అక్షరాలు పేర్చి.. నవలగా మార్చి


Wed,September 12, 2018 01:36 AM

-అక్షరం అక్షరం కలిస్తే పదమవుతుంది..
-పదం పదం పేరిస్తే వ్యాసమవుతుంది..
-ఎన్నో వ్యాసాలు రాసిన అనుభవముంటే నవల రాసే శక్తి వస్తుంది..
-21 యేండ్లకే ఇంగ్లీష్ నవల రాసి అమెజాన్‌లో అందుబాటులోకి తెచ్చిన గోనె సాయి తేజ పరిచయమిది.

Gone-Sai-Teja
అందరిలా నేనెందుకు ఆలోచించాలి? అందరు నడిచే బాటలో నేనెందుకు నడవాలి? కాస్త భిన్నంగా ఆలోచిస్తే జీవితాన్ని మరో మార్గంలో నడిపించుకోవచ్చు కదా! అని ఆలోచించాడు సాయి తేజ. చిన్నప్పటి నుంచే భిన్నంగా ఆలోచించడం.. తెలియని విషయాలపై ఆసక్తిని పెంచుకుని వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం అభిరుచిగా మార్చుకున్నాడు. అదే ఆసక్తి ఇప్పుడు అతణ్ని ఓ రచయితగా నిలబెట్టింది. 21 యేండ్లకే నవల రాసి అమెజాన్‌తో పబ్లిష్ చేయించాడు. ముంబైలో సినిమా నిర్మించడం అనే అంశాన్ని ఇతివృత్తంతో తీసుకొని ఈ నవల రాశాడు. ట్విట్టర్‌లో సాయి తేజ పెట్టిన ట్వీట్‌కు నిజామాబాద్ ఎంపీ కవిత రీట్వీట్ చేశారు. అభినందనలు తెలిపి ఆశీర్వాదం ఇచ్చారు. వయసుకు మించిన జ్ఞానాన్ని అందుకొనేందుకు అడుగులు వేస్తున్నాడు.

నాలుగు నెలలు కష్టపడి..

ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇతివృత్తంగా వచ్చిన డోంగ్రీ టు దుబాయ్ ఇంగ్లీష్ నవల సాయి తేజను ఎంతగానో ఆకట్టుకుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ది సేమ్ ఓల్డ్ స్టోరీ నవలను రాయాలని సంకల్పించాడు. చదువుపై అంతగా ఆసక్తి చూపని ఓ యువకుడు ముంబైకి వెళ్లి ఓ సినిమా చిత్రీకరించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సినిమా నిర్మించాలనే తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ముంబైకి వెళ్లిన ఓ ఆకతాయి యువతితో ఆ యువకుడికి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఆ యువతీయువకులు ఏ విధంగా సినిమా నిర్మించారు. ఆ క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారనే ఇతివృత్తంతో ఈ నవలను రచించాడు సాయి తేజ. తమ పిల్లలు ఎలాంటి చదువులు చదవాలో, ఎలాంటి ఉద్యోగాల్లో స్థిరపడాలో తల్లిదండ్రులు ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లల మనస్తత్వాన్ని అర్ధం చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఒక్క తల్లిదండ్రులపైనే కాదు. ఈ సమాజంపైన కూడా ఉందని ఈ నవల ద్వారా సాయి తేజ సందేశం ఇస్తున్నాడు. నాలుగు నెలల వ్యవధిలో ఇంగ్లీష్ భాషలో నవలను పూర్తి చేసేందుకు సాయి తేజ రాత్రింబవళ్లు కష్టపడినట్లు చెబుతున్నాడు. రోజుకు 8 గంటలు కష్టపడి 170 పేజీలు రాశాడు.

జగిత్యాల జిల్లా చిన్నోడు

జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల కేంద్రానికి చెందిన సాయి తేజ తండ్రి హన్మంతరావు కరీంనగర్‌లోని సహకార బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడే స్థిరపడ్డారు. సాయి తేజ చదివింది ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అయినా సమాజాన్ని చదివేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు. సాయి తేజకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అంటే అమితమైన ఆసక్తి. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించడం ప్రారంభించారు. ముందుగా అనేక తెలుగు నవలలు చదివి రచనా శైలిని అవగాహన చేసుకున్నాడు. తెలుగు కంటే ఇంగ్లీష్ నవలల ద్వారా జాతీయ, అంతర్జాతీయ విషయాలను తెలుసుకోవచ్చని భావించి క్రమంగా ఆ దిశగా ప్రయత్నించాడు. ఇంగ్లీష్‌లో ఇప్పటికే 200లకుపైగా నవలలు చదివిన అనుభవంతో రచనలు చేయడం ప్రారంభించాడు. అలాంటి నేపథ్యంలో వచ్చిందే దీ సేమ్ ఓల్డ్ స్టోరీ ఇంగ్లీష్ నవల..

చిన్నప్పటి నుంచే రచనల వైపు..

సాయితేజ చిన్నప్పటి నుంచే అందరికి కంటే భిన్నంగా ఆలోచించేవాడు. ఏడో తరగతిలో ఉండగానే ఈ ఆలోచనలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఏ తల్లిదండ్రినైనా ఈ సమాజం అడిగేది ఒక్కటే. నీ కొడుకు ఏం చదువుకున్నాడు? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? ఎంత సంపాదిస్తున్నాడు? అని. ఇది సర్వ సాధారణంగా భావించిన సాయి తేజ ఇంకా చేయాల్సింది ఏదో ఉన్నదని శోధించడం మొదలుపెట్టాడు. పుస్తకాలు చదవడంపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తి తనకో మార్గం చూపిందని, తానొక గొప్ప రచయితను కావాలనుకునే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. సాయి తేజ ఆలోచనలను గ్రహించిన తండ్రి హన్మంత రావు, తల్లి మంజుల ఆయన అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించడం ప్రారంభించారు. చదువులో యావరేజ్ మార్కులు తెచ్చుకున్నా తమ కొడుకుకి ఉన్న ఆసక్తిని అర్థ్ధం చేసుకున్నారు. గతంలో ముందుగా హింది, ఇంగ్లీష్ సినిమాలపై రివ్యూలు రాసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసేవాడు. ఆయన రాసిన రివ్యూలకు పలు కంపెనీలు యాడ్స్ వేసుకుని రెమ్యునరేషన్ కూడా పంపిస్తున్నాయి. అలా రచనా శైలిని అందిపుచ్చుకుని 21 ఏండ్లకే 170 పేజీల నవల రాశాడు సాయి తేజ. తాను రాసిన మొదటి నవల ది సేమ్ ఓల్డ్ స్టోరీ పూర్తిగా ముంబైలో జరుగుతుంది. దీనికోసం లొకేషన్లు తెలుసుకునేందుకు ముంబై వెళ్లి వారం రోజుల పాటు ఉండి వచ్చాడు. నవల చదువుతున్న వారంతా మీరు ముంబైలో ఉంటారా? అని ఫోన్లు చేస్తున్నారని చెబుతున్నాడు సాయి తేజ..

గొప్ప రచయితను కావాలనేదే నా లక్ష్యం..

Gone Sai Teja1
విదేశాలకు వెళ్లి ఇంకా చదువుకోవాలని ఉంది. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి విషయాన్ని అధ్యయనం చేసే మనస్తత్వం నాది. నాకు అవసరమైన సమాచారం లభించేవరకు, విషయంపై పూర్తిగా అవగాహన వచ్చే వరకు శోధించాలనుకుంటా. చిన్నప్పుడు ప్రశ్నించే మనస్తత్వం ఉండేది. ఇప్పుడు తెలుసుకోవాలనే ఆసక్తి మరింతగా పెరిగింది. ఎవరైనా విషయం చెబితే దానిని అర్ధం చేసుకోవడం, అందులోని విషయాలను కొత్త కోణంలో ఆలోచించడం నాకు అలవాటు. నేను రాసిన మొదటి నవల అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇలాంటి రచనలు ఇంకా అనేకం చేయాలనే ఆసక్తి ఉంది. గొప్ప రచయితగా ఎదగాలనే నా ప్రయత్నం కొనసాగిస్తాను.
- సాయి తేజ గోనె

అమెజాన్‌లో పుస్తకం..

book
రాసిన నవలను ఎక్కడ ప్రింట్ చేయించాలో తెలియదు. ఇంటర్నెట్‌లో పబ్లికేషన్ సంస్థల గురించి శోధించాడు. చెన్నైలోని నోషన్ పబ్లికేషన్స్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రింటు చేసేందుకు ముందుకు వచ్చింది. ముందుగా కొన్ని పేజీలను పరిశీలించిన ఆ సంస్థ 170 పేజీలను పూర్తిగా పరిశీలించి ప్రింట్ చేసి అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్‌లో అందుబాటులో ఉంచింది. పుస్తకం ధర రూ. 199గా నిర్ణయించడంతో ఐదు రోజుల్లోనే 60కిపైగా అమ్ముడుపోయాయి.

ప్రోత్సహిస్తున్నాం..

manjula
చదువులో మంచి మార్కులు రాకున్నా తనకున్న ఆసక్తిని చిన్న తనంలోనే గమనించాం. పిల్లలందరి కంటే భిన్నంగా ఆలోచిస్తున్న తీరును గుర్తించాం. మేము కూడా తనకు ఏది ఇష్టమైతే అదే చేయాలని ప్రోత్సహించాం. టెన్త్ క్లాస్ చదువుతున్నపుడే తెలుగులో ఉన్న అనేక నవలలు చదివాడు. విప్లవ సాహిత్యాన్ని కూడా వదిలేవాడు కాదు. ప్యాకెట్ మనీ ఇస్తే భద్రంగా దాచిపెట్టుకుని పుస్తకాలు కొని తెచ్చుకునేవాడు. మంచి బట్టలంటే ఆసక్తి చూపేవాడు కాదు. అదే ఒక మంచి పుస్తకం కోసం ఎంత ఖర్చయినా పెడతాడు. తన స్నేహితులు కూడా పుస్తకాలను కానుకలుగా ఇస్తే మురిసిపోతాడు. చిన్నప్పటి నుంచి అంతే. మా కొడుకు నుంచి గ్రహించిన విషయం ఏమిటంటే పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. అంతే కాని వాళ్లకు ఇష్టం లేని రంగాల వైపు దృష్టి మళ్లిస్తే ఫలితాలు వేరే రకంగా ఉంటాయి.
.- మంజుల, సాయి తేజ తల్లి

ట్విట్టర్‌లో దీవించిన ఎంపీ కవిత

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాయితేజకు వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజాలు మనోజ్ బాజ్‌పాయ్, ప్రియాంకా చోప్రా, సంజయ్ గుప్త వంటి వారికి నిత్యం సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటాడు. తను రాసిన నవల గురించి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్టర్‌లో పోస్టు చేసి ఆశీర్వాదం కావాలని అడిగిన 40 నిమిషాల్లోనే ఆమె స్పందించారు. కంగ్రాట్యులేషన్స్ అంటూ దీవించారు. అందరి కంటే తనకు కవిత మేడం చేసిన పోస్టు ఎంతో గొప్పదని అంటున్నాడు.

డి. వెంకటస్వామి, కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ బాలకిషన్ రావు

1776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles