అరుదైన గౌరవం!


Sat,October 27, 2018 01:22 AM

విజయాన్ని అందుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే ఆలస్యంగానైనా విజయం మన ముంగిట వాలుతుంది. దీనికి నిదర్శనం మిజోరం రాష్ర్టానికి చెందిన లల్‌రెమ్సియమి. దేశమంతా గర్వపడేలా ఆసియాగేమ్స్, ఉమెన్ హాకీ, యూత్ ఒలింపిక్స్‌లో అరుదైన ప్రతిభచూపిన ఆమెకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది.
Mizorams
మిజోరం రాష్ర్టానికి చెందిన క్రీడాకారిణి లల్‌రెమ్సియమికి ఘన స్వాగతం లభించింది. అత్యంత వైభవంగా పల్లకీలో ఊరేగించుకుంటూ బ్యాండ్ మేళాలు, డప్పుదరువుల కోలాహలాల మధ్య అక్కడి ప్రజలు స్వాగతించారు. కొలసిబ్ జిల్లా దయక్వాన్ స్కేర్‌లోని సంప్రదాయం ప్రకారం అత్యంత గౌరవంగా ఆమెను సత్కరించారు. 18 యేండ్ల లల్‌రెమ్సియమి ఇండియా తరుపున హాకీకి ప్రాతినిధ్యం వహించింది. అంతేకాదు పలు విజయాల్లో కీలకంగా నిలిచింది. దీంతో మిజోరం చరిత్రలోనే ఈమెకు మొదటిసారిగా ఇలా ఆహ్వానం పలికారు.

వెదురుతో తయారు చేసిన పల్లకీపై వినసొంపైన మేళ తాళాలతో ఆమెను తమ గ్రామవాసులు స్వాగతించారు. 2014లో మిజోరానికి చెందిన ఐడల్ విజేత లల్‌చ్చన్హిమికి కూడా ఇదే విధంగా ఘన స్వాగతం లభించింది. అ తర్వాత హాకీ విజేత లల్‌రెమ్సియమికే అంతటి స్థాయిలో ఘనంగా స్వాగతం పలికారు. అయితే లల్‌రెమ్సియమి అలా ఊరేగుతూ, అందరూ ఆమె ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్‌ల కోసం ఆరాటపడుతుంటే చాలా గర్వంగా అనిపించిందని ఆమె తండ్రి చెబుతున్నాడు. రాజకీయాలకు, కుల, మతాలకు అతీతంగా లల్‌రెమ్సియమిని గౌరవించడం శుభపరిణామమని ఓ అభిమాని తెలిపాడు. ఇలాంటి ప్రేమ, ఆదరాభిమానాలు, అందరి ఆశీర్వచనాలుంటే మరిన్ని విజయాలను అందుకుంటానని లల్‌రెమ్సియమి చెబుతున్నది.

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles