అది గుండెనొప్పేనా?


Mon,August 13, 2018 11:35 PM

గుండెపోటు వచ్చిందిట.. సడెన్‌గా పోయాడు..! అన్న మాటలు విని నిట్టూరుస్తూ ఉంటాం. నిజానికి చాలా సందర్భాల్లో గుండెపోటు వల్ల హఠాత్తుగా మరణించడం జరుగదు. ముందుగా మన శరీరం హెచ్చరికలు చేస్తుంది. వాటిని పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తే అప్పుడు గుండెపోటు వస్తుంది. అప్పుడు కూడా మొదటి గంటలో వైద్య సహాయం అందకపోతేనే హఠాన్మరణం సంభవించేందుకు ఆస్కారం ఉంటుంది. శరీరం అందించే ఆ హెచ్చరికలకు ముందస్తుగా జాగ్రత్తపడితే గుండెపోటు మరణాలను తగ్గించవచ్చు. అదెలాగంటారా...!
Heart-attack
రక్తనాళాల్లో 50-60 శాతం అడ్డంకి ఉన్నప్పుడు హెచ్చరికగా ఏంజైనా నొప్పి వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ అడ్డంకు 100 శాతానికి చేరుకుంటుంది. దాంతో అప్పుడు గుండెపోటు వస్తుంది. అంటే ఏంజైనా నొప్పి వచ్చినా తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది గుండెపోటుకి దారి తీస్తుందన్నమాట.


గుండెపోటుకు ముందుగా వచ్చే ఛాతినొప్పే గుండెనొప్పి. దీన్ని వైద్యపరిభాషలో ఏంజైనా అంటారు. ఈ నొప్పికి మూడు ప్రత్యేక లక్షణాలుంటాయి. ఇవి ఉంటేనే టిపికల్ ఏంజైనా నొప్పి అంటారు. వీటిలో రెండు మాత్రమే ఉంటే ఎటిపికల్ ఏంజైనా అంటారు. ఏదో ఒక లక్షణం ఉన్నా, ఈ లక్షణాలు లేకపోయినా అది గుండెనొప్పి అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. గుండెనొప్పి ఉన్నప్పుడు నొప్పి కేవలం ఛాతిభాగంలోనే ఉండకపోవచ్చు. ఎడమ చేయి, వెన్నులో కూడా నొప్పి ఉండొచ్చు. కాకపోతే ఇది ఒకే చోట ఉండకుండా విస్తరిస్తుంది. ఏ అసౌకర్యం అయినా విస్తరిస్తూ ఉండి, ఏదైనా పని చేసినప్పుడు పెరుగుతున్నదంటే అది గుండెకు సంబంధించిన నొప్పేమో అని అనుమానించాలి. ముఖ్యమైన ఆ మూడు లక్షణాలేంటంటే..


ఛాతి మధ్య భాగంలో మధ్య ఎముక దగ్గర బరువుగా అనిపిస్తుంది. నొప్పి లాంటి ఫీలింగ్ ఉంటుంది. అంబిలికస్ నుంచి దవడ వరకు అసౌకర్యంగా నొప్పి లాంటి భావన ఉంటుంది. నొప్పి విస్తరించినట్టుగా ఉంటుంది. ఇది ఎడమ చేతి వరకు కూడా వ్యాపించవచ్చు. ఈ సమయంలో చెమట పడ్తుంది. నడిచినా, మెట్లు ఎక్కినా, ఏ పని చేసినా నొప్పి, అసౌకర్యం పెరుగుతాయి. చేస్తున్న పని ఆపేసినా, అంటే నడక ఆపినా, విశ్రాంతిగా ఉన్నారంటే నొప్పి తగ్గుతుంది. లేదా నాలుక కింద సార్బిట్రేట్ మాత్ర ఉంచుకున్నా నొప్పి తగ్గుతుంది.


గుండెపోటు వస్తే..?

ఛాతిలో అసౌకర్యంగా ఉన్నప్పుడు... కాస్త గాలి తగిలితే బాగవుతుందని బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. గాలికి అటూ ఇటూ తిరుగుతారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీనివల్ల ఒత్తిడి పెరిగి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు వెనకాల దిండు లాంటిది పెట్టుకుని విశ్రాంతిగా కూర్చోవాలి. ఫ్యాన్ పెట్టుకోవాలి. నాలుక కింద సార్బిట్రేట్ మాత్ర ఉంచుకోవాలి. ఆస్పిరిన్, స్టాటిన్ మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం గడ్డ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ మూడు మాత్రల వల్ల వంద శాతం బ్లాక్ కాకుండా నివారించవచ్చు. రిస్కు తగ్గించవచ్చు. అయితే ఉపశమనంగా ఉంది కదా అని సార్బిట్రేట్ మాత్రలను ఎక్కువ వేసుకోవద్దు. తీవ్రమైన అటాక్ ఉన్నప్పుడు ఒక్కోసారి బీపీ పడిపోతుంది. ఇలాంటప్పుడు సార్బిట్రేట్ రెండు కన్నా ఎక్కువ వేసుకుంటే బీపీ మరింత తగ్గుతుంది. అందుకే సార్బిట్రేట్‌ను ఒకట్రెండుకు మించి వాడొద్దు. ఈ మాత్రలు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు ప్రమాదం జరగకుండా ఆపడానికి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు టెన్షన్ పడొద్దు. విశ్రాంతిగా ఉండడం చాలా ముఖ్యం. ఆ తరువాత వీలైనంత త్వరగా అంబులెన్స్ పిలువడమో, డాక్టర్‌ను సంప్రదించడమో చేయాలి.


