ప్రముఖ రచయిత బోయ జంగయ్య కన్నుమూత


Sun,May 8, 2016 01:08 AM

writer Boya jangayya passes away

jangayya
-1969 తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన కలంయోధుడు
నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రముఖ కవి, దళితవాద రచయిత బోయ జంగయ్య (80) కన్నుమూశారు. కొంతకాలం నుంచి పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జంగయ్య హైదరాబాద్ వనస్థలిపురంలోని తన కుమారుడి నివాసంలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ వాసి అయిన జంగయ్య నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్కలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జాతర, జగడంతోపాటు పుట్టుముచ్చ పేరుతో ప్రత్యేక నవలలే కాకుండా.. దున్న, చీమలు, తుపాకులు, బోజ కథలు పేరుతో అనేక కథా సంపుటులు వెలువరించారు. బ్రాహ్మణీయ భావజాలం మీద తిరుగుబాటే ప్రధాన ఇతివృత్తంగా రాసిన జాతర నవలకుగాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవడాక్టరేట్‌తో సత్కరించింది.

1969 తెలంగాణ ఉద్యమంలో జంగయ్య జైలుశిక్ష అనుభవించారు. 2014లో వేముల ఎల్లయ్య సంపాదకత్వంలో బోయ జంగయ్య ఆత్మకథ అవసరం వెలువడింది. ఆంధ్రుల పెత్తనం ఫలితంగానే తనకు కేంద్రసాహిత్య అవార్డు దక్కకుండా పోయిందని జీవిత చరమాంకం వరకు ఆయన ఆవేదన చెందినట్టు సన్నిహితులు పేర్కొంటారు. ప్రత్యేక గుర్తింపు పొందిన దళితవాద కవి, రచయిత బోయ జంగయ్య మరణం యావత్ తెలంగాణతోపాటు నల్లగొండ జిల్లాకు తీరని లోటు అని పలువురు కవులు, రచయితలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. బోయ జంగయ్య మృతి పట్ల విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

2107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS