రైతు సంక్షేమం భేష్

Tue,October 22, 2019 03:18 AM

-యువతను వ్యవసాయంవైపు మళ్లించాలి
-దక్షిణాది రాష్ర్టాల వాణిజ్య వ్యవసాయ సదస్సులో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశంసించారు. వ్యవసాయం, రైతు సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళ్తున్నదని కొనియాడారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించే యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌత్ ఇండియా ప్రాంతీయ సదస్సును సోమవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి తమిళిసై ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శనలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స్వయాన రైతు అయిన నిరంజన్‌రెడ్డి వ్యవసాయశాఖమంత్రిగా ఉండటం వల్ల అన్నదాతలకు మరింత మేలు జరుగుతున్నదని పేర్కొన్నారు. వ్యవసాయం వైపు యువతను మరింత ఆకర్షించాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా వర్సిటీ ఈ సదస్సు నిర్వహించడం సంతోషకరమని తమిళిసై అన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు మంచి కృషిచేస్తున్నారని ఆమె కితాబిచ్చారు. వచ్చేనెల గవర్నర్ల సదస్సు జరగనున్నదని, అందులో రైతాంగ అభివృద్ధిలో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవసాయం అంశంపై మాట్లాడుతానని తెలిపారు. రైతుల ఆదాయం పెరగడానికి, వ్యవసాయరంగ సంక్షేమానికి ప్రధానమంత్రి మోదీ అనేక చర్యలు తీసుకొంటున్నారని పేర్కొన్నారు.

ఆదర్శ రైతుల విజయాలే రోల్ మోడల్: మంత్రి నిరంజన్‌రెడ్డి

వ్యవసాయంలో కొత్త పరిజ్ఞానం, మార్కెటింగ్ పద్ధతుల గురించి గ్రామీణ యువతకు శిక్షణ ఇవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదర్శ రైతుల విజయగాథలను అందరికీ రోల్ మోడల్‌గా చూపాలని సూచించారు. ఈ సదస్సులో ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా, సెయింట్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు, దక్షిణాది రాష్ట్రాల వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles