సుస్థిరాభివృద్ధికి యువత కదలాలి


Sun,January 20, 2019 02:15 AM

Youth should fight for the rights

-ప్రపంచ సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే
-రోజూ 80 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు
-90 శాతం యువత అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే
-యువత ప్రపంచాన్ని గెలిచేందుకు ఈ సమావేశం తొలి అడుగు
-గాంధేయవాది అన్నా హజారే అందరికీ స్ఫూర్తిదాయకం
-జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ఎంపీ కవిత
నేను సంతోషంగా లేను.. ఈ ప్రపంచంలో ప్రతి ఏడాది 22,000 మంది చిన్నారులు అకాలమరణం చెందుతున్నారు. ప్రతిరోజు 80 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రోజులు గడుస్తున్నకొద్దీ మనం విషపూరితమైన గాలిని పీల్చుతున్నాం. ఆధునిక ప్రపంచంలో కూడా ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకే నేను సంతోషంగా లేను. వీటన్నింటికి అంతం పలుకాలి. ఇవన్నీ మనం సృష్టించుకున్నవే. కలిసికట్టుగా ఉండి పోరాటం చేయాలి. మేధావులు, ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలి. ఈ సదస్సు వేదికగా ఒక పరిష్కారం ఆలోచించాలి.
-జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ఎంపీ కవిత


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు ప్రపంచంలోని యువత కదలాలని, కలిసికట్టుగా పోరాటం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అని, వాటికి పరిష్కారం కనుగొనేందుకు మేధావులు, యువ నాయకులు ముందుకు రావాలని అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును ఏర్పాటు చేశామని, పెద్ద సంఖ్యలో ప్రపంచదేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమని చెప్పారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రపంచాన్ని యువత గెలిచేందుకు ఈ సదస్సు ఒక తొలి అడుగుగా నిలువాలని ఆకాంక్షించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో శనివారం జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అధ్యక్షోపన్యాసం చేశారు. గాంధేయమార్గంలో సుస్థిరాభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మనం ముందుకు పోవాలంటే ఆకలి చావులు, అకాల మరణాలు, హింస అనే వాటికి మొదలు అంతం పలకాలని, మనకు మనం సృష్టించుకున్న ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులు, ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత దృష్టి కేంద్రీకరించాలని కవిత కోరారు.

వీటిపై పోరాటం చేసేవారిని కలుపుకొని ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలని, యువ నేతలు, యువత.. ఇలా అందరం కలిసి పనిచేసినప్పుడు ఈ సమస్యల నుంచి ప్రపంచానికి విముక్తి చూపించగలమని అన్నారు. ఈ లక్ష్యంలో గాంధేయవాది అన్నా హజారే అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవటం గొప్ప విషయమని, మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధిని గొప్పగా నిలబెట్టారంటూ కరువు గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా చేసిన క్రమాన్ని వివరించారు. గాంధీ స్ఫూర్తిని పాటించి గ్రామాన్ని ఆర్థికంగా నిలబెట్టారని, అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన మార్గదర్శకం ప్రకారం సుస్థిరాభివృద్ధి వైపు ప్రపంచం నడవాలని ఆశిస్తున్నామన్నారు.

kavitha-jagruthi3

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 90 శాతం యువత

ప్రపంచ జనాభాలో 42 శాతం మంది 35 ఏండ్లకంటే తక్కువ వయసున్నవారేనని, 25 శాతం మంది 15-29 మధ్య వయసువారేనని ఎంపీ కవిత చెప్పారు. ప్రపంచంలో మొత్తంగా 180 కోట్ల యువ జనాభా ఉందని, అందులో 90 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనేనని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన - చెందుతున్న దేశాల్లో జీవిస్తున్న యువత మధ్య పెద్ద తేడా ఉందని చెప్పారు. దీని గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. యువత మరణాల శాతం ధనిక దేశాలతో పోల్చితే పేదదేశాల్లో ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పేద దేశాల్లో యువతకు సరైన విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు ఉండటం లేదు. ఈ సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. తారతమ్యాలు ఎలా తొలగించాలి అనేది ఈ సదస్సు వేదికగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి అని ఆమె కోరారు. యువత అంటే కేవలం పురుషులే కాదని, మహిళలు కూడా భాగమేనని, లింగ సమానత్వం కోసం ఇంకా పోరాటం చేయాల్సి వస్తున్నదని కవిత అన్నారు. యువతులు ఎంతో మంది విద్య, ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంటున్నారని, హెచ్‌ఐవీ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉండటం బాధాకరమైన విషయమని చెప్పారు. చాలా దేశాల నుంచి ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన యువత ప్రపంచాన్ని మార్చే విధంగా కొత్త పరిష్కారాలు చూపాలని కోరుకుంటున్నానన్నారు.

kavitha-jagruthi2

యువత హక్కుల కోసం పోరాటం చేయాలి

యువత హక్కుల కోసం పోరాటం చేసినప్పుడే మార్పు సాధ్యమవుతుందని, ప్రతి దేశంలో ఉన్న యువత పోరాటం చేయడం ఎలా.. అనే దానికి ఈ సదస్సు సమాధానం చెప్తుందని ఎంపీ కవిత తెలిపారు. సరైన విధానాలు రూపొందించి, యువతను సరైన మార్గంలో నడిపిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కాని ప్రపంచంలో ఎన్ని దేశాలు యువతను ప్రోత్సహిస్తున్నాయి. వారిపై పెట్టుబడి పెడుతున్నాయి. భారత్‌కు యువతను ప్రోత్సహించే విధానం ఉంది. కాని యువతకు సరిపోయేంత పెట్టుబడి జరుగుతుందా అంటే లేదు అని ఆమె అన్నారు. అందుకే వివిధ సంస్థల మధ్య ఒక నెట్‌వర్క్ రూపొందించాలని, ప్రతి దేశంలోని యూత్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి పనిచేయాలని చెప్పారు. అప్పుడు అనుకున్నవన్నీ సాధ్యమవుతాయని, యువత మీద ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పెట్టుబడి చేస్తాయని.. ఈ సమావేశం ముఖ్య లక్ష్యం కూడా అదేనని ఆమె అన్నారు. ఇది సాధ్యపడుతుందా అని ఆలోచించకండి. పెద్ద లక్ష్యం ఏం కాదు. అసాధ్యం కూడా కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఈ సదస్సు కూడా ప్రపంచ సమస్యల పరిష్కారానికి, యువత హక్కుల పోరాటానికి మొదటి అడుగులాంటిది. మొదట పట్టించుకోరు.. తర్వాత అపహాస్యం చేస్తారు. నీపై పోరాటం చేస్తారు.. అయినప్పటికీ విజయం సాధిస్తావు అనే మహాత్ముడి స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అని కవిత పిలుపునిచ్చారు.

844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles