అతిసారంను తరమండి ఇలా!


Tue,February 26, 2019 01:24 AM

ఎండలు తీవ్రమవుతుండటం.. నీరు కలుషితం అవడం.. పరిశుభ్రంగా లేని ఆహారం తీసుకోవడం.. వ్యక్తిగతంగానూ పరిశుభ్రత పాటించకపోవడం.. ఇవే డయేరియా (అతిసార)కు కారణమవుతున్నాయి. ఉన్నంతసేపూ మామూలుగానే కనిపించే డయేరియా.. ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాంతకం అవుతుంది. అలాంటి అవకాశం దానికి కల్పించకుండా అన్ని జాగ్రత్తలూ పాటించి డయేరియా నుంచి బయటపడుదాం.
Diearia
చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధులు 60-70% డయేరియా వల్లే వస్తున్నాయి. 23% పిల్లలు దీనివల్ల మరణిస్తున్నారు. వ్యాధిని గుర్తించడంలో.. చికిత్స ఆలస్యంగా చేయించుకోవడం వంటి కారణాల వల్ల పెద్దవాళ్లు కూడా మరణిస్తున్నారు.

ఎందుకు వస్తుంది? : ఎండలు తీవ్రమవుతుండడం.. పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం.. కలుషిత ఆహారం.. నీరు తీసుకోవడం వల్ల వాంతులు.. విరేచనాలు అధికంగా ఉంటాయి. వీటివల్ల శరీరంలోని లవణాలను కోల్పోతారు. నీరసంగా తయారవుతారు. ఇదే అతిసారం వ్యాధి.

ఎలా వస్తుంది? : రోటా వైరస్ సూక్ష్మజీవులు.. ఇతర బ్యాక్టీరియాల వల్ల అతిసారం వ్యాధి వస్తుంది. దీని తీవ్రత మార్చి- సెప్టెంబర్ నెలల మధ్యలో ఎక్కువగా ఉంటుంది. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో ఏడాది పొడవునా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు కనిపిస్తున్నారు.

లక్షణాలేంటి? : డయేరియా ముఖ్య లక్షణం డీ హైడ్రేషన్. అంటే శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది అన్నమాట. రోజులో 2-3సార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు అవుతాయి. జ్వరం, కళ్లు బిగుసుకుపోవడం, గొంతు బొంగురు పోవడం, వేగంగా ఊపిరి పీల్చాల్సి రావడం, వాంతులు అవుతాయి. విరేచనానికి ముందు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. నోరు తడారిపోతుంది. మూత్ర విసర్జన చాలావరకూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉంటాయో అప్పుడు శరీరంలోని నీరు, లవణాలు బయటికిపోయి రోగి నీరసంగా తయారవుతాడు.
నిర్ధారణ: విరేచనం పరీక్ష.. రక్తపరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. రక్తంలో లవణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వ్యాధి నిర్ధారణలో భాగంగా పరిశీలిస్తారు.

చికిత్స: లవణాలతో కూడిన నీరు తాగాలి. వాంతుల వల్ల నీరు తాగలేకపోతే స్లైన్ ఎక్కించాలి. వయసును బట్టి ప్యూరాజోలిడిస్, మెట్రోనిడజోల్ మందులు వ్యాధి తగ్గేవరకు వాడాలి. వాంతులు, విరేచనాల విషయంలో ఆందోళన చెందకుండా నీరు, గ్లూకోజ్, మజ్జిగ తీసుకోవాలి. విరేచనాల్లో రక్తం, జిగురు లాంటివి కనిపిస్తే హాస్పిటల్‌లో చేరడం మంచిది. ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి వాక్సినేషన్ ఉత్తమమైన మార్గం. రోటావైరస్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను 6, 10, 14 వారాల వయసులో 5 చుక్కల చొప్పున వేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

-ఉప్పు, చక్కెర కలిపిన నీరు.. ఓఆర్‌ఎస్ లేదా ఎలక్ట్రోల్ పొడి కలిపిన నీరు తాగాలి.
-వాంతులు తగ్గినప్పటికీ ఉప్పు వేసిన మజ్జిగ.. కొబ్బరినీళ్లు.. గంజి.. సగ్గుబియ్యం జావ తీసుకోవాలి.
-వాంతులు తగ్గిన తర్వాత మరమరాలు.. ఇడ్లీ.. ఉప్మా వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
-పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా కడిగి వాడాలి.
-భోజనానికి ముందు.. మలమూత్ర విసర్జన తర్వాత తప్పక సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
-నీటిలో ఈగలు, దోమలు పడకుండా చూసుకోవాలి. ఆహారపదార్థాలపై మూతలు పెట్టాలి.
-క్లోరిన్ కలిపిన నీరు తాగాలి.
-ఇంటి పరిసరాలలో మలవిసర్జన చేయకూడదు.
-చెరువులు, బావులు, బోర్ల వద్ద బట్టలు ఉతకొద్దు.. పాత్రలు కడుగొద్దు.
-డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ సీనియర్ పీడియాట్రిషన్
యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్

333
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles