నరసింహుడు శాంత స్వరూపుడే

Thu,December 5, 2019 03:19 AM

-కోరలు ఉంటే ఉగ్రమూర్తి కాదు
-సిందూరాన్ని అర్చకులమే తొలిగించాం
-నరసింహస్వామి అసలు రూపం దశాబ్దాలుగా ఎవరూ చూడలేదు
-నియమనిష్ఠలతో గర్భాలయం శుద్ధి
-మూలవిరాట్టుకు అపచారం చేయలేదు
-మాకు భేదాభిప్రాయాలు లేవు
-అసంతృప్తి ఉందనడం అవివేకం
-యాదాద్రి ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు
-భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతి కథనం ఉన్నదని విమర్శ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యాదాద్రి ఆలయంలో మూలవిరాట్‌కు ఎటువంటి అపచారం జరుగలేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రధాన పూజారి నల్లంతిఘల్ నర్సింహాచార్యులు స్పష్టంచేశారు. మూలవిరాట్టును శిల్పులు తాకలేదని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆర్చకులమే పూర్తి నిష్ఠ, నియమాలతో సిందూరాన్ని తొలగించామని, ఏండ్లతరబడి వేసిన సిందూరాన్ని తొలిగించడంతో స్వామివారు కొత్తగా కనిపిస్తున్నారని వివరించారు. ఇదే స్వామివారి అసలు స్వరూపమని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఎక్కడ నరసింహస్వామిని చూసినా నాలుక బయటికే ఉంటుందని తెలిపారు. యాదాద్రి స్వామివారి అసలు స్వరూపాన్ని దశాబ్దాలుగా ఎవరూ చూడలేదని చెప్పారు. యాదాద్రి ఆలయంలో అపచారం జరిగినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆ కథనంలో పేర్కొన్న అంశాలు వాస్తవంకాదని స్పష్టంచేశారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని చెప్పారు. మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి.. ఉగ్రరూపంగా జ్వాలా నరసింహస్వామి.. యోగాలన్నీ సిద్ధంపజేసేందుకు యోగానందుడుగా వెలిశాడు.. గండభేరుండ నరసింహస్వామిగా ఉన్నారు.. దయార్ద్ర నరసింహస్వామి.. ఇక లక్ష్మీనరసింహస్వామిది ఉగ్రరూపం కాదు. అసలు నరసింహస్వామి అవతారమే వాత్సల్య స్వరూపం. తన భక్తులను రక్షించుకోవడం కోసం అవతరించాడు. ప్రహ్లాదుడిని రక్షించుకునేందుకు హిరణ్యకశ్యపునికి బాధ కల్గించకుండా మోక్షం ప్రసాదించాడు. అక్కడ ఉగ్రానికే స్థానంలేదు. అలాంటప్పుడు నరసింహస్వామి ఉగ్రమూర్తి అనడం సంప్రదాయానికే మంచిదికాదు. లక్ష్మీనరసింహస్వామి శాంతమూర్తి. అలాంటప్పుడు కోరలున్నాయా అనే ప్రశ్నలు సరైనవి కావు అని నర్సింహాచార్యులు చెప్పారు. భక్తి ప్రపూర్ణుడైన నర్సింహస్వామి అన్నిరూపాల్లో ఉం టారన్నారు.

దీనిపై రాద్ధాంతంచేసేలా ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, కించపర్చేలా ఉన్నదని ఆక్షేపించారు. బుధవారం టూరిజం ప్లాజాలో ఆలయ ప్రత్యేకాధికారి కిషన్‌రావు,ఈవో గీత, స్థానాచార్యులు రాఘవాచార్యులు, అర్చకులు కారంపూడి లక్ష్మీనరసింహాచార్యులు, రంగాచార్యులు, ప్రధానశిల్పి సుందరరాజన్, ఆర్కిటెక్ట్ ఆనందసాయి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 39 ఏండ్లుగా స్వామివారికి సేవచేస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారని, ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నియమ, నిష్ఠతో ఆలయాన్ని పునర్నిస్తున్నారని లక్ష్మీనరసింహాచార్యులు చెప్పారు. బృహత్తరస్థాయిలో దేవాలయ పునర్నిర్మాణం పూర్తికావస్తున్న సమయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కోట్లమంది భక్తులను కించపరిచేలా ఉన్నదన్నారు. నరసింహస్వామిని అన్ని రూ పాల్లో కొలుస్తారన్న ప్రధాన అర్చకులు.. కోరలు ఉంటే ఉగ్రమూర్తి అవుతారా? అం టూ ప్రశ్నించారు. అమ్మవారు లేకపోతే ఉగ్రమూర్తి అవుతారని, అమ్మవారు ఉంటే శాంతమూర్తి అవుతారని వివరించారు.

మూల విరాట్టును ఎవరూ తాకలేదు

నరసింహస్వామి మూలవిరాట్టును శిల్పులు తాకలేదని ప్రధానార్చకులు నరసింహాచార్యులు స్పష్టంచేశారు. స్వామివారికి ఏండ్ల తరబడి సిందూరం వేస్తున్నామని, దీంతో దాదాపు 15 అంగుళాల మందం వరకు సిందూరం అంటుకున్నదని వివరించారు. పునర్నిర్మాణం సమయంలో శిల్పాలు చెక్కుతున్నప్పుడు దుమ్ము, ధూళి గర్భగుడిలో స్వా మివారిపై పడుతున్నదని చెప్పారు. స్వామివారికి ప్రాచీనకాలంనుంచి వేసిన సిందూరాన్ని పునర్నిర్మాణం నేపథ్యంలో తామే స్వయంగా ఉపవాసం ఉండి, నిష్ఠతో తొలిగించినట్టు తెలిపారు. వేల ఏండ్ల నుంచి స్వామివారికి సేవచేస్తున్నామని, స్వామివారిని ఎవరినీ తాకనీయబోమని చెప్పారు. సిందూరం వేసినప్పుడు చీమలు, ఎలుకలతోనూ ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఏండ్ల తరబడి అంటిన సిం దూరం తీసివేయడంతో స్వామివారి రూపం కొత్తగా కనిపిస్తున్నదని వివరించారు. స్వామివారి అసలురూపం అదేనని స్పష్టంచేశారు. సిందూరం తీయడం తప్పుకాదని చెప్పారు. సింహాచలంలో స్వామివారికి ఏటా చందనోత్సవం చేస్తుంటారని, అక్కడపైన ఉన్నది నరసింహస్వామి అయితే.. లోపల ఉన్నది వరహాస్వామి అని తెలిపారు. ఏడాదికొక్కసారి మాత్రమే దర్శనం కల్పిస్తుంటారని చెప్పారు. ఎలుకలు, పందికొక్కులు గర్భాలయం కింద భూమిని తవ్వుతుంటే ఇబ్బంది జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో 12 ఏండ్లకోసారి అష్టబంధనం చేస్తుంటారని తెలిపారు. ఇది ఆగమశాస్త్రంలోనే ఉన్నదని గుర్తుచేశారు. గర్భాలయంలో స్వామివారికి అపచారం జరుగలేదని, భవిష్యత్తులో కూడా జరుగబోదని స్పష్టంచేశారు.

దివ్యదర్శనం ఎవరూ చూడలేదు

లక్ష్మీనరసింహస్వామి దివ్యదర్శనం ఎవరూ చూడలేదని, శతాబ్దాల కిందట జగద్గురు శంకరాచార్యులు నృసింహస్వామి స్వరూపాన్ని స్తుతించారని ప్రధానార్చకులు తెలిపారు. శతాబ్దాల క్రితమే నరసింహస్వామి పూర్వపు స్వభావాన్ని నంబార్ అళ్వార్ స్తుతించారని చెప్పారు. ఇలాంటి నరసింహస్వామి ఎప్పు డో యుగయుగాల కిందటే ఆవిర్భవించారని, కాలపరిణామ క్రమంలో మార్పులు, చేర్పు లు సహజమేనని తెలిపారు.

అసంతృప్తి లేనే లేదు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఎలాంటి అసంతృప్తి లేదని ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనర్సింహాచార్యులు స్పష్టంచేశారు. ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం పూర్తయిన తర్వాత బాలాలయంలోని మూర్తులన్నింటినీ గర్భాలయంలోకి తీసుకుపోతామని తెలిపారు. అసంతృప్తి అనేది లేనేలేదని, లోపాలుంటే వాటిని సవరించే అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ద్వారాన్ని రెండు అంగుళాలు ఎత్తుచేశారని, దాన్ని గుర్తించి చెప్పడంతో సవరించుకున్నారని తెలిపారు. చినజీయర్ స్వామి ఆదేశాలు, పర్యవేక్షణతోనే పనులు జరుగుతున్నాయని స్పష్టంచేశారు. మతాచార్యులను తాము అగౌరవపరచుకోబోమని చెప్పారు.

ఫొటోలకు అవకాశం ఇవ్వలేదు

గర్భాలయంలోగానీ, ఆలయ పరిసరాల్లోగానీ ఎలాంటి ఫొటోలకు అవకాశం ఇవ్వలేదని ఈవో గీత పేర్కొన్నారు. పనులుచేసే విషయంలో కూడా శిల్పులు వెళ్లడం, రావడంపై నిబంధనలు వర్తింపజేస్తున్నామన్నారు. అర్చకుల సమక్షంలో గర్భాలయ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గర్భాలయ పనుల సందర్భంగా నిష్ఠతో పనులు చేయిస్తున్నామని తెలిపారు. ప్రధాన ఆలయ పనులన్నీ ముగిశాయని, విద్యుత్తు దీపాలు, ఫ్లోరింగ్ పనులు మిగిలాయని, జనవరి నెలాఖరుకు సంపూర్ణంగా పూర్తవుతాయని చెప్పారు.

త్వరలోనే పనులు పూర్తి: కిషన్‌రావు

యాదాద్రి ఆలయపనులు త్వరలోనే పూర్తిచేస్తామని ఆలయ ప్రత్యేకాధికారి కిషన్‌రావు చెప్పారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఖండించారు. యాదాద్రిలో 750 ఎకరాల్లో కాటేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు. దాతలకు ప్లాట్‌లు ఇస్తామని, త్వరలోనే వాటి ధరలు నిర్ణయిస్తామని అన్నారు. తిరుపతి మాదిరిగా ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పారు. పురాతన దేవాలయంలో అభివృద్ధి పనులుచేస్తున్నామని, పనులు పూర్తి అయిన తర్వాత సీఎం కేసీఆర్ మహాయజ్ఞం చేయాలని నిర్ణయించారని కిషన్‌రావు తెలిపారు. ఇలాంటి దేవాలయం వెయ్యి ఏండ్ల తర్వాత కూడా చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. ఇది రాతితో నిర్మిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుని రాయాలని హితవు పలికారు.

నాలుక బయటికే ఉంటుంది

ప్రపంచంలో ఎక్కడ నరసింహస్వామిని చూసినా నాలుక బయటికే ఉంటుందని ప్రధానార్చకులు నర్సింహాచార్యులు స్పష్టంచేశారు. నరసింహస్వామి రూపంలో ఇది ప్రధానమన్నారు. అమ్మవారు ఉండటంతో స్వామివారు శాంతమూర్తిగా ఉన్నారని, అమ్మవారు లేకున్నా దయామూర్తిగా ఉంటారని, అంతేకానీ ఉగ్రమూర్తికారని నర్సింహాచార్యులు పేర్కొన్నారు. యాదాద్రి పునర్నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ప్రశంసనీయమని, లోకోత్తరస్థాయిలో గోపురాల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.

1444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles