రొమ్ము క్యాన్సర్


Mon,September 17, 2018 11:47 PM

రొమ్ము క్యాన్సర్ చాలామందిని వేధిస్తున్నది. చాలామందికి రొమ్ము క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేదు. క్యాన్సర్ వస్తే మరణమేనా? చికిత్స
చేసుకుంటే రొమ్ము తొలగిస్తారా? చికిత్సలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి విషయాలు తెలుసుకుందాం!

breast-cancer
ఈతరం మహిళలు గర్భ ధారణను సక్రమంగా ప్లాన్ చేసుకోవడం లేదు. అపోహతో కొందరు పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం లేదు. ఇలాంటి అంశాలన్నీ కలగలసి రొమ్ముక్యాన్సర్‌ను పుట్టిస్తున్నాయి.


కారణాలు

అమ్మ, అమ్మమ్మ, అక్కాచెల్లెళ్లు, మేనత్తలలో ఈ క్యాన్సర్ ఉంటే వీరికి వచ్చే అవకాశాలెక్కువ. కుటుంబంలో ఎవరికైనా రెండు రొమ్ములకూ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా మిగతావాళ్లపై దీని ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఎవరైనా పురుషులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలున్నా ఆ ఇంట్లో వారికి ముప్పు ఎక్కువే. అలాగే బాల్యంలో ఏదైనా లింఫ్ నోడ్‌లో వచ్చిన క్యాన్సర్‌కు రేడియేషన్ తీసుకుంటే మున్ముందు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. స్థూలకాయం, తక్కువ శారీరక శ్రమ చేయడం కూడా ప్రమాదం తెచ్చేవే. చిన్న వయసులోనే రుతుక్రమం మొదలై, పెద్ద వయసులో చాలా ఆలస్యంగా మెనోపాజ్ ఆగడం, రుతుక్రమం ఆగిపోయి హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స తీసుకుంటూ ఉండటం కూడా ముప్పు తెచ్చే అంశాలే. ఆధునికత తెచ్చే ముప్పులో రాత్రివేళ నిద్రలేకుండా పనిచేయడం, పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు కూడా ఉన్నాయి.

వ్యాధి లక్షణాలు

రొమ్ముకు సంబంధించినవి: రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు తగలడం, రొమ్ము ఆకృతిలో మార్పు, రొమ్ముపై మానని పుండు, సొట్టలు కనిపించడం, చర్మం మందంగా మారడం.
నిపుల్‌కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్లు లేదా పుండ్లు ఏర్పడటం, రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం, నిపుల్ నుంచి కొన్ని స్రావాలు వస్తుండటం.
చంకల్లో: గడ్డ బాగా పెరగడం, స్పర్శ తెలియడం.

సొంత పరీక్ష మేలు

ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి ఈ పరీక్ష చేసుకోవాలి. ఇదెంతో తేలిక. ఏవైనా లక్షణాలుంటే ముందే పసిగడుతుంది. అదేంటంటే.. రొమ్ముల పైభాగం, కింది భాగం చుట్టూరా చూసుకోవాలి. చంకల కింద కూడా నొక్కి చూడాలి. ఏవైనా గడ్డల్లా కనిపించాయా? చేతికి తగులుతున్నాయా గమనించాలి. స్నానం సమయంలో సబ్బు రాసుకున్నప్పుడు రొమ్ము టెండర్‌గా మారి రొమ్ములోని మార్పు ఎంత చిన్నదైనా తేలిగ్గా తెలుస్తుంది. ఎడమ అరచేత్తో కుడి రొమ్మునూ, కుడి అరచేత్తో ఎడమ రొమ్మును పరీక్షించుకుంటే రొమ్మును పూర్తిగా గమనించవచ్చు. అద్దం ముందు నిలబడి చేతులను తల వెనకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని గమనించాలి. చేతులను నడుము మీద పెట్టి భుజాలను లోపలికి కుదించి మోచేతులను దేహం ముందు వైపునకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు రొమ్ములు కదులుతాయి. ఆ కదలికలను బట్టి కండరాల్లో మార్పు లు ఉన్నాయేమో గమనించుకోవాలి. నిపుల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగా లేదా బ్రౌన్ రంగు / రక్తవర్ణంలో ఏదైనా ద్రవం విడుదలవుతుందేమో చూడాలి.


నిపిల్స్ నుంచి పాలలాగ ద్రవం విడుదలవుతున్నా, రొమ్ములలో వాపును గమనించినా, చర్మం మీద దురద పెడుతున్నా, బుడిపెలాంటిది ఏర్పడినా, నిపిల్స్‌లో నొప్పి, ఎరుపుదనం, లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలను గమనించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పు డు తలకింద తలగడ వద్దు. భుజాల కింద మడతపెట్టిన టవల్‌ను ఉంచుకోవాలి. ఈ స్థితిలో రొమ్ముల కండరాలు పక్కటెముకల మీద విస్తరించినట్లు పరుచుకుంటాయి. దాంతో చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది. ఈ పరీక్షలను రుతుక్రమం పూర్తయిన ఏడో రోజున చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు, నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతం అయుండొచ్చు. అందుకే డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి.


రొమ్ము కోల్పోతారా?

రొమ్ము క్యాన్సర్ చికిత్స అంటే రొమ్ము తొలగిస్తారనే ఆందోళన మహిళలను వేధిస్తున్నది. కానీ ఆధునిక చికిత్సలతో చాలావరకు రొమ్మును తొలగించాల్సిన అవసరమే ఉండదు. పైగా సాంప్రదాయక క్యాన్సర్ శస్త్రచికిత్సతో ఆధునిక ప్లాస్టిక్ సర్జరీని మేళవించి ఆంకో-ప్లాస్టిక్ సర్జరీతో రొమ్మును పూర్తిగా పునర్నిర్మించవచ్చు. కాబట్టి రొమ్మును కోల్పోతామని ఆందోళన పడొద్దు.

ఆంకో ప్లాస్టిక్ సర్జరీ అంటే?

అటు ఆంకాలజీ తాలూకు సర్జరీనీ, ఇటు ప్లాస్టిక్ సర్జరీని కలగలిపిన అత్యాధునిక శస్త్రచికిత్స ప్రక్రియ అన్నమాట. గతంలో రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు వ్యాధిగ్రస్తమైన రొమ్ముభాగాన్ని తీసేసేవారు. దాంతో వ్యాధి తగ్గినా ఒకవైపు రొమ్ము లేకపోవడం అన్న విషయం మహిళలను చాలా న్యూనతకు గురిచేసేది. కానీ ఆధునిక శస్త్రచికిత్స సునిశితత్వపు నైపుణ్యంతో వ్యాధిగ్రస్తమైన ట్యూమర్ చుట్టూతా 5 మిల్లీ మీటర్లు తొలగిస్తే చాలు. ఇక వ్యాధి నుంచి పూర్తిగా విముక్తులైనట్లే. అప్పుడు ఇలా తొలగించిన భాగంలో ఇతర భాగాల్లోంచి కండరాన్ని తీసుకొని అక్కడ భర్తీ చేస్తారు. ఇటీవల స్టెమ్ సెల్స్‌లో ఖాళీని పూరించే విధానాలూ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆధునిక విధానాలతో చికిత్స తర్వాత రెండు రొమ్ములనూ ఒకే ఆకృతిలోనూ, ఒకే పరిమాణంలోనూ ఉండేలా కూడా చూడవచ్చు.


ఏయే చికిత్సలు?

కీమోథెరపీలో: ఇందులో ఎన్నో కొత్త మందులు అందుబాటులోకి రావడంతో ఇదివరలోలాగ శరీ రం మీద వాటి దుష్ప్రభావాల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఒకసారి కీమో ఇచ్చాక కూడా క్యాన్సర్ మళ్లీ వస్తే గతంలో అయితే ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త మాలిక్యూల్స్ వల్ల, నోటి ద్వారా తీసుకునే ఓరల్ కీమోథెరపీ మందుల వల్ల జీవిత కాలాన్ని గణనీయంగా పొడిగించే అవకాశాలున్నాయి.


రేడియేషన్ థెరపీలో : ఒకప్పుడు వ్యాధికి గురైన రొమ్ము భాగానికి రేడియేషన్ ఇస్తే.. దాంతో పాటు శ్వాసకోశ వ్యవస్థ, గుండె కూడా దుష్ప్రభావానికి లోనయ్యేవి. కానీ ఇప్పుడు కొత్త రకం రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఐఎమ్‌ఆర్టీ (ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియో థెరపీ), ఐజీఆర్టీ (ఇమేజ్ గైడెడ్ రేడియో థెరపీ)లతో వి-మ్యాట్ సాంకేతికత సహాయంతో రేడియేషన్ ఇస్తే రోగగ్రస్తమైన భాగానికి చాలా వేగంగా రేడియేషన్ అందించడం ఇప్పుడు సాధ్యమవుతున్నది. పైగా, దీనివల్ల ఆ పొరుగున ఉండే సాధారణ కణజాలానికి ఏమాత్రం హాని కలగదు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అనే విధానం ద్వారా మొత్తం రొమ్ముకు కాకుండా కణితి ఉన్న చోటే రేడియేషన్ ఇవ్వడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. అంతేకాదు.. ఇప్పుడు ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ ప్రక్రియల ద్వారా సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ ఇవ్వడమూ ఒకసారి పూర్తయ్యేలాంటి చికిత్స అందుబాటులో ఉన్నాయి. సైబర్ నైఫ్ సహాయంతో చేసే పార్షియల్ రేడియేషన్‌తో ఒక్కరోజులో చికిత్స పూర్తవుతుంది. ఇవేగాక హార్మోన్ థెరపీలో భాగంగా ఇచ్చే మోనోక్లోనల్ యాంటీబాడిస్ వంటి అధునాతనమై ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి.
mohana-vamshi

374
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles