యంగెస్ట్ స్టేట్.. గ్రేటెస్ట్ పోలీస్

Sat,May 20, 2017 03:06 AM

దేశాధినేతల ప్రశంసలందుకోవడం గర్వంగా ఉంది: సీఎం కేసీఆర్
పేదలకు పోలీసులు పెద్దదిక్కు కావాలి
-త్వరలో 15 వేల మంది పోలీసుల నియామకం
-పోలీసు శాఖకు రూ.500 కోట్లు బహుమానంగా ఇస్తున్నా
-అర్హులైన వారందరికీ పదోన్నతులు
-బాధితులు, పీడితుల పక్షాన పోలీసులుండాలి
-కల్తీలు, నకిలీలు, మోసాల నుంచి ప్రజలను కాపాడాలి
-పేకాట, గుడుంబాను అరికట్టడంలో విజయం సాధించిన పోలీసులు
-శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే తెలంగాణ ఆదర్శం
-పోలీసుల విస్తృతస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా.. గ్రేటెస్ట్ పోలీస్ ఇన్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం దేశాధినేతల ప్రశంసలు అందుకున్నదని, ఇది తనకు సంతోషంగా, గర్వంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతోపాటు అనేకమంది ప్రముఖులు తెలంగాణ పోలీసులను ఎన్నో రకాల ప్రశంసించారని తెలిపారు. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, ఉగ్రవాద సమస్యలు ఎక్కువవుతాయని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని కొందరు అపోహలు సృష్టించారని, కానీ మన పోలీసులు చాలా తక్కువ సమయంలోనే ఆ అపోహలను పటాపంచలు చేశారని అన్నారు. శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే తాను రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతున్నానని చెప్తూ.. ఈ ఘనత రాష్ట్ర పోలీసులదేనన్నారు. ఈవ్ టీజింగ్, పేకాట, గుడుంబాలను అరికట్టడంలో విజయవంతమైన పోలీసులు కల్తీలు, నకిలీలు, మోసాల నుంచి ప్రజలను కాపాడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏ దిక్కూలేని వారికి దేవుడే దిక్కు అనే నానుడి ఉందన్న సీఎం.. పోలీసులు భగవంతుడి అవతారమెత్తి పేదవాళ్లకు, దిక్కూమొక్కూలేని వారికి, నిస్సహాయులకు అండగా ఉండాలని కోరారు. బాధితులు, పేదలు, పీడితుల పక్షాన పోలీసులు నిలువాలని సూచించారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే కాకుండా సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్న పోలీసులు అభినందనీయులని సీఎం కేసీఆర్ అన్నారు.
cmkcr
శుక్రవారం హెచ్‌ఐసీసీలో రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల విస్తృత స్థాయి సదస్సు జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభోపన్యాసం చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, డీజీలు అంజనీకుమార్, కృష్ణప్రసాద్ ఇతర సీనియర్ పోలీసు అధికారులు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత పోలీసులదని ప్రశంసించారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నందునే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో మరో 15వేల మంది ఉద్యోగులను నియమించడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పోలీసు శాఖకు రూ.500 కోట్లు బహుమానంగా ఇస్తున్నానని, కొత్త వాహనాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనకోసం ఈ సొమ్మును వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగంలోని విశేషాలు ఆయన మాటల్లోనే..

టోపీపైనా, బెల్టుపైనా, లాఠీపైనా భారతదేశ అధికారిక చిహ్నమైన మూడు సింహాలు ధరించే గొప్ప అవకాశం, అదృష్టం పోలీసులకు కలిగింది. కాబట్టి మీపై గొప్ప బాధ్యత ఉంది. జిస్కా కోయీ నహీ హోతా హై.. ఉస్కా తెలంగాణ పోలీస్ హోతా అన్న విధంగా పనిచేయాలి. పోలీసులంటే ప్రజల్లో భయంపోయి, స్నేహితులన్న భావన రావాలి.
- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

cmkcr1

ఉద్యమానికీ సహకారం అందించారు..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు జరిగిన ఉద్యమానికి యూనిఫాంలో ఉండి కూడా పోలీసులు తమ వంతు సహకారం అందించారు. అందరం కలిసి, కష్టపడి తెలంగాణ సాధించుకున్నం. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే విషయంలో కూడా పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పోలీసు వ్యవస్థ అత్యంత కీలకమైనది. ఇది బాగుంటేనే మిగతావి బాగుంటాయి. శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే నేను కూడా వేరే విషయాలపై దృష్టి పెట్టగలుగుతున్నాను. లేదంటే దీంతోనే సరిపోయేది. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, తీవ్రవాద సమస్యలు ఎక్కువవుతాయని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అపోహలు సృష్టించారు. కానీ మన పోలీసులు చాలా తక్కువ సమయంలోనే వాటిని పటాపంచలు చేశారు. నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి మన పోలీసుశాఖను ఎన్నో రకాల ప్రశంసిస్తుంటారు. కనీసం ఓ డజనుసార్లు ప్రశంసించి ఉంటారు. తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడమే కాకుండా దేశ భద్రతావ్యవస్థకు దోహపడే విధంగా పనిచేస్తున్నారు.

యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా.. గ్రేటెస్ట్ పోలీస్ ఇన్ ఇండియాగా మారింది. ఇది నాకు సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తున్నది. కొంత మార్పు వచ్చినప్పటికీ పోలీసు శాఖ ఇంకా మెరుగుపడాలి. అత్యుత్తమ ఫలితాల సాధనకోసం నిరంతరం కృషి చేయాలి. ఎప్పుడూ రిలాక్స్ అవకూడదు. ఒక దశ తర్వాత మరో దశ అనే లక్ష్యంతో పనిచేయాలి. డీజీపీ, హోం మంత్రి కొన్ని అంశాలపై దృష్టిపెట్టాలి. ఎస్సై, సీఐ ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. పోలీసులంటే ప్రజల్లో భయం పోవాలి. స్నేహభావం కలుగాలి. పోలీసు శాఖ కూడా ఉన్నతం కావాలి. మహిళా పోలీసు ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. నేను భూపాలపల్లి, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మహిళాపోలీసులు కొన్ని సమస్యలు చెప్పారు. వారికి కొన్ని సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

అర్హులైన వారందరికీ పదోన్నతులు

జోన్ల సమస్యను స్ట్రీమ్‌లైన్ చేసుకోవాలి. పోలీసు శాఖ లో అన్ని విభాగాల్లో అర్హులైన అందరికీ వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టు లు సృష్టించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి సేవలను వినియోగించుకున్నప్పుడు వారికి కావాల్సిన పదోన్నతులు, దక్కాల్సిన గౌరవం అందాలి. రిటైరైన ఉద్యోగులకు చివరి రోజే పెన్షన్ డబ్బులు అందాలి. వారు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం తిరుగాల్సిన పరిస్థితి ఉండకూడదు. రిటైరైన ఉద్యోగిని ఘనంగా సన్మానించి, పోలీస్ వాహనంలోనే ఇంటిదాకా దించి రావాలి. అప్పుడు ఉద్యోగులకు నైతికబలం వస్తుంది.
cmkcr2

ఏం కావాలో చెప్తే చేస్తాం

దేశంలో మరెక్కడా లేనివిధంగా పోలీసుల సంక్షేమానికి, పోలీసుశాఖ పటిష్ఠానికి చర్యలు తీసుకున్నాం. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాం. దాదాపు 4వేల కొత్త వాహనాలు సమకూర్చాం. ఇంకా అవసరమైన కొత్త వాహనాలను సమకూర్చుకోవాలి. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవాలి. ఇందుకోసం రూ.500 కోట్లు బహుమతిగా ఇస్తాను. 12వేల మందిని కొత్తగా నియమించాం. రాబోయే కాలంలో మరో 15 వేల మందిని నియమిస్తాం. ఎస్సైలు, డీఎస్పీల పోస్టులను కూడా భర్తీచేస్తాం. ట్రాఫిక్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేసే వారికి రిస్క్ అలవెన్స్ ఇస్తున్నాం. పోలీసు స్టేషన్ల నిర్వహణకు ఆయా స్టేషన్ల స్థాయినిబట్టి నెలకు రూ.25వేలు, రూ.50వేలు, రూ.75వేలు ఇస్తున్నాం. హోంగార్డులను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వారిని రెగ్యులర్ స్కేల్ ఎంప్లాయీస్‌గా తీసుకునే విషయంపై సమాలోచనలు చేస్తున్నాం. పోలీసు శాఖకు కావాల్సిన అత్యాధునిక ఆయుధాలను తెప్పిస్తాం. పోలీసులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏం కావాలో చెప్తే వాటినీ సమకూరుస్తాం. ఈ విషయంలో ఏ స్థాయి అధికారి అయినా సరే మాకు సలహా ఇవ్వవచ్చు.

గుడుంబా, పేకాట అరికడితే ప్రత్యేక ప్రోత్సాహకాలు

పోలీసులు అనేక విషయాల్లో గొప్పగా, అద్భుతంగా పనిచేశారు. పేకాట, గుడుంబాను అరికట్టడంలో అద్భుత విజయం సాధించారు. వందశాతం గుడుంబా, పేకాట అరికట్టిన స్టేషన్లకు ప్రోత్సాహకాలు ఇస్తాం. రౌడీయిజం, గుండాయిజం కూడా తగ్గింది. షీ టీమ్స్ గొప్పగా, అద్భుతంగా పనిచేస్తున్నాయి. మహిళలకు భద్రత ఏర్పడింది. మట్కా, గుట్కాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. వాటిపై కఠినంగా వ్యవహరించాలి. కల్తీ, నకిలీ, మోసాలపై దృష్టి పెట్టాలి. కారం, పసుపు, పాలు, గుడ్లు, బియ్యం ఇలా ప్రతీ వస్తువు కల్తీ అవుతున్నది. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ పాస్‌పోర్టులు వస్తున్నాయి. అనేక విషయాల్లో ప్రజలకు మోసాలు ఎదురవుతున్నాయి. వీటన్నింటి విషయంలోనూ పోలీసులు దృష్టి పెట్టాలి. టోపీపైనా, బెల్టుపైనా, లాఠీపైనా భారతదేశ అధికారిక చిహ్నమైన మూడు సింహాలు ధరించే గొప్ప అవకాశం, అదృష్టం పోలీసులకు కలిగింది. కాబ ట్టి మీపై గొప్ప బాధ్యత ఉంది. జిస్కా కోయీ నహీ హోతా హై.. ఉస్కా తెలంగాణ పోలీస్ హోతాహై అన్న విధంగా పనిచేయాలి. పోలీసులు అంటే ప్రజల్లో భయంపోయి, స్నేహితులన్న భావన రావాలి. నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క అక్రమం కూడా జరుగొద్దు అని ఎస్సై అనుకుంటే ఒక్క నేరం కానీ, మోసం కానీ జరుగదు. డీజీపీ అనుకున్నదానికన్నా ఎస్సై అనుకుంటే చాలా సాధించవచ్చు.
cmkcr3

పోలీసులు బాధితులు, పీడితుల పక్షాన నిలువాలి. డబ్బున్నోళ్లు, పలుకుబడి కలిగినోళ్లు ఎలాగోలా పనులు చేయించుకుంటరు. కానీ పేదవారికి దేవుడే దిక్కు. మీరు దేవుళ్లుగా మారాలి. అసహాయులకు, పేదవాళ్లకు, బాధితులకు అండగా నిలువాలి. వారికి న్యాయం చేయాలి. మహిళల పట్ల పోలీసులు తల్లిదండ్రులుగా వ్యవహరించాలి. సమాజంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మా ప్రభుత్వంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు లేవు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకుండా పనిచేసే స్వేచ్ఛ పోలీసులకు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి. అద్భుతమైన పోలీసు వ్యవస్థ ఎక్కడున్నదంటే.. తెలంగాణలో అనే మాట వినపడాలి.

పోలీస్ అధికారుల పనితీరు భేష్..

పట్టణాలు, నగరాల్లో కొత్త తరహా నేరాలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో రకరకాల నేరాలను అదుపు చేయడానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ గొప్పగా విధులు నిర్వర్తించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇతర కార్పొరేషన్లు, నగరాల్లో కూడా శాంతిభద్రతల పర్యవేక్షణ విషయంలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని మహేందర్‌రెడ్డిని కోరుతున్నా. పోలీసులు తమ విధులే కాకుండా ప్రభుత్వం అప్పగించిన ఇతర బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో సీవీ ఆనంద్ గొప్పగా పనిచేస్తున్నారు. షీ టీమ్స్ పెట్టి స్వాతిలక్రా, గుడుంబా నియంత్రణ విషయంలో అకున్ సబర్వాల్ బాగా పనిచేస్తున్నారు. ఇంకా అనేక మంది పోలీసులు సామాజిక బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారు. అందరికీ అభినందనలు అని ముఖ్యమంత్రి చెప్పారు.
police

నవ్వులు పూయించిన సీఎం

తన ప్రసంగంలో సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నవ్వులు పూయిస్తే.. కొన్ని సందర్భాల్లో హర్షధ్వానాలు మారుమోగాయి. జిల్లా స్థాయిలో ఎస్పీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకుంటరు. ఎస్పీ, డీఎస్పీ లు, సీఐలు, ఎస్సైలు కలిసి మాట్లాడుకుంటరు. దాని పేరు క్రైమ్ మీటింగ్ అని పెట్టుకుంటరు. పోలీసులంతా కూర్చుని క్రైమ్‌మీటింగ్ పెట్టుకుంటరా? దొంగలు క్రైమ్ మీటింగ్ పెట్టుకుంటరు అని సీఎం చతురోక్తి విసరడం తో సదస్సులో నవ్వులు విరబూశాయి. క్రైమ్ మీటింగ్, క్రైమ్ రివ్యూ, క్రైమ్ స్టేషన్.. ఇలాంటి పేర్లు మార్చాలని సూచించారు. మరో సందర్భంలో రాజకీయ పార్టీలు పోలీసులను ఉపయోగించుకోవడమే తప్ప వారి గురించి గొప్పగా మాట్లాడవు. కానీ టీఆర్‌ఎస్ పార్టీ పోలీసుల పనితీరును ప్రశంసించి, దాన్నో ప్రచారాస్త్రంగా ఎన్నికల్లో వాడుకుంది. షీ టీమ్స్‌తో పాటు ఇతర నేరాలను అదుపు చేయగలిగినందుకు మాకు ఓట్లేయమని మేము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కోరినం. ప్రజలు టీఆర్‌ఎస్‌కు 99 మంది కార్పొరేటర్లను ఇచ్చారు. ఇది దేశంలో ఎక్కడా జరుగలేదు అని ముఖ్యమంత్రి అనడంతో సభలో చప్పట్లు మార్మోగాయి.

సీఎంకు పుష్పగుచ్ఛం అందించిన పోలీసు జాగిలం

సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటుచేసిన పోలీస్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక పోలీసు జాగిలం సీఎంకు పుష్పగుచ్ఛం అందించి.. స్వాగతం పలికింది. ఇతర జాగిలాలు కూడా సీఎంకు సెల్యూట్ చేశాయి. బాంబు స్క్వాడ్, ప్రొటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్‌మెంట్, సెర్చ్ అండ్ డిటెన్షన్ ఎక్విప్‌మెంట్ తదితరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగం ఎలా పనిచేస్తాయో సీఎంకు పోలీసులు ప్రదర్శించి చూపారు. పోలీసులు వాడే వివిధ రకాల ఆయుధాలను, వాటి సామర్థ్యాన్ని కూడా సీఎంకు వివరించారు. డ్రగ్స్‌ను గుర్తించే అధునాతన పరికరాలను, వేలిముద్రలను గుర్తించే ప్రక్రియను, వేలి ముద్రల ద్వారా నేరస్తుల చరిత్రను అనుసంధానం చేసే ప్రక్రియను సీఎం ఆసక్తిగా గమనించారు. దొంగనోట్లను గుర్తించే పరికరాలు, వాటి పనితీరును తెలుసుకున్నారు. షీ టీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి? పోకిరీలను ఎలా గుర్తిస్తున్నాయి కూడా ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి చూపారు. డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి పోలీసు విభాగాలను చూపించి, వివరించారు.

1566

More News

మరిన్ని వార్తలు...