రెచ్చగొట్టి చిచ్చుపెట్టొద్దు


Mon,March 25, 2019 02:47 AM

Writer Chinni Krishna Fires On Power Star Pawan Kalyan

-తెలంగాణలో విద్వేషాలు రగల్చకండి
-మా జీవితాలతో చెలగాటమాడవద్దు
-హైదరాబాద్‌లో ఆంధ్రులు సంతోషంగా ఉన్నారు
-ఓట్లకోసం సీఎం కేసీఆర్‌పై విమర్శలు తగవు
-జగన్‌ను ఎదుర్కోలేకే చంద్రబాబుతో కుమ్మక్కు
-నేను నోరుతెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాలి
-పవన్‌పై సినీ రచయిత చిన్నికృష్ణ ఫైర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు తగవని, ఆయన అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ప్రముఖ సినీరచయిత చిన్నికృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసం జగన్‌కు సీఎం కేసీఆర్‌కు ముడిపెట్టడంతోపాటు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పాలనలో ఆంధ్రులంతా సుఖంగా ఉన్నారని, సీఎం కేసీఆర్, కేటీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు. ఏ కష్టం వచ్చినా వారు ఆదుకుంటారన్న నమ్మకం ఉన్నదని అన్నారు. మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో మాకేదైనా సమస్య వస్తే మీ అన్నలు చిరంజీవి, నాగబాబు వచ్చి కాపాడుతారా? అని ప్రశ్నించారు. మీ ఓట్ల స్వార్థం కోసం మా జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో చిన్నికృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రాంత ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇక్కడి ఆంధ్రులంతా పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పవన్ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని ఆంధ్రులు ఆగ్రహంతో ఉన్నారని, సంతోషంగా ఉన్నామని చెప్పేందుకు ఐదు వేల మందితో ర్యాలీ తీసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫోన్ల ద్వారా చెప్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ చేసే రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలోని ఉన్నతమైన కుటుంబానికి తన కూతురిని ఇచ్చానని, ఇక్కడంతా కలిసిపోయి సంతోషంగా జీవిస్తున్న సమయంలో విద్వేషాలతో చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 70 ఏండ్లుగా ఏపీ, కేరళతోపాటు దేశంలోని పలురాష్ర్టాలకు చెందినవాళ్లంతా హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొని హాయిగా ఉన్నారని గుర్తుచేశారు. రాజకీయమంటే సినిమాల్లో త్రివిక్రమ్ రాసిన డైలాగులు చెప్పినట్టు అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. అనుభవలేమితో సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని, ముందు సీనియర్ల దగ్గరకు వెళ్లి రాజకీయం ఎలాచేయాలో నేర్చుకోవాలని సూచించారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే నువ్వెందుకు ఉలికిపడుతున్నావని పవన్‌ను ప్రశ్నించారు. తండ్రిని కోల్పోయి ప్రజాభిమానంతో ఒంటరిగా రాజకీయంగా ఎదుగుతున్న వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

సినీ పరిశ్రమకు మీరేం చేశారు?

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చిన్నికృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా జగన్ సీఎం కావాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారని, ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. తాను కూడా కాపు బిడ్డనేనని, కాపు కులస్థులకు మెగాస్టార్ కుటుంబం మాత్రమే ప్రతినిధులు కాదని చెప్పారు. కాపునేతలంటే వంగవీటి రంగా, ముద్రగడ వంటి నాయకులని పేర్కొన్నారు. చిరంజీవిని నమ్మి 70 లక్షల మంది ఓట్లువేస్తే.. ప్రజారాజ్యం పార్టీని మూసేసి ప్రజలను మోసంచేశారని, కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు. మీ కుటుంబాన్ని ఎంతో గొప్పవాళ్లను చేసిన సినిమాపరిశ్రమ అభివృద్ధికోసం ఏంచేశారని నిలదీశారు. స్టూడియో నిర్మించి ఎవరికైనా ఉపాధి కల్పించారా అని ప్రశ్నించారు. ఎన్నికలయ్యాక మళ్లీ వేషాలు వేసుకుంటారని, కాపు కులస్థులు వీరిని నమ్మి రెండోసారి మోసపోవద్దని సూచించారు. ప్రజారాజ్యం పార్టీకి వచ్చినన్ని సీట్లుకూడా పవన్‌కు రావని చెప్పారు. నాగబాబును పవన్ పార్టీలోకి పిలిచి కండువా కప్పారని, పార్లమెంట్ నియోజకవర్గాల్లోని మండలాల పేర్లయినా ఆయన చెప్పగలరా అని ఎద్దేవాచేశారు.నేను నోరుతెరిచి వాస్తవాలు చెప్తే నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ఎన్నో రికార్డ్స్ సృష్టించిన ఇంద్ర సినిమాకు కథ అందిస్తే చిరంజీవి కనీసం భోజనం పెట్టలేదని ఆయన ఆరోపించారు.
Chinnikrishna1

జగన్‌పై కుట్రపూరిత రాజకీయాలు

నవరత్నాలు అనే అద్భుతమైన పథకాన్ని అమలుచేయాలని భావిస్తూ జగన్ ఊరూరా పాదయాత్ర చేశారని చిన్నికృష్ణ గుర్తుచేశారు. తండ్రిని కోల్పోయిన ఒంటరి వ్యక్తిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందు వల్లే ఇలా స్పందించాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. మే 23న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని, జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఆ రోజు ఎన్నికల ఫలితాలు చూసి మీ గుండెలు పగిలిపోతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారంతా హైదరాబాద్‌కు వచ్చి పనులు చేసుకుంటున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం కూడా సరిగా అమలుచేయకపోవడంతో నిరుపేదలు అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పుష్కరాల్లో షూటింగ్ తీసి ఆడపడుచుల ఉసురు తీశారని, ఇప్పుడు పసుపు-కుంకుమ పంచుతున్నారని ఎద్దేవాచేశారు.

దేశంలోనే నంబర్‌వన్ సీఎం కేసీఆర్

దేశంలో అన్నిరాష్ర్టాల ముఖ్యమంత్రులకంటే నంబర్‌వన్ సీఎం కేసీఆర్ అని చిన్నికృష్ణ ప్రశంసించారు. బాబ్లీ సమస్యను తేల్చలేక చంద్రబాబు పక్కన పడేశారని, సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ తర్వాత రాబోయేది కేటీఆర్ అని, వారిద్దరి సంరక్షణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్లేకాకుండా దేశంలోని ఇతరరాష్ర్టాలవాసులు హైదరాబాద్‌లో ఆనందంగా ఉంటారని చెప్పారు. ఉద్యమ సమయంలో సైతం కేసీఆర్ ఆంధ్రా నాయకుల్లో కొందరినే తిట్టారని, ప్రజలను ఎప్పుడూ ఏమీ అనలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న వివాదం లేకుండాకడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారని వెల్లడించారు. ఆంధ్రాప్రాంతవాసులపై ఎక్కడా దాడులు జరిగిన సందర్భాలు లేవని స్పష్టంచేశారు. రాష్ర్టాలు వేరైనా అన్నిప్రాంతాలవారిని తెలంగాణ ప్రభుత్వం సమానంగా చూసుకుంటున్నదని వివరించారు.

4946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles