అజీర్ణం ఆటకట్టు


Tue,August 21, 2018 01:12 AM

-ఆరోగ్యపథం
-ఉదర పర్యవేక్షణా పరికరం ఆవిష్కరణ
-ఇజిజి సాంకేతికతకు ఊతం
-జీర్ణాశయాంత్ర వైద్యశాస్త్రంలో ఒక ముందడుగు

Body
దేహం లోపల విద్యుత్ కార్యశీలతను గుర్తించడం ద్వారా కడుపులోని అజీర్తి సంకేతాలను పసిగట్టే కొత్త గ్రాహ్య సాంకేతికత (సెన్సర్ టెక్నాలజీ) ను వైద్యశాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు. ఈ మేరకు పొట్టమీద బయటకు కనబడేలాగా అమర్చుకోగల ఒక సెన్సర్ పరికరాన్ని వారు అభివృద్ధి పరిచారు. దీని ద్వారా అజీర్ణం ఆటకట్టించడానికి వారు సిద్ధమయ్యారు. ఈ వినూత్న పద్ధతే కనుక క్లినికల్‌గా ప్రామాణికతను సంతరించుకోగిలితే ఇజిజి (ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ) వైద్యసాంకేతికత పునరుద్ధరణకు ఉపయోగించుకోవచ్చునని వారు అంటున్నారు.


శరీరాంతర అవయవాలలో గుండె ఎంత ముఖ్యమో ఉదరమూ అంతే ప్రధానం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వైద్యశాస్త్ర సాంకేతికవేత్తలు హృదయం పనితనంలోని లోటుపాట్లను తెలుసుకోగలుగుతున్నంత తేలిగ్గా, సౌలభ్యంగా కడుపు కనికట్లను గ్రహించలేకపోతున్నారు. దీనికి, కారణం.. అందుకు సరైన, దీటైన సాంకేతికత, పరికర వ్యవస్థ లేకపోవడమే. మనిషి పొట్ట లోపల ఏం జరుగుతున్నదీ, ఎక్కడ ఏ విధమైన అజీర్తి కారకాలు, నొప్పి, పైత్యం, వికారం వంటి అనారోగ్య లక్షణాలు తలెత్తుతున్నవీ తెలుసుకోవడానికి ఇప్పుడు వైద్యులకున్న ఏకైక శాస్త్రీయ విధానం నాసాంత్ర నాళపరీక్ష (Esophageal manometry). అంటే, ముక్కు రంధ్రాలలోంచి గొంతుద్వారా గొట్టాన్ని కడుపులోకి జొప్పించి నిర్ధారించడం. ఇక మున్ముందు, ఇంతటి ఇబ్బందికరమైన పరీక్షలకు తావు లేకుండా ఇసిజితో గుండెను ఎలా పరీక్షిస్తున్నారో అంత తేలికైన ఇజిజి విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.


జీవశక్తి ఉత్పాదనా కేంద్రమైన ఉదరంలో అణువణువునా తలెత్తే అజీర్తి సంకేతాలను, ఆరోగ్య కారకాలను, ఆహార పదార్థ పనితనాలను పర్యవేక్షించడానికి జీవశాస్త్రవేత్తలు తాజాగా ఒక సమర్థవంతమైన బాహ్యపరికరాన్ని అభివృద్ధి పరిచారు. దీనిని కడుపు పైన ధరించి, ఎలక్ట్రోడ్స్‌ను పనిచేయించడమే తరువాయి.. లోపలి దృశ్యం ఆవిష్కృతమవుతుంది. జీర్ణాశయాంత్ర వైద్యశాస్త్రంలో దీనినొక కీలకమైన ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.


ఈ ఉదర పర్యవేక్షణా పరికరం (stomach monitor) దేహానికి ఎలాంటి హానీ చేయదు. పొట్టలోని వివిధ జీర్ణ సంబంధ క్రియలను, అనారోగ్య లక్షణాలను పర్యవేక్షిస్తుంది. అది కూడా అత్యంత కచ్చితమైన ప్రామాణికతలతో పసిగడుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. కడుపునకు చెందిన ఇజిజి వైద్యపరీక్ష భవిష్యత్తుకు మంచి భరోసానిచ్చే కొత్త సాంకేతికతగా దీనిని వారు పేర్కొన్నారు.


ఇజిజి (electrogastrography) అన్నది ఇసిజి (electrocardiogram) వంటిదే. ఇసిజి పరీక్ష గుండె పనితనం, అందులోని లోటుపాట్లను ఎలా గుర్తిస్తుందో ఇజిజి కూడా ఉదర సమస్యలను అలాగే పసిగడుతుంది. కానీ, ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి కాకపోవడంతో వినియోగంలో ఒకింత వెనకబడిపోతున్నది. కారణం, ఇది ఇసిజి అంత కచ్చితత్వపు కార్యశీలతను సాధించకపోవడమే. ఇందుకు అసలైన అడ్డంకిగా మన అన్నకోశ వ్యవస్థ నిర్మాణమేనని నిపుణులు చెబుతున్నారు. హృదయం తన క్రియాశీల సంకేతాలను పై పరీక్షలో ఇచ్చినంత వేగంగా, కచ్చితంగా, ఉదర సంకేతాలు ఉండకపోవడానికి అన్నకోశ వ్యవస్థ తీరుతెన్నులే మూలమని వారంటున్నారు. కాబట్టే, ఇజిజి వినియోగంపైన గత చాలాకాలంగా వైద్యులలో అసంతృప్తి, పలు అనుమానాలు ఏర్పడ్డాయి. దీంతో ఇజిజి సాంకేతికత కాస్తా వివాదాస్పదమైంది కూడా. అయినా, ప్రపంచస్థాయిలో కొందరు జీర్ణాశయాంత్ర వైద్యులు (Gastroenterologists) ఇజిజిని క్రమబద్ధంగా వినియోగిస్తున్నారు. వారిలోని కొందరే ప్రస్తుతం పై పరికరం అభివృద్ధితో చారిత్రాత్మక పరిశోధనను సాధించారు.


ఈ కొత్త సాంకేతికత నిజానికి 1990లలోనే క్లినికల్‌గా విజయవంతమైంది. తొలుత ప్రపంచ, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు దీనిపట్ల పెద్ద ఆసక్తిని చూపలేదు. 3సిపిఎం అనే ఒకే ఒక కంపెనీ ఇప్పటికీ ఇజిజి వ్యవస్థలను మార్కెటింగ్ చేస్తుండగా, 2000 సంవత్సరంలో కేవలం 10 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కానీ, పై పరిశోధన ఫలితంగా ఇవాళ్టికి అమ్మకాలలో ఒకింత వేగం పుంజుకున్నట్టు చెబుతున్నారు. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 45 యూనిట్ల ఇజిజి యంత్రాలు అమ్ముడైనట్లు అంచనా.

అత్యంత మెరుగైన ఫలితాలు


mobile
ఉదర పర్యవేక్షణా పరికరంతో జరిపిన పరిశోధనలు అనూహ్య విజయాన్నే నమోదు చేసినట్లు జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఉదర సమస్యలతో బాధపడుతున్న 7-17 యేండ్ల మధ్యవయస్కులైన పిల్లలు 11 మందిపై జరిపిన అధ్యయనంలో గణనీయమైన ఫలితాలే నమోదైనాయని అంటున్నారు. దీనిని ఇదివరకటి కంటే అత్యంత మెరుగైన ఆవిష్కరణగా వైద్యనిపుణులు ప్రశంసిస్తున్నారు కూడా. సానీ డీగో (అమెరికా)లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన జీవశాస్త్ర సాంకేతిక నిపుణులు టాడ్ కొలెమాన్, ఆర్మెన్ గారిబన్స్‌ల ఆధ్వర్యంలో పై పరిశోధన జరగ్గా, సైంటిఫిక్ రిపోర్ట్స్ ఆన్‌లైన్ పత్రికలో అది ప్రచురితమైది.

560
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles