అందుకే భయపడేవారేమో!


Sat,August 11, 2018 11:43 PM

ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ స్వీయ ప్రతిభతో చిత్రసీమలో రాణిస్తున్నది నిహారిక. ఇటు వెబ్‌సిరీస్, రియాలిటీషోలతో సత్తాచాటి.. మరోవైపు కథానాయికగా అలరిస్తున్నది నిహారిక. మెగాప్రిన్సెస్ అనే పేరు కంటే మంచి నటిగా గుర్తుండిపోవాలన్నదే నా లక్ష్యం అని అంటున్న నిహారిక కొణిదెల తన సినీ ప్రయాణం గురించి చెప్పిన సంగతులివి..
niharika
నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ పుట్టాను. ఆ సంవత్సరమే అమ్మనాన్న చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. నేను చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే. నానక్‌రామ్‌గూడలోని ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్లో పదోతరగతి వరకు చదివాను. ఆ తర్వాత ఓబుల్‌రెడ్డి కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాను. యూసుఫ్‌గూడ సెయింట్‌మేరిస్‌లో మాస్ కమ్యూనీకేషన్స్‌లో బీఏ చేశాను. అకాడమిక్స్‌లో నేను యావరేజ్ స్టూడెంట్‌ని. ఫస్ట్‌క్లాస్ రావాలి. అందరికంటే బాగా చదువుకోవాలి అంటూ నాన్న ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. స్కూల్, కాలేజీల్లో కూడా చదువు విషయంలో పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. నా ఆరోతరగతి వరకు అసలు పుస్తకాలు వుండేవి కావు. ఆటపాటలు, చదువూ..ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే మైండ్‌సెట్‌తో నా విద్యాభ్యాసం సాగింది.


కాలేజీలో అల్లరే అల్లరి

కాలేజీ రోజులు ఎంతో సరదాగా గడచిపోయాయి. అన్న వరుణ్‌తేజ్ కూడా మా కాలేజీలోనే చదువుకున్నాడు. ప్రతిరోజు టైం కంటే కొంచెం ముందుగానే కాలేజీకి వెళ్లేవాళ్లం. ఫ్రెండ్స్‌తో కలిసి కృష్ణానగర్ లోని పూర్ణ టిఫిన్ సెంటర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్లం. కాలేజీలో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ లో ఫ్రెండ్స్‌తో కలిసి చురుగ్గా పాల్గొనేదాణ్ని. స్కూల్ రోజుల్లో నేను మెగా ఫ్యామిలీ అమ్మాయినని ఎవరికి తెలిసేది కాదు. నేను కూడా కుటుంబ నేపథ్యం గురించి ఆలోచిందేదాన్ని కాదు. అయితే ఇంటర్‌లోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ అమ్మాయి అంటూ నా గురించి మాట్లాడుకునే వాళ్లు. డిగ్రీలో మాత్రం నా బ్యాక్‌గ్రౌండ్ గురించి అందరికి తెలుసు. అయితే నన్ను ఎవరూ స్పెషల్‌గా ట్రీట్ చేసేవారు కాదు. నేను కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలుపుగోలుగా ఉండేదాణ్ని.
నాకు తెలుగు రాయడం, చదవడం బాగావొచ్చు. పదోతరగతిలో తెలుగులో నాకే ఎక్కువ మార్కులొచ్చాయి. తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో నాకు ఎప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. ఇక మ్యాథ్స్ అంటే విపరీతమైన భయం.

చిన్నప్పుడు షూటింగ్‌లతో కాలక్షేపం..

చిన్నతనంలో పెద్దనాన్న చిరంజీవి, కల్యాణ్ బాబాయ్ సినిమా షూటింగ్‌లకు తరచుగా వెళుతుండేదాణ్ని. బావగారు బాగున్నారా, అందరివాడు, బాలు షూటింగ్ అనుభవాలు ఇంకా గుర్తున్నాయి. పెద్దనాన్న నటించిన అంజి సినిమాలో నేను యాక్ట్ చేశాను. అప్పుడు నాకు నాలుగేళ్ల వయసుంటుంది. నాతో పాటు కొంతమంది పిల్లలపై నాలుగు రోజులు షూటింగ్ చేశారు. ఆ తర్వాత సినిమా స్టోరీని మార్చాం. కొంచెం పెద్ద వయసున్న పిల్లలు అయితే బాగుంటుంది అని చెప్పి మేం చేసిన సీన్స్ అన్నింటిని తీసివేశారు. అయితే ఆ షూటింగ్ మాత్రం నాకు బాగా గుర్తిండిపోయింది. ఒకవేళ నేను నటించిన సీన్స్ సినిమాలో ఉంటే అందరివాడు చైల్ట్ ఆర్టిస్టుగా నా తొలిచిత్రమయ్యేది. చైల్ట్ ఆర్టిస్టుగా నా కెరీర్‌ను డ్యామేజ్ చేశారు అంకుల్ అని ఓ సందర్భంలో చిత్ర నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారితో చెప్పాను కూడా.
నేను మంచి భోజనప్రియురాలిని. ముఖ్యంగా సీఫుడ్‌ను బాగా ఇష్టపడతాను. రొయ్యలు, పీతలు వంటివి బాగా తింటాను. వెజ్‌లో ఆలుగడ్డ కర్రీ బాగా ఇష్టం.


ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను..

కాలేజీ రోజుల్లో ప్రేమిస్తున్నానంటూ నా దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పిన వారెవరూ లేరు. బహుశా నేను మెగా ఫ్యామిలీ అమ్మాయినని తెలిసి భయపడేవారు కావొచ్చు (నవ్వుతూ). అయితే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్‌క్రష్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంటర్‌లో మా సీనియర్ అయిన ఓ మలయాళీ అబ్బాయి వుండేవాడు. అతను చూడటానికి మామూలుగానే వుంటాడు. కానీ అమెరికన్ యాక్సెంట్‌లో ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు. గిటార్ కూడా బాగా ప్లే చేసేవాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. నా లైఫ్‌లో నచ్చిన అబ్బాయి అతనే కావొచ్చు (నవ్వుతూ). అయితే ఆ ఫీలింగ్‌ను ప్రేమ అని మాత్రం చెప్పలేను. అప్పుడున్న మెచ్యురిటీలో అలా అనిపించిందని అనుకుంటున్నాను.
నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అందంగా, పొడుగ్గా ఉండాలి. తను ఏ రంగంలో పనిచేస్తున్నా అంకితభావంతో, ఇష్టంతో పనిచేసే తత్వం కలిగివుండాలి. మా నాన్నలా బాగా చూసుకోవాలి. పోనీ.. సగం చూసుకున్నా చాలు
(నవ్వుతూ).


niharika2

నాన్న జోక్ చేస్తున్నావా అన్నాడు..

నాకు సినిమాలంటే ఇంట్రస్టనే విషయం ఇంట్లోవాళ్లకు తెలుసు. అయితే ఎప్పుడూ సినిమాల గురించి వారితో చర్చించలేదు. ఓరోజు సడన్‌గా నేను సినిమాల్లోకి వెళ్దామనుకుంటున్నాను. యాక్టింగ్ చేస్తాను అని చెప్పాను. అప్పుడూ అందరూ ఆశ్చర్యపోయారు. నాన్న జోక్ చేస్తున్నావా అని అడిగారు. మా మెగా ఫ్యామిలీలో అబ్బాయిలు చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. అమ్మాయిలు ఎవరూ రాలేదు. దాంతో నేను యాక్టింగ్ గురించి చెప్పగానే వాళ్లకు కొత్తగా అనిపించింది. అన్నంపెట్టిన పరిశ్రమ అంటే మా కుటుంబ సభ్యులందరికి ఎంతో గౌరవం. నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.


కల్యాణ్ బాబాయ్ ఆటపట్టించేవాడు..

నా చిన్నప్పటి నుంచి కల్యాణ్ బాబాయ్ ఎంతో జోవియల్‌గా వుండేవారు. చైల్డ్‌హుడ్‌లో నా కళ్లు ఎందుకో కొంచెం చిన్నగా జపనీస్ అమ్మాయిల మాదిరిగా వుండేవి. దాంతో కల్యాణ్‌బాబాయ్ నన్ను తకాషిమాయ అంటూ జపనీష్ భాషలో సరదాగా పిలిచేవారు. అన్నయ్య వరుణ్‌తేజ్, నేను ఇప్పటికీ సరదగా, ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటాం. నా చిన్నతనంలో కల్యాణ్ బాబాయ్ కూడా అన్నయ్యలాగానే ఎప్పుడూ నవ్విస్తూ, ఆటపట్టిస్తూ వుండేవారు.
-కళాధర్ జూలపల్లి,
సీఎం ప్రవీణ్‌కుమార్

631
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles