తెలుగు భాష గొప్పది : రాష్ట్రపతి కోవింద్


Tue,December 19, 2017 07:43 PM
తెలుగు భాష గొప్పది : రాష్ట్రపతి కోవింద్

హైదరాబాద్ : ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని ఆయన తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కోవింద్ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశ, విదేశాల నుంచి ఈ సభలకు హాజరైన వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని రాష్ట్రపతి తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి గురజాడ అప్పారావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగు భాషా వ్యాప్తికి శ్రీకృష్ణదేవరాయలు ఎనలేని కృషి చేశారని తెలిపారు. తన కంటే ముందు ముగ్గురు తెలుగువారు రాష్ర్టపతులయ్యారు. తెలుగు తెలిసిన రాష్ట్రపతుల్లో సర్వేపల్లి, వివి గిరి, సంజీవరెడ్డి ఉన్నారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే అని రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు వారి త్యాగాలు మరువలేనివి. అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు అని కోవింద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక శుభాకంక్షలు తెలిపిన ఆయన.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ రాష్ర్టపతి తన ప్రసంగాన్ని ముగించారు.

2986

More News

Featured Articles

Health Articles