త్వరలో యాదాద్రి ప్రధానాలయం పూర్తి

Sun,October 13, 2019 02:07 AM

-నవంబర్ 15 డెడ్‌లైన్
-సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పీ భూపాల్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి ప్రధానాలయ పనులను నవంబర్ 15 వరకు పూర్తి చేస్తామని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పీ భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. శనివారం వారు ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. స్వామివారి ప్రధానాలయంతోపాటు ఆధారశిల నుంచి మహానాసి వరకు కృష్ణ శిలతో తయారు చేస్తున్న ఆలయ రాజగోపురాలు, గర్భగుడి, త్రితల రాజగోపురం (ప్రవేశ మార్గం), పడమర దిశలో ఐదంతస్తుల గోపురం (బయటకు వెళ్లేందుకు), రెండో ప్రాకారానికి పశ్చిమాన ఏడంతస్తుల మహా రాజగోపురం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తుల రాజగోపురాలను వీక్షించారు. వీటితోపాటు స్వయంభూగా కొలువై ఉన్న గర్భగుడిపై 42 అడుగుల ఎత్తున దివ్య విమానానికి జరిగిన పనులు, గోపురాల నిర్మాణ తీరుతెన్నులు, గోపురాలపై శిల్పకారులు ఆవిష్కరించిన ద్రవిడ, పల్లపు, చోళ, విజయనగరం, కాకతీయుల చిత్ర సంపదను పరిశీలించారు.

అనంతరం వైటీడీఏ అధికారులు, ఇంజినీర్లు, స్తపతులు, ఉప స్తపతులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పీ భూపాల్‌రెడ్డి, కిషన్‌రావు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవ మండపంతో కలిపి 4.35 ఎకరాల్లో నిర్మాణమవుతున్న ప్రధానాలయ పనులు 90 శాతం వరకు పూర్తయినట్టు తెలిపారు. గర్భాలయానికి జరుగుతున్న ఆర్నమెంటల్ పనులతో కలిపి నవంబర్ 15 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ ఈవో ఎన్ గీత, ఆర్కిటెక్టు ఆనందసాయి, ప్రధాన స్తపతి డాక్టర్ ఆనందాచార్యుల వేలు తదితరులు పాల్గొన్నారు.

254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles