అమ్మకాల జోరు


Sat,August 4, 2018 01:48 AM

భారత రియల్ రంగంలో 25 శాతం వృద్ధి
జేఎల్‌ఎల్, కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదికలో వెల్లడి

Mak

బెర్లిన్ నుంచి కింగ్ జాన్సన్ కొయ్యడ

భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదని జోన్స్ లాంగ్ లసాల్, కుష్‌మన్ వేక్‌ఫీల్డ్‌లు కలిసి సంయుక్తంగా బెర్లిన్‌లో వెల్లడించాయి. శుక్రవారం ఉదయం జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఇంటర్ కాంటినెంటెల్ హోటల్‌లో జరిగిన క్రెడాయ్ నాట్‌కాన్- 18 సదస్సులో రెండు సంస్థలు తమ తాజా నివేదికలను విడుదల చేశాయి.

2018 ప్రథమార్థంలో భారతదేశంలోని ఏడు నగరాల్లో ఇరవై ఐదు శాతం అమ్మకాలు పెరిగాయని జోన్స్ లాంగ్ లసాల్ తాజా నివేదికలో వెల్లడించింది. 2018 ప్రథమార్థంలో దాదాపు 64 వేల ఇండ్లను విక్రయించిందని..గతేడాది మాత్రం ఇదే సమయానికి 51 వేల ఇండ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఇప్పటివరకూ సొంతిండ్లను కొనకుండా వాయిదా వేసినవారంతా మళ్లీ ఇండ్లను కొనుక్కోవడానికి ముందుకొస్తున్నారని పేర్కొంది. రెరా రాకతో కొనుగోలుదారుల్లో సరికొత్త విశ్వాసం నెలకొన్నదని, ఆర్‌బీఐ మూడో ద్రవ్య పరపతి విధానంలో రెపో రేటును పెంచడమే ప్రధాన కారణంగా విశ్లేషించింది. ప్రస్తుతం డెవలపర్లు వాస్తవిక ధర చొప్పున ఇండ్లను అమ్మడం మొదలెట్టారని నివేదికలో తెలిపింది.

పెరిగిన విదేశీ నిధులు..

2018 ద్వితీయార్థంలో భారత్‌లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరిగిందని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ ఇండియా ఎండీ అన్షుల్ జైన్ తెలిపారు. ఆఫీస్ స్పేస్ మార్కెట్‌తో సమానంగా నివాస సముదాయాల్లోనూ విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆఫీసు స్పేస్‌లో పెట్టుబడులను గుమ్మరిస్తే.. అదే మొత్తంలో రెసిడెన్షియల్ విభాగంలోకి పెట్టుబడులొచ్చాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య సముదాయాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం దాకా అభివృద్ధిని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

-2021 నాటికి భారత రియల్ రంగంలోకి కొత్తగా ఐదు వందల మిలియన్ల చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో కొత్త ఆఫీసు, రిటైల్, వేర్ హౌసింగ్, నివాస సముదాయాలు విచ్చేస్తాయని క్రెడాయ్- సీబీఆర్‌ఈ విడుదల చేసిన మరో నివేదిక వెల్లడించింది. సానుకూల దృక్పథం, విప్లవాత్మక నిర్ణయాల్ని కేంద్రం తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా అభివర్ణించింది. హైదరాబాద్‌లో ఎనభై శాతానికి పైగా లీజింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించింది. 2015లో భారత లాజిస్టిక్ విభాగంలో 10 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య సముదాయానికి గిరాకీ ఉంటే..2018 ప్రథమార్థంలో ఈ అంకెకు చేరుకోవడం అభివృద్ధికి నిదర్శన్నమని తెలియజేసింది.

జీఎస్టీలో తగ్గించాలి..

రెరా వల్ల క్రమశిక్షణ అలవడిందని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలని భావించేవారు.. కొంతకాలం నుంచి నిర్మాణాలు చేపట్టేవారే.. రియల్ రంగంలో నిలుస్తారని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సేషా అభిప్రాయపడ్డారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో భూముల ధరలు అధికంగా ఉంటాయని, అందుకే జీఎస్టీలో అరవై శాతం వరకూ తగ్గింపునివ్వాలని కోరారు. భారత ప్రభుత్వం ప్రప్రథమంగా పట్టణాభివృద్ధిపై అధిక ప్రాధాన్యతనిస్తున్నదని పేరెన్నిక గల ఆర్కిటెక్ట్ హఫీజ్ కంట్రాక్టర్ తెలిపారు. నగరాలను కొత్త తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికల్ని రచించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, దాని ప్రభావం అర్థమవ్వడానికి కనీసం ఇరవై ఐదు ఏండ్లు పడుతుందన్నారు. అందుకే, నగరాభివృద్ధిని భవిష్యత్తు తరాలకు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దాలని తెలిపారు. భారత్‌లో వాణిజ్య రియల్ రంగం అభివృద్ధి చెందుతున్నదని క్రెడాయ్ అధ్యక్షుడు (ఎన్నిక) సంతోష్ మగర్ తెలిపారు. ల్యాండ్ టైటిల్ ఇన్సూరెన్స్, ఐదేండ్ల వరకూ నిర్వహణ బాధ్యతలు వంటి అంశాలు రెరాలో ఉండటం వల్ల ఇండ్ల ధరలు పెరుగుతాయని చెప్పారు.

హైదరాబాద్‌లో 182 శాతం వృద్ధి

హైదరాబాద్‌లో 2017 ప్రథమార్థంలో 1,941 ఇండ్లు అమ్ముడైతే.. 2018 ప్రథమార్థంలో 5,476 ఇండ్లను విక్రయించింది.అంటే, దాదాపు 182 శాతం అభివృద్ధి నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోని టిష్మన్ స్పయర్స్ ఐటీ సముదాయాన్ని కొనుగోలు చేయడానికి అమెరికాకు చెందిన ఓ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. అతిత్వరలో ఈ డీల్‌కు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తాం.
- రమేష్ నాయర్, కంట్రీ హెడ్, జేఎల్‌ఎల్

4 కోట్ల ఇండ్లకు గిరాకీ..

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం నాలుగు కోట్ల ఇండ్లకు గిరాకీ ఉంది. ఒక్కో ఇంటిని కనీసం రూ.5 లక్షల ఖర్చుతో నిర్మించినా.. ఇరవై లక్షల కోట్ల వ్యాపారానికి అవకాశాలున్నాయి. వీరిలో పదహారు శాతం మందిని తీసుకుంటే.. దాదాపు 150 బిలియన్ డాలర్లకు రుణాల్ని మంజూరు చేయాలి. ఒక్కో ఇంట్లో ఒక్కో కిచెన్ సింక్, వాష్ బేసిన్‌ను అమరిస్తే.. దాదాపు 8 కోట్ల కిచెన్ సింకులు, వాష్‌బేసిన్లు అవసరమవుతాయి. ప్రతి ఇంట్లో మూడు నల్లాలు కావాలి. అంటే, 12 కోట్ల నల్లాలకు గిరాకీ ఉంటుంది. ఇక బల్బులైతే 28 కోట్ల దాకా కావాలి. ఇలా చెప్పుకుపోతే, రియల్ రంగానికి రానున్న రోజుల్లో మంచి గిరాకీ ఉందనే విషయం అర్థమవుతుంది.
- గీతాంబర్ ఆనంద్, జనరల్ సెక్రెటరీ, క్రెడాయ్ నేషనల్

13 శాతం వాటా

ప్రస్తుతం సిసలైన ఇండ్ల కొనుగోలుదారులదే మార్కెట్లో హవా. ఈ విభాగంలోకి పెట్టుబడిదారులు అడుగుపెడితే ధరలు అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రియల్ రంగం సానుకూల దృక్పథంతో ముందుకెళుతున్నది. 2025 నాటికి భారత రియల్ రంగం 1.7 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం నుంచి 13 శాతం వాటా లభించే అవకాశముంది.
-అంశుమన్ మ్యాగజీన్, సీఎండీ, సీబీఆర్‌ఈ

360
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles