ప్రొసీడింగ్ ఇచ్చి పాస్‌బుక్ మరిచారు


Mon,August 12, 2019 01:33 AM

Women Farmer Meets Namaste Telangana Dharmaganta

-రెండేండ్లుగా చేర్యాల తాసిల్ చుట్టూ తిరుగుతున్న నక్షత్రమ్మ
-వృద్ధురాలి వద్ద రూ.15 వేలు వసూలుచేసిన వీఆర్వోలు
-న్యాయంకోసం ధర్మగంటను ఆశ్రయించిన బాధితురాలు

చేర్యాల, నమస్తే తెలంగాణ: పట్టదారు పాస్‌పుస్తకం కోసం ఓ వృద్ధురాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు ఏడాదిగా తన భూమికి పాస్‌పుస్తకం ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాల తాసిల్ కార్యాలయానికి వచ్చిపోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వీఆర్వోలు దశలవారీగా ఆమె వద్ద సుమారు రూ.15 వేలు వసూలుచేశారు. అయినా పాస్‌పుస్తకం అందలేదు. దీంతో బాధితురాలు న్యాయం కోసం ధర్మగంటను ఆశ్రయించారు. చేర్యాల పట్టణానికి చెందిన యారవ నక్షత్రమ్మ.. భర్త శౌరెడ్డి మృతి చెందడంతో సంతానం లేని ఆమె హైదరాబాద్‌లో సోదరి వద్ద ఉంటున్నారు. తన భర్త పేరిట చేర్యాల పరిధిలోని సర్వే నంబర్ 1311/సీలో ఉన్న 25 గుంటల భూమిని తన పేరిట మార్చాలని నక్షత్రమ్మ నెలల తరబడి తాసిల్ కార్యాలయం చుట్టూ తిరుగడంతో అధికారులు 24 జనవరి, 2018న ఆమె పేరిట ప్రొసీడింగ్ ఇచ్చారు. త్వరలో పట్టాదారు పాస్‌పుస్తకం జారీచేస్తామని తెలిపారు. అయితే అప్పటినుంచి పాస్‌పుస్తకం కోసం నక్షత్రమ్మ తాసిల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

పాస్‌పుస్తకం కోసం బాధితురాలు విధుల్లో ఉన్న పలువురు వీఆర్వోలకు రూ.15 వేల వరకు ముటజెప్పారు. దీంతోపాటు తన భర్త పేరిట సర్వే నంబర్ 1307/ఏలో ఉన్న మరో 14 గుంటల భూమిని సైతం తన పేరిట మార్చాలని వేడుకొన్నప్పటికీ రెవెన్యూ అధికారులు కనికరం చూపడంలేదని వృద్ధురాలు వాపోయారు. భర్త చనిపోయి, సంతానంలేని నక్షత్రమ్మ హైదరాబాద్‌లోని జగద్గీరిగుట్ట ప్రాంతంలో సోదరి కుమారుల వద్ద ఉంటున్నారు. రెండుసార్లు కిందపడి కాలువిరుగడంతో బాధితురాలు దవాఖానల చుట్టూ తిరుగతూ మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. న్యాయంగా తన భర్త పేరిట ఉన్న భూమిని తన పేరిట రికార్డులు మార్చి పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరుచేయాలని రెవెన్యూ అధికారులను వేడుకొంటున్నారు. ఈ విషయమై ఇటీవలే విధుల్లో చేరిన తాసిల్దార్ శైలజను నమస్తే తెలంగాణ ఫోన్‌లో వివరణ కోరగా.. నక్షత్రమ్మ తనను కలిసి భూపత్రాలను అందజేశారని, తగు విచారణ జరిపి న్యాయంచేస్తామని చెప్పారు.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles