మిడ్‌మానేరు సక్సెస్


Thu,April 5, 2018 03:30 AM

Work of 25 gates completed on Mid Manair Project

-25 గేట్ల బిగింపు పూర్తి
-25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సంసిద్ధం
-కాంగ్రెస్ హయాంలో నామమాత్రంగా జరిగిన పనులు
-శరవేగంగా పూర్తిచేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
-ఇంజినీర్లను అభినందించిన మంత్రి హరీశ్‌రావు
mid-maneru
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గత ఏడాది రికార్డు సమయంలో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తిచేసిన తెలంగాణ నీటిపారుదలశాఖ.. మరో రికార్డును సొంతం చేసుకున్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి అతి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్న బిజీ షెడ్యూల్‌లోనూ, మిడ్‌మానేరు ప్రాజెక్టును పూర్తిచేసింది. పదేండ్ల కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు నామమాత్రంగా జరుగగా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక శరవేగంగా నిర్మాణం పూర్తిచేసి అరుదైన ఘనతను దక్కించుకొన్నది. మిడ్‌మానేరును పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమించిన ఇంజినీర్లకు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం అభినందనలు తెలిపారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఒక విజయగాథ. ఈ ప్రాజెక్టు పనులు 2006లో మొదలయ్యాయి. పదేండ్లపాటు ఆపసోపాలు పడు తూ.. కొంతవరకు పనులైనాయనిపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సొంత ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగంగా ముందుకు సాగేందుకు అవరోధంగా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించింది. మంత్రి హరీశ్‌రావు తరచూ సమీక్షలతో పలుశాఖలను సమన్వయం చేసుకొంటూ అడ్డంకుల్ని తొలిగించారు. ఇంజినీర్లు కూడా ఒక సవాలుగా ఈ ప్రాజెక్టు పనుల్ని స్వీకరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి లిఫ్టు చేసిన గోదావరిజలాల్ని ఈ వర్షాకాలంలో మిడ్‌మానేరుకు తరలించడమనేది ప్రభుత్వం కీలక లక్ష్యంగా పెట్టుకొన్నది. దీంతో మిడ్‌మానేరు ప్రాజెక్టును పూర్తి చేయడమనేది అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ఇందుకు అనుగుణంగా ఇంజినీర్లు శ్రమించడంతో బుధవారానికి అన్ని పనులూ పూర్తిచేసుకొని.. 25 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మిడ్ మానేరు సిద్ధమైంది.

mid-maneru2

రికార్డులను తిరుగరాసిన ప్రాజెక్టు..

పదినెలల్లోనే మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించిన క్లిష్టమైన, కీలకమైన పనులు పూర్తవడమనేది విశేషం. రికార్డు స్థాయిలో కాంక్రీట్, మట్టిపనులు చేపట్టడంతోపాటు ప్రాజెక్టు గేట్ల బిగింపు, సివిల్, మెకానికల్, సాంకేతిక పనులన్నింటినీ పూర్తిచేశారు. 10.5 కిలోమీటర్ల రివిట్‌మెంట్ పనుల్లో 10 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 25గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు, బిగింపు పనులు పూర్తయ్యాయి. భూసేకరణ, నిర్వాసితుల నష్టపరిహారం, పునరావాసం కలిపి మొత్తం రూ.2,150 కోట్లు ఖర్చుచేసింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 836 కోట్లు ఖర్చు చేసినప్పటికీ పనులు మాత్రం పూర్తికాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన మిడ్‌మానేర్ డ్యాంను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మిగతా పనులను రికార్డు స్థాయిలో పూర్తిచేసింది.

మంత్రి అభినందనల వెల్లువ..

అహర్నిశలు కృషిచేసిన ఇంజినీర్లకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. పదేండ్లలో చేయని పనిని కేవలం నెలల వ్యవధిలో పూర్తి చేసిన ఇంజినీర్ల కృషిని కొనియాడారు. నిర్వాసితులకు వేగంగా పరిహారాన్ని అందించారని ప్రశంసించారు. పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని, నిరాశ్రయు లకు ఇంకా చెల్లించాల్సిన రూ.50 కోట్ల పరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపడంపై దృష్టి సారించాలన్నారు. మిడ్‌మానేరు నుంచి మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాలకు త్వరలోనే సాగునీరందించేందుకుగాను అధికారులు చర్యలు చేపడుతున్నారు.

నేడు బుద్ధారం కుడి కాల్వకు నీటి విడుదల

ప్రారంభించనున్న మంత్రి టీ హరీశ్‌రావు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి గురువారం సాయంత్రం బుద్ధారం కుడికాల్వకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన ఖరారైంది. గురువారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న హరీశ్‌రావు.. పదిగంటలకు కల్వకుర్తి ప్రాజెక్టు ప్రధానకాల్వ 160 నుంచి 90 కిలోమీటర్ వరకు పనులు, ఆవంచ అక్విడెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం ఆ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జడ్చర్ల పట్టణంలో భోజన విరామం తర్వాత వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం గౌరీదేవిపల్లి గ్రామ పరిధిలోని కల్వకుర్తి ప్రాజెక్టు ప్రధాన కాల్వ, గుడిపల్లి గట్టు (లిఫ్టు-3)ను పరిశీలిస్తారు. అనంతరం కేఎల్‌ఐ ప్రధాన కాల్వ నుంచి బుద్ధారం కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తారు. పెద్దమందడి మండలం జంగమయిపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటుచేయనున్న బహిరంగసభలో పాల్గొని.. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
mid-maneru3

3830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles