జగన్ తుఫాన్


Fri,May 24, 2019 04:12 AM

YSR Congress sweeps parliamentary and assembly polls

-ఏపీలో ఫ్యానన్న గాలికి కొట్టుకుపోయిన టీడీపీ
-ప్రభంజనం సృష్టించిన వైసీపీ
-లోక్‌సభ ఫలితాల్లోనూ అదే జోరు.. నాలుగు జిల్లాల్లో క్లీన్‌స్వీప్
-భారీ మూల్యం చెల్లించుకున్న బాబు
-24 స్థానాలతో టీడీపీకి ప్రతిపక్ష హోదా
-కాంగ్రెస్, బీజేపీలకు గుండు సున్నాలు
-రేపు వైసీపీ పక్ష నేతగా జగన్ ఎన్నిక
-30న ముఖ్యమంత్రిగా ప్రమాణం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆంధ్రపదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ భారీ విజయాన్ని నమోదుచేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారాన్ని చేజార్చుకున్న వైసీపీ.. తాజా ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. ప్రజావ్యతిరేకత తీవ్రతకు నలభై ఏండ్ల అనుభవం తలవంచింది. ఏపీ ప్రజ.. యువశక్తికి పట్టం గట్టింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 150 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఫ్యాను గాలి తుఫాన్‌గా మారడంతో కొట్టుకుపోయిన సైకిల్.. 24 స్థానాలను గెలుచుకొన్నది. లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ ఎదురులేని శక్తిగా నిలిచింది. మొత్తం 25 ఎంపీ సీట్లకుగాను ఏకంగా 22 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన ఒకేఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి వైసీపీ సీట్లు గెలవడం విశేషం. చంద్రబాబు సీఎం పదవికి రాజీనామాచేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు శనివారం వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. జగన్ 30 తేదీన ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రమాణం స్వీకరించనున్నారు. ఏపీలో ఘనవిజయం సాధించిన జగన్‌కు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు తదితరులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పలువురు ఏపీ అధికారులు జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

మూడు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్

వైసీపీ ఏకంగా మూడు జిల్లాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండాచేసింది. కర్నూలు జిల్లాలో 14, నెల్లూరులో పది, విజయనగరంలో తొ మ్మిది స్థానాలకుగాను అన్నింట్లోనూ ఫ్యాను గాలి వీచింది. పలుజిల్లాల్లో టీడీపీ ఒక్కొక్క స్థానానికే పరిమితమయింది. 2014లో రా యలసీమలోనే మెరుగైన స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈసారి ఉత్తరాంధ్ర, కోస్తాలోనూ టీడీపీకి అందనంత స్థాయిలోకి వెళ్లింది. కు ప్పంలో గతఎన్నికల్లో 47వేలపైచిలుకు మెజార్టీతో గెలిచిన చంద్రబాబు.. ఈసారి 30,722 ఓట్ల మెజార్టీకి తగ్గిపోవటం గమనార్హం.

జనసేనకు ఒకే ఒక్కడు

తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేసిన పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. మార్పు కోసమంటూ విస్తృత ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. పొత్తు పెట్టుకున్న వామపక్షాలు సైతం ఉనికిలో లేకుండాపోయాయి. జాతీయ పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో పత్తాలేకుండా పోయాయి.

పోలింగ్ సరళిలోనే తేలిపోయిన ప్రజావ్యతిరేకత

రాష్ట్రంలో హద్దుమీరిన అవినీతి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల దౌర్జన్యా లు, రాజకీయంగా చంద్రబాబు స్వయంకృతాపరాధాలు టీడీపీని కోలుకోని రీతిలో దెబ్బతీశాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇసుక మాఫియా, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, రాజధాని నిర్మాణంలో అధికారపార్టీ నేతల భూదందాలను ప్రజలు గ్రహించారని అంటున్నారు. దీనికితోడు గాడితప్పిన పాలన, ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం ప్రజలను విసుగెత్తించాయని పేర్కొంటున్నారు. అన్నింటికి మించి నాలుగేండ్లపాటు ఎన్డీఏతో అంటకాగి.. అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగి, ఎన్నికలకు కొద్ది నెలల ముందు బయటకు వచ్చి హైడ్రామాకు తెరతీయడం ఆ పార్టీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ రాజకీయాలు, నిరసనల పేరిట భారీఎత్తున ప్రజాధనాన్ని వృథాచేయడం కూ డా ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. గత నెల 11న జరిగిన పోలింగ్ సరళిలోనే ఈ ఫలితాల తాలూకు ఛాయలు కనిపించాయి. పెద్దఎత్తున మహిళలు రాత్రివేళల్లోనూ పడిగాపులు కాసి ఓటేయడం ప్రజావ్యతిరేకతకు అద్దం పట్టింది. తన ఓటమిని ముందుగానే గుర్తించిన చంద్రబాబు ఈవీఎం లోపాలంటూ ఎన్నికల సంఘాలపై ఫిర్యాదులు చేసుకుంటూ సాకులు వెతుక్కున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

అభివృద్ధి మరిచి నిందారోపణలు

ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన నేపథ్యం లో కొత్త ఏపీ అభివృద్ధికి ఆ రాష్ట్ర సీఎంగా అవసరమైనచర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు.. ఆ పనిని పక్కనపెట్టి నిత్యం తెలంగాణతో ఘర్షణపూరిత వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. మాట్లాడితే హైదరాబాద్‌ను తానే సృష్టించానని, అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్రస్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్పించి.. కొత్త రాజధాని అమరావతికి ఒక రూపు తీసుకువద్దామన్న ఆలోచనే లేకుండా పోయింది. అన్నీ తాత్కాలిక భవనాలతో నడుపుకొచ్చిన చంద్రబాబు తీరు ప్రజల్లో అపనమ్మకం కలిగించిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వేసిన తప్పటడుగులు ఆయనకు గుదిబండలుగా మారాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చేసిన డ్రామా, హంగామా అంతాఇంతా కాదు. ఏపీ ఎన్నికల్లోనూ తాను గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి, చేపట్టిన పనులను ప్రజలకు చెప్పకుండా కేవలం ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడమే కాకుం డా తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన రాజకీయ జిమ్మిక్కులు లాభిస్తాయని బాబు భావించినా.. అవే ఆయనకు బూమరాంగ్ అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.

గత ఎన్నికల్లో స్వల్పతేడాతో ఓడిన వైసీపీ

గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ, ప్రతిపక్ష వైసీపీతో పోల్చితే అత్యంత స్వల్ప ఓట్ల ఆధిక్యం వచ్చిం ది. అప్పట్లో టీడీపీకి 44.61% ఓట్లు రాగా, వైసీపీకి 44.58% ఓట్లు దక్కాయి. అంటే కేవలం 0.03 ఓట్ల తేడాతోనే టీడీపీ 102 స్థానాలు కైవసం చేసుకోగా వైసీపీ 67 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. అదేవిధంగా లోక్‌సభ స్థానాల్లో టీడీపీ గతంలో 15 స్థానాలు కైవసంచేసుకోగా, వైసీపీ ఎనిమిది స్థానాలు దక్కించుకుంది. కానీ తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనూహ్య తీర్పు ఇచ్చారు.

cm-jagan

పులివెందుల నుంచి.. సీఎం దాకా..

జగన్మోహన్‌రెడ్డి ప్రస్థానం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యెదుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డి 1972 డిసెంబర్ 21న పులివెందులలో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మకు ఏకైక కుమారుడు. జగన్‌కు సోదరి షర్మిల ఉన్నారు. జగన్ భార్య భారతి, ఇద్ద రు అమ్మాయిలు హర్షారెడ్డి, వర్షారెడ్డి ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం పులివెందులలో, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, కోఠి హనుమాన్ టేక్డీలోని ప్రగతి మహావిద్యాలయలో సాగింది. నిజాంకాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బీకాం, మాస్టర్ ఆఫ్ బిజినెస్ చదివారు. 2009లో మొదటిసారిగా కడప లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు. 2010 నవంబర్ 29న కాంగ్రెస్‌కు రాజీనామాచేశారు. 2010లో కడప లోక్‌సభ స్థానానికి రాజీనామాచేశారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో 5,45,043 ఓట్ల మెజార్టీతో తిరిగి ఎన్నికయ్యారు. 2011లో వైసీపీని స్థాపించారు. 2014లో పులివెందుల నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీ ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 2017లో ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించి, 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్రచేశారు.

తాయిలాలకు తలొగ్గని ఏపీ ఓటర్లు

ప్రజాసంక్షేమమంటే కేవలం ఎన్నికల ముందు ఓట్ల కొనుగోలు పథకాలుగా చంద్రబాబు భావించారనే విమర్శలున్నాయి. అందుకే ఐదేండ్లకాలంలో నాలుగున్నరేండ్లు పాలనను గాలికొదిలి, చివరి ఐదారునెలల్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేందుకు ప్రయత్నించారు. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి వంటి వాటికింద వేల కోట్లు పంపిణీ చేసి.. ఓట్లను కొనుగోలుచేయాలని చూశారు. కానీ.. ఈ పథకాల వెనుక పథకాన్ని గమనించిన ప్రజలు.. దానిని ఎన్నికల జమ్మిక్కుగానే గ్రహించి అదునుచూసి దెబ్బకొట్టారు. వైసీపీ విజయంలో మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు వేయడం కూడా కీలకంగా మారిందని అంటున్నారు.

jagan-sai-reddy

నూతన సీఎంతో ఆత్మీయ ఆలింగనం

ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆత్మీయ ఆలింగనంతో అభినందనలు తెలిపినట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో తమ అధినేత వైఎస్ జగన్‌ను గురువారం ఉదయం స్వయంగా కలిశానని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సైతం ట్విట్టర్‌లో పొందుపరిచారు.

ఇది ఏపీ ప్రజల విజయం

ఫేస్‌బుక్‌లో జగన్ కృతజ్ఞతలు
ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీ ప్రభంజ నం సృష్టించింది. ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ ఫేస్‌బుక్ పేజీలో స్పందించా రు. వైసీపీని ఆశీర్వదించిన అశేష ప్రజానీకానికి, పెద్దఎత్తున ఓటుహక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటిచెప్పిన యావ త్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని ఫేస్‌బుక్‌లో జగన్ పోస్ట్‌చేశారు.

ఓడిపోయాను.. కానీ పారిపోను: పవన్

ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఓడిపోయినంత మాత్రాన తాను పారిపోనని స్పష్టంచేశారు. కేంద్రంలో మరోమారు సత్తాచాటిన మోదీకి, భారీ మెజార్టీతో గెలిచిన జగన్‌కు నా శుభాకాంక్షలు. రెండు స్థానాల్లో ఓడిపోయినా.. పారిపోయే ప్రసక్తిలేదు. నా కడ శ్వాసవరకు రాజకీయాల్లోనే ఉంటా. ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటంచేస్తా అని ప్రకటించారు.

తెలంగాణలో ఊసులో లేని జనసేన

తెలంగాణలో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని 12 చోట్ల పోటీపడిన జనసేన కనీసం మూడో స్థానం కూడా దక్కించుకోలేదు.
ycp-jagan3

13539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles