ప్రపంచ తెలుగు మహాసభల్లో గుర్తుండి పోయేలా ఆతిథ్యం !


Sat,December 9, 2017 04:46 AM

World Telugu Conference to highlight cultural heritage of Telangana

ఆతిథ్యం గుర్తుండిపోయేలా!
ప్రతినిధులందరికీ కానుకగా తెలుగు వాచకం
నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు నేటి నుంచి
-ప్రతినిధులందరికీ కమ్మని విందు..
కనువిందు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు
-ప్రతినిధులందరికీ కానుకగా తెలుగు వాచకం

Telugu-Mahasabalu
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ సారస్వత వైభవాన్ని, సాంస్కృతిక చైతన్యాన్ని ఘనంగా ప్రకటించుకునే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆతిథ్యం కూడా అంతే ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులందరికీ కమ్మని విందు, కనువిందు చేసే సాంస్కృతిక ప్రదర్శనలతో ఆనందపరిచేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల భోజనాల ఏర్పాట్ల బాధ్యతలు ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆరువేల మందికిపైగా అతిథులకు భోజన వసతులు కల్పించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

-ఆతిథ్యం

అతిథులందరికీ ఏ లోటూ లేకుండా చూసేందుకు ప్రతి అతిథికీ ఓ సహాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, పరిశోధకులను అతిథులుగా గుర్తిస్తూ ఆహ్వానాలు అందజేశారు. దాదాపు వేయిమంది వరకు అతిథులు పాల్గొనే తెలుగు మహాసభల్లో ఎవరికీ ఏ సమస్యా లేకుండా చూసుకునేలా, వారి అవసరాలకు అనుగుణంగా వేదికలకు తీసుకుపోయేలా ఒక వాలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తెలుగు భాష, సాహిత్యంపట్ల అవగాహన ఉన్న వారిని వాలంటీర్లుగా ఎంపిక చేయాలని సాహిత్య అకాడమీ భావించినా జీఈఎస్ విజయవంతానికి దోహదపడిన హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల్లో తెలుగు తెలిసిన వారిని వాలంటీర్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు.

-ఆహారం

మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులు, అతిథులకు భోజనాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారులను నియమించింది. భోజనాల ఏర్పాట్లు, వడ్డన, మెనూ ఎంపిక, నిర్వహణను పౌరసరఫరాలశాఖకు అప్పగించారు. మహాసభల అయిదు ప్రధాన వేదికల వద్ద ప్రతినిధులకు భోజన వసతి కల్పిస్తారు. ఈ భోజనాల్లో వడ్డించే వంటకాల్లో తెలంగాణ రుచులుండేలా ప్రభుత్వం ముందుగానే ఆదేశించింది. మెనూ రూపకల్పన కోసం ఓ మహిళా ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఒకే కేంద్రంలో భోజనాలను సిద్ధం చేసి అక్కడి నుంచి వివిధ వేదికలకు సరఫరా చేస్తామని నిర్వహకులు నమస్తే తెలంగాణకు చెప్పారు. విందులో తెలంగాణ వంటకాలైన సకినాలు, మలీద ముద్దలు, సర్వపిండి, చింతకాయ తొక్కు, పచ్చిపులుసు, పుంటికూర తొక్కు, గుత్తివంకాయ కూర, పచ్చిమిరపకాయ తొక్కు, బొబ్బెర గుడాలు, శనగగుడాలు, మురుకులు, సల్లచారు మొదలైనవి ఉంటాయని తెలుగు మహాసభల నిర్వహణలో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక సభ్యుడు తెలిపారు. అతిథుల్లో జ్ఞాన్‌పీఠ్, సాహిత్య అకాడమీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు పొందినవారందరికీ రవాణా కోసం ఒక్కొక్కరికి ఒక కారును వినియోగిస్తారు.
TeluguMahasabhalu

-ఆస్వాదం

తెలుగు మహాసభల్లో రోజంతా సాహిత్య సదస్సులు, చర్చలు ఉంటాయి. సాయంత్రం వీనుల విందైన సంగీతం వింటూ, కనువిందు చేసే నాట్యాలు చూస్తూ గడపొచ్చు. ఎల్బీ స్టేడియంలో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ఉత్తమ ప్రమాణాలతో ఓ సాంస్కృతిక ప్రదర్శన ఉంటుందని, లలిత కళాతోరణం, రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలోనూ జానపద, శాస్త్రీయ సంగీత, నాట్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

-కానుకలు

ప్రతినిధులందరికీ తెలుగు వాచకాన్ని కానుకగా ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ ఇంట్లో తెలుగు భాషను నేర్చుకునేలా, తెలుగు సంస్కృతి గురించి తెలుసుకునేలా ఓ వాచకాన్ని రూపొందించాలని సీఎం నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి ప్రతినిధికీ ఓ చేనేత సంచి, అయిదు రోజుల తెలుగు మహాసభల ప్రణాళికా పత్రం, తెలుగు వాచకం, కొన్ని పుస్తకాలను అందజేయాలని కోర్ కమిటీ భావిస్తున్నది. అతిథులందరినీ శాలువాతో సత్కరించి, ఒక జ్ఞాపికను బహూకరిస్తారు.

1739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles