గోరఖ్‌పూర్ ఘోరకలి!


Sun,August 13, 2017 06:33 AM

Yogi Adityanth calls deaths a despicable incident Anupriya Patel to visit hospital

63కు చేరిన శిశువుల మరణాలు
- దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషాదం
- ఆక్సిజన్ సరఫరా లేకే పిట్టల్లా రాలిపోయిన చిన్నారులు
- ఆక్సిజన్ సరఫరాదారుకు నెలలుగా బకాయిలు చెల్లించని ప్రభుత్వ దవాఖాన
- పేరుకుపోయిన బకాయిలు రూ.64 లక్షలు
- గంటల వ్యవధిలోనే చిన్నారుల మృత్యువాత
- పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్లను నిలిపివేసిన సరఫరాదారు

children
ప్రాణాలు కాపాడాల్సిన దవాఖాన ప్రాణాలు తీసే వధశాలగా మారింది. అది కూడా.. అప్పుడే పుట్టి కండ్లు తెరిచిన పసికందుల ప్రాణాలు తీసింది. ఒక్కరు ఇద్దరు కాదు.. 63 మంది చిన్నారులు ఆ దవాఖానలో కొన్ని గంటల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బాబా రాఘవ్‌దాస్ (బీఆర్డీ) ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో జరిగిన ఈ ఘోరకలి దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆవేదనను కలిగించింది. ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులకు, నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిన్నమొన్నటివరకు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఈ దవాఖాన ఉంది. ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థకు కొన్ని నెలలుగా 64 లక్షల బకాయిలు చెల్లించకపోవటంతో.. విజ్ఞప్తులు చేసీ చేసీ విసిగిపోయిన సరఫరాదారు దవాఖానకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయటం ఆపివేశాడు. దీంతో ప్రాణవాయువు లేకపోవటంతో.. చికిత్స విభాగంలో ఉన్న చిన్నారులు చూస్తుండగానే పిట్టల్లా రాలిపోయారు. నాలుగురోజుల వ్యవధిలో 63 మంది కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శల వర్షం కురుస్తున్నది. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. యూపీ ప్రభుత్వం మాత్రం.. చిన్నారుల మృతికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటం కారణం కాదంటూ, తమ వైఫల్యం లేదని చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగానే పిల్లలు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దర్యాప్తులో అసలు కారణం వెల్లడవుతుందని చెప్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్‌మిశ్రాను వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలిపాయి.

గోరఖ్‌పూర్, ఆగస్టు 12: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా బాబా రాఘవ్‌దాస్ (బీఆర్‌డీ) ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో ఆక్సిజన్ అందకపోవడం వల్లే పసికందులు మరణించినట్టు తెలుస్తున్నది. నాలుగురోజుల వ్యవధిలో ఆ దవాఖానలో మరణించిన చిన్నారుల సంఖ్య 63కు చేరుకున్నది. నవజాత శిశువుల మరణాలు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కాదని ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికీ, గత పక్షం రోజులుగా దవాఖానలోని ఎమర్జెన్సీ విభాగానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల ఆ దవాఖానలో 21 మంది పిల్లలు మృతిచెందినట్టు జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందిందని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. దవాఖానను సందర్శించి ఒక నివేదిక రూపొందించాలని సీఎం ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సహచరులు ఇద్దరిని పురమాయించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 63 కుటుంబాలకు గర్భశోకం మిగిల్చిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. దవాఖాన నుంచి తనకు రూ.64 లక్షల వరకు బకాయిలు రావలసి ఉన్నదని, 30 మంది పసిపిల్లలు మరణించిన తరువాతనే ఆగమేఘాల మీద రూ.20.84లక్షలు తనకు చెల్లించారని దవాఖానకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టు సంస్థ పుష్పా సేల్స్ తెలిపింది. మరోవైపు బీఆర్‌డీ దవాఖానలో తమ పిల్లలకు వైద్యులు సరైన చికిత్సనందించడం లేదని, కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ అధకారులు లక్నోలోని ఆక్సిజన్ సరఫరా యూనిట్‌పై శనివారం దాడులు జరిపారు. దవాఖానకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయడం పట్ల ఆ సంస్థపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
Ghorakpur

చిన్నారుల మృతికి ఆక్సిజన్ కొరత కాదు: యూపీ సీఎం


గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ కొరత వల్ల చిన్నారులు మరణించలేదని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో కమిటీని నియమించిన తర్వాత ఆయన ఆదివారం హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోరఖ్‌పూర్‌లో చిన్నారులను బలిగొంటున్న మెదడువాపు వ్యాధి ప్రభావం గురించి ఎంతోకాలంగా అధికారులతో మాట్లాడుతున్నా. ఇది నాకు చాలా భావోద్వేగాలతో కూడిన అంశం. ఈ నెల 9న దవాఖాన అధికారులతో జరిగిన భేటీలో చిన్నారులకు సంబంధించిన పలు వ్యాధులు, వాటికి అందిస్తున్న చికిత్స గురించి అధికారులు నాతో చర్చించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చాను. కానీ, దవాఖానలో ఆక్సిజన్ కొరత ఉన్న విషయాన్నే చెప్పలేదు. అయితే, ఆక్సిజన్ సిలిండర్లకు అవసరమైన నిధుల కోసం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంబంధిత ఉన్నతాధికారికి లేఖ రాశారు. ఈనెల 5న నిధులను కూడా విడుదల చేశాం. కానీ, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాదారుకు ఆ నిధులను ప్రిన్సిపాల్ చెల్లించలేదు. ఆయన బాధ్యతారహితంగా వ్యవహరించారు అని సీఎం చెప్పారు. చిన్నారుల మృతికి ఆక్సిజన్ కొరతే కారణమని వచ్చిన వార్తలు నిజమైతే అది అత్యంత హేయమైన విషయం అని పేర్కొన్నారు. పసికందుల మరణాలపై ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని వైద్య విద్యా శాఖ మంత్రి అశుతోష్ టాండన్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను వెంటనే సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు.

ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం నిజమే


దవాఖానలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన మాట నిజమేనని గోరఖ్‌పూర్ జిల్లా యంత్రాంగం అంగీకరించింది. అయితే పిల్లల మరణాలకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటానికి సంబంధం లేదని తెలిపింది. 800 పడకలు ఉన్న ఈ దవాఖానలో గురువారం రాత్రి రెండుగంటల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమయంలో ఎవరూ చనిపోలేదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7వ తేదీ నుంచి వేర్వేరు వ్యాధుల కారణంగా 60 మంది పసికందులు మరణించినట్టు దవాఖాన పీడియాట్రిక్ విభాగం నుంచి తనకు సమాచారం అందిందని ఆరోగ్య మంత్రి సిద్దార్థ్‌నాథ్‌సింగ్ చెప్పారు. గోరఖ్‌పూర్‌లో పసికందుల మరణాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది.
Cylinders

యూపీ సీఎం రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్


గోరఖ్‌పూర్ ప్రభుత్వ దవాఖానలో 60 మందికిపైగా పసిపిల్లల మరణాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరోగ్య శాఖ మంత్రి సిద్దార్థ్‌నాథ్‌సింగ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్, మరికొందరు నేతలు శనివారం గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికాల్ కాలేజీ దవాఖానను సందర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసికందులు ప్రాణాలు కోల్పోయారని ఆజాద్ ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో పసికందుల మరణాలను ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంగా సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీలు అభివర్ణించాయి.

అది నరమేధం : కైలాశ్ సత్యార్థి


గోరఖ్‌పూర్ ప్రభుత్వ దవాఖానలో పసిపిల్లల మరణాలపై నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్ధి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా లేని కారణంగా చిన్నారులు మరణించడం విషాదం కాదు, నరమేధం అని ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు.
Parents1

దవాఖాన కాదు వధశాల!


నాలుగురోజుల కొడుకును కోల్పోయిన ఓ తండ్రి ఆవేదన
అది తమ ప్రాంతం (గోరఖ్‌పూర్)లోనే అతిపెద్ద దవాఖాన అని, ఆ రోజు తన కండ్ల ముందే తన కొడుకుతోపాటు కొందరు పసిపిల్లలు పిట్టల్లా రాలిపోయారని కిషన్ గుప్తా వాపోయారు. తన కొడుకు అనారోగ్యం పాలవడంతో వెంటనే బీఆర్‌డీ దవాఖానకు తీసుకొచ్చానని ఆయన చెప్పారు. వైద్యులు వెంటనే తన చిన్నారిని అడ్మిట్ చేసుకొని, ఐసీయూలో పెట్టారని తెలిపారు. అయితే నవజాత శిశువులకు పెట్టేందుకు తమ వద్ద వెంటిలేటర్లు (ఆక్సిజన్ అందించే యంత్రం) లేవని డాక్టర్లు చెప్పారని అన్నారు. నాలుగైదు గంటలపాటు ఆక్సిజన్ అందించే పంపును తాను చేతితోనే నొక్కానని ఆయన తెలిపారు. అయినప్పటికీ తన చిన్నారిని తనకు దక్కలేదని అన్నారు. దవాఖానలో ఆక్సిజన్ లేనందునే డాక్టర్లు తన కొడుకుకు వెంటిలేటర్ పెట్టలేదని స్పష్టం చేశారు. ఆ రోజు (గురువారం) ఆ దవాఖాన మెడికల్ కాలేజీలా కాకుండా వధశాల లాగా కనిపించిందని కిషన్‌గుప్తా పేర్కొన్నారు. పసిపిల్లలను బతికించేందుకు వైద్య సిబ్బంది ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. తన ముందే ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఆ వార్డు నుంచి బయటకు తరలించారని చెప్పారు.

బకాయిలు చెల్లించనందునే ఆక్సిజన్ సరఫరా నిలిపివేత?


బీఆర్‌డీ వైద్య కళాశాల యాజమాన్యం తమకు కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని, అందుకే ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తామని చెప్పామని పుష్పాసేల్స్ సంస్థ పేర్కొన్నది. ఆక్సిజన్ లేకపోవడం వల్లే 30 మంది పిల్లలు మరణించినట్టు వార్తలు వెలువడిన మరుక్షణం తమకు రావాల్సిన బకాయిల్లోంచి రూ.20.84 లక్షలు విడుదల చేశారని పుష్పాసేల్స్ అధిపతి దీపాంకర్ శర్మ చెప్పారు. బకాయిలు చెల్లించాలని తాము అడిగినప్పుడల్లా ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా నిధులు లేవని చెప్పేవారని అన్నారు. ఆయన చుట్టూ తిరుగలేకే లీగల్ నోటీసు పంపించామని దీపాంకర్ చెప్పారు. ఇప్పుడు ఒకేసారి రూ.20 లక్షలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల్లో మరో రూ.30 లక్షలు కూడా చెల్లిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. పుష్పా సేల్స్ సంస్థ ఈ నెల ఒకటో తేదీన వైద్య కళాశాల యాజమాన్యానికి రాసిన లేఖలో, తమకు రావాల్సిన రూ.64 లక్షల బకాయిలు చెల్లించకపోతే ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ లేఖ ఇప్పుడు మీడియాకు లభించింది. దవాఖానలోని ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాంట్ ఉద్యోగులు ప్రధాన వైద్యాధికారికి రాసిన లేఖ కూడా బట్టబయలైంది. తమవద్దనున్న ఆక్సిజన్ సిలిండర్లు గురువారం సాయంత్రం వరకే సరిపోతాయని, వెంటనే కొత్త సిలిండర్లను తెప్పించాలని స్టోరేజ్‌ప్లాంట్ ఉద్యోగులు ఆ లేఖలో కోరారు. వారు చెప్పినట్లే గురువారం రాత్రి 11.30 గంటలకు దవాఖానలో ఉన్న మొత్తం ఆక్సిజన్ అయిపోయినట్లు తెలిస్తున్నది. రాత్రి 1.30 గంటలకు ఆక్సిజన్ సిలిండర్ల కొత్త స్టాకు వచ్చినట్టు రికార్డులు తెలుపుతున్నాయి.
Parents

స్థానికుల ఆగ్రహం


చిన్నారుల మరణంపై గోరఖ్‌పూర్ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్వాస (ఆక్సిజన్) అందక పసికందులు కుప్పకూలుతుంటే సీనియర్ అధికారులు ఒక్కరు కూడా వచ్చి చూడలేదని భగవతి యాదవ్ అనే వ్యక్తి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ దవాఖానలో ఉత్తమ వైద్య సేవలందుతాయని ఆదిత్యనాథ్ ఎన్నికల ముందువ వాగ్దానం చేశారని గౌరీ నిషాద్ అనే చిన్నారి తండ్రి చెప్పారు. మంత్రులను పంపడానికి బదులుగా స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి దవాఖానలో పరిస్థితులను చక్కదిద్దాలని ఆదిత్యకుమార్ అనే విద్యార్థి సూచించారు. గోరఖ్‌పూర్‌లో పసిపిల్లలు మరణించే విషయాన్ని ఎంపీగా యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో ప్రస్తావించారని వినోద్‌కుమార్ సింగ్ అనే సామాజిక కార్యకర్త గుర్తు చేశారు. గత 36 ఏండ్లలో లక్ష మంది వరకు పసిపిల్లలు గోరఖ్‌పూర్‌లో మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారు దివ్యాంగులుగా మారారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది అంటూ ఆదిత్యనాథ్ నాటి సమాజ్‌వాదీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

1855

More News

VIRAL NEWS

Featured Articles