మొదటి గంటే ముఖ్యం..

గుండెపోటు వచ్చినప్పుడు మొదటి గంట చాలా కీలకమైనది. ఈ మొదటి గంట లోగా సరైన చికిత్స అందకపోతే గుండె స్పందన రేటులో తేడాలు వస్తాయి ఈ బీటింగ్ అబ్‌నార్మలిటీలనే విటివిఎఫ్ (వెంట్రిక్యులర్ ట్రాకికార్డియా-వెంట్రిక్యులర్ ఫైబ్రులేషన్) అంటారు. అంటే గుండె ఎక్కువసార్లు వేగంగా కొట్టుకోవడం (వెంట్రిక్యులర్ ట్రాకికార్డియా), అతి నెమ్మదిగా కొట్టుకోవడం అంటే దాదాపు ఆగిపోయినంత మెల్లగా కొట్టుకుంటుంది (వెంట్రిక్యులర్ ఫైబ్రులేషన్). వీటివల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాక స్పృహ తప్పుతారు. గుండెకు రక్తం తగ్గిపోయి చనిపోతారు. అందుకే మొదటి గంట ఏమీ కాకుండా రక్షించగలిగామంటే దాదాపుగా ప్రాణాలతో బయటపడ్డట్టే. అందుకే మొదటి గంట నుంచి మూడు గంటల్లోపు హాస్పిటల్‌కి చేర్చి, తగిన వైద్య సహాయం అందేలా చూడాలి. ఈ మూడు గంటల్లోపు రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకున్నా, కాథ్‌ల్యాబ్‌లో స్టెంట్ పెట్టి అడ్డంకు తొలగించినా ఇక భయపడాల్సింది ఏమీ లేదు.


ఈలోగా వైద్య సహాయం అందకపోతే గుండె డ్యామేజి అవుతుంది. విటివిఎఫ్ ప్రమాదం కూడా మొదటి గంటలో ఉండే అవకాశమే ఎక్కువ. ఇక వేరే ఊళ్లో ఉండి కాథ్‌ల్యాబ్ సౌకర్యం లేనట్టయితే ఫార్మకో ఇన్వేసివ్ థెరపీ ఇప్పించాలి. ఇన్వేసివ్ (రక్తనాళంలోకి)గా ఇచ్చే ఈ మందు సాధారణంగా అన్ని ఫార్మసీల్లో దొరుకుతుంది. క్లినిక్స్‌లో కూడా దీన్ని ఎక్కించవచ్చు. చనిపోకుండా ఆపొచ్చు. గతంలో స్ట్రెప్టోకైనేస్ మందును ఇందుకోసం వాడేవారు. అది 50 శాతమే పనిచేసేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టెనెక్టిప్లేస్, రెటిప్లేస్ మందులు 80 శాతం పనిచేస్తున్నాయి. పెద్ద హాస్పిటల్‌కి తీసుకొచ్చేలోపు ఇవి ప్రాణాల్ని రక్షిస్తాయి. తరువాత కెథ్‌ల్యాబ్‌లో స్టెంట్ వేస్తే ఇక వంద శాతం రక్షణ దొరికినట్టే.


Heart-attack3

ఆలస్యమైతే ప్రమాదమే..!

-హఠాన్మరణం (సడెన్ కార్డియాక్ డెత్)
-గుండె పగులుబారడం. గుండె పగిలిపోవడం అంటే ఇదే. దీనివల్ల గుండె నుంచి రక్తం మొత్తం బయటకు వచ్చి చనిపోతారు.
-వెట్రిక్యులార్ సెప్టమ్ పగిలిపోవడం. దీనికి రంధ్రం పడడం
-మిట్రల్ కవాటం కింద ఉండే పాపిలరీ కండరం డ్యామేజీ అయి, ఈ కవాటం లీక్ కావడం
-గుండె చుట్టూ నీరు చేరడం
ఆలస్యంగా వస్తే ఈ ప్రమాదాలు జరగొచ్చు. ఒకసారి గుండెపోటు వచ్చిన తరువాత 1-3 గంటల్లోపు చికిత్స అందితే డ్యామేజీ దాదాపుగా ఉండదు. చికిత్స తరువాత నార్మల్‌గా ఎప్పటిలా పనులు చేసుకోవచ్చు. ఒకవేళ అలా అందకపోతే గుండె కండరం డ్యామేజీ అవుతుంది. దాని పంపింగ్ సామర్థ్యం తక్కువైపోతుంది. పాడైన కండరం తిరిగి కోలుకోవడానికి సుమారు ఆరు వారాల వరకు సమయం పడుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే కార్డియాక్ రీహబిలిటేషన్ తీసుకోవాలి. ఇందులో భాగంగా గుండెను బలోపేతం చేసే ప్రత్యేకమైన వ్యాయామాలు చేయిస్తారు.


Heart-attack2

అది గ్యాస్ కాదు.. గుండెనొప్పే!

అన్నం తినగానే కొన్నిసార్లు పొట్ట పైభాగంలో, ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది గ్యాస్ నొప్పే అని పట్టించుకోం. కొన్నిసార్లు ఇది గ్యాస్‌కి సంబంధించిందే అయివుండవచ్చు. కాని దీని వెనుక గుండె సమస్య కూడా ఉండవచ్చు. అన్నం తిన్న తరువాత శోషణ ప్రక్రియ కోసం రక్తం పొట్ట వైపు ఎక్కువగా వస్తుంది. తద్వారా గుండెకు రక్తసరఫరా తగ్గి అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ రకమైన ఛాతి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటుకు దారితీయవచ్చు. ఇలాంటి ఛాతినొప్పిని పోస్ట్ ప్రాండియల్ ఏంజైనా అంటారు. చాలా సందర్భాల్లో దీన్ని గ్యాస్ నొప్పిగా, ఎసిడిటీగా పొరబడుతుంటారు. కాని కడుపుబ్బరంగా కాకుండా ఛాతిలో అసౌకర్యం కలుగుతున్నదంటే అనుమానించాలి. ఏమాత్రం సందేహం కలిగినా డాక్టర్‌ని సంప్రదించాలి. పోస్ట్ ప్రాండియల్ ఏంజైనా ఉన్నప్పుడు సార్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెడితే రిలీఫ్ వస్తుంది. ఇది గుండెపోటుకు హెచ్చరిక మాత్రమే. ఇలా రెండు మూడు సార్లు అయిందంటే అది తీవ్రమై గుండెపోటుకు దారితీస్తుంది. ఇలాంటప్పుడు విశ్రాంతిగా కూర్చుని ఉన్నా గుండెనొప్పి వస్తుంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు.


Heart-attack4

మహిళల్లో..

మహిళల్లో గుండెనొప్పి కూడా ప్రత్యేకమైనదే. మెనోపాజ్ వచ్చేవరకు ఈస్ట్రోజన్ హార్మోన్ రక్షణలో ఉండడం వల్ల మహిళల్లో గుండెపోట్లు తక్కువే. కానీ మెనోపాజ్ తరువాత మాత్రం మహిళల్లోనే ఎక్కువ. ఎందుకంటే మహిళల్లో రక్తనాళాలు పురుషుల్లో కన్నా సన్నగా ఉంటాయి. కాబట్టి అడ్డంకులు చాలా త్వరగా ఏర్పడిపోతాయి. అందువల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువ. మధుమేహం ఉంటే మాత్రం మెనోపాజ్ రాకపోయినా గుండెపోటు రిస్కు పురుషుల్లో మాదిరిగానే ఉంటుంది. ఈస్ట్రోజన్ రక్షణ కన్నా మధుమేహ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు లక్షణాలు మహిళల్లో వేరుగా ఉంటాయి. తీవ్రమైన నీరసం (ఫాటిగ్), కళ్లు తిరిగి పడిపోవడం (సింకోప్), గుండెదడ (పాల్పిటేషన్స్), పురుషులతో పోలిస్తే నొప్పి తక్కువగా ఉండడం లాంటి లక్షణాలుంటాయి.


ఇది గుండెనొప్పి కాదు..!

-ఒకే చోట పొడిచినట్టుగా నొప్పి ఉండడం
-రోజంతా నిరంతరం నొప్పి ఉండడం
-నడిచినా, మెట్లెక్కినా, పని చేసినా నొప్పిలో
ఎటువంటి తేడా లేకపోవడం
-గాలి పీల్చుకుంటే నొప్పి ఎక్కువ కావడం
ఈ లక్షణాలుంటే అది గుండెనొప్పి కాదు.
dr-a-srinivas-kumar

180
Tags

More News

VIRAL NEWS