అద్భుత జంతులోకం.. నాగర్‌హోల్ పార్క్


Thu,December 13, 2018 11:22 PM

అదోక జంతుప్రపంచం..అవును ప్రపంచమే.. ఎందుకంటే ప్రపంచంలోని జంతుజాలమంతా అక్కడే కనిపిస్తుంది. మరెక్కడా లేని విధంగా ఎన్నెన్నో అరుదైన జంతువులు, పక్షులు, సరీసృపాలు, వృక్షాలు ఇలా ఎన్నో అక్కడ మనుగడ సాగిస్తున్నాయి. వీటన్నింటినీ చూడాలంటే మాత్రం కర్నాటకలోని నాగర్‌హోల్ నేషనల్ పార్క్‌కు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్‌గా గుర్తింపు పొందిన ఈ పార్కుకు ఏటా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటున్నది. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను సైతం ఈ పార్క్ అమితంగా ఆకట్టుకుంటున్నది. పర్యాటకుల సందర్శనకోసం అటవీశాఖ ప్రత్యేక సఫారీలు కూడా ఏర్పాటు చేసింది. పలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి జీవజాలంపై ఎన్నో పరిశోధనలు చేపట్టాయి. అలాంటి అరుదైన జాతీయవనాన్ని జీవితంలో ఒక్కసారైన చూసి తీరాల్సిందే.
bandipur
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్‌గా పేరున్న నాగర్‌హోల్ నేషనల్ పార్క్‌ను రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్‌గా పిలుస్తారు. కర్నాటకలోని మైసూర్ నగరానికి 94 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం కొడగు జిల్లా నుండి మైసూర్ జిల్లా వరకు వ్యాపించి ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్‌కు వాయవ్యంగా ఉన్న నాగర్ హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్‌కు మధ్యన కబినీ రిజర్వాయర్ ఉంది. ఇదీ ఈ రెండు పార్కులనీ విడదీస్తుంది. మాజీ మైసూర్ పాలకులు దీనిని ప్రత్యేకమైన పరిరక్షిత వేట ప్రాంతం (హంటింగ్ రిజర్వ్) గా ఉపయోగించేవారు. దట్టమైన చెట్లతో కప్పబడిన ఈ అటవీ ప్రాంతంలో చిన్న వాగులూ, లోయలూ, జలపాతాలూ దర్శనమిస్తాయి. కర్నాటక రాష్ట్రంలోని వన్యప్రాణులను సంరక్షిస్తోన్న ఈ పార్క్ 643 చ.కి.మీ. మేర వ్యాపించి ఉన్నది. బందీపూర్ నేషనల్ పార్క్ 870 చ.కి.మీ. మదుమలై నేషనల్ పార్క్ 320 చ.కి.మీ. వాయనాడ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 344 చ.కి.మీ. తో కలిపి మొత్తం 2183 చ.కి.మీ. మేర వ్యాపించి ఉన్న ఈ స్థలం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ స్థలం.


పేరేలా వచ్చిందంటే...

నాగ అంటే పాము, హొలె అంటే వాగు అన్న రెండు పదాల నుండి నాగర్‌హోల్ అన్న పదం పుట్టింది. 1955లో స్థాపితమై ఈ పార్క్ దేశంలో అత్యుత్తమంగా నిర్వహిస్తున్న పార్కులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి వాతావరణం ఉష్ణంగా ఉండి, వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాఘ్ర-క్రూరమృగాలు సరైన నిష్పత్తిలో ఉన్న ఈ పార్కులో బందిపూర్ కంటే పులి, అడవిదున్న, ఏనుగుల సంఖ్య అధికంగా ఉంటుంది. నీలగిరి బయోస్ఫియర్ (జీవావరణం) రిజర్వ్‌లో ఈ పార్క్ ఒక భాగం. పడమటి కనుమలు, నీలగిరి సబ్ క్లస్టర్ (6,000 చ.కి.మీ.), నాగర్‌హోల్ నేషనల్ పార్క్ - ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదం పొందడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ పరిగణనలో ఉన్నాయి.


