్ల ద్వారా పాలు ఇవ్వడం చాలా ప్రమాదకరమైంది. అది అనేక రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టడంతోపాటు పిల్లల ఎదుగుదలను కుంటుపరుస్తుంది.


తల్లిపాల సంస్కృతి

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ఆరోగ్యం, ఆహార భద్రత, విద్యాభ్యాసం, సమానత్వం, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ సాధించడంలో తల్లిపాల సంస్కృతి చాలా కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక పరిశోధనల్లో తేలింది. పిల్లల బంగారు భవిష్యత్తుకై ఉపయోగపడే విశిష్ట పోషకాలు ఉన్న తల్లిపాలను బిడ్డ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగించడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ తల్లులకు సహకరించాలి.
Breast Feeding Foundation of Life..
Breast Feeding Nourishment of Life.

baby

ప్రయోజనాలు

తల్లిపాల వల్ల బిడ్డకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తల్లికి కూడా అన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ప్రసవం జరిగిన వెంటనే జరిగే రక్తస్రావాన్ని అరికట్టడంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడంలో తల్లిపాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనం వెలకట్టలేనిది. గర్భం దాల్చిన సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతాయి. పాలివ్వడం మూలంగా రొమ్ము బిగుతు పొతుందనే విపరీత ధోరణి కొంతమంది ఆధునిక స్త్రీలలో కనబడుతూ ఉంది. ఇలా ఆలోచించడం సరికాదు.


డా॥ జి.సురేంద్రబాబు ఎండీ పీడియాట్రిక్స్
కన్సల్టెంట్ పీడియాట్రిషన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల

149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles