అన్నం ఉంటే ప్రేమున్నట్టే!


Tue,July 18, 2017 12:37 AM

రోడ్డుపక్కన అనాథ శవం కనిపిస్తే చాలు.. ఆ శవానికి అన్నీ తానే అయి అంత్యక్రియలు చేస్తాడు..రోడ్డు మీద ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తులు కనిపిస్తే వారిని తీసుకెళ్లి తండ్రిలా, అన్నలా, కొడుకులా సపర్యలు చేస్తాడు.. జీవితమంతా సేవకే అంకితం చేసిన ఆ మానవతామూర్తి పేరు అన్నం శ్రీనివాసరావు. మమతకు, మంచితనానికి చిరునామా అయిన ఆయన కథ చదువాల్సిందే..తల్లి గర్భం నుంచి నేనేమీ తెచ్చుకోలేదు. కులం, మతం, ఆస్తిపాస్తులు లాంటివేవీ నాకు తెలియదు. పోయేటప్పుడు నేనేమీ తీస్కపోను అనే విషయాలు తెలుసుకొని సేవే మార్గంగా గడిపితే.. జీవితానిక ఓ అర్థం ఉంటుంది. జీవితాంతం అనాథలతోనే జీవిస్తా. నేను చనిపోయిన తర్వాత కూడా నా కళ్లు, ఇతర అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నా. అలా నేను మళ్లీ బతికే అవకాశం ఉంది అంటూ సమాజ సేవే పరమావధిగా తరిస్తున్నాడు అన్నం శ్రీనివాసరావు. కన్న తల్లిండ్రులనే సాదలేని ఈరోజుల్లో ముక్కూమొహం తెలియని ఎంతోమందిని చేరదీస్తుడు శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, పక్క రాష్ర్టాలకు చెందిన వారికి కూడా తన ఆశ్రమంలో సేవలందిస్తున్నాడు. వందలమంది అభాగ్యులకు అంత్యక్రియలు చేసి మనసున్న మంచి మనిషిగా నిరూపించుకుంటున్నాడు.
srinivas

చినప్పటి నుంచే :

శ్రీనివాసరావుది మహబూబాబాద్ జిల్లా సమీపంలోని గార్ల మండలం పొన్నగంటితండా. సౌభాగ్యమ్మ, రామయ్య దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కున్నాడు. పూటగడువని పరిస్థితిలో కూడా పక్కవారికి సేవ చేయాలనే ఆలోచన ఆయనలో చిన్నప్పటి నుంచే ఉండేది. చదువును వదులుకోవడం ఇష్టంలేక 1969లో ఐతపు మంగపతిరావు నిర్వహణలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో చేరాడు. ఆ సమయంలో ఏటిలో కొట్టుకుపోతున్న తోటి విద్యార్థిని ప్రాణాలకు తెగించి కాపాడడం ఆయన సాహసం, సేవా తత్పరతను చాటిచెప్తున్నది. ఇప్పటివరకు 500 మందికి పైగా అంత్యక్రియలు చేశారాయన. ఇంటి నుంచి తప్పిపోయిన వారిని తిరిగి సొంతవారి దగ్గరికి చేర్చడం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడం, మతిస్థిమితం లేనివారిని చేరదీసి సొంతమనిషిలా వారి బాగోగులు చూసుకుంటూ వైద్యం చేయించడం వంటి పనులు ఆయన నిత్యకృత్యాలు.

అన్నీ అవస్థలే:

పదో తరగతి వరకు చదువుకున్న శ్రీనివాసరావు ఇల్లు గడువడం కోసం ఓ ఆసామి వద్ద కూలిపనికి కుదిరాడు. పేదరికం నుంచి గట్టెక్కేందుకు తల్లితో కలిసి ఊరూరు తిరిగి దుస్తులమ్మే వ్యాపారం చేశాడు. బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ పేపర్‌మిల్లు నిర్మాణ పనుల్లో, బెంగుళూరు పెంకుల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేశాడు. అడవికెళ్లి కట్టెలు తెచ్చి ఊరూరు తిరిగి అమ్మి పొట్టపోసుకునేవారు శ్రీనివాసరావు కుటుంబం. తర్వాత కొంతకాలానికి 1978-79 లో టెలికాం శాఖలో రోజువారీ వేతన కూలీగా చేరాడు. ప్రస్తుతం నెలకు రూ.60 వేల వేతనం పొందుతున్నాడు.

విధుల్లోనూ సేవాధర్మమే :

1981లో టెలిఫోన్ లైన్‌మెన్‌గా ట్రెనింగ్ తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ పరిధిలో అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు ఏరికోరి పోస్టింగ్ వేయించుకున్నాడు. బాహ్య ప్రపంచంతో సంబంధాలే లేని ఆ ఎక్స్‌చేంజ్ పరిధిలో టెలీఫోన్ సౌకర్యాన్ని మెరుగుపరిచి అధికారుల చేత శభాష్ అనిపించుకున్నాడు. 1982లో నేలకొండపల్లికి బదిలీ పై వచ్చాడు. ఆ ప్రాంతంలో విష కీటకాల కాటుకు గురై ఎవరైనా ప్రాణాపాయంతో వస్తే టెలిఫోన్ రింగింగ్ కరెంట్‌తో వారికి క్షణాల్లో సాంత్వన కలిగించి కాపాడాడు. సమాచార వ్యవస్థ అంతగా లేని నాటి రోజుల్లోనే కుటుంబ సభ్యుల మరణాన్ని బంధువులకు చేరవేసి ఎందరికో చివరిచూపు దక్కేలా చేశాడు. ఓవైపు వృత్తి ధర్మం, మరోవైపు కుటుంబం, ఇంకోవైపు సేవాగుణంతో అందరిచేత మనసున్న మంచోడు అనిపించుకుంటున్నాడు.

ఆశ్రమం.. ఆశ్రయం :

అనాథలు, మానసిక దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఖమ్మం సమీపంలోని దానవాయిగూడెం కాలనీలో ఆశ్రమం ఏర్పాటు చేశారాయన. ఆశ్రమం ఏర్పాటుకు ముందు ఎన్నో ఆశ్రమాలను ఆశ్రయించినా తను ఆదరించిన వారిని తమ ఆశ్రమంలో చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో తన ఇంట్లోనే అనాథలకు ఆశ్రయం కల్పించి సేవలందించాడు. ప్రస్తుతం 75 మందికి నీడనిస్తున్నారు. నెలకు రూ. 8 వేలు చెల్లిస్తూ అద్దెభవనంలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. మానసిక వికలాంగులకు ఆశ్రమం కల్పిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఉన్నవాటితోనే సేవ చేస్తున్నాడు శ్రీనివాసరావు.

దాతలు వస్తున్నా :

ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో చూసి మానవతాదృక్పథంతో పలువురు స్వచ్ఛందంగా ఆశ్రమానికి నిధులిస్తున్నారు. కడవెండి వేణుగోపాల్, గంధం పట్టాభిరామారావు, ఆళ్ల సుబ్బలక్ష్మమ్మ, షేక్ నాగుల్‌మీర, ముస్తఫా, పోతుగంటి వెంకటేశ్వర్లు, అంబరీశ్ శర్శ తదితరులు సేవా కార్యక్రమాల్లో శ్రీనివాసరావుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సైతం 50 వేలు వితరణ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐ వాసవి క్లబ్ వారు పదినెలలుగా ఆశ్రమం అద్దె చెల్లిస్తున్నారు. అన్నం ఆశ్రమానికి దాన ధర్మాలు చేయదలచిన వారు.. 94910 88522, 93900 24108 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.
srinivas1

అవార్డులు-రివార్డులు..


అన్నం శ్రీనివాసరావు సేవలను గుర్తించి అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ అనే ఫారిన్ సంస్థ ఇంటర్నేషనల్ మాన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు ప్రదానం చేసింది. స్టేట్ బీసీ ఫ్రంట్ జ్యోతిరావు పూలే అవార్డునందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ తెలంగాణ రత్న అవార్డుతో పాటు జాతీయ ఉత్తమ పౌరుడు బిరుదునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర తొలి, ద్వితీయ అవిర్భావ వేడుకల సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అబ్దుల్‌కలాం అవార్డు అందుకున్నాడు. సర్ సీవీ రామన్ అకాడమీ మదర్‌థెరిస్సా ఎక్సలెన్సీ అవార్డుతో శ్రీనివాసరావు సేవలను కొనియాడింది. హ్యూమన్ ఎక్స్‌లెన్సీ అవార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచేత అందుకున్నాడు.

వివిధ హోదాల్లో..


అన్నం శ్రీనివాసరావు వివిధ సంస్థల్లో గౌరవ సభ్యులుగా సేవలందిస్తున్నాడు. ఖమ్మం జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీలో స్పెషల్ స్కీమ్స్ మెంబర్‌గా ఉన్నాడు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో జీవితకాల సభ్యులుగా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్‌లోని ఖమ్మం ప్లాటినం క్లబ్ ఉపాధ్యక్షులుగా ఉన్నాడు. జిల్లా ఎస్సీ, ఎస్టీ అథారటీ కేసెస్ విజిలెన్స్ అండ్‌మానటరింగ్ కమిటీ సభ్యులుగా కలెక్టర్ చేత నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా కారాగారం ఖైదీల ప్రేరక్‌గా పనిచేస్తున్నాడు.

సేవలోనే సంతృప్తి..


సమాజంలో ఎంతోమంది అనాథలు, మతిస్థిమితం లేనివారిని చేరదీసి వారికి సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది. నా సేవలను విస్తృతం చేయాలని ఉంది. ఆశ్రమానికి సొంత భవనం లేదు. ప్రభుత్వం దయతో ఆశ్రమానికి స్థలం కేటాయిస్తే జిల్లా వ్యాప్తంగా సేవలందించడానికి సిద్ధం. ప్రస్తుతానికి దాతల సహాయంతోనే ఆశ్రమాన్ని నడిపిస్తున్నా.
డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, అన్నం ఫౌండేషన్ చైర్మన్

506
Tags

More News

VIRAL NEWS