collage

వైవిధ్య జంతుజాలం

నాగర్‌హోల్‌లో ఏనుగుల సంఖ్య ఎక్కువ. పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు అధికంగా కనిపిస్తాయి. అడవిదున్న, సాంబార్ జింక, చీతల్ (మచ్చలున్న జింక), కామన్ మున్‌జాక్ జింక, నాలుగు కొమ్ముల జింక, మౌజ్ జింక, వైల్ బోర్ (అడవి పంది) లాంటి గిట్టలున్న జంతువుల మీద పెద్ద క్రూరమృగాలు ఆహారం కోసం ఆధారపడతాయి. గ్రే లంగూర్స్, లయన్ టేల్ మకాక్స్, బోన్నెట్ మకాక్స్ ఈ పార్క్‌లోని ఆదిమ జాతులుగా చెప్పవచ్చు. పార్క్ బయట, చుట్టూ వ్యాపించి ఉన్న కొండలలో నీలగిరి టార్స్, నీలగిరి లంగూర్స్ కనపడతాయి. దక్షిణ భాగాన ఉండే ఉష్ణం, తేమతో కూడిన మిశ్రమమైన డెసిడ్యూస్ అడవుల నుండి, తూర్పు భాగాన ఉండే బురదతో కూడిన కొండ లోయ అడవుల వరకు చాలా భిన్నంగా ఉంటాయి.


అరుదైన వృక్షజాతులు

ప్రపంచంలో మరెక్కడ లేనివిధంగా ఈ అరణ్యంలో వైవిద్యంతో కూడిన అరుదైన వృక్షజాతులు కనిపిస్తాయి. లాజస్ట్రోమియా మైక్రోకార్పా, అదీనా కొర్డిఫోలియా, బొంబాక్స్ మలబార్సియం, స్కీషేరా ట్రైజూగా, ఫైకస్ జాతికి చెందిన వృక్షాలు కనిపిస్తాయి. ఇంకా టేర్మినాలియా టర్మెన్టోసా, టెక్టోనా గ్రాండిస్, లాజస్ట్రోమియా లాన్సివొలాటా, టేరోకార్పస్ మార్సపియం, గ్రూవియా తిలేఫోలియా, దళ్బెర్జియా లాతిఫోరియా వంటి వృక్షాలు, కైడియా కాలిసినా, ఎంబికా అఫీషినాలిస్,గ్మేలీనార్బోరియా. సోలానం, డేస్మోడియం, హెలిక్టర్స్ అతిగా వృద్ది చెందు లాంటానా కామరా, యూపటోరియం లాంటి పొదలు అధికంగా కనిపిస్తాయి. ఎర్రకలప, టేకు వృక్షాలే కాక, వాణిజ్యపరంగా ముఖ్యమైన వృక్ష జాతులు, గంధం, సిల్వర్ ఓక్ కూడా కనపడతాయి.


dears

వందలాది పక్షులు

పక్షుల విహంగ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్క్‌లో 270 జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి. వీటిలో శీఘ్రంగా అంతరించిపోతున్న జాతులకి చెందిన ఓరియంటల్ వైట్ బాక్డ్ వల్చర్ (రాబందు జాతి), వల్నరబుల్ లెస్సర్ అడ్జూటంట్ (బెగ్గురు కొంగ జాతి), గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ (గద్ద జాతి), నీలగిరి వుడ్ పిజియన్ (పావురం జాతి) వంటి పక్షులు ఉన్నాయి. దాదాపుగా ఆపదకి గురయ్యే జాతుల్లో డార్టర్స్ (కొంగ జాతి), ఓరియంటల్ వైట్ ఐబిస్ (కొంగ జాతి), గ్రేటర్ గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ (గద్ద జాతి), రెడ్ హెడెడ్ వల్చర్ (రాబందు జాతి) వంటి పక్షులు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. స్థల విశిష్టమైన జాతుల్లో బ్లూ వింగ్డ్ పారాకీట్ (చిలుక జాతి), మలబార్ గ్రే హార్న్ బిల్ (వడ్రంగి పిట్ట జాతి), వైట్ బెల్లీడ్ ట్రీపై (కాకిజాతి) వంటి ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇక్కడ కనపడే కొన్ని పక్షుల్లో వైట్ చీక్డ్ బార్బెట్, ఇండియన్ స్కైమైటార్ బాబ్లర్ ఉన్నాయి. పొడి ప్రదేశాలలో సాధారణంగా కనపడే పేయింటెడ్ బుష్ క్వైల్ (కొలంకి పిట్ట), సర్కీర్ మల్ఖొవా, ఆషి ప్రైనియా (పిచ్చుక జాతి), ఇండియన్ రాబిన్ (పాలపిట్ట జాతి), ఇండియన్ పీఫౌల్ (నెమలి జాతి) యెల్లో లెగ్డ్ గ్రీన్ పిజియన్ (పావురం జాతి) లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.


సరీసృపాలకేం తక్కువ లేదు

సాధారణంగా కనపడే సరీసృపాలలో వైన్ స్నేక్, కామన్ వుల్ఫ్ స్నేక్, రాట్ స్నేక్, బాంబూ పిట్ వైపర్, రసెల్స్ వైపర్ (సెంజెర జాతి), కామన్ క్రైట్ (కట్లపాము జాతి), ఇండియన్ రాక్ పైథాన్ (కొండచిలువ జాతి), ఈందియన్ మానిటర్ లిజార్డ్, కామన్ టోడ్... ఇక్కడ కనిపించే పాము జాతులు. ఈ పార్క్‌లో కీటక జీవ భిన్నత్వంలో 96 జాతులకు చెందిన డంగ్ బీటిల్స్ ( పేడపురుగులు) 60 జాతులకు చెందిన చీమలు కూడా ఉన్నాయి. అసాధారణ జాతులుగా గుర్తించిన చీమలో హార్పెగ్నథొస్ సాల్టేటర్ అనబడే, ఎగిరే చీమలను గుర్తించారు. ఇవి ఒక మీటరు యెత్తున ఎగరగలవు. టెట్రాపోనేరా రూఫోనిగ్ర జాతికి చెందిన చీమలు చెదపురుగులను తిని బతుకుతాయి. చచ్చిన చెట్లు ఉండే ప్రాంతాలలో ఇవి పుష్కలంగా కనిపిస్తా యి. ఏనుగు పేడ మీద మాత్రమే బతికే హీలియోకొప్రిస్ డొమినస్, ఇండియాలోని అతిపెద్ద పేడపురుగు (ఆం థొఫేగస్ డామా) కామన్ డంగ్ బీటిల్, చాలా అరుదుగా కనిపించే ఆంథొఫేగస్ పాక్టోలస్ కూడా ఇక్కడి పేడ పురుగుల జాతుల్లో ఉన్నాయి.


tiger

సఫారీ యాత్ర

నాగర్‌హోల్ సందర్శకుల కోసం బెంగళూరుకి సుమారు 220 కి.మీ. దూరంలో ఉన్న ముర్కల్ అతిథి గృహాలలో పర్యాటకులకు అటవీశాఖ విడిది ఏర్పాటు చేసింది. పార్క్‌లోని కార్యాలయం దగ్గర కూడా వసతి ఉన్నది. అటవీశాఖకు చెందిన వాహనాలలో రోజుకి రెండుసార్లు, అంటే తెల్లవారు ఝామున, సాయం సమయంలో సఫారీ యాత్ర ఏర్పాటుచేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం తరచూ విద్యా శిబిరాలు నిర్వహిస్తారు. ఇంకా అటవీశాఖ పాఠశాల విద్యార్థుల పర్యటన కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుండడం విశేషం. అయితే జంతువుల కలయిక కాలంలో, వర్షాకాలంలో సఫారీ యాత్రలు లేకుండా పార్క్‌ను మూసివేస్తారు. ట్రాఫిక్ కదలికలను పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టడి చేసి అడవికి ఇరువైపులా ఉండే గేట్లని మూసివేస్తారు.

me-with-ele


ఎన్నెన్నో జంతువులు

ఈ పార్కులో ఎన్నో రకాల జంతువులున్నాయి. అతి ముఖ్యమైన జాతులైన పులి, ఇండియన్ బైసన్, గౌర్ (అడవి దున్న), ఏషియన్ ఏనుగులు చాలా పెద్ద మొత్తంలో పార్క్‌లో ఉన్నాయి. ఇంకా పులి, చిరుత అడవికుక్కలు తోడేళ్ళు, బూడిద రంగు ముంగిస, ఎలుగుబంట్లు, చారల సివంగి, మచ్చల జింక లేదా చీతల్, సామ్బర్ జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల జింక , అడివి పందులు కూడా పుష్కలంగా ఉన్నాయి.

ఇతర క్షీరదాలైన కామన్ ఫాం సివెట (పునుగు పిల్లి జాతి), బ్రౌన్ మాన్గూస్, స్ట్రైప్డ్ నెక్డ్ మాంగూస్ (ముంగిస జాతి), బ్లాక్ నేప్డ్ హేర్ (చెవుల పిల్లి లేదా కుందేలు జాతి), ఇండీన్ పాంగోలిస్ (పొలుసులతో కూడిన చీమలు తిను జంతువు), రెడ్ జైంట్ ఫ్లాఇంగ్ స్క్విరల్
(ఉడుత జాతి), ఇండియన్ పోర్సుపైన్ (ముళ్ళ పంది జాతి), ఇండియన్ జెయింట్ ఫ్లైయింగ్ స్క్వారెల్ (ఉడుత జాతి) వంటి వివిధ జాతులకు చెందిన జంతువులు ఇక్కడ కనిపిస్తాయి.
-మధుకర్ వైద్యుల

1472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles