అంధులకు అండగా..


Sat,September 1, 2018 11:10 PM

అంధులు ఎవరైనా రోడ్డున వెళ్తుంటే.. పిల్లలు, పెద్దలు వారికి ఏదో విధంగా సాయపడుతుంటారు. వారు ఇంటి వరకూ చేరుకున్న తర్వాత.. ఇళ్లలోకి వెళ్లాలంటే ఎలా? అసలే అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగింది. లిఫ్టుల్లో వెళ్లాలంటే ఎవరి తోడైనా కావాల్సిందే. లేకపోతే అలా పడిగాపులు కాయాల్సిందే. అందుకే ఈ చిన్నారులు పెద్ద మనసు చేసుకొని అంధుల కోసం ఓ గొప్ప ఆలోచన చేశారు.
brille-numbers
అంధులను రోడ్డు దాటించడం, ఏదైనా వస్తువు కొనివ్వడం వంటిని మనకు అప్పుడప్పుడూ కనిపించే దృశ్యాలే. ఈ చిన్నారులు మాత్రం పెద్ద మనసుతో ఆలోచించారు. నగరాల్లో పెరిగిన అపార్ట్‌మెంట్ సంస్కృతిలో భాగంగా అంతా లిఫ్టులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా నగరాల్లో ఉన్న లిఫ్టుల్లో నెంబర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కళ్లున్నవారికి ఉపయోగకరంగా ఉన్నాయి. మరి.. కళ్లు లేనివారి పరిస్థితి ఏంటి? వారి స్థాయిలో బ్రెయిలీ చదువుకున్నా.. ఆ స్థాయిలో అన్ని వసతులు వారికి లేవు. కనీసం లిఫ్టులు ఎక్కేటప్పుడు వారు ఏ ఫ్లాట్‌కు వెళ్లాలో తెలిసేలా వారి భాషలో అంకెలు లేవు. ఇలా తమ అపార్ట్‌మెంట్‌లో అంధులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ చిన్నారులు చలించిపోయారు. వారికి తమకు చేతనైన సాయం చేయాలనుకొని లిఫ్టు సిస్టమ్ మార్చేశారు.


brille-numbers2

లిఫ్ట్‌లో బ్రెయిలీ నెంబర్లు!

కర్ణాటకలోని రాజ్‌కోట్‌కు చెందిన ఐదుగురు విద్యార్థుల పేర్లు కతన్ పాండ్యా, దర్షిత్ సోన్వాని, శ్రేయాస్ భందేరి, ఖుషి చంగేల, ధ్రువాంగ్ అక్బారి. స్థానిక గెలాక్సీ స్కూల్‌లో చదువుకుంటున్నారు. వీళ్లుండే అపార్ట్‌మెంట్‌లో అంధులు పడే ఇబ్బందిని రోజూ చూస్తుండేవారు. ఒకరోజు వారి సమస్యలపై చర్చించారు. ఓ పరిష్కారం కనుగొన్నారు. అదేంటంటే.. లిఫ్ట్‌లో బ్రెయిలీ లిపిలో నెంబర్లు యాడ్ చెయ్యడం. అనుకున్నదే తడవుగా స్కూల్ టీచర్లతో మాట్లాడి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వారు కూడా మంచి ఆలోచన చేసిన విద్యార్థులను అభినందించి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. వీళ్లే బ్రెయిలీ నంబర్లను నెట్‌లో సెర్చ్ చేసి, దాని గురించి బొమ్మలు గీసుకున్నారు. ఓ మెటల్ ప్లేట్‌పై బ్రెయిలీ నెంబర్లను సుత్తి, శీలలతో కొట్టారు. వాటిని లిఫ్ట్‌లోని నెంబర్ల పక్కనే అమర్చారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న అంధులు ఆ నెంబర్ల ఆధారంగా వారి ఫ్లాట్‌లకు వెళ్తున్నారు. ఇలా వారి తొలి ప్రయత్నం విజయవంతం అయింది.


brille-numbers3

పలువురి అభినందనలు

విద్యార్థుల ప్రయత్నం గురించి తెలిసిన అపార్ట్‌మెంట్‌వాసులు వారిని అభినందించారు. తమ ఆలోచనలను ైబ్లెండ్ పీపుల్ అసోసియేషన్‌కు తెలియజేశారు. వారు కూడా చిన్నవయసులో తమ గురించి ఆలోచించిన చిన్నారులను మెచ్చుకున్నారు. రాజ్‌కోట్ మున్సిపల్ అధికారులకు తమ సమస్యలతో కూడిన విన్నపాన్ని తెలియజేశారు. మాల్స్‌లో, పెద్ద షాపుల్లో లిఫ్టులు ఉన్న దగ్గర అంధుల కోసం బ్రెయిలీ నెంబర్లను అమర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ అధికారులు ఆ ఆదేశాలను జారీ చేశారు. కొత్తగా అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్న బిల్డర్స్, ఆర్కిటెక్‌లకు కూడా లిఫ్టుల్లో బ్రెయిలీ లిపితో కూడిన నెంబర్లు ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలా వీరి ప్రయత్నం ఓ యంత్రాంగాన్ని కదిలించింది. అంధులపై ఈ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం, దాని ఫలితానికి ఐకెన్ అవార్డ్స్-2017లో మంచి గుర్తింపు వచ్చింది. వీరు చేసింది చిన్నపనే అయినా.. పెద్ద ఫలితాన్ని ఇచ్చింది.

467
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles